విశాఖ రైల్వేజోన్‌: కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై అసంతృప్తి ఎందుకు?

 • 1 మార్చి 2019
పీయూష్ గోయల్ Image copyright Getty Images

కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన దక్షిణ తీర రైల్వే జోన్ విషయంలో రెండు చర్చలు జరుగుతున్నాయి. ఒకటి జోన్ వల్ల వచ్చే ప్రయోజనాలు, రెండు ఉత్తరాంధ్ర ప్రాంత చిరకాల కోరిక.

నిజానికి ఈ జోన్ డిమాండు కంటే ముందు నుంచీ ఉత్తరాంధ్ర వాసులు ఒక డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతంలోని స్టేషన్లు, ట్రాకులను భువనేశ్వర్ నుంచి తప్పించి సికింద్రాబాద్‌లో కలపాలనేది వారి కోరిక. కానీ ఈ కొత్త జోన్ వచ్చిన సందర్భంగా వారి కోరిక తీరుతుందా అంటే ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి. అధికారికంగా సరిహద్దులు ఖరారు కాకపోయినా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు, విశాఖలో ఉండే కొత్త జోన్‌కూ సంబంధం ఉండదనీ, ఆ రెండు జిల్లాలూ భువనేశ్వర్ కిందే ఉండాలన్న వార్తలు అక్కడి వారిని ఇబ్బంది పెడుతున్నాయి.

కొత్త జోన్ వల్ల ప్రయోజనాలు

రైల్వే శాఖ కింద రైల్వే బోర్డు ఉంటుంది. ఆ బోర్డే రైల్వేల యాజమాన్యం చూస్తుంది. పాలనా సౌలభ్యం కోసం దేశవ్యాప్తంగా రైల్వేలను జోన్లుగా, తిరిగి ఆ జోన్లు డివిజన్లుగా విభజించారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్ర ప్రాంతంలో ఒక కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పెట్టారు. ఇప్పుడు ఆ జోన్‌ని ప్రకటించారు.

రైల్వే జోన్‌కు జనరల్ మేనేజర్ అధిపతిగా ఉంటారు. రైల్వే బోర్డు తరువాత ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకునే అధికారం ఈ జనరల్ మేనేజర్లకు ఉంటుంది. వారి స్థాయి (ర్యాంక్) కూడా రైల్వే బోర్డు మెంబరుతో సమానం.

జోన్ రావడం అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే, విశాఖలో కొత్తగా ఒక జనరల్ మేనేజర్ పదవి సృష్టించి అతనికి అక్కడ ఒక కార్యాలయం నిర్మిస్తారు. ఇకపై ఆ పరిధిలోని రైల్వే పాలన సికింద్రాబాద్ నుంచి కాకుండా విశాఖపట్నం నుంచి జరుగుతుంది.

Image copyright Getty Images

కొత్త ఉద్యోగాలు వస్తాయా?

ఎక్కువ మంది అనుకుంటున్నట్టు రైల్వే జోన్ వస్తే భారీ ఎత్తున కొత్త ఉద్యోగాలేమీ రావు అని వివరిస్తున్నారు రైల్వే అధికారులు.

ఇప్పుడు ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయం నుంచే నిష్పత్తి ప్రకారం కొందరు ఉద్యోగులను విభజించి ఈ కొత్త జోన్‌కి పంపుతారు. అక్కడ నుంచి డివిజన్లు తీసేసినప్పుడు పని భారం తగ్గుతుంది కాబట్టి, వారిని ఇక్కడకు బదిలీ చేస్తారు. అతి తక్కువ సంఖ్యలో మాత్రమే కొత్త పోస్టులు ఏర్పడే అవకాశం ఉందని వారు వివరిస్తున్నారు.

అధికారి స్థాయి కాకుండా, చిన్న ఉద్యోగాలు ఎక్కువగా అవసరం పడవచ్చని బీబీసీతో చెప్పారు ఒక రైల్వే ఉన్నతాధికారి.

రైల్వేలు దేశవ్యాప్తంగా కలిపి నియామకాలు చేస్తాయి. ఏ రాష్ట్రం వారైనా రైల్వేల్లో ఉద్యోగం చేయవచ్చు. దీంతో విశాఖ జోన్ కేంద్రంగా జరిగే నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం ఉంటుందని ఆశించక్కర్లేదు. వీటన్నిటికీ మించి విశాఖలో కొత్త జోన్ అన్నారు కానీ కొత్తగా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వస్తుందని చెప్పలేదు, దానిపై స్పష్టత రావాల్సి ఉందని వ్యాఖ్యానించారు ఆ ఉన్నతాధికారి.

అయితే రైల్వే జోన్‌కి సంబంధించిన పలు కార్యాలయాలు కొత్తగా ఏర్పడడం వల్ల పరోక్ష ఉపాధి కాస్త పెరిగే అవకాశం ఉంది.

Image copyright Getty Images

నిధులు - నిర్ణయాలు

మా రైల్వే జోన్‌కి ఇంత ఆదాయం వస్తోంది, ఆ రైల్వే జోన్‌కి ఇంత ఆదాయం వస్తుంది అని చాలా మంది చెప్పడం వింటాం. కానీ కేంద్రం తిరిగి ఆ డబ్బును ఖర్చు పెట్టేప్పుడు, జోన్లకు నిధులు ఇచ్చేప్పుడు అసలు ఆ ఆదాయాన్ని లెక్కించదు.

కోట్లాది రూపాయల లాభం తెచ్చే జోన్ అయినా, అసలు ఆదాయమే రాని జోన్ అయినా కేంద్రం తాను ఇవ్వాలనుకున్నట్టే నిధులు ఇస్తుంది తప్ప జోన్ల ఆదాయాన్ని బట్టి కాదు.

అంతేకాదు, జోన్లకు వచ్చే ఆదాయం, లెక్కలకు మాత్రమే పరిమితం. ఏ జోన్‌కి వచ్చిన సొమ్మైనా నేరుగా భారతీయ రైల్వేలకే వెళుతుంది. తరువాత వారు ఇచ్చింది తీసుకోవాలి. కాబట్టి ఒక జోన్ ఆదాయం ఎక్కువ, తక్కువున్నంత మాత్రాన ఆ జోన్‌కి కొత్తగా ఒరిగేది కానీ, పోయేది కానీ ఏదీ లేదు.

అయితే జోన్ ఏర్పడడం వల్ల, ఆ జనరల్ మేనేజర్‌కి కొన్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. జీఎం సొంతంగా కొన్ని నిధులు ఖర్చు పెట్టవచ్చు. పైగా తన పరిధిలో ఉన్న రాష్ట్రంతో సమన్వయం చేసుకోవడం సులువు అవుతుంది.

ఇప్పటి వరకూ ఆంధ్రా ప్రభుత్వం రైల్వేల గురించి మాట్లాడాలంటే సికింద్రాబాద్‌లోని జనరల్ మేనేజర్‌తో మాట్లాడాలి. కానీ ఇకపై విశాఖలో మాట్లాడాలి. అటు ఆ జోనల్ మేనేజర్ కూడా ఆంధ్ర పరిధిలో జరగాల్సిన పనులపై ఎక్కువ దృష్టి పెట్టి కేంద్రానికి తగిన నివేదికలు, సిఫార్సులు పంపే అవకాశం ఉంటుంది. నిర్ణయాధికారం మాత్రం దిల్లీదే.

రైల్వేల్లో ఏ సమస్య వచ్చినా జోనల్ కార్యాలయానికే వెళ్లాలి. ఇప్పుడు మెజార్టీ ఆంధ్రా ప్రాంతం వారికి ఆ కార్యాలయం సికింద్రాబాద్ బదులు విశాఖ కానుంది.

Image copyright Getty Images

మిగతా చోట్ల పద్ధతి?

ప్రతి రాష్ట్రానికీ జోన్ ఉండే పద్ధతి లేదు. ఉదాహరణకు కేరళలో రైల్వే జోన్ లేదు. చెన్నై కేంద్రంగా ఉన్న దక్షిణ రైల్వేలో భాగం ఆ ప్రాంతం. కానీ కోల్‌కతా కేంద్రంగా మూడు జోన్లు, ముంబై కేంద్రంగా రెండు జోన్లూ ఉన్నాయి.

డివిజన్ కేంద్రం లేకుండా జోన్ ఉంటుందా?

విశాఖ నగరంలో వాల్తేరు డివిజన్ ఉండేది. ఇప్పుడు దాన్ని రద్దు చేస్తున్నారు. డివిజన్ కేంద్రంలోనే రైల్వే జోన్ ఉండాలన్న నిబంధన లేదు. కానీ విశాఖ ప్రాంతాన్ని విజయవాడ డివిజన్లో కలిపే బదులు వాల్తేరు డివిజన్ యదాతథంగా కొనిసాగించాలని డిమాండ్ చేస్తున్నారు దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శంకర రావు.

విశాఖ డివిజన్ ఉంటే బావుంటుంది, విభజించడం వల్ల ఉత్తరాంధ్ర వారికి అన్యాయం జరుగుతుంది అని వ్యాఖ్యానించారు శంకర రావు.

Image copyright Getty Images

ఉత్తరాంధ్ర సమస్య ఏంటి?

సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వేలో ఆంధ్ర ప్రాంతాన్ని కవర్ చేసే విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ఉండేవి. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు తీర రైల్వేలో ఉత్తరాంధ్ర భాగం విశాఖ నగరం కవర్ చేసే వాల్తేరు డివిజన్ ఉండేది. శ్రీకాకుళం జిల్లా సగం వాల్తేరు డివిజన్లో, సగం ఖుర్దా రోడ్ డివిజన్లో ఉండేది.

దీంతో భువనేశ్వర్ పెత్తనం భరించలేని ఉత్తరాంధ్ర వాసులు తమ డివిజన్లను సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వేలో కలపమని డిమాండ్ చేసేవారు. తరువాత విశాఖలోనే కొత్త జోన్ ఏర్పాటు చేసి అందులో కలపాలని డిమాండ్ చేశారు.

కేంద్రం విశాఖలో కొత్త జోన్ ఏర్పాటు చేసింది కానీ, మొత్తం ఉత్తరాంధ్రను ఆ జోన్‌లో కలుపుతామని మాత్రం చెప్పలేదు. పైగా కలిపే అవకాశం లేదని సంకేతాలు కూడా వస్తున్నాయి.

‘‘మాకు ఇప్పటి వరకూ అధికారిక సమాచారం లేదు. కానీ విజయనగరం వరకూ ఆంధ్రలో ఉంచి ఆపైన ఒడిశాలో కలుపుతున్నారని తెలిసింది. కిరండోల్-కొత్త వలస లైన్‌లో అరకు వరకూ ఆంధ్రలో ఉంటుంది. ఇక పార్వతీపురం, బొబ్బిలి ప్రాంతాలు కూడా భువనేశ్వర్‌కే వెళ్తున్నాయి’’ అని బీబీసీతో చెప్పారు విశాఖకు చెందిన ఒక రైల్వే ఉన్నతోద్యోగి.

అసలు ఆంధ్రా జోన్ విశాఖకు రావడానికి కారణమే ఈ డివిజన్ తో వచ్చిన సమస్యలు. అటువంటి తమ సమస్యను పరిష్కరించకుండా ఈ కొత్త జోన్ ఏర్పాటు చేయడం ఉత్తరాంధ్ర వాసులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

Image copyright Getty Images

వాల్తేరు డివిజన్లోని స్టేషన్లు

 1. విశాఖపట్నం
 2. విజయనగరం
 3. కొత్త వలస
 4. కోరుకొండ
 5. చీపురుపల్లి
 6. శ్రీకాకుళం రోడ్
 7. కోటబొమ్మాళి
 8. నౌపడ

ఖుర్దా రోడ్ డివిజన్లోని స్టేషన్లు

 1. పలాస
 2. మందవ
 3. బారువ
 4. సోంపేట
 5. ఇచ్ఛాపురం

ఆంధ్రకు కొత్త జోన్ వస్తే విజయవాడ, గుంటూరు, గుంతకల్లుతో పాటు వాల్తేరు డివిజన్ కూడా అందులోకి వస్తుందని అంతా అనుకున్నారు. ఖుర్దా రోడ్ డివిజన్లోని స్టేషన్లను కూడా వాల్తేరులో కలిపి కొత్త జోన్లో పెడతారని ఆశించారు శ్రీకాకుళం జిల్లా వాసులు. ఇప్పుడు ఈ స్టేషన్లన్నీ రాయగడ డివిజన్లోకి వెళ్లిపోతాయన్న వార్త వారిని బాగా ఇబ్బంది పెడుతోంది.

Image copyright Getty Images

భువనేశ్వర్ కేంద్రంగా ఉంటే తప్పేంటి?

నిజానికి రైల్వేల సరిహద్దులు సరిగ్గా రాష్ట్రాల సరిహద్దుల్లా ఉండడం సాధ్యం కాదు. ఉదాహరణకు తెలంగాణలోని మిర్యాలగూడ స్టేషన్ వరకూ ఆంధ్ర జోన్ పరిధిలోకి వస్తుంది. పరిపాలన పక్కాగా, పక్షపాతం లేకుండా జరిగితే ఏ సమస్యా ఉండదు. కానీ ఏ ప్రాంతం వారు ఆ ప్రాంత స్వార్థం చూసుకుంటేనే రైల్వే జోన్ల సమస్యలు వస్తుంటాయి.

భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు తీర రైల్వే ఒడిశాకు అనుకూలంగా ఉండి, ఉత్తరాంధ్ర ప్రజల డిమాండ్లు పట్టించుకోవడం లేదని ఇక్కడి వారి ఆరోపణ.

 • భువనేశ్వర్ ఆర్ఆర్‌బీలో పరీక్షల కోసం వెళ్లిన వారిని ఇబ్బంది పెట్టడం
 • విశాఖ వరకూ నడపాల్సిన రైళ్లను భువనేశ్వర్ వరకూ పొడిగించడం
 • ఉత్తరాంధ్ర ప్రాంతంలో రైల్వేల హాల్టులు తగ్గించడం
 • సరకు రవాణా కోసం అవసరమైనన్ని పెట్టెలు (బోగీలు) ఇవ్వకపోవడం
 • కొత్త రైళ్లు వేయడానికి ప్రతిపాదనలు పంపకపోవడం

ఇవన్నీ చేస్తూ తమపై వివక్ష చూపుతున్నారని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన రైల్వే సిబ్బంది, నాయకులు ఆరోపిస్తూ వచ్చారు. అందుకే వారు తమ డివిజన్‌ను భువనేశ్వర్ నుంచి తప్పించాలని కోరారు.

Image copyright Getty Images

వాల్తేరు డివిజన్ చరిత్ర

వాల్తేరు (వాల్తేరు విశాఖలోని ఒక ప్రాంతం) డివిజన్ 1893లో కోల్‌కతా కేంద్రంగా ఉండే తూర్పు రైల్వేలో భాగంగా ఏర్పడింది. 1952 వరకూ బెంగాల్- నాగ్‌పూర్ రైల్వేలో భాగంగా ఉండేది, తరువాత తూర్పు రైల్వేలో భాగం అయింది. 1955లో ఆగ్నేయ రైల్వేలో కలిసింది. తిరిగి 2003లో తూర్పు తీర రైల్వేలో కలిపారు. ఇప్పుడు మొత్తానికి రద్దయింది.

మరి కేంద్రం కొత్త జోన్‌తో పాటు కొత్త రైల్వే రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేస్తుందా? శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలను విశాఖలో వచ్చే కొత్త జోన్లో ఉంచుతుందా? అన్నది తెలియాలి.

Image copyright Getty Images

రైల్వే బోర్డ్ కార్యకలాపాలు ఎప్పుడు?

(వి.శంకర్, బీబీసీ కోసం)

ద‌క్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ మంత్రి చేసిన ప్ర‌క‌ట‌న‌పై కొంద‌రు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

"విశాఖ రైల్వేజోన్‌పై కేంద్ర మంత్రి మండ‌లి నిర్ణ‌యం జ‌ర‌గ‌లేదు. రైల్వే బోర్డ్ ప్రోసీడింగ్స్ జారీ కాలేదు. మంత్రి ప్ర‌క‌ట‌న త‌ప్ప ఏమీ లేదు. వారం ప‌ది రోజుల్లో ఎన్నిక‌ల కోడ్ వ‌స్తోంది. ఈలోగా జోన్ ఏర్ప‌డుతుందా?" అని సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ నవీన్ సందేహం వ్య‌క్తం చేశారు.

(ఫిబ్రవరి 28వ తేదీ గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు నిర్ణయాన్ని ఆమోదించింది)

ఇలాంటి అనుమానాలే రైల్వే ఉద్యోగుల సంఘాల్లో కూడా వినిపిస్తున్నాయి.

"కేంద్రం చేసిన ప్ర‌క‌ట‌న ఆచ‌ర‌ణ రూపం దాల్చ‌డానికి ఇంకా స‌మ‌యం ప‌డుతుంది. తాజా ప్ర‌క‌ట‌నతో క‌ద‌లిక వ‌చ్చినట్టే భావించాలి. కానీ మ‌రి కొన్ని నెల‌ల త‌ర్వాత మాత్ర‌మే కొత్త రైల్వే జోన్ మ‌నుగ‌డ‌లోకి వ‌స్తుంది. ఈలోగా ప్ర‌భుత్వం తీసుకోబోయే నిర్ణ‌యాల‌ను బ‌ట్టి ఎప్ప‌టికి వెలుగు చూస్తుంద‌న్నది ఆధార‌ప‌డి ఉంటుంది. ప్ర‌స్తుతం మాత్రం ఎన్నిక‌ల‌కు ముందు జోన్ వ‌స్తుంద‌నే విశ్వాసం క‌నిపించ‌డం లేదు" అంటూ రైల్వే ఉద్యోగుల సంఘం నాయకుడు అశోక్ కుమార్ అంటున్నారు.

ఒడిశాలో రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ఆశించే ఆదాయం ల‌భించే డివిజ‌న్‌ను విభ‌జించారని కొందరు విమ‌ర్శిస్తుంటే, విభ‌జ‌న చ‌ట్టంలో కీల‌క‌మైన రైల్వే జోన్ రావ‌డంపై బీజేపీ నేత‌లు ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా విశాఖ న‌గ‌రానికి ఇదో మైలురాయి అవుతుంద‌ని బీజేపీ ఎమ్మెల్సీ మాధ‌వ్ పేర్కొన్నారు.

ఉత్త‌రాంధ్ర చ‌ర్చా వేదిక ప్ర‌తినిధి కొణ‌తాల రామ‌కృష్ణ తాజాగా ప్ర‌క‌టించిన రైల్వే జోన్ ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేశారు. "రాష్ట్రం మీద కేంద్రం క‌క్ష‌తో వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. జోన్ ఇచ్చి వాల్తేర్ డివిజ‌న్ లేకుండా చేయ‌డం.. పంచ‌భ‌క్ష్య ప‌ర‌మాన్నం పెట్టి చిన్న విషం చుక్క వేసిన చందంగా క‌నిపిస్తోంది. విశాఖ డివిజ‌న్‌ను కాపాడుకోవాలి. అందుకు మ‌ళ్లీ ఉద్య‌మం చేస్తాం. దేశంలోనే ఆదాయ స‌ముపార్జ‌న‌లో విశాఖ డివిజ‌న్ నాలుగో స్థానంలో ఉంది. దానిని విభ‌జించ‌డం త‌గ‌దు. సంర‌క్షించుకోవ‌డం కోస‌మే అంద‌రం క‌లిసి సాగుదాం" అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)