పద్మ అవార్డుల ప్రదానోత్సవం: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని ఆశీర్వదించిన శతాధిక వృద్ధురాలు తిమ్మక్క ఎవరు?

  • 17 మార్చి 2019
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆశీర్వదిస్తున్న తిమ్మక్క Image copyright @rashtrapatibhvn
చిత్రం శీర్షిక రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ నుంచి పద్మ అవార్డు అందుకున్న శతాధిక వృద్ధురాలు తిమ్మక్క.. కోవింద్ తల మీద చేయిపెట్టి ఆశీర్వదించారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం దిల్లీలో పద్మ అవార్డులు ప్రదానం చేస్తున్నారు. కర్ణాటకకు చెందిన శతాధిక వృద్ధురాలు సాలుమరద తిమ్మక్క అవార్డు అందుకున్న తర్వాత.. రాష్ట్రపతి తల మీద చేయిపెట్టి ఆశీర్వదించారు.

రాష్ట్రపతి భవన్‌లోని దర్బారు హాలులో పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ప్రముఖులందరూ ఈ దృశ్యం చూసి పెద్ద ఎత్తున చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.

కర్ణాటకలో ఎనిమిది వేలకు పైగా చెట్లు నాటిన తిమ్మక్క ‘వృక్షమాత’గా ప్రసిద్ధి చెందారు. భారత ప్రభుత్వం ఆమెకు సమాజ సేవ విభాగంలో 2019 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.

తిమ్మక్క వయసు ప్రస్తుతం 107 సంవత్సరాలు. శనివారం జరిగిన పద్మశ్రీ అవార్డుల ప్రదానోత్సవంలో.. దర్బారు మందిరానికి ఆమెను చక్రాల కుర్చీలో తీసుకువచ్చారు.

అయితే.. రాష్ట్రపతి భవన్ సిబ్బంది ఒకరు ఆమెను చేయిపట్టుకుని నడిపిస్తూ రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్లారు. అనంతరం అతడి సహాయం లేకుండానే ఆమె అవార్డు స్వీకరించారు.

ఆమెకు పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేస్తూ కొంత ముందుకు వంగారు. అదే సమయంలో ఆయన తల మీద తిమ్మక్క చేయి పెట్టి ఆశీర్వదించారు.

‘‘పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో భారత ఉత్తమ పౌరులను, అత్యంత అర్హులను గౌరవించటం రాష్ట్రపతి విశేషాధికారం. కానీ ఈ రోజు కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త, ఈ ఏడాది పద్మ అవార్డు గ్రహీతల్లో అత్యధిక వయస్కురాలైన 107 సంవత్సరాల సాలుమరద తిమ్మక్క.. ఈ రోజు నన్ను ఆశీర్వదించటం నన్ను ఎంతో కదిలించింది’’ అంటూ రాష్ట్రపతి ఆ ఫొటోను ట్వీట్ చేస్తూ వ్యాఖ్యానించారు.

Image copyright @rashtrapatibhvn
చిత్రం శీర్షిక తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు

ఈ ఏడాది మొత్తం 112 మందికి పద్మ అవార్డులు ప్రకటించగా.. మార్చి 11వ తేదీన జరిగిన ప్రదానోత్సవంలో రాష్ట్రపతి 47 మందికి అవార్డులు బహూకరించారు.

తాజాగా జరిగిన కార్యక్రమంలో ఇంకో 54 మందికి అవార్డులు ప్రదానం చేశారు. తాజాగా అవార్డులు స్వీకరించిన వారిలో తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి కూడా ఉన్నారు.

జానపద గాయని తీజన్ బాయ్, ఎల్‌అండ్‌టీ (లార్సన్ అండ్ టుబ్రో) సంస్థ చైర్మన్ అనిల్‌కుమార్ నాయక్‌, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, నటుడు మనోజ్ బాజ్‌పాయ్, ఒడిశా టీ కొట్టు యజమాని డి.ప్రకాశరావు తదితరులు కూడా అవార్డులు అందుకున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)