లోక్‌సభ ఎన్నికలు 2019: పెద్ద నోట్ల రద్దు అసలు లక్ష్యం నెరవేరిందా- RealityCheck

  • 5 మార్చి 2019
రద్దైన నోట్ల మార్పిడికి బ్యాంకుల ముందు బారులు తీరిన జనం Image copyright Getty Images
చిత్రం శీర్షిక రద్దైన నోట్ల మార్పిడికి బ్యాంకుల ముందు బారులు తీరిన జనం

అప్పటికి చలామణీలో ఉన్న 500, 1000 నోట్లను రద్దుచేస్తున్నట్లు 2016 నవంబరులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్రకటిత ఆస్తులు, నల్లధనాన్ని అరికట్టడానికి అదే సరైన పద్ధతని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే, నగదు వాడకాన్ని తగ్గించి, డిజిటల్ లావాదేవీల వైపు అడుగులు వేయడానికి కూడా ఇది తోడ్పడుతుందని చెప్పింది.

అయితే ఈ చర్యతో మిశ్రమ ఫలితాలు లభించాయి.

దీనివల్ల పన్నుల వసూళ్లలో గణనీయమైన వృద్ధి సాధించినప్పటికీ, అక్రమాస్తులను బయటకు తీయడానికి ఈ నోట్ల రద్దు ఎంతవరకూ ఉపయోగపడిందనే దానిపై ఇప్పటికీ సరైన సమాచారం లేదు. అలాగే, డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నా నగదు వాడకం కూడా ఏమీ తగ్గలేదు.

Image copyright AFP

అనూహ్యం - గందరగోళం

అనూహ్యంగా ప్రకటించిన నోట్ల రద్దు మొదట్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. రద్దైన నోట్లకు కొత్త నోట్లను పొందడం కేవలం బ్యాంకుల ద్వారానే అనుమతించారు, పైగా రోజుకు రూ.4000 మాత్రమే. ఇలా పరిమిత మార్పిడిని మొదట్లో కొద్దిరోజుల పాటు అమలు చేశారు.

పెద్దనోట్ల రద్దు వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనమైందని, ముఖ్యంగా నగదుపైనే ఆధారపడి జీవించే పేదలు, గ్రామీణ ప్రజలపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది.

ఆర్థిక వ్యవస్థలో భాగంకాని అక్రమ సంపదే అవినీతికి, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దోహదం చేస్తోందని, అందుకే దీన్నే లక్ష్యంగా చేసుకుని ఈ చర్యను చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.

అక్రమ సంపాదనను పోగేసుకున్నవారు ఒకేసారి బ్యాంకుల్లో ఆ మొత్తానికి కొత్త నోట్లు తీసుకోవడం కష్టమని మొదట్లో భావించారు.

కానీ, నోట్లరద్దుకు ముందున్న నగదు మొత్తం తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిందని 2018 ఆగస్టులో ఆర్బీఐ ఓ నివేదికలో వెల్లడించింది. ఇది ఒకింత ఆశ్చర్యానికి గురిచేయడమే కాదు, విమర్శకులకు మరో అవకాశం ఇచ్చినట్లయింది.

మొత్తం ధనం ఆర్థిక వ్యవస్థలోకి చేరిపోయింది అంటే లెక్కల్లోకి రాని సంపద భారీగా లేదనే అనుకోవాలి, లేదా తమ దగ్గరున్న నల్లధనాన్ని మార్చుకునేందుకు అక్రమార్కులు ఏవో మార్గాలను కనిపెట్టారనైనా అనుకోవాలి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పూరీ బీచ్‌లో సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన శిల్పం

పన్నులు వసూళ్లు పెరిగాయా?

నోట్ల రద్దు తర్వాత పన్నుల వసూళ్లలో గణనీయమైన పెరుగుదల చోటుచేసుకుందని ఓ ప్రభుత్వ నివేదిక స్పష్టం చేసింది. పన్ను ఎగవేతదారులను పన్నులు చెల్లించేలా చేసింది.

