అనిల్ అంబానీ: ఎరిక్సన్‌కు రూ.462 కోట్లు చెల్లించారు.. గడువు తప్పి ఉంటే జైలుకే

  • 18 మార్చి 2019
రఫేల్ Image copyright Getty Images

స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్ కంపెనీకి చెల్లించాల్సిన రుణం రూ.462 కోట్లను సుప్రీం కోర్టు విధించిన గడువుకు ఒక రోజు ముందే రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్.కామ్) చెల్లించింది.

ఈ మొత్తం తమకు అందిందని ఎరిక్సన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారని వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.

అంతకు ముందు అనిల్ అంబానీ, ఆ కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఫిబ్రవరి 20న సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాల పట్ల యథాలాప వైఖరిని అవలంభించారని నిందించింది.

మరో నాలుగు వారాల్లో (మార్చి 19లోగా) స్వీడన్‌కు చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్‌కు రూ.453 కోట్ల బకాయి చెల్లించాలని, లేకుంటే అనిల్ అంబానీ మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయస్థానం తెలిపింది.

అలాగే.. సుప్రీంకోర్టు న్యాయ సహాయ విభాగానికి అనిల్ అంబానీకి చెందిన మూడు కంపెనీలు కోటి రూపాయల చొప్పున నాలుగు వారాల్లో చెల్లించాలని, లేకుంటే నెల రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆదేశించింది.

కాగా, అంతకు ముందు ఆర్.కామ్ పూచీకత్తుగా పెట్టిన రూ.118 కోట్లను కంపెనీకి తిరిగి ఇచ్చేయాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సూచించింది.

కేసు పూర్వాపరాలు

రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ తన నెట్‌వర్క్‌ కార్యకలాపాలను కొనసాగించేందుకు, విస్తరించేందుకు ఎరిక్‌సన్ కంపెనీతో 2014లో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందానికి సంబంధించి ఆర్.కామ్ తమకు రూ.550 కోట్లు చెల్లించాల్సి ఉందని ఎరిక్‌సన్ గతేడాది సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఎరిక్సన్ సంస్థకు ఆ డబ్బును 120 రోజుల్లో చెల్లించాలని అప్పట్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ను న్యాయస్థానం ఆదేశించింది.

కానీ, ఆ గడువులోగా ఆర్.కామ్ చెల్లించలేకపోయింది. తర్వాత మరో 60 రోజులు గడువును కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. అప్పుడు కూడా ఆర్.కామ్ విఫలమైంది.

అయితే, ఇప్పుడు గడువులోపే తమకు ఆర్.కాం చెల్లించిందని ఎరిక్సన్ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)