ఓట్ల తొలగింపు కోరుతూ 3 నెలల్లో 8.72 లక్షల దరఖాస్తులు: ప్రెస్‌రివ్యూ

  • 6 మార్చి 2019
Image copyright Facebook/Election Commission of India

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ముఠాలు తయారయ్యాయి. ఓట్ల తొలగింపునకు గంపగుత్తగా దరఖాస్తులు చేస్తూ తమ ప్రత్యర్థి పార్టీల ఓట్లు తీయించే పనిని ముమ్మరంగా చేపట్టాయని ఈనాడు ఒక కథనంలో పేర్కొంది.

‘‘కొన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు, కొందరు వ్యక్తులు దీనిలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల సంఘాన్నే బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటర్ల జాబితాలో నుంచి తమ పేరు తొలగించాలంటూ ఓటర్లకు తెలియకుండానే వారి పేరిట ఎన్నికల సంఘానికి కొందరు భారీ ఎత్తున దరఖాస్తులు పెడుతున్నారు. గత పది రోజుల్లో ఎన్నికల సంఘానికి ఫారం-7లు లక్షల్లో వెల్లువెత్తాయి.

ప్రాథమిక సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి 8.72 లక్షల దరఖాస్తులు అందాయి. వీటిలో 90 శాతం గత పది రోజుల వ్యవధిలో ఆన్‌లైన్‌లో వచ్చినవే. గుంటూరు జిల్లాలో 1.17 లక్షలు, చిత్తూరులో 1.09 లక్షల మంది పేరిట ఈ ముఠా ఓట్ల తొలగింపు కోసం దరఖాస్తు చేశారంటే ఇది ఏ స్థాయిలో సాగుతోందో అర్థమవుతుంది.

ఇన్ని లక్షల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించటం చాలా కష్టసాధ్యం. ఈ క్రమంలో అర్హుల ఓట్లు గల్లంతై, అనర్హుల ఓట్లు జాబితాలో మిగిలిపోయే ప్రమాదం ఉంది.

ఓటరుగా నమోదు కావాలంటే ఫారం-6 తోనూ, జాబితా నుంచి పేరు తొలగించాలన్న, ఎవరి పేరైనా ఓటర్ల జాబితాలో ఉండటంపై అభ్యంతరం తెలపాలన్న ఫారం-7తోనూ దరఖాస్తు చేసుకోవాలి. ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్‌లో ఈ దరఖాస్తులు చేసుకునేలా ప్రజలకు వెసులుబాటు కల్పించేందుకు ఎన్నికల సంఘం నేషనల్‌ ఓటర్‌ సర్వీసు పోర్టల్‌ను ఏర్పాటు చేసింది.

ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో నిర్ణీత ఫారాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సదవకాశాన్ని కొన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులు, కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు. గ్రామాల్లో తమ ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లు గల్లంతు చేసేందుకు వారి పేరిట ఎన్‌వీఎస్‌పీ వెబ్‌సైట్‌ ద్వారా భారీ ఎత్తున ఫారం-7 దరఖాస్తులు చేస్తున్నారు. వీటిపై ఫిర్యాదులువెల్లువెత్తుతున్నాయి.

రాజకీయ పార్టీల బూత్‌ కమిటీల బాధ్యులు ఆయా బూత్‌ల పరిధిలో తమ ప్రత్యర్థి పార్టీలకు చెందిన, సానుభూతిపరులైన వారి ఓట్లు తొలగించాలంటూ దరఖాస్తులు చేయడాన్ని గత వారం రోజుల్లో ఓ ఉద్యమంలా చేపట్టారు. దీంతో ఈ కొద్ది రోజుల వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో తొలగింపు దరఖాస్తులు వెల్లువెత్తాయ’’ని ఈనాడు తెలిపింది.

హైకోర్టు Image copyright High court website

‘ఏపీ డీజీపీ పార్కు ఆక్రమణపై హైకోర్టుకు నివేదిక

ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ రామ్‌ ప్రవేశ్‌ ఠాకూర్‌ (ఆర్పీ ఠాకూర్‌) హైదరాబాద్‌లోని ప్రశాసన్‌నగర్‌లో జీహెచ్‌ఎంసీకి చెందిన పార్కు భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవమేనని జీహెచ్‌ఎంసీ న్యాయవాది ఎల్‌.వెంకటేశ్వరరావు హైకోర్టుకు నివేదించారు. తాము నోటీసు జారీ చేసిన తరువాత పార్కులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించారని వివరించారని సాక్షి తెలిపింది.

‘‘అనుమతి పొందిన ప్లాన్‌ కు విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు చేపడుతుండటంపై కూడా నోటీసులు జారీ చేశామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, జీహెచ్‌ఎంసీపై నిప్పులు చెరిగింది. పార్కును అక్రమించుకునేంత వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.

అనుమతి పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే ఎక్కడున్నారంటూ నిలదీసింది. అక్రమ నిర్మాణాల విషయంలో తప్పుపట్టాల్సింది అవి చేపడుతున్న వారిని కాదని, చోద్యం చూస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పీకలకు చుట్టుకుంటుందని అనుకున్నప్పుడే స్పందించడం జీహెచ్‌ఎంసీ అధికారులకు అలవాటుగా మారిందని వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణా ల విషయంలో ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారో తమకు అర్థం కాకుండా ఉందంది.

24 గంటల్లో ఆక్రమణలను తొలగించాలని, లేకుంటే కూల్చివేస్తామంటూ చెప్పడం అలవాటుగా మారిందంది. నోటీసు ఇచ్చినప్పుడు దానికి స్పందిం చేందుకు వారం రోజు ల గడువునివ్వాలని సుప్రీంకోర్టు తీర్పులిచ్చిందని గుర్తు చేసింది.

ఈ కేసులో కూడా డీజీపీ ఠాకూర్‌కు 24 గంటల సమయం ఇవ్వడాన్ని తప్పు పట్టింది. ఠాకూర్‌ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే విషయంలో యథాతథస్థితిని (స్టేటస్‌ కో) కొనసాగించాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింద’’ని సాక్షి పేర్కొంది.

ట్విటర్ లోగో Image copyright Getty Images

కేటీఆర్‌- నారా లోకేశ్ మధ్య ట్వీట్ల వార్

తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ ఇప్పట్లో ముగిసే పరిస్థితులు కనిపించట్లేదు. టీడీపీ వర్సెస్‌‌ వైసీపీగా మొదలైన ఈ వివాదంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించి ఏపీ సర్కార్, సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించడంతో ఈ వివాదం మరింత ముదిరిందని ఆంధ్రజ్యోతిపేర్కొంది.

ఇటీవల ఈ డేటా వ్యవహారంపై కేటీఆర్ స్పందించడంతో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన తెలుగు తమ్ముళ్ల కౌంటర్ల వర్షం కురిపించారు. అయితే సోమవారం లోకేశ్ ట్వీట్స్‌‌పై కేటీఆర్ స్పందించి కౌంటర్లు కురిపించారు. అయితే తాజాగా మంత్రి నారా లోకేశ్‌‌.. కేటీఆర్‌‌పై వరుస ట్వీట్ల వర్షం కురిపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అటు డేటా వార్.. ఇటు కేటీఆర్-లోకేశ్‌‌ల మధ్య ట్వీట్ వార్ జరుగుతోందని చెప్పుకోవచ్చు.

మొదటి ట్వీట్...

" ఏపీ డేటా పోయింద‌ని క‌ల‌గ‌న్నారా కేటీఆర్ గారూ?.. మా సమాచారం పోలేదని ఏపీ సర్కార్ స్ప‌ష్టం చేసింది. ఓటర్ లిస్ట్ సమాచారం పబ్లిక్ డేటా అని ఈసీ ప్ర‌క‌టించింది. మ‌రి ఏపీ డేటా పోయింద‌ని క‌ల ఏమైనా వ‌చ్చిందా? ఈ ఎపిసోడ్‌లో పోయింది ఏపీ డేటా కాదు. హైద‌రాబాద్ బ్రాండ్ ఇమేజ్" అని కేటీఆర్‌పై కౌంటర్ల వర్షం కురిపించారు లోకేశ్.

రెండో ట్వీట్...

"టైమ్ మిష‌న్ ఎక్కిన కేటీఆర్‌ గారూ!.. మార్చ్ 2న ఎఫ్ఐఆర్ నమోదు అయితే ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 4.30 కి ఐటీ గ్రిడ్స్ సంస్థ పై 30 మంది పోలీసుల దాడి ఎలా జరిగింది?. వారం రోజుల పాటు తెలుగుదేశం పార్టీ కీలక సమాచారం ఇవ్వాలని మీరు ఉద్యోగుల‌ను, వారి కుటుంబ సభ్యులను వేధించారు" అని లోకేశ్ ట్వీట్ చేశారు.

మూడో ట్వీట్...

"మా డేటా ఎత్తుకెళ్లిపోయి... 'ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే' అంటున్నారు. సావాస దోషం మ‌రి! ల‌క్షల కోట్ల దొంగ‌తో స్నేహం మిమ్మ‌ల్నీ దొంగని చేసింది" అని లోకేశ్ ఆఖరి ట్వీట్ చేశారు. కాగా.. ఈ ట్వీట్స్‌‌పై టీఆర్ఎఉస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి అని ఆంధ్రజ్యోతి తెలిపింది.

మందులు Image copyright Getty Images

‘వంద రూపాయల ఔషధం మూడు వేలకు’

కొన్ని ఔషధ తయారీ కంపెనీలు అసలు ధరకు దాదాపు 30 రెట్ల వరకు పెంచి ఎమ్మార్పీ ముద్రిస్తున్నాయని నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వ్యవస్థాపక అధ్యక్షుడు పీఆర్ సోమాని ఆరోపించారు. దేశప్రజలంతా ఆర్థికంగా దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందులో కంపెనీలతోపాటు పలువురు డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్ వ్యాపారులు, డాక్టర్లు భాగస్వాములుగా ఉన్నారన్నారని చెప్పినట్లు నమస్తే తెలంగాణ పేర్కొంది.

ఔషధాల అమ్మకాల్లో అవినీతికి సంబంధించి కొన్ని ఆధారాలను ఆయన మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు బహిర్గతం చేశారు. దేశంలో మందుల ధరలను అదుపులో ఉంచేందుకు సరైన డ్రగ్ పాలసీ లేకపోవడంతో తయారీదారులు రెచ్చిపోతున్నారని చెప్పారు.

శస్త్రచికిత్సల ఉపకరణాలపైనా అధిక మొత్తంలో ధరలు ముద్రిస్తూ దోచుకుంటున్నారని వెల్లడించారు. ఉదాహరణకు.. ఒక కంపెనీ ఔషధం తయారుచేసిన తర్వాత రిటైలర్ ద్వారా రూ.100కు అమ్మాల్సి ఉంటుంది. కానీ ఎమ్మార్పీ రూ.మూడువేలుగా ప్రింట్‌చేసి అమ్ముతున్నారు. తయారీఖర్చు కంటే 30 రెట్లు అధిక ధర వసూలు చేస్తున్నారు అని వివరించారు.

డ్రగ్స్ ప్రైసెస్ కంట్రోల్ యాక్ట్-2013 ప్రకారం నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) షెడ్యూల్‌లో పేర్కొన్న మందుల ధరలను నియంత్రింస్తుందని సోమాని తెలిపారు. వీటిపై రిటైలర్ 16 శాతం మాత్రమే మార్జిన్ తీసుకోవాలన్నారు. షెడ్యూల్‌లో లేని మందులపై ఎలాంటి నియంత్రణ లేదని, ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న 80-85 శాతం మందు లు ఇలాంటివేనని చెప్పారు.

అధిక ధరలపై తాను 2018 అక్టోబర్‌లో ప్రధాని మోదీకి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశానని, డిసెంబర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దృష్టి కి తీసుకెళ్లానని సోమాని చెప్పారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశానన్నారు. ఎట్టకేలకు స్పందించి మందుల ధరలను తగ్గించేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించిందన్నారు.

42 యాం టీ క్యాన్సర్ మందుల ధరలను నియంత్రించిదని చెప్పారు. మందు ల తయారీ ధరలకు గరిష్ఠంగా 30 శాతం లాభాలు వసూలుచేసేలా చర్యలు తీసుకున్నదన్నారు. ఫలితంగా వాటి ధరలు 85% వరకు తగ్గినట్టు చెప్పారని నమస్తే తెలంగాణ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

గోదావరి కచ్చులూరు పడవ ప్రమాదంలో ప్రధాన నిందితుడైన బోటు యజమాని, మరో ఇద్దరి అరెస్ట్

ఇన్‌స్టాగ్రాంలో ‘బ్రౌన్ గర్ల్స్’... దక్షిణాసియా అమ్మాయిల సరికొత్త గ్యాంగ్

శేఖర్ రెడ్డిని చంద్రబాబు బినామీ అన్న జగన్ ఆయనను టీటీడీ బోర్డులోకి ఎలా తీసుకున్నారు?

నిర్మలా సీతారామన్: కార్పొరేట్ పన్ను రేట్ల తగ్గింపు... లాభాలతో ఉరకలెత్తిన సెన్సెక్స్

ఆంధ్రప్రదేశ్: గ్రామ స‌చివాల‌య ఉద్యోగ ప‌రీక్ష‌లపై వివాదం ఏంటి? ప్రభుత్వం ఏమంటోంది?

గోదావరి పడవ ప్ర‌మాదాలు: ప్రభుత్వాలు తీసుకున్న చర్యలేంటి? ఫలితాలేమైనా ఉన్నాయా?

గూగుల్ యాప్స్ లేకుండా హువావే కొత్త ఫోన్లు.. మేట్ 30 ప్రోలో మూవీ కెమెరా

వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'