చక్రం కాదు.. బొంగరమూ తిప్పలేరు: కేసీఆర్ మీద రేవంత్‌రెడ్డి విమర్శలు - ప్రెస్‌రివ్యూ

  • 17 మార్చి 2019
రేవంత్ రెడ్డి Image copyright Revanth reddy anumula/facebook

పదహారు సీట్లు గెలిచి దిల్లీలో చక్రం తిప్పుతానంటున్న సీఎం కేసీఆర్‌ చక్రం కాదు కదా.. బొంగరం కూడా తిప్పలేరని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేసినట్లు 'ఈనాడు' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. మల్కాజిగిరి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా ఆయన్ను అధిష్టానం ప్రకటించడంతో శనివారం కూకట్‌పల్లి నియోజకవర్గంలో ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెరాస 16 సీట్లు గెలిచినా గల్లీలో మాత్రమే చక్రం తిప్పుకోవాలని, దిల్లీలో భాజపా నుంచి మోదీ లేదా కాంగ్రెస్‌ నుంచి రాహుల్‌గాంధీ మాత్రమే ప్రధాని అవుతారన్నారు.

వితండవాదంతో ప్రజలను కేసీఆర్‌ మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షం లేకుంటే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తప్పనిసరిగా విలక్షణ తీర్పునిస్తారన్నారు.

కేసీఆర్‌ పాలన సారా.. కారా.. బేకార్‌లా.. ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నియంతృత్వ పాలన చేసి, రెండోసారి ఎన్నికై అరాచక పాలన చేస్తున్నారని విమర్శించారు.

16 సీట్లు గెలిచే కేసీఆర్‌ దిల్లీలో చక్రం తిప్పితే సర్వేలు చెప్పినట్లు 150 సీట్లు గెలిచే కాంగ్రెస్‌ గోళ్లు గిళ్లుకోవాలా? అని ఎద్దేవా చేశారు. మూకుమ్మడి వలసలు ప్రోత్సహించి క్రమంగా పార్టీలనే తన పార్టీలో కలుపుకొంటే దావూద్‌ ఇబ్రహీం లాంటి నేరస్థుడు సైతం ప్రధాని అయ్యే ప్రమాదం ఉందని విమర్శించారు.

Image copyright ktr/facebook

కేసీఆర్‌ సారథ్యమే దేశానికి దిక్సూచి : కేటీఆర్‌

త్వరలో జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో మొత్తం టీఆర్‌ఎస్‌ ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీని మనమే శాసిద్దామనీ, ఐదేళ్లలో లక్షన్నర కోట్లు తెచ్చుకోగలమనీ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నట్లు ప్రజాశక్తి దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బిజెపిల శకం ముగిసిందని, ఈ రెండు పార్టీలు కలిసినా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని అన్నారు.

ఏ నీళ్లు, నిధులకైతే ప్రత్యేక రాష్ట్రం సాధించామో.. అదే విధంగా జాతీయ నీళ్లు, నిధుల సాధన కోసం ఢిల్లీ రాజకీయల్లో శక్తిని సంపాధించాలంటే మొత్తం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలన్నారు. దేశ ప్రగతికి మోడీ ప్రభుత్వం చేసింది శూన్యమన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి 90 శాతం నిధులిచ్చిన కేంద్రం అదే తెలంగాణలోని కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు నయా పైసా ఇవ్వలేదని ఆరోపించారు. కర్ర ఉన్నోడిదే బర్రె అన్నట్టుగా కేంద్రంలో ఏ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి ఉంటే ఆ రాష్ట్రానికే నిధులు తరలిస్తున్నారనీ, మిగిలిన రాష్ట్రాలను విస్మరిస్తున్నారనీ అన్నారు.

కేసీఆర్‌ సారధ్యమే దేశానికి దిక్సూచి అన్నారు. సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, శాసనమండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

విశాఖ ఏజెన్సీలో పోలీసు కాల్పుల్లో ఇద్దరు గిరిజనుల మృతి

విశాఖ ఏజెన్సీలో పోలీసు కూంబింగ్‌ పార్టీల కాల్పులకు ఇద్దరు గిరిజనులు మృతి చెందారని.. మరో ఇద్దరు పరుగులు తీసి తృటిలో ప్రాణాలను కాపాడుకున్నారని ‘సాక్షి’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. మృతి చెందిన గిరిజనులు మావోయిస్టు పార్టీ పెదబయలు ఏరియా కమిటీ సభ్యులని పోలీసులు ప్రకటించారు. అయితే.. వేటకు వెళ్లిన ఇద్దరిని దారుణంగా తుపాకులతో కాల్చి చంపారని పెదకోడాపల్లి గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెదబయలు మండలంలోని పెదకోడాపల్లి మెట్టవీధికి చెందిన బట్టి భూషణ్‌రావు (50), సిదేరి జమదరి (35) నాటు తుపాకులను వెంటబెట్టుకుని శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి అరనంబయలు కొండ, గంగోడిమెట్ట కొండలపైకి బయల్దేరారు. వారికి సహాయంగా కోడా బొంజుబాబు, సిదేరి రాంబాబు ఉన్నారు.

కుందేళ్లు, ఇతర అడవీ జంతువుల వేట కోసం వెళ్లారు. అయితే వారి వేట సాగకపోవడంతో, అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో గ్రామానికి కాలినడకన బయల్దేరారు. నాటు తుపాకులు కలిగి ఉన్న భూషణ్‌రావు, జమదరి ముందు నడుస్తుండగా, వారి వెనుకన బొంజుబాబు, రాంబాబు వెళ్తున్నారు.

పెదకోడాపల్లి గ్రామానికి సమీపంలోని బురదమామిడి పంట భూముల సమీపంలోకి రాగానే పోలీసు పార్టీలు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ముందు నడుస్తున్న బట్టి భూషణ్‌రావు, సిదేరి జమదరి అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక ఉన్న బొంజుబాబు, రాంబాబు తప్పించుకుని సురక్షితంగా గ్రామానికి చేరుకున్నారు.

అయితే పోలీసులు మాత్రం ఎన్‌కౌంటర్‌ నిజమేనని, సుమారు 20 మంది మావోయిస్టులు సంచరిస్తుండడంతో వారిపై కాల్పులు జరిపామని ప్రకటించారు. కాల్పుల్లో మృతి చెందిన బట్టి భూషణ్‌రావు, సిదేరి జమదరి మావోయిస్టు సభ్యులని పోలీసులు చెప్పడంపై పెదకోడాపల్లి గిరిజనులంతా భగ్గుమన్నారు.

దకోడాపల్లి పంచాయతీలోని గిరిజనులంతా శనివారం మధ్యాహ్నం పాడేరుకు చేరుకుని పోలీసుల తీరుపై నిరసన ప్రదర్శన చేశారు. పాడేరు సబ్‌కలెక్టర్‌ వెంకటేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. పోలీసులు కాల్పులు జరపడంపై న్యాయ విచారణ చేసి, బాధిత గిరిజనుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

Image copyright Getty Images

బ్రిటన్‌ వెళ్లానుకునే భారతీయ విద్యార్థులకు శుభవార్త

బ్రిటన్‌కు వచ్చే విదేశీ విద్యార్థులకు ఆ దేశం తీపి కబురు చెప్పిందని.. బ్రిటన్ ప్రభుత్వం కొత్త వీసా విధానాన్ని ప్రకటించిందని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. చదువుకోవడానికి బ్రిటన్ వచ్చే విద్యార్థులు ఇక్కడే ఉద్యోగాలు వెదుక్కునే అవకాశం కల్పిస్తోంది.

విద్యాభ్యాసం పూర్తికాగానే వెంటనే ఉద్యోగాలు దొరకడం చాలామందికి కష్టంగా ఉంటుంది. అలాంటివారు వీసా గడువు ముగియడంతో దిక్కు తోచని పరిస్థితుల్లో స్వదేశాలకు పయనమవుతున్నారు. అలాంటి వారికి అండగా ఉండాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు వెదుక్కోవడానికి 6 నెలల గడువు ఇవ్వనుంది.

దీని వల్ల తాము ఎంచుకున్న రంగాల్లో విద్యార్థులు అనుభవం సంపాదించడానికి వీలుంటుందని ఇక్కడి అధికారులు అంటున్నారు. యూకేలో విద్యనభ్యసించే విదేశీయుల సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త వీసా విధానాన్ని సృష్టించినట్లు అధికారులు చెప్పారు.

ప్రస్తుతం యూకేలోని వర్సిటీల్లో ఏటా 4.6 లక్షల మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారని, ఈ సంఖ్యను 2030 నాటికి 6 లక్షలకు పెంచడమే తమ లక్ష్యమని వారన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి శతవిధాలా ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు.

బ్రిటన్‌లో చదువుకునే విదేశీ విద్యార్థుల్లో చైనా తర్వాత రెండో స్థానంలో భారత విద్యార్థులే ఉన్నారు. దాంతో ఈ కొత్త వీసా విధానం మరింతమంది భారతీయులను తమ దేశానికి రప్పిస్తుందని ఈ విధానం రూపకర్తలంటున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)