లోక్‌సభ ఎన్నికలు 2019: 'విద్యుదీకరణతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాం' అన్న మోదీ మాటల్లో నిజమెంత - Reality Check

  • 15 మార్చి 2019
పొలంలో పని చేస్తున్న రైతు Image copyright AFP

ఏప్రిల్ 11తో దేశంలో ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రధాన రాజకీయపార్టీలు చేసిన ప్రతిజ్ఞలు, ఇచ్చిన హామీల్లో వాస్తవం ఎంత అన్న విషయాన్ని బీబీసీ 'రియాలిటీ చెక్' బృందం పరిశీలిస్తోంది.

గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ.. తాము ఇచ్చిన హామీల్లో ఓ మైలురాయిని చేరుకున్నామంటూ సంబరాలు చేశారు. దేశంలోని ప్రతిఒక్క గ్రామానికీ విద్యుత్ సరఫరా చేసి, తమ లక్ష్యాన్ని ఛేదించామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

''చాలామంది దేశ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురాగలిగిన ఓ హామీని నిన్నటిరోజున మేం నెరవేర్చాం'' అని మోదీ ట్వీట్ చేశారు.

గ్రామాలకు, గ్రామీణ కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడం.. మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది. ఈ సందర్భంలో.. 'ఈ హామీని నెరవేర్చాం' అని చెబుతున్న మోదీ మాటలు పరీక్షకు నిలబడగలవా?

గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో ఓసారి పరిశీలిస్తే..

ఒక గ్రామంలోని 10% గృహాలతోపాటు, స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాల్లాంటి బహిరంగ ప్రదేశాలను 'ఎలక్ట్రిక్ గ్రిడ్‌'కు అనుసంధానం చేశాక, ఆ గ్రామాన్ని పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా ఉన్న గ్రామంగా ప్రభుత్వం నిర్వచిస్తోంది.

2011 గణాంకాల ప్రకారం, దేశంలో దాదాపు 60లక్షల గ్రామాలున్నాయి. ప్రభుత్వం ఇస్తోన్న నిర్వచనం ప్రకారం ఇప్పుడు దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఉంది. ఇందులో ఎక్కువ భాగం పనులు గత ప్రభుత్వాల హయాంలోనే జరిగాయి.

ప్రధాని మోదీ అధికార పగ్గాలు చేపట్టినప్పటికే 96% గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఉంది. ఇక పైన చెప్పిన 10% కుటుంబాలతోపాటు ఆ గ్రామంలోని బహిరంగ ప్రదేశాలను ఎలక్ట్రిక్ గ్రిడ్‌కు అనుసంధానం చేయాల్సిన గ్రామాల సంఖ్య 18వేలు. అంటే అధికారంలోకి వచ్చాక బీజేపీ లక్ష్యం కేవలం 18వేల గ్రామాలు మాత్రమే.

భారత ప్రభుత్వం సాధించిన ఘనతను ప్రపంచ బ్యాంకు కూడా ప్రశంసించింది. దేశంలోని 85% జనాభాకు విద్యుత్ సౌకర్యం ఉందని ప్రపంచ బ్యాంకు అంచనా. కానీ ప్రభుత్వ అంచనా 82% మాత్రమే. ప్రభుత్వ అంచనా కంటే ప్రపంచ బ్యాంకు అంచనా ఎక్కువగా ఉంది.

విద్యుత్ సౌకర్యం పొందిన గ్రాామాలు

ఆధారం: కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ

బీజేపీ అధికారంలోకి రాకమునుపు దేశంలో 27కోట్ల మంది ప్రజలకు విద్యుత్ సౌకర్యం లేదు. ప్రపంచ బ్యాంకు నివేదిక-2017 ప్రకారం, ‘విద్యుత్ సౌకర్యలేమి’తో జీవిస్తున్న ప్రజలు ఎక్కువమంది ఉన్న దేశం భారత్. అంటే ప్రపంచ విద్యుత్ లోటులో దాదాపు ఇది మూడోవంతు.

గృహాల పరిస్థితి ఏమిటి?

2017 సెప్టెంబర్‌లో మోదీ ప్రభుత్వం ఓ ప్రాజెక్టును ప్రారంభించింది. అందులో.. 2018 డిసెంబర్‌నాటికి, 4కోట్ల గ్రామీణ కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తూ, దేశంలో ఉన్న అన్ని కుటుంబాలకూ విద్యుత్ సౌకర్యం కల్పించడమే ఆ ప్రాజెక్టు లక్ష్యం.

ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలోని అన్ని కుటుంబాలకు విద్యుత్ సౌకర్యం ఉన్నట్లే. కానీ మార్చి నెల వరకున్న లెక్కల ప్రకారం 19,753 కుటుంబాలకు ఇంకా విద్యుత్ సౌకర్యం కల్పించాల్సివుంది.

గత ప్రభుత్వంతో పోలిస్తే, తాము చాలా వేగంగా విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నామని బీజేపీ ప్రభుత్వం చెబుతోంది.

కానీ, కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ గణాంకాలు మరోలా ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం, కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి సగటున 9వేల గ్రామాలను విద్యుదీకరణ చేస్తే, బీజేపీ ప్రభుత్వం సగటున కేవలం 4వేలకుపైగా గ్రామాలను మాత్రమే విద్యుదీకరణ చేసింది.

Image copyright Getty Images

సరఫరా సమస్యలు

భారతదేశ గ్రామాలను విద్యుదీకరణ చేయడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు గణనీయమైన వృద్ధి కనబరిచినా, విద్యుత్ సరఫరాలో నాణ్యత ఓ ప్రధాన సమస్యగా మారింది.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విషయంలో పార్లమెంటులో ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ, దేశంలోని 29 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాలకే 24గంటల విద్యుత్ అందుతోంది.

దేశంలోని సగం కంటే తక్కువ గ్రామాలకు, పగటిపూట 12గంటల కంటే ఎక్కువ సమయం విద్యుత్ సరఫరా అవుతోంది. అదికూడా నివాస గృహాలకు మాత్రమే.

ఇక మూడోవంతు గ్రామాలకు 8 నుంచి 12గంటలపాటు విద్యుత్ సరఫరా అవుతోంది.

విద్యుత్ సరఫరా దుర్భరంగా ఉన్న రాష్ట్రాలు ఈశాన్య భారతదేశంలో ఉన్నాయి. కేవలం 1-4 గంటలపాటు విద్యుత్ సరఫరా అయ్యే గ్రామాల్లో అత్యధికశాతం గ్రామాలు జార్ఖండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)