పాలీఎమరీ: ఒక అమ్మాయికి ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్... ఆ ముగ్గురితో ప్రేమ సాధ్యమేనా? వారేమంటున్నారు?

  • 8 మార్చి 2019
ఒక అమ్మాయి-ముగ్గురు బాయ్‌ ఫ్రెండ్స్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

24 ఏళ్ల గరిమా ముగ్గురు అబ్బాయిలను ప్రేమిస్తోంది. ముగ్గురూ ఆమె బాయ్‌ఫ్రెండ్సే. ముఖ్యంగా గరిమా బాయ్‌ఫ్రెండ్స్‌ ముగ్గురికీ ఒకరికొకరు బాగా తెలుసు. వారందరూ ఆ బంధాన్ని లైట్ తీసుకున్నారు.

ఎవరైనా ఒక వ్యక్తి ఒకే సమయంలో ముగ్గురిని ప్రేమించడం సాధ్యమవుతుందా? అనేదే ఇప్పుడు ప్రశ్న

దానికి గరిమా 'అవును' అనే సమాధానం ఇస్తుంది.

నిజానికి ఆమె ఉన్న ఇలాంటి బంధాన్ని 'పాలీఎమరస్ రిలేషన్‌షిప్'(Polyamorous relationship) అంటారు. ఇలాంటి బంధం పెట్టుకునేవారిని పాలీఎమరీ(Polyamory) అంటారని చాలామందికి తెలుసు.

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇప్పుడు ఇలాంటి బంధాల గురించి బాహాటంగా చెబుతున్నారు.

పాలిఎమరిస్ రిలేషన్‌షిప్ అంటే?

పాలిఎమరీ(Polyamory) అనేది గ్రీక్, లాటిన్ భాషల్లోని రెండు పదాలు కలిసి ఏర్పడింది. పాలీ(గ్రీక్) ఎమోర్(లాటిన్) పదాలు. పాలీ అంటే చాలా లేదా ఒకటి కంటే ఎక్కువ, ఎమోర్ అంటే ప్రేమ. అంటే ఒకరు లేదా ఒకరికంటే ఎక్కువ మందిని ప్రేమించడాన్ని 'పాలీఎమరీ' అంటారు.

పాలిఎమరీకి అత్యంత ముఖ్యంగా ఉండాల్సింది తమ బంధాలలో నిజాయితీ, పారదర్శకత. ఈ బంధంలో ఉన్న ప్రతి పార్ట్‌నర్ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఉండాలి. అందరి అంగీకారంతో తన బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

గరిమా, ఆమె ప్రియుల కథ, వారి నోటి నుంచే...

"నాకు సుమారు 13-14 ఏళ్లొస్తున్నప్పుడు మొదటిసారి ప్రేమలో పడ్డాను. మేం ఇద్దరం చాలా సంతోషంగా ఉండేవాళ్లం. అంతా బాగానే నడిచేది. అప్పుడే నేను ఇంకొకరి వైపు అట్రాక్ట్ అయ్యాను. కానీ తనతోపాటూ నా మొదటి పార్ట్‌నర్‌ను కూడా వదులుకోవాలని అనిపించలేదు. కానీ ఒక అమ్మాయికి ఇద్దరు బాయ్‌ఫ్రెండ్స్ ఉండడం ఎలా సాధ్యం?

"యవ్వనంలో కొన్నేళ్లు నాకు చాలా గందరగోళంగా, కష్టంగా అనిపించింది. నేను తీవ్రమైన 'ఐడెంటిటీ క్రైసిస్'(గుర్తింపు సంక్షోభం)లో ఊగిసలాడాను. తెలిసినవారు చాలామంది నాకు 'కళంకిత' అనే ముద్ర కూడా వేసేశారు. చాలా మంది నేను సెక్స్‌కు అడిక్ట్ అయ్యానని, నేను మానసికవైద్యుల దగ్గరికి వెళ్లాలని చెప్పారు" అని గరిమా చెప్పారు..

"నేను కౌన్సిలర్ దగ్గరకు కూడా వెళ్లాను. నా కౌన్సిలర్ నాకు చాలా సర్ది చెప్పారు. దానితోపాటూ ఏ అబ్బాయైనా తన గర్ల్‌ఫ్రెండ్ ఇంకో బాయ్‌ఫ్రెండ్ ఉండడాన్ని ఎలా స్వీకరించగలడు అని ప్రశ్నించారు. ఆయన మాటలు నన్ను మరింత గందరగోళంలో పడేశాయి".

"మధ్యలో చదవు కోసం నేను విదేశాలకు వెళ్లాను. అక్కడ వాతావరణం నన్ను నేను అర్థం చేసుకోడానికి సాయం చేసింది. అక్కడ నేను ఆధునిక బంధాలు, సెక్స్, ఎవల్యూషన్‌పై చాలా పుస్తకాలు చదివాను. అక్కడ నాలాంటి వారినే చాలామందిని కలిశాను. వారంతా తాము అలా ఉన్నందుకు ఏమాత్రం సిగ్గుపడడం లేదని చెప్పారు".

మెల్లమెల్లగా నేను ఆ దిగులు, ఇబ్బందికర వాతావరణం నుంచి బయటపడ్డాను. నన్ను నేను స్వీకరించాను.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

తోడు దొరికాడు కానీ...

"విదేశాల్లో నేను మరో వ్యక్తిలో నా తోడును వెతుక్కున్నాను. ఆయన వయసులో నాకంటే చాలా పెద్దవారు. తెలివైనవారు. ఆయనకు నా స్వభావం గురించి ఓపెన్‌గా చెప్పేశాను. నా ఆలోచనలు, నా జీవన విధానం గురించి తనకు ఎలాంటి అభ్యంతరాలూ లేవని ఆయన నాతో అన్నారు".

"మేం ప్రేమించుకున్నాం. జీవితాన్ని ఆస్వాదించాం. కానీ నేను మరొకరికి దగ్గరయ్యేసరికి అదంతా మారిపోయింది. ఆయన సైద్ధాంతికంగా పాలిఎమరీని అంగీకరించారు. కానీ అసలు నిజం తనకు తెలిసేసరికి దాన్ని భరించలేకపోయారు".

ఆయన నాతో "నా ప్రేమలో ఏమైనా లోటుందా? మన బంధం అంత బలహీనమైనదా? నువ్వు వేరే వారివైపు అట్రాక్ట్ అయ్యావంటే, మన సెక్స్ లైఫ్ నీకు నచ్చలేదా? అంటూ మాట్లాడేవారు".

"నేను ఆయనకు మొత్తం ముందే చెప్పేశాను. అందుకే ఇప్పుడు తనకు అర్థమయ్యేలా చెప్పడానికి నా దగ్గరేం లేదు. అలా మేం మెల్లమెల్లగా దూరం అవుతూ వచ్చాం".

Image copyright Getty Images

నాతో నేనే 'సరే' అన్నాను

కొన్నేళ్ల తర్వాత నేను తిరిగి భారత్ వచ్చాను. ఇప్పుడు నాకు పాలిఎమరీ గురించి చాలా తెలుసు. అందుకే నేను దాని గురించి మరింత చదవడంతోపాటు రీసెర్చ్ చేయడం కూడా మొదలెట్టాను.

"కొంతకాలం తర్వాత భారత్‌లో కూడా చాలామందికి పాలిఎమరిస్ ఉందని నాకు తెలిసింది. ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా అలాంటి వారు కనీసం వంద మంది తెలుసు. వాళ్లంతా తమను పాలీఎమరిస్ అని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో ఓపెన్‌గా మాట్లాడుకోడానికి ఒక కమ్యూనిటీ, స్పోర్ట్ గ్రూప్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు".

ఫేస్‌బుక్‌లో 'బెంగళూరు పాలిఎమరీ' అనే ఒక క్లోజ్డ్ గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ పాలిఎమరిస్ వారికోసం మీటింగ్స్, గెట్‌టుగెదర్, స్పీడ్ డేటింగ్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది.

"నేను కూడా వారు పెట్టిన అలాంటి ఒక ఈవెంటుకు వెళ్లాను. అక్కడికెళ్లిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. నేను ఒంటరిదాన్ని కాదని అనిపించింది. అలా నా జీవితం మళ్లీ ట్రాక్‌లో పడడం మొదలైంది".

మళ్లీ ప్రేమ పుట్టింది

"ఈలోపు నేను డేటింగ్ యాప్ టిండర్‌లో మిహిర్‌ను కలిశాను. కొన్నిసార్లు కలిసిన తర్వాత నేను మిహిర్‌కు నా గురించి మొత్తం చెప్పేశాను. పూర్తి నిజాయితీతో, ఎలాంటి ఒత్తిళ్లూ లేకుండా జీవించాలని మేం ఇద్దరం నిర్ణయించుకున్నాం".

"నేనూ, మిహిర్ ఆర్నెల్లు కలిసి ఉన్న తర్వాత, నాకు వేరే అతను నచ్చడం మొదలైంది. నేను తనతో డేట్ చేయాలనుకునేదాన్ని. నేను ఆ మాట మిహిర్‌కు చెప్పాను. అతడిని కలవమని తను నాకు చెప్పాడు. అతడిని కలిసి వచ్చిన తర్వాత మా మధ్య శారీరక బంధం కూడా ఏర్పడిందని నేను మిహిర్‌కు చెప్పాను".

"అదంతా విన్న మిహిర్ చాలా మామూలుగా ప్రవర్తించాడు. తనకు అది చెడుగా ఏం అనిపించలేదు. తనకు ఈర్ష్యగా అనిపించలేదు. అయితే, ఆ భావాలను తను చాలా హుందాగా వ్యక్తం చేశాడు. అతడి ప్రవర్తన నన్ను చాలా ప్రభావితం చేసింది. మిహిర్ ఇక ముందు కూడా నాతో ఉంటాడని అనిపించింది. తర్వాత అతడు నా మూడో పార్ట్‌నర్‌ను కూడా కలిశాడు".

"తర్వాత కొంతకాలానికి నాకు ఇంకో వ్యక్తి కూడా నచ్చాడు. నేను తనతో కూడా బంధం పెంచుకున్నాను. అంటే నేరుగా చెప్పాలంటే ప్రస్తుతం నాకు ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. ముగ్గురికీ ఒకరి గురించి ఇంకొకరికి తెలుసు. అయితే నా ప్రైమరీ(ముఖ్య) పార్ట్‌నర్ మాత్రం మిహిరే. ఎక్కువ సమయం నేను అతడితోనే గడుపుతుంటాను".

"అయినా, పాలిఎమరిస్ అవడం వల్ల ఎదురయ్యే అతిపెద్ద సవాలు ఏంటంటే.. మన కోసం మనకు చాలా తక్కువ సమయం లభిస్తుంది. అందరికీ ఒక బంధాన్ని నిలబెట్టుకోవడమే కష్టం. కానీ నేను ఒకేసారి రెండు-రెండు, మూడు-మూడు బంధాల్లో ఉన్నాను. అలాంటప్పుడు టైమ్-మేనేజ్‌మెంట్ అనేది చాలా కష్టం".

Image copyright Getty Images

జనం 'వేశ్య' అంటే, జవాబిచ్చా...

"నేను పాలీఎమరిస్ అని మా అమ్మనాన్నలకు చెప్పాను. వారు ఒక స్థాయి వరకూ నన్ను స్వీకరించారు. కానీ వారికి పాలిఎమరీ అనే దాని గురించి పెద్దగా తెలీదు".

"మిహిర్ గురించి వాళ్లు చాలా ఓపెన్‌గా ఉంటారు. తను మా ఇంటికి కూడా వస్తూపోతుంటాడు. కానీ నా మిగతా ఇద్దరు పార్ట్‌నర్స్ గురించి మా ఇంట్లో మాట్లాడరు. నేను కూడా ఆ ఇద్దరి గురించి ఇంట్లో మాట్లడను".

"మీరు పెళ్లి గురించి అడిగితే, నేను దానికి వ్యతిరేకం అనే చెబుతా. పెళ్లి ఒక పితృస్వామిక విధానం. అది సామాజికం కంటే ఎక్కువ ఆర్థికంగానే ఉంటుంది. కానీ, పెళ్లి చేసుకోవాలని నాపై ఒత్తిడి పెరిగితే, భవిష్యత్తులో నా ఆలోచనలు మారితే, నేను మిహిర్‌నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాను".

"ఇప్పుడు కూడా నా గురించి తెలిసిన కొంతమంది నన్ను 'స్లట్'(వేశ్య) అంటుంటారు. కానీ నేను పట్టించుకోవడం మానేశాను. ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే నేను వాళ్లతో "అవును నాకు రకరకాల మగాళ్లతో సంబంధాలు పెట్టుకోవడం ఇష్టం, అయితే ఏంటి" అని ముఖాన్నే అడిగేస్తా.

Image copyright iStock
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

మిహిర్ ఈ బంధం గురించి ఏమంటారు?

మిహిర్ బీబీసీతో మాట్లాడుతూ గరిమా పూర్తి నిజాయితీ తనకు నచ్చిందని చెప్పారు. ఆమె నుంచి ఏం దాయాల్సిన అవసరం ఉండదని అంటారు. ఆమె ఎప్పుడూ జడ్జ్ చేయదని తెలిపారు.

"గరిమా చాలా తెలివైన అమ్మాయి. ఆమె తన ఆలోచనలతో ఎవరినైనా ప్రభావితం చేయగలదు. అయితే, నాకంటే మెరుగైన వారు దొరికితే, తను నన్ను వదిలేస్తుందేమో.. అని నేను మా బంధం మొదట్లో కాస్త భయపడ్డ మాట నిజమే. కానీ మెల్లమెల్లగా ఏది ఏమైనా ఆమె నాతోనే ఉంటుందనే విషయం అర్థమైంది" అంటారు మిహిర్.

గరిమాతో గడపాలని అనుకున్నప్పుడు ఆమె తన మరో పార్ట్‌నర్‌తో ఉంటే కొన్నిసార్లు తనకు బాధగా ఉంటుందని మిహిర్ చెప్పారు. కానీ తర్వాత మేం మాట్లాడుకుంటాం. మా మనసులోని భావాలను వ్యక్తం చేసేస్తాం. దాంతో అలాంటి సమస్యలు చాలావరకూ సర్దుకుంటాయని తెలిపారు.

Image copyright iStock
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

మిహిర్ ఇంట్లో గరిమా గురించి తెలుసా?

దానికి సమాధానంగా "మా ఇంట్లో వాళ్లకు గరిమా నా గర్ల్‌ఫ్రెండ్ అనే విషయం తెలుసు. కానీ ఆమె పాలిఎమరిస్ అనే విషయం వారికి చెప్పలేదు. వాళ్లు దాన్ని ఎప్పటికైనా స్వీకరించగలరని నాకు అనిపించడం లేదు. అవును, నా క్లోజ్ ఫ్రెండ్స్‌ అందరికీ తన గురించి తెలుసు" అని మిహిర్ చెప్పాడు.

పాలిఎమరిస్ బంధాల్లో 'మాట్లాడుకోవడం' అనేది చాలా పెద్ద సవాలు అని మిహిర్ చెబుతారు.

"చాలాసార్లు మీ పార్ట్‌నర్ ఎంత బిజీగా ఉంటారంటే, మీకు పరస్పరం మాట్లాడుకోడానికి సమయమే దొరకదు. అలాంటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఈ బంధంలో ఉన్న అద్భుతం ఏంటంటే ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండడం. నాకు నా పార్ట్‌నర్ దగ్గర ఏదీ దాయాల్సిన అవసరమే ఉండదు. మనం కొత్తవాళ్లను కలవచ్చు. వారితో డేట్ కూడా చేయచ్చు. దాని గురించి నా పార్ట్‌నర్‌తో ఓపెన్‌గా మాట్లాడచ్చు" అంటాడు మిహిర్.

Image copyright YOUTUBE / FOXSTARHINDI
చిత్రం శీర్షిక ప్రతీకాత్మక చిత్రం

కుటుంబం, పెళ్లి సంగతేంటి

ఈ ప్రశ్నకు మిహిర్ నవ్వుతూ "దీని గురించి మేం దాదాపు రోజూ మాట్లాడతాం. మా మధ్య అంతా బాగానే ఉండి, పెళ్లి చేసుకోవాల్సి వస్తే, కచ్చితంగా గరిమానే చేసుకుంటా. నా మనసులో చిన్న భయం మాత్రం ఉంటుంది. ఆమె తన కెరీర్ కోసం వేరే దేశాలకు, వేరే నగరాలకు వెళ్లాల్సి రావచ్చు. లాంగ్ డిస్టన్స్ రిలేషన్‌షిప్ కొనసాగించడంలో నేనంత సమర్థుడిని కాదు" అన్నాడు.

పాలీఎమరీ పుట్టుకతో ఉంటుందా, చాయిస్ మాత్రమేనా?

దీని గురించి నిపుణులు రకరకాలుగా చెబుతారు.

సెక్స్, ప్రేమ, మానవ కాంక్షల గురించి చర్చించే 'ఏజెంట్ ఆఫ్ ఇష్క్' ప్రాజెక్టుకు చెందిన పారోమితా వోహ్రా బీబీసీతో "సామాజికవేత్తలు చెప్పినట్లు పాలిఎమరీ అంటే ఒకరి కంటే ఎక్కువ పార్ట్‌నర్స్ ఉండడం అనే అలవాటు మనిషికి పుట్టుకతోనే వస్తుంది. కానీ నాగరికత పెరిగేకొద్దీ, మానవ జీవితంలోని చాలా సామాజిక నిబంధనలకు జనం కట్టుబడతారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఒకే పార్ట్‌నర్ ఉండడానికే అనుమతి ఉంది. అయితే కొంతమంది విషయంలో ఇది కేవలం చాయిస్ అవుతుంది" అన్నారు.

సైకాలజిస్ట్ శిఖ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. అందులో అడల్ట్రీని నేర విభాగం నుంచి తొలగించారు. కోర్టు ఇచ్చిన ఈ తీర్పు వెనుక కూడా ఎక్కడో ఒకచోట "మనిషి కోరికలపై ఎవరి బలవంతం ఉండదని, కనీసం దానిని నేరంగా భావించకూడదు అనే వాస్తవం దాగి ఉంది" అన్నారు.

Image copyright Thinkstock

సామాజికవేత్తలు ఏమంటున్నారు?

పరిశోధకులందరూ మనిషి స్వభావంలో మోనోగమస్(ఒకే పార్ట్‌నర్‌తో బంధం పెట్టుకోవడం) అనేదే లేదని చెబుతున్నారు. అంటే ఒక వ్యక్తి తన జీవితం అంతా ఒకే పార్ట్‌నర్‌తో బంధం పెట్టుకోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటున్నారు.

అమెరికా రచయిత క్రిస్టొఫర్ రాయన్ ఈ అంశంపై Sex at Dawn: How we Mate, Why we Stray and What it Means for Modern Relationships లాంటిపుస్తకాలు రాశారు.

"మనం ఒక సమయంలో ఒకే పార్ట్‌నర్‌తో ఉన్నంత మాత్రాన మనం మోనోగమస్ అని అర్థం కాదు. మొత్తం జీవితంలో మనం ఒకరి కంటే ఎక్కువ మందితో సంబంధాలు పెట్టుకుంటాం. దానిని మోనోగమీ అనకూడదు" అని క్రిస్టొఫర్ చెప్పారు.

యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్ డేవిడ్ పి. బ్రాస్ మోనోగమీ అంటే ఒకే పార్టనర్‌ ఉండడం అనే సంప్రదాయం తర్వాత ఏర్పడిందని అన్నారు. ఆయన సెక్స్, ఎవల్యూషన్, లైంగిక సంబంధాలు, ద్రోహం లాంటి అంశాలపై ఎన్నో పుస్తకాలు రాశారు.

"ప్రాచీన కాలంలో జనం ఒకేసారి ఎన్నో సంబంధాలు నెరిపేవారు, దానిని అప్పుడు తప్పుగా భావించేవారు కాదు" అని ఆయన చెప్పారు.

"మనిషి సహజంగా మోనోగమస్ కాదు, కానీ అంతమాత్రాన మోనోగమీ అనేదానిని అసహజంగా అనుకోకూడదు" అని ప్రొఫెసర్ బ్రాస్ భావిస్తున్నారు.

(ఈ కథనంలో ఉన్న వారి గోప్యత కోసం వారి పేర్లు మార్చాం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)