విరాట్ కోహ్లీకి ధోనీ ఎంత అవసరం?

  • 13 మార్చి 2019
ఫీల్డ్ లో కోహ్లీకి సలహాలు ఇస్తున్న ధోనీ Image copyright Getty Images

ఆస్ట్రేలియా మొహాలీలో టీమిండియా ఇచ్చిన 350 పరుగులు భారీ లక్ష్యాన్ని ఛేదించడమే కాదు, సిరీస్‌లో కూడా పుంజుకుంది.

భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎప్పుడూ పల్లెత్తు మాట అనని వారు అతడిపై విమర్శలు ఎక్కుపెట్టేలా చేసింది.

భారత వన్డే చరిత్రలో 350 పరుగుల భారీ స్కోరు చేసినా టీమిండియా ఓడిపోవడం ఇది మొట్టమొదటి సారి. అంతకు ముందు ఈ స్కోరు చేసిన ప్రతిసారీ భారత్ విజయం అందుకుంది.

ఇంత భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేకపోయిన కోహ్లీ సేన వరల్డ్ కప్ కోసం సిద్ధంగా ఉన్నట్టేనా? అనడానికి విమర్శకులకు అవకాశం ఇచ్చింది.

మొహాలీలో ఆస్ట్రేలియాతో నాలుగో వన్డేను ఎలాగైనా కాపాడుకోవాలని భారత్ శతవిధాలా ప్రయత్నించింది. మైదానంలో పరుగులు ఆపేందుకు ఫీల్డర్లు చెమటోడ్చారు. ఎక్కువగా క్లోజింగ్ ఫీల్డులో కనిపించే కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌండ్రీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేశాడు. ఇలాంటి కష్ట సమయంలో తరచూ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సలహాలు తీసుకునే కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో ఒంటరి అయినట్టు కనిపించాడు.

Image copyright Getty Images

ధోనీ అవసరం ఉందా?

ఆస్ట్రేలియాతో ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆఖరి రెండు మ్యాచుల్లో మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి విశ్రాంతి ఇచ్చారు. కానీ "ధోనీ జట్టులో ఉంటే విరాట్ పని సులభం అవుతుందని" చాలా మంది క్రికెట్ నిపుణులు వివిధ సందర్భాల్లో చెప్పారు.

వికెట్ల వెనక నిలబడే ధోనీ వ్యూహాలు సిద్ధం చేస్తుంటాడు. బౌలర్లతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. వాళ్లను ఉత్సాహపరుస్తాడు. దానితోపాటు కీపింగ్ చేస్తున్నప్పుడు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను తన మైండ్‌గేమ్‌తో బోల్తా కొట్టిస్తుంటాడు.

కోహ్లీ చేతుల్లో బ్యాట్ ఉన్నప్పుడు, అతడికి ఎవరి సలహాలూ అవసరం లేదు. తన బ్యాటింగ్ సత్తాతో ఎప్పుడైనా మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగలిగే సామర్థ్యం చూపిస్తాడు. కానీ తన బౌలర్లు బెంబేలెత్తిపోతూ, ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లకు దాసోహం అయినప్పుడు కోహ్లీ దిక్కుతోచని స్థితిలో ఉన్నట్టు కనిపిస్తాడు.

ఉస్మాన్ ఖ్వాజా సెంచరీ వైపు దూసుకెళ్తున్న సమయంలో జస్‌ప్రీత్ బుమ్రా అతడిని 91 పరుగుల దగ్గర అవుట్ చేశాడు. కానీ కోహ్లీ తర్వాత ఓవర్లోనే బుమ్రాను బౌలింగ్ నుంచి తప్పించాడు.

Image copyright AFP

బుమ్రా ఓవర్లో గ్లెన్ మాక్స్‌వెల్ రెండు ఫోర్లు కొట్టాడు. కానీ అంత మాత్రాన కీలక వికెట్ పడగొట్టిన బౌలర్‌కే తర్వాత ఓవర్ ఇవ్వకూడదనేం లేదు. ఆ తర్వాత మరోసారి విరాట్ బుమ్రాను బౌలింగ్‌కు దించాడు. కానీ అప్పటికే ఆలస్యం అయ్యింది.

మొహాలీలో టీమిండియా వికెట్లు పడగొట్టడం చాలా అవసరమైంది. అయినా, కోహ్లీ త్వరగా బంతిని పార్ట్ టైం బౌలర్ల చేతికి అప్పగించేశాడు. విజయ్ శంకర్‌ను 10వ ఓవర్లోనే బౌలింగుకు దించాడు. కేదార్ జాదవ్‌కు 15వ ఓవర్లోనే బంతి అందించాడు.

అయితే, పార్ట్ టైమ్ బౌలర్ల కోటాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోహ్లీ అనుకున్నాడు. ఆరోన్ ఫించ్, ఉస్మాన్ ఖ్వాజా ధాటిగా ఆడుతున్న సమయంలో కోహ్లీ అలా ఎందుకు చేశాడా అనేది చాలా మంది క్రికెట్ పండితులకు కూడా అర్థం కాలేదు.

యజువేంద్ర చాహల్, కులదీప్ యాదవ్‌కు ఈ మ్యాచ్‌లో వికెట్ల వెనక నుంచి ప్రత్యేకమైన సూచనలేవీ లభించలేదు. ధోనీ సలహాలు లేకపోవడంతో ఇద్దరూ నిస్సహాయస్థితిలో కనిపించారు. మొదటి 12 ఓవర్లలో 72 పరుగులు ఇచ్చిన ఈ ఇద్దరూ ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు.

Image copyright Getty Images

'హాఫ్ కెప్టెన్' విరాట్ కోహ్లీ

"మహేంద్ర సింగ్ ధోనీ భారత జట్టుకు సగం కెప్టెన్. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో అతడు లేకపోవడం వల్ల కెప్టెన్ కోహ్లీ దిక్కుతోచని స్థితిలో కనిపించాడు" అని సోమవారం మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేదీ అన్నారు.

వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడిన మాజీ స్పిన్నర్ బేదీ "వ్యాఖ్యానించడానికి నేనెవరు, కానీ ధోనీకి విశ్రాంతి ఎందుకిచ్చారా అని మేమంతా ఆశ్చర్యపోయాం. వికెట్ల వెనక, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో తన లోటు బాగా కనిపించింది. తను(కోహ్లీ) ఒక విధంగా సగం కెప్టెనే" అన్నారు.

"ధోనీ ఇప్పుడు యువ ఆటగాడు కాదు, మొదట్లో ఉన్నంత జోరు కూడా లేదు. అయినా జట్టుకు తన అవసరం చాలా ఉంది" అన్నారు.

మొహాలీ వన్డేలో రిషబ్ పంత్‌ను ధోనీ స్థానంలో వికెట్ కీపర్‌గా ఆడించారు.

44వ ఓవర్లో చాహల్ వేసిన వైడ్‌ బంతి టర్నర్ బ్యాట్ అంచు తాకి వెళ్లినట్టు అందరికీ అనిపించినప్పుడు పంత్‌పై ఒత్తిడి విపరీతంగా పెరిగింది.

ఆ సమయంలో కెప్టెన్ కోహ్లీకి డీఆర్ఎస్ తీసుకోవాలని పంత్ చెప్పాడు. కెప్టెన్ కూడా వెంటనే డీఆర్ఎస్ తీసుకున్నాడు. కానీ తర్వాత ఆ నిర్ణయం ఆస్ట్రేలియాకు అనుకూలంగా వెళ్లింది.

పంత్ చేసిన ఒక పొరపాటు ప్రేక్షకులు, కోహ్లీకి చిరాకు తెప్పించింది. పంత్ వికెట్ల వెనక బంతి వదిలేస్తున్నప్పుడల్లా ప్రేక్షకులు స్టేడియంలో ధోనీ-ధోనీ అని అరవడం మొదలెట్టారు.

Image copyright Reuters

ధోనీ శాంత స్వభావి

"పంత్ అడవి గుర్రం లాంటి వాడు. అతడికి ఎవరైనా కళ్లెం వేయాలి. అలా ఎవరు చేస్తారు. స్పోర్ట్స్ స్టాఫ్ అలా చేయగలరా. అతడు మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నాడు. స్టంప్ వెనక పంత్ ఇంకా చాలా వర్క్ చేయాల్సుంటుంది. మీ సెలక్షన్ బోర్డ్ అధ్యక్షుడు(ఎంఎస్‌కే ప్రసాద్) వికెట్ కీపరే. మీరు కనీసం ఆయనతో అయినా మాట్లాడాలి" అని బేదీ అన్నారు.

"ధోనీ ఉన్నప్పుడు జట్టు చాలా కూల్‌గా ఆడుతుంది. కెప్టెన్‌కు కూడా అతడి అవసరం తెలిసొస్తుంది. అతడు లేకపోతే కోహ్లీకి అసౌకర్యంగా కూడా ఉంటుంది. అది మంచి సంకేతం కాదు. భారత జట్టు ప్రపంచ కప్‌కు ముందు వన్డే జట్టులో ప్రయోగాలు చేసుండకూడదు."

"నా వరకు నేను వాళ్లు వర్తమానంలో జీవించాలని కోరుకుంటున్నాను. వరల్డ్ కప్‌కు ఇంకా రెండున్నర నెలలుంది. మీరు మీ ఆట మాత్రమే ఆడండి. ప్రపంచ కప్ కోసం మనం గత ఏడాదిన్నరగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాం. అది నాకు ఏమాత్రం సంతోషంగా అనిపించలేదు" అని బేదీ చెప్పారు.

"మార్చి 23న ప్రారంభం కానున్న ఐపీఎల్ వల్ల ప్రపంచ కప్‌కు ముందు జట్టుకు తీవ్రమైన సమస్యలు రావచ్చు."

"ఫ్రాంచైజీ తరఫున ఆడే ఆటగాడు ఎప్పుడూ తన వంద శాతం ఆట చూపించాలనే కోరుకుంటాడు. ఐపీఎల్ ఆడే సమయంలో వీరిలో ఎవరైనా గాయపడవచ్చు. మనం అలాంటివి అసలు ఊహించలేం" అ బిషన్ సింగ్ బేదీ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)