వైఎస్ జగన్ 'సమర శంఖారావం': అవినీతిలేని స్వ‌చ్ఛ‌మైన పాల‌న అందిస్తా

 • 11 మార్చి 2019
వైఎస్ జగన్మోహన్ రెడ్డి

"తొమ్మిది సంవ‌త్స‌రాలుగా ప్ర‌తిప‌క్షంలో ఉన్నాం. ఎన్నో అవ‌మానాలు, కేసులు ఎదిరించి కార్య‌క‌ర్త‌లు పనిచేస్తున్నారు. అధికారంలో ఉన్న‌వాళ్లు అనేక క‌ష్టాలు పెట్టినా తట్టుకుని నిలిచారు. అధికారంలోకి రాగానే ప్ర‌తి కార్య‌క‌ర్తా ఎదిగేందుకు అవకాశాలిస్తాను. అక్ర‌మంగా బ‌నాయించిన అన్ని కేసులూ మ‌న పాలన రాగానే ఉప‌సంహ‌రిస్తాను. ఆర్థికంగా, రాజ‌కీయంగా, సామాజికంగా అంద‌రికీ అండ‌దండ‌లు అందిస్తాను. ప్ర‌జ‌ల‌ను వంచించిన పార్టీకి బుద్ధి చెప్పాల‌ని ప్ర‌జ‌ల‌కు న‌చ్చ జెప్పండి. వైసీపీకి ఒక్క అవ‌కాశం ఇవ్వండ‌ని ప్ర‌జ‌ల‌ను అభ్య‌ర్థించండి. అవినీతిలేని స్వ‌చ్ఛ‌మైన పాల‌న అందిస్తామని నమ్మకాన్నివ్వండి" అంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ శ్రేణులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.

వైఎస్సార్సీపీ వివిధ జిల్లాల్లో నిర్వ‌హిస్తున్న "స‌మ‌ర శంఖారావం" కార్య‌క్ర‌మాన్ని ఈ రోజు తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ‌లో నిర్వ‌హించారు. రాజధాని, పోలవరం నిర్మాణాలపై ప్రభుత్వ తీరును జగన్ విమర్శించారు. కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేస్తూనే త‌న ఎన్నిక‌ల ప్ర‌చార స‌ర‌ళి ఎలా ఉండ‌బోతోంద‌న్న‌ది వివరించారు.

Image copyright YSRCP

టీడీపీపైనా, చంద్ర‌బాబుపైనా జగన్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

 • రాష్ట్రంలో అంద‌రినీ వంచించి, హింసించి, దోచుకున్న ప్ర‌భుత్వం ఇది. ఈ ప్ర‌భుత్వాన్ని స‌మాధి చేసేందుకు మార్పుకు ఓటు వేయాలి.
 • రైతు రుణ‌మాఫీ కూడా పూర్తి చేయలేదు. రూ.జ87,612 కోట్లు రైతులకు రుణమాఫీ అని చెప్పి రూ.24 వేల కోట్లకు కుదించారు. అది వడ్డీలకు కూడా సరిపోదు. అయినా అందులో 4, 5 విడతల్లో బాకీ పడ్డారు. ఇంకా రూ.10 వేలు పెండింగ్ పెట్టారు.
 • ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజున జీవో ఇచ్చి మళ్ళీ రైతులను మోసం చేస్తున్నారు.
 • ఇంటెలిజెన్స్ పోలీసులు రాష్ట్రాన్ని కాపాడడానికి కాకుండా చంద్రబాబు కోసం ప‌నిచేస్తున్నారు.
 • మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారు.
 • మట్టి, ఇసుక, బొగ్గు, గుడి భూములు, బడి భూములు వదలకుండా దోచేశారు. మరుగుదొడ్ల మంజూరులోనూ దోచేస్తున్నారు.
 • అమ‌రావ‌తిలో కూడా అన్నీ తాత్కాలిక భవనాలే తప్ప ఏమీ కనిపించదు. బయట 3 సెంటిమీటర్ల వర్షం పడితే తాత్కాలిక భవనాల్లో 6 సెంటిమీటర్ల వర్షం పడుతోంది.
 • చంద్రబాబుకు మానవత్వం లేదు. ఎన్టీఆర్ శవంతో రాజకీయం, హరికృష్ణ శవం పక్కన పెట్టుకుని రాజకీయాలు చేశారు.

వైసీపీ అధికారంలోకి వస్తే చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాలనూ జగన్ వివ‌రించారు. ఆయనేమన్నారంటే...

 • 'న‌వ‌ర‌త్నాల' ద్వారా జ‌నం జీవితాల్లో వెలుగు వ‌స్తుంది.
 • 'వైఎస్సార్ చేయూత' ద్వారా ప్రతి మహిళకు రూ.75 వేలు అందిస్తాం. డ్వాక్రా రుణాలన్నీ నాలుగు దశల్లో చెల్లిస్తాం.
 • వృద్ధులకు పింఛను రూ.2 వేలకు పెంచడానికి కారణం వైసీపీకి భయపడి మాత్రమే. అధికారంలోకి రాగానే మేం పింఛను రూ.3 వేలు చేస్తాం.
 • రైతుకు ఏటా మే నెలలో రూ.12,500 'రైతు భరోసా'గా చెల్లిస్తాం.
 • బ‌డికి వెళ్లే ప్ర‌తి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం.

కేసీఆర్ వస్తే తప్ప జగన్ ఏపీకి వచ్చేలా లేరు: జూపూడి ప్రభాకర్

"ప్రభుత్వం ప్రతి ఇంటికి నాలుగైదు సంక్షేమ పథకాలు అందిస్తోంది. వీటిపై చర్చిద్దాం. రాష్ట్రంలో అభివృద్ధి, కేంద్రం వివక్షపై చర్చ అసెంబ్లీలో జరిగింది. ఆ చర్చలో పాల్గొనకుండా జగన్ ఎందుకు పారిపోయారు? సంక్షేమం, అభివృద్ధిపై జగనా మాకు చెప్పేది? అవినీతిపరుడైన జగన్‌కు పరిపాలనాదక్షుడైన చంద్రబాబుకు మధ్య ఈ ఎన్నికల్లో పోటీ. జగన్ పిలుపు ఇచ్చినట్లు గ్రామాల్లో చర్చ చంద్రబాబు పాలనపైన కాదు జరిగేది, జగన్ అవినీతి, జగన్ అప్రజాస్వామిక చర్యలపై చర్చ జరుగుతుంది. ఇల్లు ప్రారంభించి 15 రోజులైనా జగన్‌కు అమరావతికి రావాలని అనిపించడం లేదు. కేసీఆర్ వస్తే తప్ప జగన్ ఏపీకి వచ్చేలా లేరు" అని టీడీపీ నాయకుడు, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

Image copyright YSRCP

"ప్రత్యేక హోదాపై ప్రస్తావన లేదు"

జ‌గ‌న్ స‌భ‌పై కాకినాడ‌కు చెందిన విశ్లేష‌కులు ఎస్.నాగేంద్ర‌కుమార్ మాట్లాడుతూ- "జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు మీద గురిపెట్టి ఆయ‌న చేసిన కామెంట్స్ అందుకు తార్కాణం. మోదీ విష‌యంలో జ‌గ‌న్ మౌనం పాటించ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంది. ప్ర‌త్యేక హోదా విష‌యాన్ని త‌న ఎన్నిక‌ల అజెండా 2017లో విశాఖ‌పట్నంలో జ‌రిగిన స‌భ‌లో ప్ర‌క‌టించారు. కానీ ప్ర‌స్తుతం దానికి మించి చంద్ర‌బాబు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల మీద గురిపెట్టారు. పార్టీ శ్రేణుల‌కు భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం వైఎస్ రాజశేఖర‌రెడ్డిని త‌ల‌పించింది. గ‌తంలో రాజ‌శేఖ‌రరెడ్డి కూడా త‌న అనుచ‌రుల‌కు అన్ని ర‌కాలుగానూ అండ‌దంద‌లు అందించారు" అని వ్యాఖ్యానించారు.

"ప్రాజెక్టులను పరిశీలించి మాట్లాడితే బాగుండేది"

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ జీఏ భూషణ్ బాబు మాట్లాడుతూ "కేంద్ర ప్ర‌భుత్వం ఏపీకి త‌గిన రీతిలో స‌హాయం అందించ‌లేదు. కానీ జ‌గ‌న్ ఆ విష‌యం పెద్ద‌గా ప‌ట్టించుకుంటున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. అదే స‌మ‌యంలో పోల‌వ‌రం వంటి ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ప‌డ‌లేద‌న‌డం జగన్‌కు త‌గ‌దు. ఇప్ప‌టికే ప్రాజెక్ట్ ప‌నులు చురుగ్గా సాగుతున్నాయి. ఆయ‌న స్వ‌యంగా ప‌రిశీలించి మాట్లాడి ఉంటే బాగుండేది" అని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు

కర్ణాటక ముఖ్యమంత్రి: అడ్వాణీకి వర్తించిన రూల్ యడ్యూరప్పకు వర్తించదా

'మా తరం భవిష్యత్తును దోచుకున్నారు': పార్లమెంటులో పదహారేళ్ల బాలిక ప్రసంగం

పదహారేళ్ల కిందటే చంద్రుడిపై స్థలం కొన్నానంటున్న హైదరాబాద్ వ్యాపారి.. అసలు చందమామపై స్థలం కొనొచ్చా

కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'

నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం

లోకేశ్ ట్వీట్: ‘జగన్ మాట మార్చడం వల్ల ఒక్కో మహిళకు రూ.45 వేల నష్టం’

కర్ణాటక అసెంబ్లీ: ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ.. కుమారస్వామి రాజీనామాను ఆమోదించిన గవర్నర్