భారత్ సుంకాలపై ట్రంప్ కఠిన నిర్ణయం.. వాణిజ్య ప్రాధాన్య హోదా ఉపసంహరణ

  • 5 మార్చి 2019
ట్రంప్ మోదీ Image copyright Getty Images

ఎలాంటి సుంకం లేకుండా భారత్ నుంచి కొన్ని రకాల వస్తువులను అమెరికాకు ఎగుమతి చేసే వీలు కల్పించే 'వాణిజ్య ప్రాధాన్య హోదా'ను ఇక కొనసాగించరాదని డోనల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు.

తమ మార్కెట్లు అమెరికాకు సులభంగా అందుబాటులో ఉండేలా భరోసా కల్పించడంలో భారత్ విఫలమైందని ట్రంప్ అన్నారు.

కాగా ,అమెరికా వేస్తున్న అడుగులు ఆర్థికంగా తమపై పెద్దగా ప్రభావం చూపబోవని భారత్ అంటోంది.

మరోవైపు అమెరికా టర్కీ విషయంలోనూ ఇదే రీతిలో స్పందించింది. ఆ దేశానికీ వాణిజ్య ప్రాధాన్య హోదా తొలగించబోతున్నట్లు ప్రకటించింది.

అమెరికా వాణిజ్య లోటును తగ్గించడానికి ప్రయత్నిస్తున్న ట్రంప్ భారత్ అధిక సుంకాలు విధిస్తోందంటూ ఇప్పటికే పలుమార్లు ప్రస్తావించారు.

తాజాగా ఇప్పుడు భారత్‌కు వాణిజ్య ప్రాధాన్య హోదా తొలగించాలని అమెరికా వాణిజ్య ప్రతినిధుల కార్యాలయానికి సూచించారాయన.

Image copyright Getty Images

ఏమిటీ ప్రాధాన్య హోదా

జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్(జీఎస్‌పీ) కార్యక్రమం ప్రకారం ఈ వాణిజ్య ప్రాధాన్యం దక్కుతుంది. ఇలాంటి ప్రాధాన్యం దక్కే దేశాలు అమెరికాకు ఎలాంటి సుంకం లేకుండా కొన్ని వస్తువులను ఎగుమతి చేయొచ్చు.

అయితే, ఇందుకు అమెరికా కాంగ్రెస్ విధివిధానాలను అనుసరించాలి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి భంగం కలగకుండా చూసుకోవడంతో పాటు ఆ దేశ మార్కెట్లలో అమెరికాకు సులభ ప్రవేశానికి వీలు కల్పించాలి. కానీ భారత్ అధిక సుంకాలు విధించి మార్కెట్లకు తగిన యాక్సెస్ ఇవ్వడం లేదన్నది ట్రంప్ ఆరోపణ.

అయితే.. అమెరికా వాణిజ్య ప్రాధాన్య హోదా ఉపసంహరించుకుంటే పెద్దగా నష్టమేమీ ఉండదని భారత వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్ అన్నారు. గట్టిగా 19 కోట్ల డాలర్ల మేర భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుందని తెలిపారు.

ఈ ఉపసంహరణ అమెరికా-భారత్‌ల మధ్య గల అన్ని రకాల వాణిజ్య సంబంధాలనూ ప్రభావితం చేయబోదన్నారు.

Image copyright Reuters

భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందడంతోనే ఈ నిర్ణయం

- కరిష్మా వశ్వాణీ, ఆసియా బిజినెస్ కరస్పాండెంట్

అమెరికా జీఎస్‌పీ కార్యక్రమం వల్ల అత్యధికంగా లబ్ధి పొందుతున్న దేశం భారత్. వర్ధమాన, పేద దేశాలు ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా అమెరికా 1970లో ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.

ఈ కార్యక్రమం మొదలైన కాలంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 3.5 శాతం ఉండేది.

ఇప్పుడు ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ పరుగులు తీస్తోంది.

ఈ కారణం వల్లే అమెరికా, ట్రంప్ ప్రభుత్వం ఇక భారత్‌కు ఈ హోదా అవసరం లేదని భావిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలు ఇక ఎంతమాత్రం ఈ హోదాలో ఉంటూ అమెరికా నుంచి ప్రయోజనాలు పొందాల్సిన అవసరం లేదని.. ఒకవేళ ఆయా దేశాలు అమెరికా ప్రయోజనాలనూ రక్షిస్తేనే ఈ హోదాలో కొనసాగించాలన్నది అమెరికా ఉద్దేశం.

టర్కీకీ హోదా ఉపసంహరణ

టర్కీ విషయంలోనూ అమెరికా ఇలాంటి నిర్ణయాన్నే అమలు చేయడానికి సిద్ధమవుతోంది.

టర్కీ కూడా ఆర్థికంగా బలపడినందున వాణిజ్య ప్రాధాన్య హోదా ఉపసంహరించుకోవాలనుకుంటోంది.

అయితే... అమెరికా ఈ నిర్ణయం తీసుకుని భారత్, టర్కీ, యూఎస్‌ కాంగ్రెస్‌కు తమ ప్రకటన పంపిన తరువాత అమలు కావడానికి కనీసం 60 రోజులు పడుతుంది.

భారత్ స్పందన..

‘‘190 మిలియన్ అమెరికన్ డాలర్ల భారత వాణిజ్యంపై జీఎస్‌పీ ఉపసంహరణ ప్రభావం చాలా తక్కువ. అమెరికాతో మా వాణిజ్య సంబంధాలు ఎప్పట్లాగే సుహృద్భావ వాతావరణంలో కొనసాగుతాయి. అమెరికా ఉత్పత్తులపై మేం విధిస్తున్న సుంకాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు డబ్ల్యుటీఓ సూచించినట్లుగానే ఉన్నాయి’’ అని భారత వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వథవాన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)