లోక్‌సభ ఎన్నికలు 2019: రైతుల సమస్యలు తీరాలంటే.. రుణాల మాఫీ పథకాలే పరిష్కారమా?- Reality Check

  • 18 మార్చి 2019
రైతు బంధు Image copyright KCR/FB

దేశంలో అనేకమంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. మరి, ప్రభుత్వం వారి రుణాలను మాఫీ చేయాలా? రైతుల సమస్యలకు పరిష్కారం రుణాలు మాఫీ చేయడమేనా?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశంలో రాజకీయ నాయకులతో పాటు, ఇతర వర్గాల్లోనూ దీనిపై చర్చ నడుస్తోంది.

వాదన: పదేపదే రైతు రుణాలు మాఫీ చేసుకుంటూ పోవడం సమస్యకు సరైన పరిష్కారం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంటున్నారు. రుణాలు మాఫీ చేస్తామని చెప్పడం ఎన్నికల ముందు ’’లాలీపాప్" ఇవ్వడం లాంటిదే అని అన్నారు.

తీర్పు: గతంలో అమలు చేసిన రుణ మాఫీ పథకాలు రైతుల పూర్తి సమస్యలను తీర్చలేకపోయాయని గణాంకాలు చెబుతున్నాయి.

గతంలో కేంద్రంతో పాటు, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు రైతు రుణాలను మాఫీ చేశాయి.

2014, 2018 మధ్య కాలంలో 11 రాష్ట్రాలు రుణ మాఫీ ప్రకటించాయి. అందులో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతృత్వంలోని ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఈ పథకాల కోసం రూ. 1.5 లక్షల కోట్లకు పైనే ఖర్చు చేశాయి.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి?

దేశంలో 40 శాతం మంది కార్మికులు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు.

విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలతో పాటు ఇతర పెట్టుబడుల కోసం రైతులు రుణాలు తీసుకుంటున్నారు.

వర్షాభావ పరిస్థితులు, ప్రకృతి విపత్తులు, చీడపీడల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. దాంతో, అప్పులు తీర్చలేని పరిస్థితిలో కొందరు బలన్మరణాలకు పాల్పడుతున్నారు.

గత కొన్ని దశాబ్దాల కాలంలో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలపై రుణ భారం అంతకంతకూ పెరిగిపోతోందని గతేడాది విడుదలైన ఒక నివేదిక పేర్కొంది.

గత కొన్నేళ్లుగా కూలీల ఖర్చులు పెరిగిపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడులు పడిపోవడం, పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లభించకపోవడం వల్ల రైతుల ఆదాయం పడిపోతోంది.

రుణ మాఫీ పరిష్కారమా?

అయితే, రుణ మాఫీ ద్వారా రైతులు ఈ సంక్షోభం నుంచి బయటపడతారన్నది వాస్తవ దూరం.

రైతు ఆత్మహత్యలకు రుణ భారమే ప్రధాన కారణమని స్పష్టంగా చెప్పలేం. ఎందుకంటే, అధిక అప్పులతో సతమతమయ్యే వెనుకబడిన రాష్ట్రాలతో పోల్చితే... వ్యవసాయ రంగం మెరుగైన స్థితిలో ఉన్న ధనిక రాష్ట్రాల్లోనే అన్నదాతల బలవన్మరణాలు ఎక్కవగా నమోదవుతున్నాయి.

సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ప్రకారం, 2014-18 మధ్య కాలంలో మహారాష్ట్రలో 14,034 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 30 శాతానికి పైగా ఆత్మహత్యలు 2017లో రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటించిన తర్వాతే జరిగాయి.

రుణ మాఫీ పథకాల ప్రభావంపై మరికొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి.

ఒక నివేదిక ప్రకారం, 1990లో దేశవ్యాప్తంగా రుణ మాఫీ చేసిన తర్వాత బ్యాంకు రుణాల రికవరీ రేటు తగ్గిపోయింది.

ప్రభుత్వాలు మళ్లీ తమ రుణాలను మాఫీ చేస్తాయేమో అన్న ఆశతో రైతులు బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించేందుకు ఆసక్తి చూపడంలేదని ఆ నివేదిక పేర్కొంది.

ఒక రాష్ట్రంలో లోన్ల మాఫీ ప్రకటించిన తర్వాతి ఏడాదిలో రుణాల రికవరీ రేటు దాదాపు 75 శాతం నుంచి 40 శాతానికి పడిపోయింది.

సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు 2008లోనూ దేశవ్యాప్తంగా రూ. 52,516 కోట్ల రైతు రుణాలు మాఫీ చేశారు.

అయితే, లబ్ధిదారుల ఎంపికలో 22 శాతానికి పైగా పొరపాట్లు జరిగాయని కాగ్ చెప్పింది. కొంతమంది అనర్హులకు కూడా లబ్ధి చేకూరింది, కొందరికేమో అర్హులైనా కూడా సాయం అందలేదు.

మరోవైపు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే ఆ పథకాల ద్వారా ప్రయోజనం కలిగింది. కానీ, ప్రైవేటు వ్యక్తులు, స్నేహితులు, బంధువుల నుంచి లేదా వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకున్నవారికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు.

Image copyright Getty Images

తెలంగాణ 'రైతు బంధు'

రుణ మాఫీ చేసి అప్పుల్లో కూరుకుపోయిన రైతులను గట్టెక్కించాలంటూ కొన్ని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, రుణాలన్నింటీని మాఫీ చేయడం అనేది ఖరీదైన విషయమని నిపుణులు అంటున్నారు.

మాజీ కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ అంచనా ప్రకారం, దేశవ్యాప్తంగా ఇప్పుడు రైతుల రుణాలు మాఫీ చేయాలంటే దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు అవుతుంది.

"ఇతర సంక్షేమ పథకాలకు కేటాయింపులు తగ్గిస్తేనే ఇంత భారీ మొత్తంలో రుణ మాఫీ సాధ్యమవుతుంది" అని ఆయన బీబీసీతో అన్నారు.

రుణాలు మాఫీ చేయడం కంటే, అందుకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 'రైతు బంధు' పథకం లాంటి మార్గాలను ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

Image copyright Getty Images

రైతు బంధు కింద తెలంగాణ ప్రభుత్వం రైతులకు గతేడాది ఎకరాకు ఏటా రూ.8,000 చొప్పున సాయం చేసింది. ఈ ఏడాది నుంచి ఎకరాకు రూ.10,000కు పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవలి ఎన్నికల సమయంలో ప్రకటించారు.

ఈ పథకం కింద ఎలాంటి మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా రైతులకే ప్రయోజనం అందుతోంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.12,000 కోట్లు కేటాయిస్తోంది.

రైతులకు పంటల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ సాయం తోడైతే వారికి అది ఎంతో భరోసా ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాలు కూడా ఈ తరహా పథకాలను ప్రకటించాయి.

కేంద్ర ప్రభుత్వం కూడా ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో చిన్న, సన్నకారు రైతులకు ఏటా రూ.6,000 సాయం అందించే "ప్రధాన మంత్రి కిసాన్ నమ్మాన్ నిధి" పథకాన్ని ప్రకటించింది.

ఈ పథకం కింద తొలి విడతలో ఇప్పటికే కోట్ల మంది లబ్ధిదారులకు నగదు సాయం అందింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)