మోదుగుల వేణుగోపాల్ రెడ్డి , ఘంటా మురళీ కృష్ణ: అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు

  • 17 మార్చి 2019
మోదుగుల వేణుగోపాల్ రెడ్డి Image copyright MODhugula/fb

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లో కండువాలు మార్చుతున్న నేతల సంఖ్య పెరుగుతోంది. టికెట్ ఆశించి భంగపడుతున్న వారు వేరే పార్టీల్లోకి ఫిరాయిస్తున్నారు.

ఇన్నాళ్లు టీడీపీలో ఉన్న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. లోటస్ పాండ్‌లో వైఎస్ జగన్‌ను కలిసిన ఆయన వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

మోదుగుల గతంలో ప్రజారాజ్యం పార్టీలోనూ పనిచేశారు. 2009 ఎన్నికల్లో నరసరావు పేట నుంచి టీడీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో చర్చ జరుగుతున్నప్పుడు విభజనకు వ్యతిరేకంగా పోరాడారు.

2014 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కన్నా లక్ష్మీనారాయణపై గెలిచారు.

అయితే, గతకొంతకాలంగా టీడీపీకి దూరంగా వస్తున్న ఆయన ఎన్నికల వేళ వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి జగన్‌ను సీఎం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. వైసీపీని గుంటూరు జిల్లాలో పటిష్టం చేస్తానని తెలిపారు. సైనికుడిలా పనిచేసి వైసీపీ విజయానికి కృషి చేస్తానని చెప్పారు.

జగన్ ఒక్కరే ప్రత్యేక హోదా మీద స్థిరంగా ఉన్నారని అన్నారు. టీడీపీలో ద్వితీయ శ్రేణి పౌరుడిగా ఉండలేకపోయానని, చంద్రబాబు పార్టీలో న్యాయం జరగకపోవడం వల్లే బయటకు వచ్చానని అన్నారు.

Image copyright Gantha/fb

‘చంద్రబాబు సీఎం అవడానికి కృషి చేస్తా’

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ కృష్ణ కూడా ఇటీవల పార్టీ మారారు. ఇన్నాళ్లు వైసీపీలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

గతంలో ఘంటా కాంగ్రెస్ పార్టీ నుంచి శాసన సభకు ఎన్నికయ్యారు. తర్వాత వైసీపీలో చేరారు. కొన్నాళ్ల కిందట ద్వారకతిరుమలలో జరిగిన వైసీపీ సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగనే ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. చంద్రబాబు రుణమాఫీ పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు.

టీడీపీ గూటికి చేరిన అనంతరం సీఎం చంద్రబాబు ఏపీకి చేసిన అభివృద్ధిని చూసి అనుచరులతో కలిసి టీడీపీలో చేరుతున్నాని చెప్పారు. చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)