మొబైల్ డేటా రేట్లు ప్రపంచంలోకెల్లా భారత్‌లోనే అత్యంత తక్కువ

 • 6 మార్చి 2019
భారతదేశ ఆర్థిక వృద్ధి Image copyright Getty Images

యూకేలో మొబైల్ డేటాకోసం ప్రజలు చెల్లించే ధరలు యూరప్‌లోని ఇతర దేశాలకన్నా ఎక్కువగా ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది.

ఒక గిగాబైట్ (జీబీ) డేటా ధర భారత్‌లో 0.26 డాలర్లు కాగా ఇది యూకేలో 6.66 డాలర్లుగా ఉందని కేబుల్.కో.యూకే అనే ఓ సంస్థ చేసిన ఈ అధ్యయనంలో వెల్లడైంది.

అమెరికాలో కూడా డేటా ధరలు ఎక్కువగానే ఉన్నాయని, 1 జీబీ డేటా 12.37 డాలర్లుగా ఉందని తెలిపింది.

ఈ ఫలితాలు చాలా నిరాశాజనకంగా ఉన్నాయని 'కేబుల్' సంస్థ టెలీకమ్యూనికేషన్స్ విశ్లేషకుడు డాన్ హౌడిల్ తెలిపారు.

"యూకే ఆరోగ్యకరమైన మార్కెట్టే అయినా ఈయూలోని ఫిన్లాండ్, పోలాండ్, డెన్మార్క్, ఇటలీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్‌ వంటి కొన్ని దేశాల్లో డేటాకోసం యూకేలో మేం చెల్లించేదాని కన్నా చాలా తక్కువ చెల్లిస్తున్నారు. బ్రెగ్జిట్ తర్వాత మా పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రపంచవ్యాప్తంగా 230 దేశాల్లో మొబైల్ డేటా రేట్లు ఎలా ఉన్నాయో ఈ అధ్యయనంలో భాగంగా కేబుల్ సంస్థ పరిశీలించింది. దీనిలో యూకే 136వ స్థానంలో నిలిచింది. 1 జీబీ డేటాకు ప్రపంచ సగటు ధర 8.53 డాలర్లు అని ఈ అధ్యయనం వెల్లడించింది.

పశ్చిమ యూరప్‌లో అత్యంత చవకగా 1.16 డాలర్లకే 1 జీబీ మొబైల్ డేటా అందిస్తున్న దేశం ఫిన్లాండ్. డెన్మార్క్, మొనాకో, ఇటలీల్లో కూడా 1 జీబీ డేటా ధర 2 డాలర్లలోపే ఉంది. ఇక్కడి 15 దేశాల్లో యూకే కన్నా తక్కువ ధరకే మొబైల్ డేటా లభిస్తోంది.

తూర్పు యూరప్‌లోని పోలాండ్‌లో 1 జీబీ మొబైల్ డేటా ధర 1.32 డాలర్లు కాగా, రొమేనియాలో 1.89 డాలర్లు, స్లొవేనియాలో 2.21 డాలర్లుగా ఉంది. తూర్పు యూరప్‌లో చవకగా డేటా అందించే దేశాలు ఇవే.

డేటా రేట్లు (డాలర్లలో) తక్కువగా ఉన్న మొదటి ఐదు దేశాలు

 1. భారత్ - 0.26 డాలర్లు
 2. కిర్గిస్తాన్ - 0.27
 3. కజకిస్తాన్ - 0.49
 4. యుక్రెయిన్ - 0.51
 5. రువాండా - 0.56

డేటా రేట్లు (డాలర్లలో) ఎక్కువగా ఉన్న మొదటి ఐదు దేశాలు

 1. జింబాబ్వే - 75.20 డాలర్లు
 2. ఈక్వటోరియల్ గినీ - 65.83
 3. సెయింట్ హెలీనా - 55.47
 4. ఫాక్‌లాండ్ ఐలాండ్స్ - 47.39
 5. జిబౌటి - 37.92
Image copyright Getty Images

డేటా ప్యాక్‌ల ధరలు

1 జీబీ మొబైల్ డేటా ధర అత్యధికంగా జింబాబ్వేలో 75.20 డాలర్లుగా ఉంది.

అత్యంత చవకైన, ఖరీదైన డేటా సేవలందించే దేశాలు ఆఫ్రికాలోనే ఉన్నాయి. రువాండా, సుడాన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో.. ఇవన్నీ 1 డాలర్ కన్నా తక్కువగే 1 జీబీ డేటానిస్తున్నాయి. కానీ ఈక్వటోరియల్ గినీ, సెయింట్ హెలీనాలు అదే డేటాకు 50 డాలర్లకు పైగా వసూలు చేస్తున్నాయి.

చవకగా డేటా లభించే మొదటి 20 దేశాలు ఆసియాలోనే ఉన్నాయి. ఇక్కడి తైవాన్, చైనా, దక్షిణ కొరియాలు మాత్రమే ప్రపంచ సగటు ధర కన్నా కొద్దిగా ఎక్కువగా వసూలు చేస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మొబైల్ డేటా ధరల్లో ఇన్ని వ్యత్యాసాలకు కారణాలు చాలా సంక్షిష్టంగా ఉన్నాయని హౌడిల్ అభిప్రాయపడ్డారు.

Image copyright Getty Images

"కొన్ని దేశాల్లో మొబైల్, ఫిక్సుడ్ బ్రాడ్‌బ్యాండ్ వ్యవస్థలు అద్భుతంగా ఉన్నాయి. అందువల్ల అక్కడి ప్రొవైడర్లు పెద్దమొత్తంలో డేటాను అందించగలుగుతున్నాయి. దీంతో రేట్లు దిగివస్తున్నాయి. బ్రాండ్‌బ్యాండ్‌ వ్యవస్థకు కావలసిన మౌలిక సౌకర్యాలు సరిగ్గా లేని దేశాల్లో మొబైల్ డేటాపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. అక్కడి ప్రభుత్వాలు కూడా ప్రజలకు అందుబాటులోనే రేట్లు ఉండాలని ఆదేశిస్తున్నాయి" అని ఆయన విశ్లేషించారు.

"డేటా రేట్లు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాను చూస్తే... మౌలిక సౌకర్యాలు అంత గొప్పగా లేని దేశాల్లో వినియోగం కూడా చాలా తక్కువగానే ఉంటోంది. ప్రజలు చాలా తక్కువమొత్తంలో అంటే, 10 మెగాబైట్ల వంటి తక్కువ డేటా ప్యాక్‌లను కొనుగోలు చేస్తున్నారు. దీంతో వారికి గిగాబైట్ డేటాను కొనడం అంటే చాలా ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది" అని హౌడిల్ తెలిపారు.

వివిధ దేశాల్లో లభించే విభిన్న ప్యాకేజీలు, సిమ్-ఓన్లీ ఆఫర్ల ఆధారంగా ఈ పరిశోధన జరిగింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)