ప్రత్యక్ష పన్నులు

వార్షిక వృద్ధి రేటు(%)

ఆధారం : ఆదాయ పన్ను

నోట్లరద్దుకు ముందు రెండేళ్లలో పన్నుల వసూళ్లలో వృద్ధి రేటును పరిశీలిస్తే అది ఎప్పుడూ సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. 2016-17లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో గత సంవత్సరం కన్నా 14.5% పెరుగుదల నమోదైంది. ఆ తర్వాత సంవత్సరం ఈ పెరుగుదల 18శాతంగా నమోదైంది.

పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఉన్నవారిని గుర్తించడానికి, వారంతా రిటర్నులు ఫైల్ చేసేలా చేయడం ద్వారా నోట్ల రద్దు ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో వృద్ధికి సహాయపడిందని ఆదాయపన్ను విభాగం అభిప్రాయపడింది.

కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2008-09, 2010-11 మధ్య కాలంలో కూడా ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో ఇలాంటి పెరుగుదలే చోటుచేసుకుంది.

2016లో ప్రకటించిన ఆదాయపన్ను ఆమ్నెస్టీ పథకాలు, జీఎస్టీని అమల్లోకి తీసుకురావడం కూడా పన్నుల వసూళ్ల పెరుగుదలకు తోడ్పడ్డాయి.

నకిలీ నోట్లను అరికట్టాలనే లక్ష్యం నోట్ల రద్దుతో నెరవేరిందా? ఆర్బీఐ నివేదికను బట్టి చూస్తే కాదనే అనిపిస్తుంది.

నోట్ల రద్దు తర్వాత దొరికిన నకిలీ 500, 1000 నోట్ల సంఖ్య అంతకు ముందు సంవత్సరం దొరికిన నకిలీ నోట్ల సంఖ్య కన్నా కొద్దిగా ఎక్కువ.

కొత్తగా విడుదలచేసిన నోట్లకు ఉన్న ప్రత్యేకతల కారణంగా వాటికి దొంగనోట్లను తయారుచేయడం కష్టం, కానీ వీటికి కూడా నకిలీ నోట్లు మార్కెట్లోకి వచ్చేశాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.

నోట్ల రద్దు డిజిటల్ ఇండియాను సాకారం చేసిందా?

పెద్ద నోట్ల రద్దు భారత ఆర్థిక వ్యవస్థను డిజిటల్ వైపు మళ్లించడంలో సఫలమైందా? అంటే ఈ విషయంలో ఆర్బీఐ సమాచారం అస్పష్టంగానే ఉంది.

నగదు రహిత చెల్లింపుల్లో ఎప్పుడూ లేనంత వృద్ధి 2016 చివర్లో నోట్ల రద్దు తర్వాత నమోదైంది.

కానీ ఆ తర్వాత ఇది మళ్లీ పాత ట్రెండ్‌కి వచ్చేసింది.

కాలానుగుణంగా వచ్చే పెరుగుదలకు టెక్నాలజీ, సులభతర నగదు రహిత లావాదేవీలు దోహదం చేస్తాయి కానీ, దీనిపై ప్రభుత్వ పథకాల ప్రభావం పెద్దగా ఉండదు.

ఆర్థిక వ్యవస్థలో లభ్యతలో ఉన్న నగదు విలువ తగ్గిందా, ఒక్కసారి భారత్‌లో అందుబాటులో ఉన్న కరెన్సీ, జీడీపీల సంబంధాన్ని పరిశీలిస్తే ఇది అర్థమవుతుంది.

ఆర్థిక వ్యవస్థ పరిమాణం ఆధారంగా ఎంత విలువైన కరెన్సీ చలామణీలో ఉండాలనేదానికి ఇదే ప్రమాణం. నోట్ల రద్దు తర్వాత ఇది దారుణంగా పతనమైంది. కానీ ఆ తర్వాత సంవత్సరం మార్కెట్లోకి నగదు అందుబాటులోకి రావడంతో ఇది మళ్లీ 2016 నాటి స్థాయికి చేరుకుంది.

నగదు లావాదేవీలు తగ్గకపోవడమే కాదు, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో అత్యధిక స్థాయిలో నగదు వినియోగం ఉన్న దేశాల్లో ఇప్పటికీ భారత్ కూడా ఒకటి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ఈ కథనం గురించి మరింత సమాచారం