కేన్సర్‌ బాధితులకు స్ఫూర్తి: తలపై జుట్టు లేకుండా.. 'పెళ్లి కూతురు' ఫొటోషూట్

  • 12 మార్చి 2019
మహిళ, జుట్టు Image copyright NAVIINDRANPILLAI/INSTAGRAM

ఆ 'పెళ్లికూతురు' చక్కగా నుదుటి మీద తిలకం దిద్దుకున్నారు. లిప్‌స్టిక్, చేతులను, కాళ్లను గోరింటాకుతో అలంకరించుకున్నారు. అందమైన చీర కట్టుకున్నారు.

ఇందులో వింతేముంది? ఏ పెళ్లి కూతురైనా ఇలాగే తయారవుతారు కదా! అనే అనుమానం మీకు వచ్చి ఉంటుంది. మీ అనుమానం సరైనదే, కానీ ఈ పెళ్లికూతురి పూర్తి కథ మీకు తెలిసి ఉండదు.

ఈ 'పెళ్లి కూతురు'కి పూలజడ లేదు, అసలు జడే లేదు. అసలు తలమీద దాదాపు వెంట్రుకలే కనిపించడంలేదు.

ఈమె పేరు వైష్ణవి పువేంద్రన్ పిళ్లై. సన్నిహితులు ప్రేమగా నవీ అని పిలుస్తారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె పేరు నవీ ఇంద్రాణ్ పిళ్లై. వీరి పూర్వీకులది తమిళనాడు. కొన్ని దశాబ్దాల క్రితం మలేషియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వైష్ణవి ప్రస్తుతం మలేషియాలోనే ఉంటున్నారు.

వైష్ణవి రెండుసార్లు కేన్సర్‌తో పోరాడి గెలిచారు. మొదటిది రొమ్ము కేన్సర్, రెండోది లివర్- వెన్నెముక కేన్సర్. కొన్నాళ్ల క్రితం కీమోథెరపీ చేయించుకున్నాక ఆమె జుట్టంతా రాలిపోయింది.

Image copyright NAVIINDRANPILLAI/INSTAGRAM

సాధారణంగా ఎవరైనా పెళ్లి రోజు అందంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ, కేన్సర్ బాధితులకు అదంత సులువు కాదు. ప్రత్యేకించి, మహిళా కేన్సర్ రోగులకు మరింత కష్టం.

కేన్సర్ కారణంగా ఆమె రొమ్ములను వైద్యులు తొలగించారు. కీమోథెరపీ చేయించున్న తర్వాత జుట్టంతా రాలిపోయింది, శరీరం బలహీనంగా తయారైంది. తనలాగే కేన్సర్‌తో పోరాడుతున్న ఎంతోమందికి ఇప్పుడు ఇంటర్నెట్ వేదికగా ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

వైష్ణవి పెళ్లి కూతురిగా తయారై ఫొటో షూట్‌ తీయించుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ షూట్‌లో ఒక్క ఫొటోలోనూ తన జుట్టులేని తలను దాచిపెట్టేందుకు ఆమె ప్రయత్నించలేదు. అన్ని ఫొటోల్లోనూ ఆమె తల కనిపిస్తుంది. కొన్నింట్లో పలుచని వస్త్రం కప్పుకున్నా, జుట్టులేని తల బయటకు స్పష్టంగా కనిపిస్తుంది.

అంతేకాదు, ఈ ఫొటోల్లో ఎక్కడా వైష్ణవి ముఖంలో బాధ కనిపించలేదు.

ఈ ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఎవరైనా సరే, కష్ట సమయాల్లో ధైర్యంగా ఉండాలని, నిరాశ నిస్పృహలతో బాధపడకూడదంటూ ఇతరులకు స్ఫూర్తినిచ్చే మాటలు రాస్తున్నారు.

Image copyright NAVIINDRANPILLAI/INSTAGRAM

వైష్ణవితో బీబీసీ మాట్లాడింది, ఆమె పూర్తి వివరాలు తెలుసుకుంది. నవీ స్టోరీ ఆమె మాటల్లోనే..

నేను మలేషియాలో ఉండే ఒక భారతీయ కుటుంబానికి చెందిన 28 ఏళ్ల అమ్మాయిని. అమ్మా, నాన్న, అక్క ఉన్నారు. ఇంజినీరింగ్ చదివాను, కొన్నేళ్లపాటు ఇంజినీర్‌గా పనిచేశాను.

భరతనాట్యం అంటే నాకు ఎంతో ఇష్టం. వంట చేయడం, కర్ణాటక సంగీతం కూడా ఇష్టం. ప్రయాణాలు చేస్తూ, కొత్త స్నేహితులను సంపాదించుకోవాలని ఉంటుంది. మేకప్ వేయడం కూడా ఇష్టం.

నాకు రొమ్ము కేన్సర్ వచ్చిందన్న విషయం 2013లో తెలిసింది. అప్పుడు షాకయ్యాను. అంతకుముందు జీవితాన్ని సీరియస్‌గా తీసుకునేదాన్ని కాదు. కానీ, కేన్సర్ చికిత్స తీసుకున్న తర్వాత అంతా మారిపోయింది. భయమేసింది, కానీ దాని నుంచి బయటపడతానన్న నమ్మకం ఉండేది.

Image copyright NAVIINDRANPILLAI/INSTAGRAM

చికిత్స చేయించుకున్న తర్వాత కొన్నేళ్లకు ఆరోగ్యం కాస్త కుదుటపడింది. కానీ, 2018లో మళ్లీ కేన్సర్ దాడి చేసింది. ఈసారి అది రొమ్ము నుంచి వెన్నెముకతో పాటు కాలేయం దాకా విస్తరించింది. దాంతో, మరింత ఆందోళన చెందాను. ఇక చావు ముందు తలవంచాల్సి వస్తుందేమో అనిపించింది.

కేన్సర్ మహమ్మారి మనిషిని శారీరకంగా, మానసికంగా తీవ్రంగా కుంగదీస్తుంది. రోగి ఒక్కరే కాదు, ఆ కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మలేషియాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేన్సర్‌ చికిత్సకు ప్రత్యేక సదుపాయాలు లేక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. దాంతో, ఆర్థికంగా సమస్యలు ఎదురయ్యాయి.

Image copyright NAVIINDRANPILLAI/INSTAGRAM

కేన్సర్ మన శరీరాన్ని, మెదడును పూర్తిగా మార్చేస్తుంది. ఆ పరిస్థితులను తట్టుకోవడం చాలా కష్టమైన పని. ఇప్పటి వరకు 16 సార్లు కీమోథెరపీ చేయించుకున్నాను.

మానసిక కుంగుబాటుతో పాటు, ప్రతికూల ఆలోచనలు చుట్టుముట్టాయి. నా కుటుంబ సభ్యులు, కొందరు స్నేహితులు అండగా నిలిచారు. కానీ, మిగతా ప్రపంచం నా నుంచి దూరంగా వెళ్లిపోతోందనిపించింది.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న క్యాన్సర్ బాధితురాలు

కేన్సర్, కుంగుబాటు విషయాలను బయటకు చెబితే ఇతరులు తమను చిన్నచూపు చూస్తారన్న అభిప్రాయం మలేషియా సమాజంలో ఉంది. అందుకే, ఆ విషయాల గురించి బయట ఎవరితోనూ మాట్లాడొద్దని మా అమ్మానాన్నలు చెప్పేవారు. నాకున్న జబ్బుల గురించి బయటకు తెలిస్తే నాకు మంచి సంబంధాలు రావని వాళ్ల భయం.

అయితే, నేను దాన్ని పట్టించుకోలేదు. కేన్సర్ గురించిన విషయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ప్రారంభించాను. ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది.

అది అలా జరిగిపోతుండగా.. ఓ రోజు బెడ్ మీద పడుకుని నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా చూస్తుండగా నా మదిలో ఓ ఆలోచన వచ్చింది. పెళ్లి కూతురిగా తయారై ఫొటోషూట్ చేయించుకోవాలని అనిపించింది.

Image copyright NAVIINDRANPILLAI/INSTAGRAM

నన్ను ఎవరైనా ప్రేమిస్తారో లేదో నాకు తెలియదు. నాకు వివాహం అవుతుందో లేదో తెలియదు. కానీ, నా ఈ కలను నిజం చేసుకోవాలని అనిపించింది.

ఆ తర్వాత వెంటనే ఫొటోగ్రాఫర్‌తో, మేకప్ ఆర్టిస్టుతో మాట్లాడాను. నా ఆలోచన వాళ్లకు నచ్చింది. సరే చేద్దాం అన్నారు.

ఆ ఫొటోషూట్ చేసేటప్పుడు నా ఫొటోలు ఇంత వైరల్ అవుతాయని నేను ఊహించలేదు. అయితే, నా ఫొటోలు సాధ్యమైనంత ఎక్కువ మంది మహిళలకు చేరాలని మాత్రం కోరుకున్నాను. ఇప్పుడు అలాగే జరిగింది.

ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తర్వాత వేల సంఖ్యలో స్పందనలు వచ్చాయి. అందులో చాలామంది కేన్సర్‌తో బాధపడుతున్న అమ్మాయిలే. అది నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.

Image copyright NAVIINDRANPILLAI/INSTAGRAM

అందం విషయానికొస్తే.. మీరు అందంగా ఉన్నారని అనుకుంటే, అందంగానే కనిపిస్తారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, మీ మీద మీరు విశ్వాసం కలిగి ఉండటమే అందం.

ఇప్పటికీ నేను పెళ్లి చేసుకోలేదు. ఒక వ్యక్తిని ప్రేమించాను. గతంలో అతనితో రిలేషన్‌లో ఉన్నాను. కానీ, తర్వాత బ్రేకప్ అయ్యింది. గొప్ప విషయం ఏమిటంటే, మా బ్రేకప్‌కి కారణం కేన్సర్ కాదు. దానికి మరో కారణం ఉంది. ఇప్పటికీ అతన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమించేవారు కావాలి. నా కల నెరవేరుతుందని ఆశిస్తున్నాను.

Image copyright NAVIINDRANPILLAI/INSTAGRAM

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను పోస్ట్ చేయడంతో పాటు వైష్ణవి ఒక అద్భుతమైన ఉత్తరం కూడా రాశారు. అందులోని కొంత భాగం ఇదీ...

కేన్సర్ చికిత్స మన జీవితంలో ఎన్నో పరిమితులు విధిస్తుంది. మన అందాన్ని దోచేస్తుంది, మనలోని ఆత్మవిశ్వాసాన్ని లాగేసుకుంటుంది.

మనం చిన్న వయసులో ఉన్నప్పుడు మన పెళ్లి రోజు గురించి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాం. పెళ్లి కూతురిగా ఎలా ఉంటామో ఊహించుకుంటాం. కానీ, కేన్సర్ అలాంటి కలలు నెరవేరకుండా చేస్తుంది. ఎంతోమంది మహిళలు కేన్సర్ కారణంగా తమ వివాహాలను వాయిదా వేసుకున్నారు, రద్దు చేసుకున్నారు.

నన్ను ప్రేమించే వ్యక్తితో వివాహం జరగాలని ఆశపడుతున్నాను. పెళ్లి కూతురిగా కనిపించాలని అనుకుంటాను.

Image copyright Nvi
చిత్రం శీర్షిక తన ప్రాణ స్నేహితుడితో నవీ

కేన్సర్ చికిత్స వల్ల జుట్టు రాలిపోవడం నాకు ఎదురైన అత్యంత క్లిష్టమైన సమస్య. దాంతో, నేను అందంగా లేనని నన్ను ఎవరూ ఇష్టపడరని బాధపడ్డాను. ఇక పెళ్లి కూతురిలా కనిపించే అవకాశం లేదని ఆందోళన చెందాను.

జుట్టు అనేది మహిళకు 'కిరీటం' లాంటిదని భావిస్తారు. అది లేకపోవడం మనల్ని ఎంతగానో కుంగదీస్తుంది. అయితే, ఏది ఏమైనా అన్నింటినీ స్వీకరించాలని, నన్ను నేను గౌరవించుకోవాలని నిర్ణయించుకున్నాను. మున్ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా స్వాగతించేందుకు సిద్ధమైపోయాను.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ఈ కథనం గురించి మరింత సమాచారం