బాలాకోట్ వైమానిక దాడి: ఆ 5 కీలక ప్రశ్నలకు బదులిచ్చిన ఎయిర్‌ చీఫ్‌ మార్షల్ ధనోవా

  • 4 మార్చి 2019
ఎయిర్ చీఫ్ మార్షల్ ధనోవా Image copyright Twitter

భారత వైమానిక దళం చీఫ్ బీఎస్ ధనోవా సోమవారం మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్‌లో బాలాకోట్ దాడి నుంచి వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్, తీవ్రవాదానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న చర్యల వరకూ వివరంగా చెప్పారు.

జమ్ము కశ్మీర్ పుల్వామాలో మిలిటెంట్ దాడి తర్వాత భారత వైమానిక దళం పాకిస్తాన్ బాలాకోట్ ప్రాంతంలో దాడులు చేసింది. జైషే మహమ్మద్ ట్రైనింగ్ క్యాంపులను టార్గెట్ చేశామని చెప్పింది. అయితే, పాకిస్తాన్ భారత్ వాదనను తోసిపుచ్చింది.

మీడియాలో ఈ దాడి గురించి రకరకాల చర్చ జరుగుతోంది. ఈ చర్చల మధ్య వైమానిక దళం చీఫ్ కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

1. ఎయిర్ స్ట్రైక్స్‌లో ఎంతమంది మిలిటెంట్లు చనిపోయారు?

భారత వైమానిక దళానికి ఏ లక్ష్యాలు ఇచ్చారో, వాటిని మేం హిట్ చేశాం. మేం అడవుల్లో బాంబులు వేసుంటే పాకిస్తాన్‌కు ప్రతిదాడులు చేయాల్సిన అవసరం ఏముంది. దాడిలో ఎంతమంది చనిపోయారు అనేది వైమానిక దళం చెప్పలేదు, ఎందుకంటే మేం చనిపోయినవారి సంఖ్య లెక్క పెట్టలేం. ఈ చర్యల తర్వాత బాంబుల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేశాం. ఆ సమయంలో అక్కడ ఉన్న వారిని బట్టి చనిపోయిన వారి సంఖ్య ఆధారపడి ఉంటుంది.

Image copyright AFP

2. మిగ్ 21 బైసన్ ఎందుకు ఉపయోగించారు?

భారత వైమానిక దళం దగ్గర మిగ్-21 బైసన్ ఉంటే, ఇలాంటప్పుడు మేం దాన్నెందుకు ఉపయోగించకూడదు. వైమానిక దళం ఆపరేషన్స్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అలాంటప్పుడు మేం ఏయే విమానాలు ఉపయోగిస్తున్నాం అనేది నేను చెప్పలేను.

ఇక మిగ్-21 విషయానికి వస్తే, అది ఒక శక్తిమంతమైన విమానం. కొంతకాలం క్రితం దాన్ని అప్ గ్రేడ్ చేశాం. దానిలో ఎయిర్ టు ఎయిర్ మిసైల్, మెరుగైన రాడార్ సిస్టమ్‌తోపాటూ థర్డ్ జనరేషన్ విమానాన్ని మరింత ఆధునికం చేసే అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. వైమానిక దళం తన దగ్గర ఉన్న అన్ని విమానాలనూ ఉపయోగిస్తుంది.

3. వింగ్ కమాండర్ అభినందన్ ఇక ముందు యుద్ధ విమానం నడపగలరా?

వింగ్ కమాండర్ అభినందన్ తన విమానం నుంచి ఎజెక్ట్ కావాల్సి వచ్చింది. ఆయన ఫైటర్ ప్లేన్ కాక్‌పిట్‌లో కూర్చుంటారా, లేదా అనేది ఆయన మెడికల్ ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది. ఆయనకు ఏదైనా చికిత్స అవసరం అయితే అవన్నీ చేయిస్తాం. ఆ తర్వాత ఆయన మెడికల్ ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే యుద్ధ విమానం నడపగలరు.

Image copyright Reuters

4. వింగ్ కమాండర్ అభినందన్ యూనిట్ మారుతుందా?

మేం సాధారణంగా అంత త్వరగా యూనిట్ మార్చం. పూర్తిగా రికవర్ అయ్యేవరకూ ఆయన యుద్ధ విమానం నడపలేరు. మీకో విషయం చెప్పాలి, నేను కూడా ఒకసారి విమానం నుంచి బయటపడాల్సి వచ్చింది. శరీరంపై దాని ప్రభావం తీవ్రంగా పడింది. మొదటి ఎజెక్షన్ తర్వాత బాడీ రికవర్ కాకముందే, మేం మరోసారి విమానం నుంచి ఎజెక్ట్ అయితే ఆ పైలెట్ తన జీవితాంతం వీల్ చెయిర్‌ మీద గడపాల్సి వస్తుంది. అందుకే మేం ఒక ఫైటర్ పైలెట్ ఫిట్‌నెస్ గురించి చాన్స్ తీసుకోలేం.

ఫైటర్ ప్లెయిన్ పైలెట్ ఎంపికలో ఫెయిల్ అయ్యే శాతం చాలా ఎక్కువగా ఉంటుంది అనే విషయం మీకు తెలుసు. ఎందుకంటే మేం అభ్యర్థిని రీడ్ ఎముకల స్థితి నుంచి అన్నీ పరిశీలిస్తాం. అంటే వారు ఎజెక్షన్‌ను తట్టుకోగలరా లేదా అనేది చూస్తాం,

Image copyright Reuters

5. పాకిస్తాన్ అమెరికాతో చేసుకున్న ఒప్పదాన్ని ఉల్లంఘించిందా?

పాకిస్తాన్, అమెరికా మధ్య ఎఫ్-16 విమానాల ఒప్పందంలో షరతులు ఏంటో నాకు తెలీదు. ఈ విమానాలను దాడులకు వీటిని ఉపయోగించకూడదని ఆ ఒప్పందం ఉంటే, వాళ్లు కచ్చితంగా ఆ షరతును ఉల్లంఘించారు. ఎందుకంటే మన భూభాగంలో మాకు ఎమ్రామ్ మిసైల్ శకలాలు లభించాయి. మేం వాటిని చూపించాం కూడా. ఎయిర్ స్ట్రైక్స్ సమయంలో వాళ్లు ఒక ఎఫ్-16 విమానం కోల్పోయినట్లు అనిపిస్తోంది. అలాంటప్పుడు వాళ్లు మనకు వ్యతిరేకంగా కచ్చితంగా ఎఫ్-16 విమానం ఉపయోగిస్తున్నారు.

ఫిబ్రవరి 26న బాలాకోట్‌‌లో జైష్-ఎ-మొహమ్మద్ శిబిరంపై దాడి జరిపిన తరువాత భారత ఎయిర్ చీఫ్ మార్షల్ మీడియాతో మాట్లాడడం ఇదే తొలిసారి.

తాను రాజకీయాల గురించి ఏమీ మాట్లడనని.. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తిరిగి స్వదేశానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు