‘బాలాకోట్ దాడిలో 200మంది మిలిటెంట్లు మరణించారని పాకిస్తాన్ ఆర్మీ అంగీకరించిందా - FACT CHECK

  • 15 మార్చి 2019
వీడియోలోని పాకిస్తాన్ అధికారి, గ్రామస్థులు Image copyright SM Viral Post
చిత్రం శీర్షిక వీడియోలోని పాకిస్తాన్ అధికారి, గ్రామస్థులు

పుల్వామా దాడికి ప్రతిగా, ఫిబ్రవరి 26న పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై భారత వైమానిక దళం దాడి చేసింది. ‘ఈ దాడిలో 200మంది మిలిటెంట్లు మరణించినట్లు పాకిస్తాన్ కల్నల్ అంగీకరించారు’ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కానీ ఈ దాడుల గురించి రెండు దేశాలూ భిన్నంగా స్పందించాయి. బాలాకోట్ దాడుల్లో ఒక్కరు కూడా చనిపోలేదని పాకిస్తాన్ చెబుతుంటే, కొందరు భారతీయ మంత్రులు మాత్రం, ఆ దాడిలో 200కుపైగా మిలిటెంట్లు మరణించారని చెబుతున్నారు.

20సెకన్ల నిడివి ఉన్న ఆ వైరల్ వీడియోలో కల్నల్ ఫైజల్ అనే వ్యక్తి ఓ చిన్నారితో మాట్లాడుతుంటారు.

బాలాకోట్‌ దాడిలో 200కుపైగా మిలిటెంట్లు మరణించినట్లు ఓ పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్ అంగీకరించారంటూ కొన్ని భారతీయ మీడియా సంస్థలు కూడా ఈ వీడియోను బుధవారంనాడు షేర్ చేశాయి. మొదట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయ్యింది.

'బాలాకోట్‌లో భారత వైమానిక దళాల దాడికి నిదర్శనం' అన్న ట్యాగ్‌లైన్‌తో, మితవాద వర్గానికి చెందిన కొందరు ఈ వీడియోను ఫేస్‌బుక్ గ్రూపుల్లో షేర్ చేశారు.

Image copyright Twitter

''భారత సైన్యం ధైర్యాన్ని చూసి, పాకిస్తాన్ ఏడుస్తోంది. బాలాకోట్ దాడికి రుజువులు అడుగుతున్న ద్రోహులకు ఈ వీడియో ఒక నిదర్శనం'' అని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ వీడియోను షేర్ చేస్తూ, ట్వీట్ చేశారు.

ట్విటర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో ఈ వీడియోకు కొన్ని లక్షల వ్యూస్, షేర్లు వచ్చాయి. కానీ ఈ వీడియో పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.

మా అధ్యయనంలో భాగంగా, ఆ పాకిస్తానీ ఆర్మీ ఆఫీసర్.. బాలాకోట్ దాడిలో 200మంది మిలిటెంట్లు చనిపోయినట్లు అంగీకరించలేదని తేలింది.

Image copyright Nasur Ullah/Facebook
చిత్రం శీర్షిక బాధితుడి కుటుంబంతో కల్నల్ ఫైజల్ ఖురేషి

‘మరణించింది కేవలం ఒకరే..!’

''ఆర్మీ ఆఫీసర్‌తో మాట్లాడుతున్న ముసలాయన పాస్తో భాషలో మాట్లాడుతున్నారు. కానీ మాన్సెరా-బాలాకోట్ ప్రాంతంలో ఎక్కువగా హింద్కో మాట్లాడుతారు'' అని సీనియర్ పాకిస్తానీ జర్నలిస్ట్ రహీముల్లా యూసుఫ్‌జాయి బీబీసీతో అన్నారు.

అంతేకాకుండా, ఆ వీడియోలో.. కేవలం ఒక వ్యక్తి మరణం గురించే మాట్లాడినట్లు వినిపిస్తోందని రహీముల్లా అన్నారు.

''ప్రభుత్వానికి మద్దతుగా ఉండి, ప్రభుత్వం కోసం పోరాడేవారే జిహాదీ'' అని ఆ వీడియోలోని అధికారి అన్నారు.

''జిహాదీ పేరుకు కేవలం కొందరు మాత్రమే అర్హులు. నిన్న 200మంది కొండపైకి వెళ్లారు. కానీ ఇతడికి మాత్రమే 'ప్రాణత్యాగం' చేసే రాత రాసుంది. ప్రతిరోజూ మేము కొండపైకి వెళ్లి వస్తుంటాం. కానీ అల్లా ఆశీస్సులు ఉన్నవారికి మాత్రమే ప్రాణత్యాగం చేసే భాగ్యం కలుగుతుంది'' అని, ఆ వీడియోలోని మరో స్వరం వినిపిస్తుంది.

ఈ స్వరం కెమెరా వెనకవైపు నుంచి వినిపిస్తుండటంతో, ఆ వ్యక్తి ఆర్మీ ఆఫీసరా, లేక సాధారణ పౌరుడా అన్న విషయంలో స్పష్టత లేదు.

ఏదేమైనా, బాలాకోట్‌ దాడిలో 200మంది మరణించారని పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ ఒప్పుకున్నారంటూ భారతదేశంలో ఈ వీడియో వైరల్ అయ్యింది.

Image copyright Farman Ullah Khan/Facebook
చిత్రం శీర్షిక గ్రామస్థులను కలిసిన బ్రిగేడర్ హలీమ్

‘ఈ వీడియో.. బాలాకోట్‌ది కాదు’

ఈ వీడియోను ఫ్రేమ్ టు ఫ్రేమ్ క్షుణ్ణంగా పరిశీలించిన మీదట, ఇది ఫేస్‌బుక్‌లోని ఓ పాత వీడియో అని తేలింది. ఆ వీడియోలో మరణించిన వ్యక్తి ఎహ్‌సానుల్లా అనే పాకిస్తాన్ సైనికుడని, ఆయన పశ్చిమ ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతానికి చెందినవారని మాకు లభించిన ఉర్దూ ఫేస్‌బుక్ పోస్ట్ తెలిపింది.

ఈ వైరల్‌ వీడియో.. బాలాకోట్‌కు 300కి.మీ. దూరంలో ఉన్న పశ్చిమ ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని 'దిర్‌' ప్రాంతానికి చెందినదని తాము భావిస్తున్నట్లు పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి బీబీసీతో అన్నారు.

ఈ ఘటనకు చెందిన మరో వీడియోలో జావెద్ ఇక్బాల్, షహీన్ ఫర్మానుల్లా ఖాన్, ఖిష్తా రెహ్మాన్ దురాని అనే ముగ్గురు వ్యక్తులను, వారివారి సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా మేం గుర్తించాం.

ఈ ముగ్గురి ఫేస్‌బుక్ పోస్టుల ద్వారా, బ్రిగేడియర్ హలీమ్, కల్నల్ ఫైజల్ ఇద్దరూ బాధితుడి గ్రామాన్ని సందర్శించినట్లు అర్థమవుతోంది. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా దిర్ ప్రాంతానికి చెందినవారిగా ఫేస్‌బుక్‌ సమాచారం చెబుతోంది.

Image copyright SM Viral Post
చిత్రం శీర్షిక ఫేస్‌బుక్ పోస్టుల ద్వారా, బ్రిగేడర్ హలీమ్, కల్నల్ ఫైజల్ ఇద్దరూ బాధితుడి గ్రామాన్ని సందర్శించినట్లు అర్థమవుతోంది.

బాలాకోట్‌ దాడుల్లో చాలామంది మరణించారని చెప్పడానికి భారతీయ మీడియా ఇలాంటి నకిలీ వీడియోలను వాడుకుంటోందని పాకిస్తాన్ మీడియా వెబ్‌సైట్లు పేర్కొన్నాయి.

కానీ ఈ వీడియో గురించి, ఈ వెబ్‌సైట్లు చెబుతున్న దానిలో కూడా వాస్తవం లేదు.

ఈ వీడియోలో మరణించిన వ్యక్తి అబ్దుల్ రావ్ అనే సైనికుడని, భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగినపుడు నాయక్ ఖుర్రమ్ అనే సైనికుడితోపాటు అబ్దుల్ చనిపోయారని ''డెయిలీ పాకిస్తాన్.కామ్''(DailyPakistan.com) తెలిపింది.

కానీ 'రేడియో పాకిస్తాన్' అధికారిక ట్వీట్ ద్వారా, ఈ ఇద్దరు సైనికులు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతానికి చెందినవారుగా తెలిసింది.

(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)