టీడీపీ ఎన్నికల శంఖారావం: ‘కట్టుబట్టలతో వస్తే మోదీ మట్టికొట్టారు’

  • 16 మార్చి 2019
చంద్రబాబు Image copyright chandrababu/fb

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, తెలంగాణ సీఎం కేసీఆర్ తమను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారని, వారి బెదిరింపులకు భయపడమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

తిరుపతిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశం సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ నమ్మక ద్రోహం చేసిందని విమర్శించారు. అందుకే వారిపై తిరుగుబాటు చేస్తున్నామని చెప్పారు. విభజన హామీలు నెరవేర్చలేదనే పార్లమెంట్‌లో అలుపెరగకుండా పోరాడామన్నారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఎన్టీఆర్‌కు తాము వారసులమని, బాంబులు... బులెట్లకు టీడీపీ కార్యకర్తలు భయపడరని అన్నారు. కేంద్రం, కేసీఆర్ బెదిరింపులకు తాము బెదరబోమని చెప్పారు.

పోలవరం నిర్మాణం చేపట్టకుండా కొందరు అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అయినప్పటికీ 67 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. జులైలో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తామని ప్రకటించారు.

కట్టుబట్టలతో హైదరాబాద్ విడిచి వస్తే రాజధాని నిర్మాణానికి సాయం చేయకుండా ఆంధ్రుల ముఖాన మోదీ మట్టిగొట్టారని విమర్శించారు. తెలుగు దేశం నేతలపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారని విమర్శించారు.

‘తెలంగాణలో టీడీపీకి ఏం పని అని కేసీఆర్ అన్నారు. నా దగ్గర పనిచేసిన వ్యక్తి అతను. అతనే అంత విర్రవీగితే పనిచేయించుకున్న నాకు ఎంత ఉండాలి’ అని ప్రశ్నించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

Image copyright Tdp/fb

‘వైసీపీ వస్తే రావణ కాష్టమే’

వివేకానంద రెడ్డి హత్యలో వైసీపీ నేతలు సాక్ష్యాలు చెరిపేసి మానవత్వం లేని మనుషులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తప్పుడు పనులు చేసి వాటిని కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు చేస్తున్నారని అన్నారు. వివేక హత్యకు కారకులైన వారిని కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని తప్పుపట్టారు. కేంద్రంలో వారికి అనుకూల ప్రభుత్వం ఉండటం వల్లే కోడి కత్తి, వివేక హత్య కేసుల్లో సీబీఐ విచారణకు వైసీపీ డిమాండ్ చేస్తోందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం రావణకాష్టంగా మారుతుందని విమర్శించారు.

తెలుగు దేశం పార్టీకి మద్దతిచ్చే వారిని తెలంగాణ ప్రభుత్వం వేధిస్తుందని ఆరోపించారు. ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకుండానే హైదరాబాద్‌లో సేవామిత్ర కార్యాలయంపై సోదాలు చేసిందని అన్నారు. ఏపీ డాటా దొంగిలించి జగన్‌కు ఇచ్చి ఆయనను గెలిపించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఏపీలో ఉన్న ఫ్యాన్‌(వైసీపీ గుర్తు)కు తెలంగాణలో స్విచ్ఛ్ ఉందని, దానికి కరెంట్ దిల్లీలో ఉందని విమర్శించారు.

Image copyright Tdp/fb

150కి పైగాస్థానాలు గెలవాలి

దేశంలో అవినీతి రహిత రాష్ట్రంలో 3వ స్థానంలో ఏపీ ఉందని చంద్రబాబు తెలిపారు. డ్వాక్రా సంఘాలు పెట్టి పొదుపు ఉద్యమాలు నేర్పించానని గుర్తు చేశారు.

రైతులకు సంబంధించి 24,500 కోట్ల రూపాయిల రుణమాఫీ చేశామని చెప్పారు. అన్నదాత సుఖీభవ పేరుతో ఇప్పుడు నేరుగా రైతు ఖాతాలోకే డబ్బులు వచ్చేలా చేస్తున్నామన్నారు. సంక్షేమ కార్యక్రమాలను మూడు రకాలుగా తీసుకొని ముందుకు వెళుతున్నామని తెలిపారు.

వెనుకబడిన అనంతపురం జిల్లాలో కియా మోటార్స్‌ను పరిగెత్తిస్తున్నామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. 2022 నాటికి మూడు అగ్ర రాష్ట్రాలలో ఏపీ ఒకటిగా ఉంటుందని చెప్పారు. సమస్యలను అవకాశాలుగా తీసుకొని ముందుకు వెళుతామని తెలిపారు. ప్రకృతిసేద్యంతో ప్రపంచానికే కేంద్రంగా ఏపీ ఉంటుందని అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)