‘అభినందన్‌లా నా భర్త కూడా పాక్ సైన్యానికి చిక్కారు.. ఆయన కోసం 48ఏళ్లుగా ఎదురు చూస్తున్నా..’

  • 15 మార్చి 2019
దమయంతి

ఎదురుచూపులు ఎంత భారంగా ఉంటాయో 71 ఏళ్ల దమయంతికి బాగా తెలుసు. తన భర్త, ఫ్లైట్ లెఫ్టినెంట్ విజయ్ తాంబే ఇంటికి వస్తారని గత 48 ఏళ్లుగా ఆమె ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ ఆయన రాలేదు.

ఆయన 1971లో జరిగిన భారత్-పాక్ యుద్ధంలో అదృశ్యమయ్యారని, తర్వాత పాకిస్తాన్ అదుపులోకి తీసుకుందని చెప్పారు. అప్పటి నుంచి తన భర్తను స్వదేశానికి తీసుకురావాలని దమయంతి ప్రయత్నిస్తూనే ఉన్నారు.

దమయంతి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, జేఎన్‌యూలో మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్‌గా పని చేశారు.

వింగ్ కమాండర్ అభినందన్‌ ఫిబ్రవరి 27న పాకిస్తాన్ దళాలకు చిక్కారు. 50 గంటల తర్వాత విడుదలైన ఆయన తిరిగి భారత్ చేరారు. కానీ ఇలా చిక్కుకున్న చాలామంది భారతీయులు మాత్రం ఇంకా పాక్ చెరలోనే మగ్గిపోతున్నారు.

ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్ విజయ్ తాంబే కూడా 1971 యుద్ధంలో భాగంగా, పాకిస్తాన్ భూభాగంలో అదృశ్యమయ్యారు. ఆయన భార్య దమయంతి తాంబే ఆయన విడుదల కోసం గత 48 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.

‘‘నేను ఈ రెండు ఘటనలనూ పోల్చడం లేదు. వింగ్ కమాండర్ అభినందన్‌ను తిరిగి దేశానికి అప్పగించినపుడు అది పూర్తి స్థాయి యుద్ధం కూడా కాదు’’ అని దమయంతి అన్నారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionనా భర్త 48 ఏళ్లక్రితం పాక్ సైన్యానికి చిక్కారు.. ఇప్పటికీ తిరిగి రాలేదు.

అసలు ఏం జరిగింది?

‘‘మొదట మా ఆయన యుద్ధంలో కనిపించకుండా పోయారని మాకు టెలిగ్రాం అందింది. తర్వాత అదే వార్తను నేను రేడియోలో విన్నాను. తన కొలీగ్స్ కొందరు ఆయన్ను పాకిస్తాన్ టీవీ చానల్లో చూశామని చెప్పారు. మా మావయ్య పాకిస్తాన్ న్యూస్ పేపర్లు తీసుకొచ్చారు. వాటిలో ఐదుగురు భారత పైలెట్లను పాకిస్తాన్ పట్టుకుందని, వారిలో ఒకరి పేరు తాంబే అని ఉంది. దాంతో పైలెట్లను పాకిస్తాన్ నిర్బంధించినట్లు ఒప్పుకుందనే అనుకున్నాం’’ అని ఆనాటి సంఘటనలను దమయంతి బీబీసీతో పంచుకున్నారు.

‘‘కొంతకాలానికి యుద్ధం ముగిసింది. సిమ్లా ఒప్పందం జరిగింది. యుద్ధ ఖైదీల అప్పగింత జరిగింది. యుద్ధ ఖైదీలను వారి దేశాలకు పంపిస్తారు. విజయ్ కూడా అందరిలాగే ఇంటికి తిరిగొస్తారనే అనుకున్నాం. కానీ మొదటి రెండు జాబితాల్లో ఆయన పేరు లేదు. మూడో జాబితా వస్తుందన్నారు. అందులో మిగతా వారి పేర్లుంటాయిలే అనుకున్నాం. కానీ ఆ జాబితా విడుదల కాలేదు, యుద్ధ ఖైదీలు కూడా రాలేదు. మేం ప్రభుత్వానికి లేఖ రాశాం. కానీ ఏ సమాధానం లేదు’’ అని దమయంతి వివరించారు.

‘‘ఒక మంత్రి మమ్మల్ని ప్రభుత్వ క్వార్టర్స్ నుంచి ఇంకా బయటికి వెళ్లలేదే అని అడిగారు. అధికారులకు ఇళ్లు దొరకడం లేదని, అందుకే మేం ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. అధికారులు మాతో మాట్లాడ్డం అదే మొదటిసారి. యుద్ధం ముగిసింది. మనం గెలిచాం. దేశం అప్పుడు విజయోత్సవాల్లో ఉంది. ఆ సమయంలో మా కన్నీళ్లు ఎవరికి కనిపిస్తాయి’’ అని ఆమె అన్నారు.

చిత్రం శీర్షిక అభినందన్‌ను విడుదల చేసిన రోజు భారత్-పాకిస్తాన్ సరిహద్దు వద్ద అటారీ వైపు జాతీయ జెండాతో భారతీయులు

తాము ఈ విషయాన్ని పాకిస్తాన్ దగ్గర ఎన్నోసార్లు ప్రస్తావించామని భారత ప్రభుత్వం చెబుతోంది. కానీ దమయంతి మాత్రం తన ప్రయత్నం వదులుకోవడం లేదు.

‘‘నిజం చెప్పాలంటే, ఈరోజు కూడా ఆ కేసు మూసేయడం గురించి నేను పట్టించుకోవడం లేదు. కేసు మూసేయడం అంటే ప్రయత్నాలన్నీ ఆపేశారని అర్థం. భారత ప్రభుత్వం.. అక్కడ ఇంకా యుద్ధ ఖైదీలు ఉన్నారని ఒప్పుకోడానికి సిద్ధంగా లేదు. పాకిస్తాన్ ప్రభుత్వం కూడా తమ దగ్గర యుద్ధ ఖైదీలు ఉన్నారని చెప్పడం లేదు. కానీ నాకు మాత్రం ఆయన అక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది. ఆయన విడుదల కోసం నేను కాకుండా ఇంకెవరు ప్రయత్నిస్తారు’’ అని దమయంతి తన బాధను పంచుకున్నారు.

‘ఆయన ఇప్పుడు ఎక్కడున్నారని భావిస్తున్నారు? ఏ పరిస్థితిల్లో ఉండచ్చు?’ అని బీబీసీ ప్రతినిధి దమయంతిని ప్రశ్నించినపుడు..

‘‘ఆయన ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో నాకు తెలీదు. ఆ విషయం తెలుసుకునే మార్గం కూడా లేదు. నన్ను రెండుసార్లు పాకిస్తాన్ పంపినప్పుడు మమ్మల్ని కోట్ లఖ్‌పత్ జైలుకు తీసుకెళ్లారు. కొంతమంది భారత ఖైదీలను మా ముందు పరేడ్ చేయించారు. అక్కడ వాళ్ల కాళ్లకు సంకెళ్లు వేయడం, వారి పరిస్థితి అంతా చూసి నాకు ఒక్క క్షణం.. వీళ్లు ఇలా జీవించాలా? ఇలా బతకడం కంటే విజయ్ ప్రాణాలతో లేకపోవడమే మంచిది అనిపించింది. అందుకే, ఆయన ఎలా ఉన్నారో, ఎక్కడ ఉన్నారో తెలీదు. కానీ తిరిగొస్తే మాత్రం, ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా, నా జీవితంలో ఆయనకు 200 శాతం చోటు ఉంటుందని మాత్రం నాకు తెలుసు’’ అని ముగించారు దమయంతి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)