లోక్‌సభ ఎన్నికలు 2019: అందరికీ మరుగుదొడ్లు కల్పిస్తామన్న మోదీ హామీ నెరవేరిందా? - BBC Reality Check

  • 7 మార్చి 2019
మోదీ, జైరాం రమేశ్

ప్రతిష్ఠాత్మక 'స్వచ్ఛ్ భారత్' కార్యక్రమంలో భాగంగా కోటికి పైగా మరుగుదొడ్లను నిర్మిస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. తాము అధికారంలోకి రాకముందు అంటే 2014 వరకూ కేవలం 40శాతం మందికి మాత్రమే మరుగుదొడ్డి సౌకర్యం ఉండేదని, కానీ ప్రస్తుతం 90% మంది భారతీయులకు మరుగుదొడ్డి సదుపాయం ఉందని చెబుతున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఇది నిజమేనా?

నిజమే, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం భారీ స్థాయిలో జరిగింది. అయితే ఈ మరుగుదొడ్లన్నీ వినియోగంలో లేవు, కొన్ని సరిగ్గా పనిచేయడం లేదు. దీనికి అనేక కారణాలున్నాయి.

"ప్రస్తుతం 90% మంది భారతీయులకు మరుగుదొడ్డి సౌకర్యం ఉంది. 2014కి ముందు ఇది కేవలం 40 శాతమే" అని 2018 సెప్టెంబరులో మోదీ వ్యాఖ్యానించారు. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ పథకాన్ని విమర్శించింది.

"మరుగుదొడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని చూపించాలనే ఆరాటంలో ప్రణాళికాబద్ధంగా, స్థిరీకృత పద్ధతిలో మెరుగైన ఆరోగ్య సాధన అనే అసలు లక్ష్యం పక్కదారి పట్టింది" అని పారిశుధ్య శాఖ మాజీ మంత్రి జైరామ్ రమేశ్ 2018 అక్టోబరులో విమర్శించారు.

'స్వచ్ఛ్ భారత్' కార్యక్రమంలో రెండు అంశాలున్నాయి.

  • గ్రామీణ స్వచ్ఛ్ భారత్ - విస్తృతంగా మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా గ్రామాల్లో బహిరంగ మలవిసర్జన చేయడాన్ని ఆపాలనేది దీని లక్ష్యం.
  • పట్టణ స్వచ్ఛ్ భారత్- ఇళ్ళల్లో, బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్లను ఏర్పాటుచేయడం, నగరాల్లో ఘన వ్యర్థాల మెరుగైన నిర్వహణ దీని లక్ష్యం.

పొలాలు, ఖాళీ ప్రదేశాలు, నదుల్లో బహిరంగ మలవిసర్జన వ్యాధుల వ్యాప్తికి కారణమవుతుంది.

చీకట్లో, ఎవరూ చూడని ప్రదేశాలకు మహిళలు మలవిసర్జనకు వెళ్ళినప్పుడు వారి భద్రత కూడా ప్రమాదంలో పడుతోంది.

మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే బాగా పురోగతి సాధించిందని, 2018 నవంబరు నాటికి 96.25% ఇళ్ళలో మరుగుదొడ్లు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించిన సమాచారం స్పష్టం చేస్తోంది. 2014 అక్టోబరులో ఇది 38.7% మాత్రమే.

ఈ సమాచారాన్ని బట్టి చూస్తే, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కన్నా రెట్టింపు సంఖ్యలో ప్రస్తుత ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టింది.

గ్రామీణ కుటుంబాల్లో 77% మందికి మరుగుదొడ్డి సదుపాయం ఉందని, వీరిలో 93.4% మంది దాన్ని నిత్యం వాడుతున్నారని నవంబరు 2017 నుంచి మార్చి 2018 మధ్య కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో జరిపిన ఓ స్వతంత్ర సర్వేలో వెల్లడైంది (ఆధారం: http://www.indiaenvironmentportal.org.in/files/file/NARSS-2017-18-Provisional-Summary-Results-Report.pdf ).

దేశవ్యాప్తంగా 6,136 గ్రామాల్లో 92,000కి పైగా కుటుంబాలను ఈ సర్వే పరిగణనలోకి తీసుకుంది.

27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఇప్పుడు బహిరంగ మలవిసర్జనరహితంగా మారాయని స్వచ్ఛ్ భారత్ మిషన్ తెలిపింది. (ఆధారం: http://swachhbharatmission.gov.in/sbmcms/index.htm)

2015-16లో సిక్కిం మాత్రమే బహిరంగ మలవిసర్జనరహిత రాష్ట్రంగా ఉండేదని తెలిపింది.

Image copyright Getty Images

మరుగుదొడ్డి వాడకం - సమస్యలు

మరుగుదొడ్ల నిర్మాణంపై సమాచారం పుష్కలంగా ఉన్నప్పటికీ, అవి ఎంతవరకూ ఉపయోగంలో ఉన్నాయనే ప్రశ్న మాత్రం ఉంది. మరోమాటలో చెప్పాలంటే, ఇంట్లో మరుగుదొడ్డి ఉన్నంతమాత్రాన దాన్ని ఉపయోగించాలని లేదు, బహిరంగ మలవిసర్జన ఆగిపోయిందని కాదు.

2016లో నిర్మించిన మరుగుదొడ్లలో 5శాతం ఉపయోగంలో లేవని, 3శాతం టాయిలెట్లకు నీటి సౌకర్యం లేదని.. ప్రభుత్వ ప్రధాన సమాచార సేకరణ సంస్థ 'నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్' (ఎన్ఎస్ఎస్ఓ) తెలియజేసింది. [ఆధారం: http://mospi.nic.in/sites/default/files/publication_reports/Swachhta_Status_Report%202016_17apr17.pdf ]

అప్పటి నుంచి ఇప్పటికి పరిస్థితులు మెరుగుపడ్డాయని గ్రామీణ స్వచ్ఛ్ భారత్ మిషన్ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ బీబీసీకి చెప్పారు.

Image copyright Getty Images

కానీ అధికారిక నివేదికలు, ఎన్జీఓల పరిశోధనలు అనేక అంశాలను వెల్లడి చేస్తున్నాయి.

  • అనేక మరుగుదొడ్లకు సింగిల్ పిట్ లెట్రిన్ లేదా సెప్టిక్ ట్యాంక్ ఉంటున్నాయి, అయిదు నుంచి ఏడేళ్ళలో ఇవి నిండిపోతాయి. ఆ తర్వాత ఇవి నిరుపయోగంగా మారతాయి.
  • నాసిరకం నిర్మాణం, సరైన నిర్వహణలేమి వల్ల కొన్ని మరుగుదొడ్లు పనిచేయకుండా పోతున్నాయి.
  • లక్ష్యాలకు, అధికారుల దగ్గరున్న సమాచారంలో కూడా కొంత తేడా ఉంది.

ఉదాహరణకు, ప్రభుత్వ పాఠశాలలన్నింట్లో బాలబాలికలు ప్రత్యేక టాయిలెట్లు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ 2015లో ప్రకటించారు. కానీ 2018లో విడుదలైన విద్యా వార్షిక నివేదిక [http://img.asercentre.org/docs/Publications/ASER%20Reports/ASER%202016/State%20pages%20English/allindia_english.pdf] ప్రకారం.. దాదాపు 23శాతం ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగుదొడ్లు ఉపయోగానికి యోగ్యంగా లేవని స్పష్టమైంది.

కొన్ని అంశాల్లో లక్ష్యాల నిర్దేశిత గడువు కూడా ముగిసిపోయిందనే సూచనలు కనిపిస్తున్నాయి.

ఆరు సంవత్సరాల ముందు నుంచే అంటే రాష్ట్ర జనాభా తక్కువగా ఉన్నప్పుడే మరుగుదొడ్ల నిర్మాణంపై కృషి చేస్తోందని గుజరాత్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి 2018లో విడుదలైన ఓ నివేదికలో పేర్కొన్నారు.

Image copyright Getty Images

ఇకపై బహిరంగ మలవిసర్జన ఉండదా?

మహారాష్ట్ర బహిరంగ మలవిసర్జనరహితంగా మారిందన్న అధికారుల మాటల్లో నిజమెంతో తెలుసుకునేందుకు బీబీసీ 2018లో సొంతంగా పరిశోధన చేసింది. ఓ గ్రామంలోని 25% ఇళ్ళకు మరుగుదొడ్లు లేవని, దీంతో వాళ్ళు బహిర్భూమికి వెళుతున్నారని దీనిలో వెల్లడైంది. బీబీసీ కథనం తర్వాత స్థానిక అధికారులు మరిన్ని మరుగుదొడ్లు నిర్మించారు.

బహిరంగ మలవిసర్జన ముగింపుపై ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలపై మరికొన్ని నివేదికలు కూడా సందేహాలను కలిగిస్తున్నాయి. ఉదాహరణకు, తమది బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా గుజరాత్ అక్టోబరు 2, 2017న ప్రకటించింది. కానీ అక్కడ 29% ఇళ్ళకు ఇంకా మరుగుదొడ్లు లేవని దాదాపు సంవత్సరం తరువాత వెల్లడైన అధికారిక లెక్కలు వెల్లడించాయి.

Image copyright Getty Images

మారని అలవాట్లు

ప్రజల అలవాట్లను మార్చడం అనేది ఈ ప్రభుత్వ కార్యక్రమం ముఖ్యమైన లక్ష్యం. దీన్ని లెక్కించడం కొంచెం కష్టమే కానీ కొన్ని ప్రాంతాల్లో అలవాట్లను మార్చుకోవడంపై సమస్యలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.

"ప్రజలు మరుగుదొడ్లు నిర్మించుకున్నారు కానీ వీటిని ఇంటిలో భాగంగా పరిగణించడం లేదు. మరుగుదొడ్లు తమకు సౌకర్యంగా లేవంటూ చాలా ఇళ్లల్లో ముసలివాళ్ళు వాటిని ఉపయోగించడం లేదు" అని ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలి జిల్లాకు చెందిన సీనియర్ అధికారి సత్యేంద్ర కుమార్ బీబీసీకి చెప్పారు.

నాలుగు ఉత్తర భారత రాష్ట్రాలైన బిహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్‌లలో ఈ అంశాన్ని పరిశీలించి ఈ ఏడాది జనవరిలో ఓ నివేదిక వెలువడింది.

ఇంట్లో మరుగుదొడ్డి ఉన్నప్పటికీ కనీసం 25శాతం మంది ప్రజలు ఇప్పటికీ మలవిసర్జనకు బహిరంగ ప్రదేశాలకే వెళ్తున్నారు అని ఆ నివేదికలో వెల్లడైంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు