హోలీకి ముందే Surf Excel వెంటపడుతున్న జనం

  • 12 మార్చి 2019
సర్ఫ్ ఎక్సెల్ Image copyright YOUTUBE GRAB

"హోలీ రంగుల పండుగ. హోలీ పండుగ తన రంగులతో సమాజంలో పరస్పర ఘర్షణలను, శత్రుత్వాన్ని, భేదభావాలను దూరం చేస్తుంది. అందరి మధ్యా అనుబంధాలను పెంచుతుంది."

చిన్నతనంలో హోలీ మీద వ్యాసం రాస్తున్నప్పుడు మనం తరచూ ఇలాంటి వాక్యాలు ఉపయోగించుంటాం.

హోలీకి ఇంకా కొన్నిరోజులే ఉంది. అందుకే మార్కెట్ అంతా అందరినీ హోలీ రంగుల్లో ముంచెత్తడానికి సిద్ధమైపోయింది.

కానీ, హోలీ పండుగ సమయంలో హఠాత్తుగా బట్టలు ఉతికే పౌడర్, సబ్బు ఉత్పత్తి సర్ఫ్ ఎక్సెల్ పతాక శీర్షికల్లో నిలిచింది.

అయినా అందరికీ హోలీ ఆడిన తర్వాత సర్ఫ్ ఎక్సెల్‌ గుర్తొస్తుంది. కానీ ఈసారీ జరిగింది వేరే. సోషల్ మీడియాలో ఇప్పుడు #BoycottSurfExcel అనే హ్యాష్‌టాగ్ కూడా ట్రెండింగ్ టాపిక్ అవుతోంది.

దీనికి కారణం హోలీ నేపథ్యంలో రూపొందించిన ఒక సర్ఫ్ ఎక్సెల్ ప్రకటన.

Image copyright YOUTUBE GRAB

ఈ ప్రకటనలో ఏముంది?

మొదట మనం ఆ ప్రకటన గురించి చెప్పుకోవాలి. కేవలం నిమిషం ఉన్న ఈ ప్రకటనలో ఒక చిన్న పాప సైకిల్‌పై వెళ్తుంటుంది. ఆ పాపను కొందరు పిల్లలు రంగునీళ్లు నింపిన బెలూన్లతో కొడుతుంటారు.

పాప సంతోషంగా ఆ బెలూన్లను తనపైన పడనిస్తుంది. అందరి దగ్గరా ఆ రంగుల బెలూన్లన్నీ అయిపోయాక.. ఒక ఇంటి ముందుకెళ్లి తన సైకిల్ ఆపుతుంది. ఒక చిన్న పిల్లాడితో "అన్నీ అయిపోయాయి, బయటికి రా" అంటుంది.

ఆ పిల్లాడు తెల్ల కుర్తా-పైజామా వేసుకుని ఉంటాడు. పాప అతడిని తన సైకిల్‌పై కూచోబెట్టుకుని ఒక మసీదు దగ్గర వదులుతుంది. మసీదులోకి వెళ్తూ ఆ పిల్లాడు "నమాజు చదివొచ్చేస్తా" అంటాడు.

దానికి ఆ పాప "తర్వాత రంగులు పడతాయి" అంటుంది. అప్పుడు ఆ పిల్లాడు కూడా సంతోషంగా అలాగే అన్నట్టు తల ఊపుతాడు. అంతే ప్రకటన అయిపోతుంది.

ఈ ప్రకటనను ఇప్పటివరకూ 80 లక్షల మందికి పైగా చూశారు. ఈ ప్రకటనతోపాటూ #RangLayeSang అనే ఒక హ్యాష్‌ట్యాగ్ కూడా ఉంటుంది.

ప్రకటనతో వివాదం

మితవాద వైఖరి ఉన్న గ్రూపులు, ప్రజలు ఈ సర్ఫ్ ఎక్సెల్ ప్రకటనను వ్యతిరేకిస్తున్నారు. దీని ద్వారా "హోలీ పండుగను అపార్థం చేసుకునేలా ప్రదర్శిస్తున్నారు" అని భావిస్తున్నారు.

"ఈ ప్రకటన ద్వారా హిందూ-ముస్లింల మధ్య దూరాలను చూపించారు" అని సోషల్ మీడియాలో చాలామంది చెబుతున్నారు. "హోలీ వల్ల వేరే మతం వారు ఇబ్బంది పడతారు" అనేలా ఇందులో చూపించారని అంటున్నారు.

సినీ నిర్మాత వివేక్ అగ్నిహోత్రి "అయినా క్రియేటివ్ స్వేచ్ఛ అంటే నాకూ ఇష్టమే. కానీ ఇలాంటి తెలివితక్కువ కాపీరైటర్లు గంగా యమునా సంస్కృతి నుంచి యమునను వేరు చేయాలని చూస్తున్నారు, ఇలాంటి వారిని భారత్‌లో బ్యాన్ చేయాలి" అని ట్వీట్ చేశారు.

బాబా రాందేవ్ కూడా తన ట్విటర్‌ అంకౌంట్లో "మేం ఏ మతానికీ వ్యతిరేకం కాదు. కానీ జరుగుతున్న దాని గురించి చాలా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విదేశీ సర్ఫ్ ఎక్సెల్ మన బట్టలను ఉతుకుతుంది. ఇప్పుడు దాన్ని ఉతికే రోజులు వచ్చాయి" అన్నారు.

ఆకాశ్ గౌతమ్ "ఈ ప్రకటన గురించి హిందూస్తాన్ యూనీ లీవర్‌కు ఫిర్యాదు చేయాలి. కంపెనీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయాలి" అని సూచించారు.

సందీప్ దేవ్ అనే యూజర్ "సమాజంలో ద్వేషాన్ని రగిల్చే, పండుగల్లో హిందూ-ముస్లిం తేడాను చూపించే #HUL కు చెందిన #BoycottSurfExcel అన్ని రకాల ఉత్పత్తులను బహిష్కరించాలి" అన్నారు.

Image copyright @SHEKARCHAHA:

శేఖర్ చాహల్ అనే యూజర్ సర్ఫ్ ఎక్సెల్ ప్యాకెట్ తగలబెడుతూ ఒక వీడియో పోస్ట్ చేశారు. "మొహరం, బక్రీద్ రక్తపు రంగుల కంటే మా హోలీ రంగు మంచిదే. మా ప్రతి పండుగలో హిందూ-ముస్లింలను ఎందుకు చొప్పిస్తారు" అని ప్రశ్నించారు.

సర్ఫ్ ఎక్సెల్ రూపొందించిన ఈ ప్రకటనను హిందూ మతంపై దాడిగా చాలా మంది చూస్తున్నారు. సర్ఫ్ ఎక్సెల్‌తోపాటు హిందుస్తాన్ యూనీలీవర్‌కు సంబంధించిన అన్ని ఉత్పత్తులను బహిష్కరించాలని కోరుతున్నారు. మరోవైపు ప్రకటనకు మద్దతుగా కూడా కొంతమంది మాట్లాడుతున్నారు.

వాసన్ బాలా తన ట్విటర్‌లో "ఈ ప్రకటన రూపొందించిన వారిలో నేనూ ఒకడిని. ఇందులో భాగమైనందుకు, ఈ అద్భుతమైన ప్రకటనను రూపొందించినందుకు గర్వంగా ఉంది" అని చెప్పారు.

ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ సిన్హా కూడా "ఎన్నికల తేదీలు ప్రకటించిన రోజు సర్ఫ్ ఎక్సెల్ ప్రకటనపై హిందుత్వవాదుల నుంచి వ్యక్తం అవుతున్న ఈ ఆగ్రహం చూస్తుంటే, గత ఐదేళ్లలో దేశంలో ఎలాంటి పరిస్థితి ఉంది అనేది కనిపిస్తోంది" అన్నారు.

ఆకాశ్ బెనర్జీ వ్యంగ్యంగా "ఈ ప్రకటనను ఈ షేర్ చేయకండి. అయినా సర్ఫ్ ఎక్సెల్ రంగు, ప్రేమ, హాస్యం, అల్లరి, అమాయకత్వం, సాంస్కృతిక గౌరవం, సంతోషం, బ్రాండింగ్ అన్నీ ఒక్క నిమిషంలో ఎలా చూపించగలదు" అన్నారు.

వామపక్ష నేత కవితాకృష్ణన్ "సర్ఫ్ ఎక్సెల్ ఈ ప్రకటనలో హిందూ-ముస్లింల స్నేహాన్ని చూపించింది" అని అన్నారు.

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ "నా దగ్గరొక మంచి పరిష్కారం ఉంది. భక్తులను సర్ఫ్ ఎక్సెల్‌తో బాగా కడగాలి. ఎందుకంటే సర్ఫ్ ఎక్సెల్‌తో ఉతకడం వల్ల మరకలు శుభ్రం అవుతాయి" అని ట్వీట్ చేశారు.

కానీ ఇప్పటివరకూ హిందుస్తాన్ యూనీలీవర్ తరఫున ఈ సర్ఫ్ ఎక్సెల్ ప్రకటనపై ఎలాంటి స్పందనా రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు