జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోభాల్: ‘ఒకప్పుడు పాకిస్తాన్‌లో ముస్లిం’ ఎందుకయ్యారు?

  • 16 మార్చి 2019
అజిత్ దోభాల్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌

భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని చెబుతారు.

అలా అని ఆయన మోదీ ప్రధాని అయిన తర్వాత బీజేపీకి దగ్గర కాలేదు. డోభాల్‌కు లాల్‌కృష్ణ అడ్వాణీ కూడా చాలా విలువ ఇచ్చేవారు.

కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ డోభాల్‌ను ఒక రాజకీయ నేతలా టార్గెట్ చేసుకున్నారు. డోభాల్‌కు ఒక చురుకైన గూఢచారిగా, రక్షణ నిపుణుడిగా గుర్తింపు ఉంది.

కానీ ఇటీవల భారత్‌లో జరిగిన ఎన్నో మిలిటెంట్ దాడులు, పొరుగు దేశంతో పాడవుతున్న సంబంధాల వల్ల డోభాల్‌ వ్యూహాలపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ "పుల్వామా దాడి దోషి మసూద్ అజర్‌ను భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌ తన విమానంలో తీసుకెళ్లి కాందహార్‌లో వదిలేసి వచ్చారు" అన్నారు.

అయితే అధికారిక రికార్డుల ప్రకారం మసూద్ అజర్‌ సహా ముగ్గురు మిలిటెంట్లను కాందహార్ తీసుకువెళ్లిన విమానం దిల్లీ నుంచి టేకాఫ్ అవడానికి ముందే అజిత్ డోభాల్‌ (ఆ సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్నారు) కాందహార్‌లో ఉన్నారు.

అజిత్ డోభాల్‌పై కాంగ్రెస్ మీడియా సెల్ చీఫ్ రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా చేసిన వరుస ట్వీట్లలో "తీవ్రవాదంపై పోరాటంలో ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్‌ కాంగ్రెస్-యూపీఏ ప్రభుత్వ విధానాలను దేశ హితంగా చెప్పారు. యూపీఏ ప్రభుత్వం హైజాకింగ్ గురించి కఠిన విధానాలు రూపొందించింది. తీవ్రవాదులకు మినహాయింపులు, వారితో చర్చలు ఉండవని చెప్పింది. బీజేపీ ప్రభుత్వం అంత దైర్యం ఎందుకు చూపించడం లేదు" అన్నారు.

Image copyright RANDEEP SURJEWALA @TWITTER

మరో ట్వీట్‌లో ఆయన "ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్‌.. మసూద్ అజర్‌ను విడుదల చేయడం రాజకీయ నిర్ణయం అన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వ నిర్ణయం అయ్యుంటే దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు?" అని ప్రశ్నిచారు.

రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా 2010లో వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లో ప్రచురితమైన ఒక ఆర్టికల్ కూడా ట్వీట్ చేశారు.

జర్నలిస్ట్ హరిందర్ బవేజాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అజిత్ డోభాల్‌ "కాందహార్ హైజాక్ సమయంలో మసూద్ అజర్ చాలా కీలకమైన వ్యక్తి అని మాకు తెలిసింది. భద్రత, నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఆయన్ను విడుదల చేయడం ఒక తప్పిదం. అలా జరిగుండకూడదు. కానీ ఒక పెద్ద రాజకీయ నిర్ణయం తీసుకోవడం వారి పని" అన్నారు.

అయితే మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన "భద్రత దృష్ట్యా ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాలూ అంగీకరించాల్సి ఉంటుంది. రాజకీయంగా బాగా ఆలోచించి, దేశ ప్రయోజనాల కోసం ఆ నిర్ణయం తీసుకుని ఉంటే, దానిని అంగీకరించాల్సి ఉంటుంది" అన్నారు.

ఈ వివాదాలకు ముందు అసలు 1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ అయినపుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

విమానం హైజాక్ చేసిన సమయంలో తాలిబన్లతో చర్చలు జరిపిన అజిత్ డోభాల్‌ అక్కడ ఎలాంటి పాత్ర పోషించారో తెలుసుకుందాం.

Image copyright SATPAL DANISH

1988లో రిక్షావాలా కలకలం

అది 1988. స్వర్ణ మందిరం దగ్గర అప్పుడు జర్నైల్ సింగ్ భింద్రావాలే మాటే నడిచేది. అక్కడ అమృత్‌సర్ ప్రజలు, ఖలిస్తానీ వేర్పాటువాదులు చాలా కష్టంగా రిక్షా తొక్కుతున్న ఒక రిక్షావాలాను చూశారు.

తను ఆ ప్రాంతానికి కొత్త. చూడ్డానికి అంతా రిక్షావాడిలాగే ఉన్నాడు. కానీ ఖలిస్తాన్ మిలిటెంట్లకు అతడిపై ఎందుకో సందేహం వచ్చింది.

స్వర్ణ మందిరం పవిత్ర గోడలకు దగ్గరగా నిఘా పెట్టి, మీకు సాయం అందించడానికి పాకిస్తాన్ ఐఎస్ఐ నన్ను పంపిందని ఆ రిక్షావాలా వారికి చెప్పాడు. వారిని నమ్మించడానికి అతడికి పది రోజులు పట్టింది.

'ఆపరేషన్ బ్లాక్ థండర్‌'కు రెండు రోజులు ముందు ఆ రిక్షావాలా స్వర్ణ మందిరం కాంపౌండ్‌ లోపలికి వెళ్లాడు. వేర్పాటువాదుల పొజిషన్, వారి సంఖ్య గురించి కీలకమైన నిఘా సమాచారం సేకరించి బయటకు వచ్చాడు.

ఆ రిక్షావాలా ఎవరో కాదు భారత ప్రభుత్వ ప్రస్తుత భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌.

చాలా అడిగిన తర్వాత పేరు బయటపెట్టకూడదనే షరతుతో ఇంటెలిజెన్స్ బ్యూరోలోని ఒక మాజీ అధికారి "ఈ ఆపరేషన్ చాలా ప్రమాదకరమైన ఆపరేషన్. కానీ మా రక్షణ దళాలకు ఖలిస్తాన్ వేర్పాటువాదుల ప్లాన్ గురించి అజిత్ డోభాల్‌ మొత్తం లేఅవుట్ అందించారు. మ్యాప్, ఆయుధాలు, మిలిటెంట్లు దాగి ఉన్న ప్రదేశాలు లాంటి కచ్చితమైన సమాచారం బయటకు తీసుకొచ్చింది డోభాలే" అన్నారు.

అదే విధంగా 80వ దశకంలో డోభాల్‌ వల్లే భారత నిఘా ఏజెన్సీ మిజోరాంలో వేర్పాటువాదుల అగ్ర నాయకత్వాన్ని ఢీకొట్టడంలో విజయవంతం అయ్యింది. ఆ గ్రూప్‌లోని నలుగురు తిరుగుబాటుదారులు భారత భద్రతాదళాల ముందు లొంగిపోయారు.

చిత్రం శీర్షిక బీబీసీ కార్యాలయంలో రా మాజీ అధికారి అమర్‌జీత్ సింగ్ దులత్

పాకిస్తాన్‌లో ముస్లిం బాబా

డోభాల్‌ కింద పనిచేసిన ఒక అధికారి "మాకు ఎలాంటి డ్రెస్ కోడ్ ఉండేది కాదు. మేం కుర్తా పైజామా, లుంగీ, మామూలు చెప్పులు వేసుకుని తిరిగేవాళ్లం. సరిహద్దుల్లో గూఢచర్యం కోసం వెళ్లడానికి ముందు మేం గడ్డం పెంచేవాళ్లం" అన్నారు.

"అండర్ కవర్‌గా ఉండడం నేర్చుకోడానికి, మేం టార్గెట్ చేసిన ప్రాంతాల్లో చెప్పులు కుట్టేవారిలా వెళ్లేవాళ్లం. నిఘా సమాచారం సేకరించడానికి మేం చెప్పులు కుట్టే పనులు కూడా నేర్చుకున్నాం" అని తెలిపారు.

అజిత్ డోభాల్‌ స్వయంగా ఏడేళ్లు పాకిస్తాన్‌లో గడిపారు. అయితే ఒకప్పుడు ఆయన బాస్.. ఐబీ, రా మాజీ చీఫ్ ఏఎస్ దులత్ మాత్రం "డోభాల్‌ అక్కడ భారత హైకమిషన్‌లో మంచి పోస్టింగులో ఉండేవారు, అండర్ కవర్ ఏజెంట్‌గా లేరు" అని చెప్పారు.

కానీ డోభాల్‌ స్వయంగా విదర్భ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ వేడుకలో ప్రసంగిస్తూ ఒక కథ చెప్పారు. "లాహోర్‌లో ఒక దర్గా ఉండేది. అక్కడకు చాలా మంది వచ్చేవాళ్లు. నేను ఒక ముస్లిం వ్యక్తితో కలిసి ఉండేవాడ్ని. అక్కడ్నుంచి వెళ్తున్నప్పుడు నేను కూడా ఆ సమాధి దగ్గరకు వెళ్లాను. అక్కడ ఒక మూల ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు పొడవాటి తెల్ల గడ్డం ఉంది. ఆయన నన్ను చూడగానే నువ్వు హిందూవా అని అడిగారు" అన్నారు.

తర్వాత డోభాల్‌ "నేను ఏం చెప్పలేదు. తర్వాత ఆయన నన్ను తనతో రమ్మన్నారు. నన్ను ఒక చిన్న గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ తలుపులు మూసి నువ్వు హిందూవా? అన్నారు. నేను ఆయనతో ఏమంటున్నారు అన్నా. మీ చెవులు కుట్టి ఉన్నాయే అన్నారు. నేను ‘ఆ.. చిన్నప్పుడు నా చెవులు కుట్టారు. కానీ తర్వాత నేను కన్వర్ట్ అయ్యాను’ అని చెప్పా. దానికి ఆయన నువ్వు కన్వర్ట్ కాలేదు అన్నారు. అయినా నువ్వు వాటికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకో లేదంటే వీళ్లకు నీపై సందేహం వస్తుంది అని చెప్పారు".

ఆ ఘటనను గుర్తు చేసుకున్న డోభాల్‌ "ఆయన నేను నిన్ను ఎలా గుర్తించానో తెలుసా? అన్నారు. నేను తెలీదు అన్నా. దానికి ఆయన, ఎందుకంటే నేను కూడా హిందూనే అన్నారు. తర్వాత ఆయన తన అల్మారా తెరిచారు. అందులో శివుడు, దుర్గాదేవి ప్రతిమలు ఉన్నాయి. చూశావా, నేను వీటిని పూజిస్తాను, కానీ బయట అందరికీ నేనొక ముస్లిం బాబాగా తెలుసు అని చెప్పారు" అని తెలిపారు.

ఈ కథ డోభాల్‌ నోటి నుంచే వచ్చింది. దీన్ని బట్టి ఆయన కొంతకాలమైనా అండర్ కవర్‌గా పనిచేశారనే విషయం మనకు అర్థమవుతుంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక కాందహార్‌లో హైజాక్ అయిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం

కాందహార్ విమానం హైజాక్ కేసు

డోభాల్‌ గురించి ఇంకొకటి కూడా చెబుతారు. 90వ దశకంలో ఆయన కశ్మీర్‌లో ప్రమాదకరమైన వేర్పాటువాది కుకా పారేకి బ్రెయిన్ వాష్ చేసి అతడిని కౌంటర్ ఇన్‌సర్జెంట్‌ కావడానికి ఒప్పించారని కూడా చెబుతారు.

1999లో కాందహార్ విమానం హైజాక్ సమయంలో తాలిబన్లతో చర్చలు జరిపిన భారత అధికారుల్లో డోభాల్‌ కూడా ఉన్నారు.

"ఆ సమయంలో కాందహార్ నుంచి డోభాల్‌ నాతో నిరంతరం టచ్‌లో ఉన్నారు. ప్రయాణికులను వదిలేలా హైజాకర్స్‌ను ఆయనే ఒప్పించారు. మొదట్లో వారు భారత జైళ్లలో ఉన్న వంద మంది మిలిటెంట్లను విడిపించాలని డిమాండ్ చేశారు. కానీ చివరికి కేవలం ముగ్గురిని విడిపించుకువెళ్లారు" అని రా మాజీ చీఫ్ దులత్ అన్నారు.

"ఇంటెలిజెన్స్ బ్యూరోలో నాకు తెలిసి ఆపరేషన్ల విషయంలో అజిత్ డోభాల్‌ కంటే మంచి ఆఫీసర్ ఎవరూ ఉండరు" అని డోభాల్‌ మరో సహచరుడు, సీఐఎస్ఎఫ్ మాజీ డైరెక్టర్ జనరల్ కేఎం సింగ్ అన్నారు.

"1972లో ఐబీలో పనిచేయడానికి నేను దిల్లీ వచ్చాను. రెండేళ్లకే మిజోరాం వెళ్లిపోయాను. అక్కడ ఆయన ఐదేళ్లు ఉన్నారు. ఈ ఐదేళ్లలో నేను మిజోరాంలో నేను చూసిన రాజకీయ మార్పులన్నింటికీ ఘనత అజిత్ డోభాల్‌కే దక్కుతుంది" అన్నారు.

"80వ దశకంలో పంజాబ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఆయన పంజాబ్ వెళ్లారు. బ్లాక్ థండర్ ఆపరేషన్‌ కోసం ఆయన అందించిన భాగస్వామ్యాన్ని వర్ణించడం చాలా కష్టం. పోలీస్ డిపార్ట్‌మెంటులో 14-15 ఏళ్లు పనిచేసిన తర్వాతే పోలీస్ మెడల్ లభిస్తుంది. ఈ స్పెషల్ ఆఫీసర్‌ మిజోరాంలో ఏడేళ్ల తర్వాతే పోలీస్ మెడల్ ఇచ్చారు. సైన్యంలో కీర్తిచక్ర చాలా పెద్ద పురస్కారంగా భావిస్తారు. దానిని సైన్యం బయట వ్యక్తులకు ఇవ్వరు. కానీ కీర్తి చక్ర కూడా అందుకున్న ఒకే ఒక పోలీస్ ఆఫీసర్ అజిత్ డోభాల్‌" అని కేఎం సింగ్ అన్నారు.

2005లో రిటైరైన తర్వాత కూడా ఆయన నిఘా విషయాల్లో చాలా చురుకుగా ఉండేవారని డోభాల్‌ గురించి తెలిసినవారు చెబుతారు. దావూద్ ఇబ్రహీంపై దాడి చేయించడానికి డోభాల్‌ ప్లాన్ చేశారని, కానీ ముంబై పోలీసుల్లోని కొందరు అధికారుల వల్ల అది చివరి సమయంలో అమలు చేయలేకపోయారని 2005 ఆగస్టులో వికీలీక్స్ కేబుల్స్‌లో వెల్లడైంది.

హుసేన్ జైదీ తన 'డోంగ్రీ టు దుబాయ్' పుస్తకంలో ఈ ఘటన గురించి వివరంగా చెప్పారు. తర్వాత రోజే 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ముంబై ఎడిషన్‌లో ఒక వార్త కూడా ప్రచురించారు. కానీ డోభాల్‌ దాన్ని ఖండించారు. ఆయన 'ముంబై మిర్రర్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, 'నేను అప్పుడు మా ఇంట్లో కూర్చుని ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తున్నా' అని చెప్పారు.

నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అయ్యాక, అజిత్ డోభాల్‌ ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. ఆ తర్వాత మోదీ ప్రభుత్వంలో ఆయన హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌నే మించిపోయేంతగా చొచ్చుకుపోయారని చెబుతారు.

చిత్రం శీర్షిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సహ సంపాదకుడు సుశాంత్ సింగ్‌తో రేహాన్ ఫజల్

చాలాసార్లు వైఫల్యాలు కూడా ఎదురయ్యాయి

అజిత్ డోభాల్‌ నిఘాలో భారత్‌కు కొన్ని భారీ విజయాలు దక్కాయనడంలో సందేహం లేదు. అది ఫాదర్ ప్రేమ్ కుమార్‌ను ఐఎస్ పట్టు నుంచి విడిపించినా, శ్రీలంకలో ఆరుగురు భారతీయ మత్స్యకారులకు ఉరిశిక్ష విధించే ఒక్క రోజు ముందు క్షమాభిక్ష ఇప్పించడమైనా లేక దేప్‌సాంగ్, దేమ్‌చోక్ ప్రాంతాల్లో చైనా సైన్యం శాశ్వత క్యాంపులను తొలగించడమైనా డోభాల్‌ ఘనతే అని చెప్పుకుంటారు. కానీ చాలా విషయాల్లో ఆయనకు వైఫల్యాలు కూడా ఎదురయ్యాయి.

నేపాల్‌తో కొనసాగిన ప్రతిష్టంభన, నాగాలాండ్ వేర్పాటువాదులతో చర్చలపై వచ్చిన ప్రశ్నలు, పాకిస్తాన్‌తో విఫలమైన చర్చలు, పఠాన్‌కోట్ దాడి లాంటివి అజిత్ డోభాల్‌ను ప్రశ్నల బోనులో నిలబెట్టాయి.

ఇంగ్లిష్ వార్తాపత్రిక 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కో-ఎడిటర్ సుశాంత్ సింగ్.. పొరుగు దేశాలతో సంబంధాల విషయానికి వస్తే భారత్‌ పరిస్థితి గత కొన్నేళ్లుగా సరిగాలేదని మీరు భావిస్తారు. అది మాల్దీవులు అయినా, నేపాల్ అయినా, పాకిస్తాన్ అయినా ఒక్కోసారి సరే, ఒక్కోసారి నో అనే వాతావరణం ఉంది. భారత్‌పై రెండు మూడు మిలిటెంట్ దాడులు జరిగాయి. కశ్మీర్లో తీవ్రవాదం పెరిగింది అన్నారు.

ఈ రంగంలో అజిత్ డోభాల్‌ పైన చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే అది ఆయన ఫీల్డ్. కానీ అక్కడ ఆయన మెరుగ్గా పనిచేయలేకపోయారు.

ఇటు ప్రముఖ వ్యూహ నిపుణులు అజయ్ శుక్ల్... అజిత్ డోభాల్‌ తన సమయంలో ఒక మంచి సమర్థులైన, విజయవంతమైన ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా ఉన్నారు. కానీ ఒక రంగంలో నిపుణులైన వారు మరో ఫీల్డులో కూడా అదే స్థాయిలో ఉండాలనేం లేదు అని అన్నారు.

"ఆయనకు ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్నంత సమాచారం విదేశీ సంబంధాలు, దౌత్యం, సైనిక ఆపరేషన్ల గురించి పెద్దగా లేదు" అని శుక్ల్ చెబుతారు.

ఇలాంటి ఆపరేషన్ వచ్చినపుడు, అందులో మూడు కోణాలూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక మనిషి తన స్థాయిలో అన్ని నిర్ణయాలు తీసుకోవడం బహుశా సముచితం కాదు.

అలాంటప్పుడు జటిలమైన ఆపరేషన్ల సమయంలో అన్ని నిర్ణయాలూ స్వయంగా తీసుకోవడానికి బదులు క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్ సమావేశం ఏర్పాటు చేయాలి. తర్వాత మంచివిగా నిరూపించుకోలేకపోయిన నిర్ణయాలను ఒంటరిగా తీసుకోకుండా ఉండాలి.

మరోవైపు, డోభాల్‌ పదవీకాలం ఇప్పటివరకూ చాలా బాగానే ఉందని ఏఎస్ దులత్ అన్నారు. "ఎందుకంటే మోదీకి, ఆయనకి మధ్య అన్యోన్యత చాలా బాగుంది, నిజానికి కాలం, వ్యక్తులతో స్టైల్ మారుతుంది" అని ఆయన అన్నారు.

"నేను బ్రజేష్ మిశ్రాతో కలిసి పనిచేశాను. ఆయన కూడా చాలా పెద్ద వ్యక్తి. వాజ్‌పేయి హయాంలో మూడు-నాలుగు పెద్ద సమస్యలు వచ్చాయి. కానీ ప్రతిసారీ చాలా తెలివిగా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం రియాక్షన్ చాలా త్వరగా వస్తుంది."

దులత్ దానికి ఉదాహరణ కూడా ఇచ్చారు. పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు బ్రజేష్ మిశ్రా మొత్తం ఘటన అంతా టీవీలో చూస్తున్నారు. ప్రధాన మంత్రి దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లాలనేంతగా ఆయనలో ఎలాంటి ఎక్సైట్‌మెంట్ లేదు. ఆయన నిశ్శబ్దంగా చూస్తూ సిగరెట్ తాగుతున్నారు. దీని పరిణామాలు ఎలా ఉంటాయా అని ఆలోచిస్తున్నారు. ఆయన లంచ్ తర్వాత ప్రధాన మంత్రి దగ్గరకు వెళ్లారు. ఆ తర్వాతే ఇలాంటివి సాగవని ఆయన ప్రకటన చేశారు. తర్వాత పాకిస్తాన్‌ను హెచ్చరించారు.

దులత్ ప్రకారం ఆయన కాలంలోనే జరిగిన హైజాకింగ్ గురించి తీవ్రవాదులను ఎందుకు వదిలేశారంటూ విమర్శలు వచ్చాయి. కానీ అక్కడ వేరే దారి లేదు. అక్కడ చాలా తీవ్రమైన వాతావరణం ఉంది. ఎందుకంటే తాలిబన్లు మొదట సుమారు వంద మందిని విడిపించాలని అనుకున్నారు. కానీ మెల్లమెల్లగా ఆ డిమాండును మొదట 75కు తగ్గించి, చివరికి ముగ్గురిని వదిలేశారు.

Image copyright Pti
చిత్రం శీర్షిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడుతున్న అజిత్ డోభాల్‌

డోభాల్‌ భుజాలపై చాలా భారం ఉంది

ప్రతి చోటకీ వెళ్లి.. ప్రతి దాన్నీ తనే హ్యాండిల్ చేయాలని అనుకుంటారని డోభాల్‌పై ఆరోపణలు ఉన్నాయి. 'ఇండియన్ ఎక్స్‌ప్రెస్' సుశాంత్ సింగ్ - ‘నిజానికి డోభాల్‌ చాలా భారం మోస్తున్నారు. దాని ఫలితంగానే పఠాన్‌కోట్ దాడి జరిగినప్పుడు ఆయన చైనాతో జరగాల్సిన సరిహద్దు చర్చలను వాయిదా వేయాల్సి వచ్చింది’ అన్నారు.

130 కోట్ల మంది ఉన్న దేశంలో అలా జరక్కూడదు. ఆరుగురు తీవ్రవాదులు ఒకదగ్గర చొరబడినంత మాత్రాన మనకంటే పెద్దదైన పొరుగు దేశంతో చర్చలను అలా వాయిదా వేయకూడదు.

కానీ మోదీ స్వయంగా ఇచ్చారు కాబట్టే డోభాల్‌ ఆ బాధ్యతలు తీసుకున్నారని ఆయన మద్దతుదారులు చెబుతారు. విషయం మళ్లీ అక్కడికే వస్తుంది. మోదీ ఏం కోరుకుంటున్నారు? మోదీ డోభాల్‌పై ఆధారపడితే, ఆయనే అన్నీ చేయాలని భావిస్తే, అప్పుడు అజిత్ డోభాల్‌ ముందు వేరే ప్రత్యామ్నాయం ఏదీ ఉండదు.

డోభాల్‌ విమర్శకులు ఆయన భాష ఆధునికం కాదని అంటారు. ఆయన కటువుగా ఉంటారని, అవుటాఫ్ టర్న్ మాట్లాడతారని చెబుతారు. ఈ విషయంలో దులత్ ఆయన్ను వెనకేసుకొస్తారు. "ఆయన ఏం మాట్లాడినా బాగా ఆలోచించి మాట్లాడతారు. ఆయన కటువుగా మాట్లాడ్డం వెనుక తన మాటలు ప్రత్యేకంగా కొందరికి చేరాలని కోరుకోవడం కావచ్చు. ఏదైనా వ్యూహం ప్రకారం అలా మాట్లాడుండచ్చు" అన్నారు.

పఠాన్‌కోట్‌లో సైనిక ఆపరేషన్ నిర్వహించడానికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్‌జీ)ని పంపించడం చాలా మంది మాజీ జనరళ్లకు రుచించలేదు. సుశాంత్ సింగ్ దానికి.. "డోభాల్‌ రాజ్యంలో భారత భద్రత, వ్యక్తిగతీకరణ అయిపోయింది. ఇక్కడ ప్రతిస్థితి నుంచి తొలగించడానికి ముందు నుంచే దానిని ఒక పద్ధతి ప్రకారం ఎగతాళి చేయడం, విమర్శించడం జరుగుతోంది. డోభాల్‌ బాధ్యతలను పంచుకోవడంపై నమ్మకం ఉంచరు. ప్రతి దానినీ స్వయంగా మైక్రో మేనేజ్ చేయాలని చూస్తారు" అని విమర్శించారు.

ప్రస్తుతం డోభాల్‌ టార్గెట్‌లో ఉన్నారు. ఒకవేళ ఆయన నేతృత్వంలో కూడా భారత్‌లో యాక్టివ్ యుద్ధ వ్యూహాలు అమలు కాలేదంటే అది ఆయన నిర్మించుకున్న అద్భుతమైన ట్రాక్ రికార్డుపై కొన్ని మరకలు వేయవచ్చు. డోభాల్‌ బహుశా అలా జరగనివ్వకపోవచ్చు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

గోదావరిలోనుంచి బోటును బయటకు తీయలేరా

గాంధీకి దగ్గరైన ఈ ఎనిమిది మంది మహిళల గురించి మీకు తెలుసా

ఏరియా 51: గ్రహాంతరవాసులను చూడ్డానికి ఎంతమంది వచ్చారు.. వచ్చినవారికి ఏమైంది

కేసీఆర్‌నే జైలుకు పంపుతామంటున్నారు.. తప్పు చేస్తే ఆ సీఎంలు వదిలిపెట్టేవాళ్లా - కేటీఆర్

‘బ్రౌన్ గర్ల్స్’... ఇన్‌స్టాగ్రామ్‌లో దక్షిణాసియా అమ్మాయిల సరికొత్త గ్యాంగ్

18 సంవత్సరాల్లోపు యూజర్లకు ఇలాంటి పోస్టులు ఇక కనిపించవు - ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్

శేఖర్ రెడ్డిని చంద్రబాబు బినామీ అన్న జగన్ ఆయనను టీటీడీ బోర్డులోకి ఎలా తీసుకున్నారు

గోదావరి కచ్చులూరు పడవ ప్రమాదంలో ప్రధాన నిందితుడైన బోటు యజమాని, మరో ఇద్దరి అరెస్ట్