లోక్‌సభ ఎన్నికలు 2019: నేను పాన్‌షాప్ దగ్గర బండి ఆపితే మోదీ సభకు వచ్చినకంటే ఎక్కువ మంది జనం వస్తారు - లాలూ

  • 3 మార్చి 2019
పట్నాలో నరేంద్ర మోదీ బహిరంగ సభ ర్యాలీ Image copyright AFP

మార్చి 3వ తేదీ ఆదివారం. ఉదయం 8.30 గంటలు అవుతోంది. పాట్నాలోని బెలీ రోడ్‌లో వాహనాల రాకపోకల్ని ఆపేశారు.

రోడ్డుపై వేసిన ఒకలైన్లో ప్రజలంతా నడుచుకుంటూ గాంధీ మైదానం వైపు వెళుతున్నారు. ఆ మైదానంలోనే ఎన్డీఏ సంకల్ప్ ర్యాలీ (బహిరంగ సభ) నిర్వహిస్తున్నారు.

కార్యకర్తలంతా తమతమ పార్టీ జెండాలను, బ్యానర్లను, ఫొటోలను పట్టుకుని 'జిందాబాద్.. జిందాబాద్' అంటూ నినాదాలు చేస్తున్నారు. మరో లైన్లో అధికారులు, పోలీసుల వాహనాలు, పార్టీ కార్యకర్తలు, మంత్రుల వాహనాలు వెళ్తున్నాయి.

ఇదే సమయంలో పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ విమానాశ్రయానికి.. జమ్మూ కశ్మీర్‌లో మిలిటెంట్ల చేతిలో మరణించిన సీఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ పీటూ సింగ్ మృతదేహం వచ్చింది.

పీటూ సింగ్‌కు నివాళులర్పించేందుకు విమానాశ్రయానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా ఒక్కరే వెళ్లారని సమాచారం అందింది.

అయితే, ఎన్డీఏ నాయకులు పింటూ సింగ్‌కు నివాళులర్పించేందుకు ఎందుకు వెళ్లలేదో మహాత్మాగాంధీ మైదానం వైపు వెళ్తున్న కార్యకర్తల్ని చూస్తే తెలుస్తుంది.

Image copyright Neeraj Priyadarshi

వాళ్లలో కొందరు నరేంద్ర మోదీ బొమ్మను ముఖానికి పెట్టుకుంటే, మరికొందరు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బొమ్మను ముఖానికి పెట్టుకున్నారు.

విమానాశ్రయం నుంచి గాంధీ మైదానానికి నరేంద్ర మోదీ రానున్నారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా పోలీసులు మొహరించారు.

సంకల్ప్ ర్యాలీ ఎలా జరిగింది?

బెలీ రోడ్ నుంచి, ఇన్‌కమ్ ట్యాక్స్ కార్యాలయం, పోస్టాఫీసు చౌరస్తాల మీదుగా గాంధీ మైదానం వరకూ కట్టిన ఎన్డీఏ పార్టీలు, నాయకుల బ్యానర్లు, జెండాలను చూస్తే అవి శనివారం రాత్రి వరకూ ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది.

వీటిలో ఎక్కువ భాగం జేడీయూ పార్టీవే ఉన్నాయి. అయితే, వాటిలో కూడా మోదీ బొమ్మ ఉంది.

''ప్రభుత్వంలో ఉండటంతో జేడీయూ అధికారాన్ని వాడుకుంది. అందుకే ఆ పార్టీ జెండాలు, బ్యానర్లే ఎక్కువ కనిపిస్తున్నాయి'' అని బీజేపీ మహిళా విభాగం నాయకురాలు ఒకరు చెప్పారు. ఈ జెండాలు, బ్యానర్ల వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర పార్టీ సమావేశంలో శనివారం చర్చ కూడా జరిగింది.

సంకల్ప్ ర్యాలీకి వెళ్తున్న వారిలో ఎక్కువ మంది చేతుల్లో కూడా జేడీయూ జెండాలే కనిపిస్తున్నాయి.

Image copyright Neeraj Priyadarshi

''బీజేపీ ర్యాలీని హైజాక్ చేసిన జేడీయూ'' అంటూ స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి.

గాంధీ మైదానంలోకి ప్రవేశించే గేట్ల వద్ద ఒక మూల పారేసిన జెండాల్లో బీజేపీ జెండాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

మైదానంలోకి ప్రవేశించే వారి చేతుల్లోకి కొత్త జెండాలు వచ్చాయి. దీంతో ర్యాలీకి హాజరైన వారిలో ఎవరు ఏ పార్టీకి చెందిన కార్యకర్తలో చెప్పడం కష్టంగా ఉంది.

ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం.. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు గాంధీ మైదానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చారు.

అప్పుడు మైదానంలో ఎంత మంది జనం ఉన్నారనేది స్పష్టంగా చెప్పలేం. ఎందుకంటే ఒక్కచోట నిలబడ్డ ప్రజలు ఎంతమందో లెక్కించటం కష్టం.

Image copyright Neeraj Priyadarshi

పైన ఆకాశంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. మబ్బులు కమ్మాయి. ఆ మబ్బుల్లో ఎంత వర్షం దాగి ఉందో స్పష్టంగా చెప్పలేం.

అప్పుడే.. కొందరు ఫొటో జర్నలిస్టులు గాంధీ మైదానం పక్కనే ఉన్న బిస్కోమాన్ భవన్, పనాశ్ హోటల్ వంటి భారీ భవనాలపైకి ఎక్కి ఫొటోలు తీద్దామని ప్రయత్నించారు. కానీ, భద్రతా కారణాలను చూపించి పోలీసులు వారిని అడ్డుకున్నారు.

''గాంధీ మైదానంలో ర్యాలీ జరిగినప్పుడల్లా దానికి హాజరైన జనాలను చూపేందుకు మేమంతా ఈ బిల్డింగులు ఎక్కేవాళ్లం. ఇప్పుడు చూడండి వీళ్లు ఆపేశారు'' అని స్థానిక ఫొటో జర్నలిస్టు ఆనంద్ అన్నారు.

నరేంద్ర మోదీ కంటే ముందు సునీల్ మోదీ, రామ్ విలాస్ పాశ్వాన్, నితీశ్ కుమార్ తదితరులు ప్రసంగించారు. దీంతో ర్యాలీకి హాజరైన ప్రజలంతా మోదీ ప్రసంగం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.

Image copyright Neeraj priyadarshi

అందరికంటే చివర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించేందుకు సంసిద్ధులయ్యారు.

మోదీ లేచి నిలబడటంతోనే ప్రజలంతా కూడా లేచి నిలబడ్డారు. ఆయన మైకును సరిచేసి, మాట్లాడటం ప్రారంభించారు.

హిందీ, భోజ్‌పురి, మైథిలీ భాషల్లో నరేంద్ర మోదీ ప్రజలకు నమస్కారం చేస్తున్నారు. ఇంతలో హఠాత్తుగా ప్రజలంతా గాంధీ మైదానం నుంచి బయటకు పరుగులు పెట్టారు.

Image copyright Neeraj Priyadarshi

వర్షం మొదలైంది. పెద్దపెట్టున కురుస్తోంది. మరోపక్క మోదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. ఇటు వర్షం తీవ్రత పెరుగుతోంది. దీంతో ప్రజలంతా వర్షం బారి నుంచి తప్పించుకునేందుకు మైదానం వెలుపలకు వెళ్లిపోవడం ప్రారంభించారు.

ప్రసంగం కొనసాగింది. కొంతసేపు వర్షం పడింది. మోదీ ప్రసంగం సగం అయ్యింది. మైదానంలో ప్రజలంతా తలోదిక్కూ వెళ్లిపోయారు.

Image copyright NEERAJ PRIYADARSHI

తన ప్రసంగంలో సగం పూర్తయిన తర్వాత నరేంద్ర మోదీ విపక్షాలపై విమర్శలు సంధించడం మొదలు పెట్టారు. పుల్వామా దాడి గురించి కూడా మాట్లాడారు. బాలాకోట్ దాడి గురించి ఆధారాలు అడిగిన వారిపై అనుమానాలు వ్యక్తం చేశారు. తాను ''జాగ్రత్తగా చూసుకునే చౌకీదారు''నని మోదీ చెప్పుకున్నారు.

ప్రసంగం పూర్తయ్యే సరికి గాంధీ మైదానంలో కొందరు ఉన్నారు. వీళ్లు ముందునుంచీ వర్షంలో తడుస్తున్నవాళ్లే.

నేను పాన్ షాప్ దగ్గర ఆగితే ఇంత జనం వస్తారు

తాను కిళ్లీ కట్టించుకోవడానికి పాన్ షాప్ దగ్గర బండి ఆపితే చాలు మోదీ సభకు వచ్చినంత జనం వచ్చేవారని లాలూ ట్విటర్ వేదికగా అన్నారు.

‘‘మోదీ, నితీశ్, పాసవాన్‌లు నెలల తరబడి కష్టపడి, అధికార వ్యవస్థను వాడుకుని ఈ రోజు గాంధీమైదాన్‌కు ఈ జనాలను పోగేశారు. కానీ, నేను కిళ్లీ కట్టించుకోవడానికి పాన్ షాప్ దగ్గర బండి ఆపితే చాలు ఇంత జనం నా చుట్టూ చేరి ఉండేవారు’’ అని ఆ ట్వీట్‌లో మాటల దాడి చేశారు.

వాస్తవానికి లాలూ జైలులో ఉండగా ఆయన అధికారిక ట్విటర్‌ ఖాతా నుంచి ఈ ట్వీట్ పోస్టయింది. దీంతో.. తన కార్యాలయం ఈ ట్వీటర్ హ్యాండిల్ నడుపుతోందని లాలూ వివరణ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం