అయోధ్య కేసు: హిందూ మహాసభ, నిర్మోహి అఖాడాలు ప్రతిపాదించిన మధ్యవర్తులు వీరే

  • 6 మార్చి 2019
బాబ్రీ మసీదు Image copyright Getty Images

అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూ వివాదాన్ని ''శాశ్వత పరిష్కారం కోసం'' కోర్టు ఆధ్వర్యంలో నియమించే మధ్యవర్తికి అప్పగించడంపై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఈ కేసులో వాదనలు విన్న తరువాత మధ్యవర్తి నియామకంపై తీర్పును రిజర్వ్‌లో పెడుతున్నట్లు వెల్లడించింది.

''ఇది భూ వివాదం మాత్రమే కాదు. మత విశ్వాసాలు, ఉద్వేగాలకు సంబంధించినది. ఎవరు కూల్చారన్నది ఇప్పుడు అప్రస్తుతం. ప్రస్తుత వివాదాన్ని పరిగణనలోకి తీసుకుని పరిష్కరించాలని చూస్తాం. ఒకరి కంటే ఎక్కువ మంది మధ్యవర్తులు అవసరం అనుకుంటున్నాం'' అని ధర్మాసనంలోని జస్టిస్‌ బోబ్డే అన్నారు.

''ఒకవేళ సమస్యను మధ్యవర్తికి అప్పగించేలా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటే రెండు పక్షాలు మధ్యవర్తుల పేర్లు సూచించాలి' అని చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నిర్దేశించారు.

అలాగే.. మధ్యవర్తిత్వం ప్రక్రియ కొనసాగుతున్నపుడు దీనికి సంబంధించిన పరిణామాలపై మీడియా రిపోర్టుల మీద సంపూర్ణ నిషేధం ఉండాలని తాము భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ''ఇది గొంతు నొక్కివేసే ఉత్తర్వు కాదు.. కానీ ఆ పరిణామాలపై వార్తలు వద్దు'' అని చెప్పింది.

అఖిల భారతీయ హిందూ మహాసభ ప్రతిపాదించిన మధ్యవర్తులు

  • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన దీపక్ మిశ్రా, జగదీశ్ సింగ్ ఖెహర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఏకే పట్నాయక్

నిర్మోహి అఖాడా ప్రతిపాదించిన మధ్యవర్తులు

  • సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన కురియన్ జోసెఫ్, ఏకే పట్నాయక్, జీఎస్ సింఘ్వి
Image copyright Getty Images

‘‘గతం మీద మా నియంత్రణ లేదు’’

అంతకుముందు విచారణ సందర్భంగా.. ''మేం కూడా చరిత్ర చదివాం. గతం మీద మా నియంత్రణ లేదు. ప్రస్తుతం గురించి మాత్రమే మేం ఏమైనా చేయగలం'' అని జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారు.

మధ్యవర్తిత్వానికి ముందు కోర్టు పబ్లిక్ నోటీస్ జారీ చేయాల్సి ఉంటుందని హిందూ మహాసభ తరఫు న్యాయవాది ఎస్.కె.జైన్ విచారణ సందర్భంగా ధర్మాసనంతో పేర్కొన్నారు. హిందువులు ఈ అంశాన్ని మనోభావాలకు సంబంధించినదిగా పరిగణిస్తారంటూ.. బాబరు ఇక్కడ రామమందిరాన్ని కూల్చివేశారని చెప్తూ.. మధ్యవర్తిత్వం నిష్ఫలమవుతుందని ఆయన పేర్కొనటంతో బోబ్డే తర్వాత ఆయన పై విధంగా స్పందించారు.

మధ్యవర్తిత్వానికి తాము మద్దతు తెలుపుతున్నట్లు నిర్మోహి అఖాడా తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ సుశీల్ జైన్ చెప్పారు.

మధ్యవర్తిత్వం నిర్దిష్ట ప్రమాణాలకు లోబడి ఉండాలని.. వాటిని మార్చటానికి వీలు ఉండరాదని సుబ్రమణ్యం స్వామి సుప్రీంకోర్టుకు నివేదించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు