రఫేల్ పత్రాలను మేం దొంగిలించలేదు, వచ్చే ఎన్నికలపై ఈ వివాదం ప్రభావం ఉంటుంది: ఎన్.రామ్

  • 10 మార్చి 2019
రఫేల్ విమానం, మోదీ Image copyright Getty Images

రఫేల్ ఒప్పందంపై ఆంగ్ల దినపత్రికలో పలు పరిశోధన వ్యాసాలు రాసిన 'ది హిందూ' మీడియా గ్రూప్ చైర్మన్ ఎన్.రామ్... ఈ ఒప్పందానికి సంబంధించిన పత్రాలను భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి దొంగిలించలేదని పేర్కొన్నారు.

"రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం భారత ప్రభుత్వం... ఫ్రెంచ్ ప్రభుత్వానికి చెందిన దసో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఒప్పందం విలువ 2007 నాటి ధరలతో పోల్చితే 40 శాతం అధికమని, 2012 ధరలతో పోల్చితే 14 శాతం అధికం'' అని ఎన్.రామ్ తన వ్యాసాల్లో ఆరోపించారు.

రఫేల్ ఒప్పందంపై ఒకవైపు రక్షణ మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతుంటే అదే సమయంలో భారత ప్రధానమంత్రి కార్యాలయం సమాంతర చర్చలు జరిపిందని, దీంతో చివరకు భారత ప్రభుత్వానికి బేరమాడే శక్తి తగ్గిపోయిందని ఎన్.రామ్ తన వ్యాసాల్లో పేర్కొన్నారు.

అలాగే, సమాంతర చర్చల వ్యవహారంపై రక్షణ శాఖలోని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసిన పత్రాలను 'ది హిందూ'లో ప్రచురించారు.

అయితే, ప్రభుత్వం నుంచి తస్కరించిన పత్రాలు, పబ్లిక్ డొమైన్‌లో ఉన్న సున్నితమైన సమాచారాన్ని ది హిందూ, ఏఎన్ఐ మీడియా సంస్థలు ప్రచురించాయని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మార్చి 6న సుప్రీం కోర్టుకు తెలిపారు.

Image copyright Getty Images

అధికార రహస్యాల చట్టం కింద ఇలాంటి వార్తలు ప్రచురించిన సంస్థలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి రహస్య పత్రాలను బహిర్గతం చేయడం వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని, స్నేహపూర్వక విదేశీ శక్తులతో సంబంధాలు దెబ్బతింటాయని చెప్పారు.

అయితే, ప్రచురించిన పత్రాలు తస్కరించినవి కావని మార్చి 8న ఏజీ తెలిపారు. ప్రభుత్వానికి చెందిన రహస్య పత్రాల జిరాక్స్ కాపీలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయనేది తన వ్యాఖ్యల అర్థం అని ఆయన వివరణ ఇచ్చారు.

రఫేల్ ఒప్పందంపై వ్యాసాలు ప్రచురించిన ది హిందూ మీడియా చైర్మన్ ఎన్. రామ్‌తో బీబీసీ తమిళ ప్రతినిధి మురళీధరన్ కాశీ విశ్వనాథన్ జరిపిన ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు ఇవి..

Image copyright DASSAULT RAFALE

ప్రశ్న: రఫేల్ పత్రాలు దొంగిలించారని ఏజీ చెబుతున్నారు?

సమాధానం: మేం ఏ పత్రాలనూ దొంగిలించలేదు. వాటి కోసం డబ్బు కూడా ఖర్చు చేయలేదు. కానీ, అమెరికా, ఇంగ్లాండ్‌లోని కొన్ని మీడియా సంస్థలు రహస్య పత్రాల కోసం డబ్బులిచ్చాయి. మేం ఆ పత్రాలను రహస్య వర్గాల నుంచి సంపాదించాం.

6.5 బిలియన్ డాలర్ల నిధుల కోసం 1981లో భారత ప్రభుత్వం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌తో ఒప్పందం చేసుకుంది. కానీ, నిధుల విడుదలకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌ అనేక షరతులు పెట్టింది. అందులో కార్మిక చట్టాలను సవరించడం కూడా ఉంది. దీనికి సంబంధించిన 64 పత్రాలను మేం సంపాదించి ప్రచురించాం. ఇందులో భారత ప్రభుత్వానికి చెందిన అనేక రహస్య అంశాలు కూడా ఉన్నాయి. ఆ పత్రాలు దొంగిలించినవని అప్పుడు ఎవరూ చెప్పలేదు.

బొగ్గు కుంభకోణానికి సంబంధించిన కొన్ని పత్రాలను లాయర్ ప్రశాంత్ భూషణ్ బయటపెట్టారు. వాటిని దొంగిలించిన పత్రాలు అని పిలవలేదు.

ఇలాంటి పత్రాలను బయటపెట్టినా మీడియాకు రక్షణ కల్పించేలా ఎన్నో అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి.

1970లో పెంటగాన్ పత్రాలను విడుదల చేసిన సమయంలో మీడియాకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. వాటర్ గేట్ స్కాం, వికీలీక్స్ మొదలైనవి కూడా ఇలాంటివే.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)ఏ ప్రకారం కొన్ని పరిమితులకు లోబడి ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. అధికార రహస్యాల చట్టం ఈ నిబంధనను అతిక్రమించలేదు.

సమాచార హక్కు చట్టం నిబంధన 8(1), (2) లు కూడా అధికార రహస్యాల చట్టాలను అధిగమిస్తున్నాయి.

బ్రిటిష్ ప్రభుత్వం వారి ప్రయోజనాల కోసం 1923లో తీసుకొచ్చిన చట్టం ఇంకా ఎందుకు కొనసాగుతోంది?

స్వతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా బ్రిటన్ ప్రభుత్వం తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందు ఈ చట్టాన్ని తీసుకొచ్చింది.

ఈ చట్టం చాలా విస్తృతమైంది. దేనినైనా ఈ చట్టం కిందకు తీసుకురావొచ్చు. కానీ, దీన్ని అరుదుగా ఉపయోగించేవారు. దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తే పరిశోధనాత్మక జర్నలిజం చేయలేం. అయితే, 'ది హిందూ' దీన్ని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంది.

చిత్రం శీర్షిక ఎన్.రామ్

ప్రశ్న: పరిశోధనాత్మక జర్నలిజంలో మీడియా ప్రతినిధులు ఎలా వ్యవహరించాలి?

సమాధానం: ప్రజాప్రయోజనాలు ఉంటే తప్ప ఒకరి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను విడుదల చేయకూడదు. ప్రజాప్రయోజనాలు అంటే ఇక్కడ ప్రజలు ఇష్టపడేదని కాదు. కానీ, కొన్ని సంస్థలు అలానే చేస్తున్నాయి.

అయితే, రఫేల్ పత్రాలలో ప్రైవేట్ అంశాలు ఏమీ లేవు. ఇందులో ఒప్పందానికి సంబంధించిన ధరలు మాత్రమే ఉన్నాయి.

ప్రశ్న: అధికార రహస్యాల చట్టం కింద ఉన్న ఇలాంటి సమాచారాన్ని బహిర్గతం చేసిన మీడియా మీద చర్యలు తీసుకుంటారా?

సమాధానం: మీడియా, లాయర్లపై ఈ చట్టాన్ని ఉపయోగించబోమని ఏజీ హామీ ఇచ్చిన విషయాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో ప్రస్తావించింది.

టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకుని ఆ ప్రకటన ఇచ్చినట్లు గుర్తు. కానీ, ఇప్పుడు చూస్తే ఆయన భరోసా ఇవ్వనట్లే కనిపిస్తోంది.

ఒక వేళ వారు మాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నా మేం వాటిని ఎదుర్కొంటాం. కానీ, అది పెద్ద వివాదం అవుతుంది.

Image copyright EORGES GOBET/AFP/GETTY IMAGES

ప్రశ్న: ఇలాంటి వివాదాలపై ఈ సమయంలో వార్తలు ప్రచురించడం వల్ల పుల్వామా దాడిని తక్కువ చేసి చూపినట్లు అనిపిస్తుంది కదా?

సమాధానం: హిందీ మాట్లాడే రాష్ట్రాలలో పుల్వామా దాడి చాలా పెద్ద సమస్య. కానీ, ఇటీవల కాలంలో రఫేల్ ఒప్పందంపై విస్తృతంగా చర్చ జరగలేదన్నది నిజం.

ప్రశ్న: పుల్వామా దాడి వార్తల నేపథ్యంలో మీరు ఈ పత్రాలను ఆలస్యంగా విడుదల చేశారా?

సమాధానం: అలాంటిదేమీ లేదు. మాకు అందిన పత్రాల విశ్వసనీయతను ధ్రువీకరించడం కోసమే సమయం తీసుకున్నాం. ఆ తర్వాత వెంటనే ప్రచురించాం.

ప్రశ్న: వచ్చే సార్వత్రిక ఎన్నికలను రఫేల్ వివాదం ప్రభావితం చేస్తుందా?

సమాధానం: తప్పకుండా చేస్తుంది. రాహుల్ గాంధీతో సహా అనేక మంది ప్రతిపక్ష నేతలు దీని గురించి మాట్లాడుతున్నారు. అయితే, ఎన్నికల సమయంలో జీవనోపాధికి సంబంధించిన సమస్యల గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. తర్వాత ప్రాధాన్యం రైతు సమస్యలది. వీటి తర్వాతే రఫేల్ ప్రభావం కనిపిస్తుంది.

బోఫోర్స్ స్కాం.. కాంగ్రెస్ ఓటమికి దారితీసిందని చాలా మంది పేర్కొన్నారు. అయితే, వాటితో పాటు అప్పుడు అనేక సమస్యలున్నాయి. అదేవిధంగా కేవలం 2జీ కుంభకోణం వల్లే యూపీఏ-2 ప్రభుత్వం ఓడిపోలేదు. ఇంకా అనేక సమస్యలు కూడా వారి ఓటమికి దారి తీశాయి.

Image copyright BARCROFT MEDIA

ప్రశ్న: బోఫోర్స్‌తో పోల్చితే రఫేల్ వివాదం ఎందుకు భిన్నమైంది?

సమాధానం: రెండింటికి తేడా ఉంది. ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా చాలా మంది ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా టీవీ మీడియా ఇలా చేస్తోంది. అయితే, సోషల్ మీడియా వల్ల రఫేల్ వివాదం చాలా మందికి చేరింది.

బోఫోర్స్ కుంభకోణం వెలుగుచూసినప్పుడు సమాచారాన్ని బహిర్గతం చేయడానికి మీడియా తమలో తాము పోటీ పడింది.

'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌'కు అరుణ్ శౌరీ ఎడిటర్‌గా ఉన్నసమయంలో మేం ప్రధాన పోటీదారులుగా ఉండేవాళ్లం. 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' వేదికగా రాం జెఠ్మలానీ ప్రతిరోజూ రాజీవ్ గాంధీకి 10 ప్రశ్నలు సంధించేవారు. ఇండియా టుడే, ది స్టేట్స్‌మెన్ కూడా ఈ అంశంపై చాలా సీరియస్‌గా వార్తలు ప్రచురించేవి.

ఇప్పుడు కార్వాన్ మ్యాగజైన్, వైర్, స్క్రోల్ లాంటి ఆన్‌లైన్ మీడియా ఎక్కువ సమాచారాన్ని ప్రచురిస్తోంది.

బోఫోర్స్ కుంభకోణంతో పోల్చితే రఫేల్ స్కాంనే ఎక్కువ మంది చదివారు.

Image copyright MANJUNATH KIRAN/AFP/Getty Images

ప్రశ్న: వాస్తవాలు వెలికితెచ్చేందుకు ఇప్పటి మీడియా తమలో తాము పోటీపడుతోందా?

సమాధానం: బోఫోర్స్ పత్రాలను ప్రచురించినప్పుడు మేం భయపడలేదు. మిగిలిన మీడియా సంస్థలు కూడా తప్పనిసరై వాటిని ప్రచురించాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారుతోంది.

ఎన్డీటీవీ లాంటి మీడియా సంస్థలపై ఐటీ దాడులు నిర్వహించారు. ఇవాళ మీడియా కూడా మారింది. లాభాలు తగ్గాయి. ప్రభుత్వ ప్రకటనలు లేకుంటే ఆదాయం మరింత తగ్గిపోతుంది.

'ది హిందూ'తో సహా మీడియా మొత్తం ఒత్తిడిలో ఉంది. మొదట్లో 70 నుంచి 80 శాతం వరకు ఆదాయం ప్రింట్ (పత్రికలు) నుంచే వచ్చేది. ఇప్పుడు డిజిటల్ మీడియా అంతా మార్చేసింది.

డిజిటల్ న్యూస్‌ను పొందేందుకు కనీస ధరను పెట్టాలి. అయితే, ఏ మీడియాకూ ఇలా చేసే ధైర్యం లేదు. పత్రికల సర్క్యులేషన్స్ వేగంగా పడిపోతున్నాయి. అతివాద జాతీయభావజాలమే తమను నిలబెడుతుందని టీవీ మీడియా భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు