జమ్మూ బస్టాండ్‌లో గ్రెనేడ్ దాడికి పాల్పడిన మిలిటెంట్ అరెస్ట్

  • 8 మార్చి 2019
జమ్మూ గ్రెనేడ్ పేలుడు Image copyright Getty Images
చిత్రం శీర్షిక జమ్మూ బస్టాండ్‌లో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రదేశంలో బాంబు పేలుడు సంభవించింది

గురువారం నాడు జమ్మూ బస్టాండ్‌లో జరిగిన గ్రెనేడ్ పేలుడులో మృతుల సంఖ్య రెండుకు చేరింది. ఈ దాడిలో ఇంకా 30 మందికి పైగా గాయపడ్డారు.

ఈ దాడి అనంతరం కశ్మీర్ పోలీసులు.. హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్ సంస్థ సభ్యుడిగా భావిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు.

గత నెలలో భారత భద్రతా బలగాల మీద జరిగిన మానవబాంబు దాడి భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. రెండు దేశాల మధ్య వైమానిక దాడులు కూడా జరిగాయి.

అయితే, గురువారం నాటి దాడికి తమకూ ఏ సంబంధం లేదని హిజ్బుల్ ముజాహిదీన్ చెబుతోంది.

అయితే, నిందితుడు యాసిర్ జావేద్ భట్ తాను హిజ్బుల్ సభ్యుడినేనని అంగీకరించాడని పోలీసులు బీబీసీ ఉర్దూతో చెప్పారు.

"కుల్గాం జిల్లాలోని హిజ్బుల్ ముజాహిదీన్ జిల్లా కమాండర్ ఫారూఖ్ అహ్మద్ భట్ తనకు గ్రెనేడ్ దాడి చేయాలని చెప్పాడని ఇరవయ్యేళ్ళు దాటిన ఆ యువకుడు చెప్పాడు" అని ఇన్‌స్పెక్టర్ జనరల్ మనీష్ కుమార్ సిన్హా చెప్పారు.

Image copyright MOHIT KANDHARI / BBC

గురువారం సంభవించిన పేలుడు

జమ్మూ నడిబొడ్డున జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 29 మంది గాయపడ్డారని, వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని జమ్మూ డివిజన్ ఐజీ ఎం.కె.సిన్హా విలేకరులకు తెలిపారు.

కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బస్‌స్టాండ్ మీదకు గ్రెనేడ్‌ విసిరారని ఆయన విలేకరులకు చెప్పారు.

Image copyright AFP / GETTY IMAGES

క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

పోలీసులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. ''అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. సాక్ష్యాలు సేకరిస్తున్నాం. దోషులను వేటాడుతాం'' అని ఒక పోలీసు అధికారి విలేకరులకు చెప్పారు.

''ఆ పేలుడు విన్నపుడు బస్ టైర్ పేలి ఉంటుందని నేను అనుకున్నాను. స్థానికులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు'' అని ప్రత్యక్ష సాక్షి ఒకరు ఏఎన్ఐ వార్తా సంస్థతో చెప్పారు.

దాడిచేసిన దుండగులను పట్టుకునేందుకు భారీ స్థాయి బలగాలతో గాలింపు మొదలైనట్లు స్థానికులు చెప్పారు.

Image copyright AFP / GETTY IMAGES

పుల్వామా జిల్లాలో గత ఏడాది జరిగిన ఆత్మాహుతి దాడి అనంతరం జమ్మూలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.

ఫిబ్రవరి 13వ తేదీన జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఒక స్కూల్ వద్ద జరిగిన పేలుడులో 12 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

జిల్లాలోని నర్బల్ వద్ద గల ఒక స్కూల్‌లో ఆ పేలుడు సంభవించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)