అందరికీ సొంత ఇల్లు అన్న మోదీ హామీ ఎంతవరకు నెరవేరింది? : Reality Check

  • 13 మార్చి 2019
మోదీ - ఇళ్ల నిర్మాణం - రియాలిటీ చెక్

మాటలు: 2022 నాటికి ప్రతి భారతీయుడికీ సొంత ఇల్లు నిర్మించి ఇస్తామని ప్రస్తుత ప్రభుత్వం హామీనిచ్చింది. ఈ సంవత్సరంలో కోటి ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందనీ, 2022 నాటికి మరో కోటి గృహాలు సిద్ధమవుతాయని ప్రకటించింది.

వాస్తవాలు: సొంత ఇల్లు లేనివారికి అందించేందుకు మరిన్ని ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి, అనుమతులు వచ్చాయి. కానీ ఇప్పటివరకూ ప్రభుత్వం చెబుతున్నన్ని ఇళ్లు మాత్రం పూర్తికాలేదు.

అయితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన దానికన్నా బీజేపీ ప్రభుత్వంలో గృహ నిర్మాణం వేగంగా జరుగుతోంది.

Presentational grey line

ఇళ్లులేనివారికి ఇళ్లు నిర్మించే ఉద్దేశంతో 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ఓ పథకాన్ని ప్రారంభించారు.

అందరికీ సొంత ఇంటి కలను 2022 నాటికి మేం నెరవేరుస్తాం అని ఫిబ్రవరి 2018లో మోదీ ప్రకటించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత్‌లోని 120 కోట్ల జనాభాలో 17.7 లక్షల మంది ఎలాంటి ఇళ్లు లేనివారున్నారు.

దీనిపై తాజా గణాంకాలు అందుబాటులో లేవు. కానీ నిరాశ్రయులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పోరాడేవారు మాత్రం ఈ లెక్కలు సరైనవి కాదంటున్నారు.

అధికారిక లెక్కల ప్రకారం ముంబయిలో 57416 మంది నిరాశ్రయులున్నారు, కానీ వాస్తవానికి ఈ సంఖ్య నాలుగైదు రెట్లు ఎక్కువే ఉంటుందని స్థానిక ఎన్జీఓలు అంచనా వేశాయి.

అందువల్ల, అందరికీ ఇళ్లు నిర్మించాలంటే ఎన్ని ఇళ్లు సిద్ధం చేయాలనే దాన్ని కచ్చితంగా అంచనావేయడం కష్టం.

అయితే, కేవలం ఇళ్లు లేనివారికే కాదు, కనీస సౌకర్యాలు కూడా లేని, అతి చిన్న ఇళ్లలో నివసించే వారందరికీ కూడా సొంత ఇంటిని నిర్మాణానికి సహకరించాలనేది ఈ పథకం ఉద్దేశం.

అర్హులైన అల్పాదాయ వర్గాల వారికి ప్రస్తుత పథకం కింద ఒక్కో ఇంటికి రూ.1.3 లక్షల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా అందిస్తోంది. మెరుగైన, సౌకర్యవంతమైన ఇంటిని నిర్మించుకునేందుకు కుటుంబాలను ప్రోత్సహించడమే ఈ పథకం ఉద్దేశం. ఇక్కడ సౌకర్యాలు అంటే... మరుగుదొడ్లు, విద్యుత్, వంట్ గ్యాస్ సదుపాయం వంటివి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక భారత్‌లోని పెద్ద నగరాల్లోనే అత్యధికంగా ఇళ్ల నిర్మాణం జరుగుతోంది.

ఇప్పటి వరకూ ఎన్ని ఇళ్లు నిర్మించారు?

పట్టణ ప్రాంతాల్లో లక్ష్యంగా పెట్టుకున్న కోటి ఇళ్ల నిర్మాణంలో ఇప్పటికే 54 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయని 2018 జులైలో మోదీ తెలిపారు.

అయితే 2018 డిసెంబరు నాటికి 65 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతి లభించిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

2004-14 మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వ హయాంలో అమలైన పథకాలతో పోల్చి చూస్తే ఇది చాలా ఎక్కువ. అయితే డిసెంబరు నాటికి కేవలం 12 లక్షల ఇళ్ల నిర్మాణాన్నే పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటుంది.. ఒక్కో ఇంటి నిర్మాణానికి అనుమతి లభించడానికి ఒక్కోసారి సంవత్సరం కూడా పడుతుంది, అవి నిర్మాణం పూర్తిచేసుకుని, నివాసయోగ్యంగా మారటానికి మరికొన్ని సంవత్సరాలు పడతాయి.

భారత్‌లో గృహనిర్మాణం

ప్రభుత్వ రుణ పథకం

ఆధారం: గృహనిర్మాణం, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలు

క్రెడిట్ రేటింగ్ కంపెనీ క్రిసిల్ డిసెంబర్ 2018 నాటి అంచనాల ప్రకారం 2022 నాటికి పట్టణ ప్రాంతాల్లో అందరికీ ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రభుత్వం రూ.1,50,000 కోట్లు ఖర్చుచేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ దీనిలో 22శాతం మాత్రమే ఖర్చు చేసిందని క్రిసిల్ నివేదికలో వెల్లడైంది.

అల్పాదాయ వర్గాల వారికి ఇళ్ల నిర్మాణాన్ని ఎన్నో అంశాలు ఆలస్యం చేస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

  • ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించకపోవడం.
  • పట్టణ ప్రాంతాల్లో భూమి కొరత
  • భూముల ధరల్లో పెరుగుదల
  • భూ రికార్డుల్లో సమస్యలు

వీటిలో భూమి లభ్యత అంశమే అన్నింటికన్నా ప్రధానమైనదని సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎక్సెలెన్స్ డైరెక్టర్ డాక్టర్ రేణు ఖోస్లా తెలిపారు.

"నగరాల మధ్యలో భూమి అందుబాటులో లేనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఊరికి దూరంగా నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది, కానీ ప్రజలు అలాంటి ప్రాంతాల్లో ఉండటానికి ఇష్టపడటం లేదు. అక్కడ రవాణా సౌకర్యాలు, ఉపాధి అవకాశాల లేమి దీనికి కారణం" అని రేణు అంటున్నారు.

Image copyright Reuters

గ్రామీణ ప్రాంతాలే బెటర్

గ్రామీణ గృహనిర్మాణ పథకం కింద 2016-19 మధ్యనున్న మూడేళ్ల కాలంలో కోటి ఇళ్లు నిర్మించాల్సి ఉంది. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో కోటి ఇళ్లను నిర్మించి అర్హులకు అప్పగించామని గత సంవత్సరం జులైలో మోదీ ప్రకటించారు.

కానీ అధికారిక లెక్కల ప్రకారం ఈ వివరాలు నిజం కాదు.

గ్రామాల్లో గృహ నిర్మాణం

మిలియన్లలో

2016లో ప్రారంభమైన గృహ నిర్మాణ పథకం ద్వారా
ఆధారం: గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

2015లో ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి నిర్మించిన ఇళ్లే 71,82,758... అంటే లక్ష్యం కన్నా తక్కువే. కానీ మొత్తంగా చూస్తే, గత ప్రభుత్వం (2009-14) కన్నా ప్రస్తుత ప్రభుత్వం గ్రామీణ గృహ నిర్మాణ విషయంలో మెరుగైన పనితీరు కనబర్చింది.

కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం హయాంలో సంవత్సరానికి 16.5 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగిందని 2014లో అధికారిక ఆడిట్ నివేదిక వెల్లడించింది. ఈ గృహ నిర్మాణ రేటు ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ హయాంలో పెరిగింది. 2016-18 మధ్య కాలంలో ఇది సంవత్సరానికి 18.6 లక్షల నిర్మాణాలకు చేరింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు