లోక్‌సభ ఎన్నికలు 2019: మోదీ హయాంలో దేశ భద్రత పెరిగిందా? -BBC Reality Check

  • సమీహ నెట్టిక్కర
  • బీబీసీ రియాలిటీ చెక్
శ్రీనగర్‌లో పోలీసుల పహారా

ఫొటో సోర్స్, Getty Images

ఎవరి హయాంలో దేశ భద్రత పటిష్టంగా ఉందనే దానిపై లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీలన్నీ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి.

ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ పాలనలో ఉగ్రదాడి ఘటనలు 260% పెరిగాయి, సరిహద్దుల వెంబడి చొరబాట్లు రెట్టింపయ్యాయి అని 2014 వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

బీజేపీ ప్రభుత్వంతో పోలిస్తే తమ హయాంలో నాలుగు రెట్లు ఎక్కువ మంది మిలిటెంట్లు హతమయ్యారని కూడా కాంగ్రెస్ చెబుతోంది.

ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి వస్తున్న మాటలు, ప్రకటనలు, వాటిలోని వాస్తవాలను బీబీసీ రియాలిటీ చెక్ బృందం పరిశీలిస్తోంది.

ఈ ప్రకటనల్లో నిజమెంత?

  • కశ్మీర్‌లో జరిగిన సంఘటనలు
  • ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్లు
  • వివిధ ప్రాంతాల్లోని వామపక్ష తీవ్రవాద ఘటనలు
  • దేశంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన తీవ్రవాద ఘటనలు

కాంగ్రెస్ పార్టీ చెబుతున్న సంఖ్య కేవలం కశ్మీర్ ప్రాంతంలో జరిగిన ఘటనలకు మాత్రమే సంబంధించినదిలా అనిపిస్తోంది. అందువల్ల ముందు ఈ సమాచారంలోని వాస్తవమెంతో పరిశీలిద్దాం.

1980ల చివరి నుంచీ కశ్మీర్లో ఉగ్రవాదులతో సాయుధ పోరు జరుగుతూనే ఉంది. కశ్మీర్ తమకే దక్కుతుందని భారత్, పాకిస్తాన్ రెండూ చెబుతున్నాయి. కానీ కొంతభాగం భారత్ పాలనలో ఉంటే, మరి కొంత భాగంపై పాకిస్తాన్‌ ఆధిపత్యంలో ఉంది.

ఫిబ్రవరిలో పాకిస్తాన్‌లోని మిలిటెంట్ శిబిరాలపై భారత్ వైమానిక దాడులు చేసినట్లు ప్రకటించడం, ఆ తర్వాత తాము కూడా ప్రతిదాడులు చేశామని పాకిస్తాన్ చెప్పడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images

కశ్మీర్‌లో 2013 వరకూ హింసాత్మక ఘటనలు తగ్గుతూ వస్తున్నాయని, ఇటీవల కాలంలో అవి పెరిగాయని ప్రభుత్వ సమాచారమే స్పష్టం చేస్తోంది.

భారత హోంమంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2013లో 170 ఉగ్రవాద ఘటనలు జరగ్గా, 2018లో ఈ సంఖ్య 614. అంటే దాదాపు 260% పెరిగాయి.

ఇది కాంగ్రెస్ పార్టీ చెబుతున్న గణాంకాలకు దాదాపు సరిపోతున్నాయి.

కశ్మీర్‌లో ఎన్ని ఉగ్రదాడి ఘటనలు జరిగాయి?. .  .

అయితే, ప్రస్తుత బీజేపీ పరిపాలనను, గత కాంగ్రెస్ పరిపాలనను ఓసారి పరిశీలిస్తే రెండు ప్రభుత్వాల సమయంలో మిలిటెంట్ చర్యలు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి.

2009-13 మధ్య కాలంలో మొత్తం 1717 ఘటనలు నమోదయ్యాయి. 2014-18 మధ్యలో ఇంతకన్నా కొద్దిగా తక్కువగా 1708 ఘటనలు జరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఇక తమ పరిపాలన సమయంలో బీజేపీ హయాంలో కన్నా ఎక్కువ మంది మిలిటెంట్లు హతమయ్యారని చెబుతున్న కాంగ్రెస్ మాటలను ఓసారి పరిశీలిస్తే...

మీడియాలో వచ్చిన కథనాలు, ప్రభుత్వ గణాంకాల్ని క్రోడీకరించి ఓ స్వతంత్ర ఎన్జీఓ గ్రూప్ 'ది సౌత్ ఏషియన్ టెర్రరిజమ్ పోర్టల్' (ఎస్ఏటీపీ) ఈ సమాచారాన్ని సిద్ధం చేసింది. ()

దీనిలోని వివరాలను బట్టి కాంగ్రెస్ హయాంలో బీజేపీ ప్రభుత్వకాలంలో కన్నా ఎక్కువ మంది మిలిటెంట్లు హతమయ్యారని ఈ సమాచారం ఆధారంగా చేసుకునే కాంగ్రెస్ చెబుతోంది.

కశ్మీర్‍‌లో హింసాత్మక ఘటనల్లో ఎంతమంది మరణించారు?. .  .

హోంమంత్రిత్వ శాఖ ద్వారా విడుదలైన అధికారిక సమాచారం కూడా దీనికి దగ్గరగానే ఉంది. కాకపోతే సంఖ్య కొద్దిగా తక్కువగా ఉంది.

అయితే, ఇక్కడ గమనించాల్సిన అంశం... రెండు పర్యాయాల కాంగ్రెస్ పాలన (2004-13)లో జరిగిన ఘటనలను ఒక్క పర్యాయం బీజేపీ పాలన (2014-18)తో పోల్చి చూపడం. కాంగ్రెస్ ఈ అంశాన్ని విస్మరించింది.

ఒకవేళ గత ఐదేళ్లను, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని చివరి ఐదేళ్లతో పోల్చి చూస్తే బీజేపీ హయాంలోనే ఎక్కువ మంది మిలిటెంట్లు హతమయ్యారనేది ప్రభుత్వ సమాచారాన్ని చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.

చొరబాటు యత్నాలు

మిలిటెంటు గ్రూపులకు చెందినవారు కశ్మీర్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన సంఘటనలను కూడా భారత్ పరిశీలిస్తూ ఉంటుంది.

కశ్మీర్ సరిహద్దులో చొరబాట్లు. .  ఆధారం: హోంమంత్రిత్వ శాఖ సమాచారం.

నియంత్రణ రేఖ వెంబడి 2001-14 మధ్య కాలంలో ప్రతి సంవత్సరం దాదాపు 250 చొరబాటు యత్నాలు జరిగాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ, 2016 నుంచి చాలామంది కశ్మీర్లోకి చొరబడేందుకు ప్రయత్నించినప్పటికీ వాటిలో చాలావరకు భగ్నమయ్యాయి.

దేశంలోని ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి?

ఈశాన్య భారత్‌లో ఎన్నో దశాబ్దాలుగా వేర్పాటువాద ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. స్థానికంగా తమకు స్వతంత్ర ప్రతిపత్తి, స్వాతంత్ర్యం కావాలంటూ ఎన్నో గ్రూపులు పోరాడుతూనే ఉన్నాయి.

కానీ, 2012లో తప్పించి మిగిలిన అన్ని సంవత్సరాల్లో ఈ హింసాత్మక ఘటనల సంఖ్య తగ్గుతూనే ఉందని నివేదికలు చెబుతున్నాయి. పౌరులు, భద్రతాదళ సభ్యుల మరణాలు కూడా 2015 నుంచి గణనీయంగా తగ్గాయని ఈ సమాచారం స్పష్టం చేస్తోంది.

ఈ ప్రాంతంలో 1997 నుంచి పరిశీలిస్తే... 2017లో అత్యల్ప సంఖ్యలో తిరుగుబాటు ఘటనలు నమోదయ్యాయని హోంమంత్రిత్వ శాఖ చెబుతోంది.

ఫొటో సోర్స్, AFP

మావోయిస్టులు క్రియాశీలంగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో వారు కమ్యూనిస్టు పాలనకోసం, గిరిజనులు, పేదలకు హక్కులు, అధికారాల కోసం పోరాడుతున్నారు.

ఇటీవల కాలంలో వామపక్ష తీవ్రవాద ఘటనలు తగ్గాయని బీజేపీ చెబుతోంది. 2014-17 మధ్యలో 3380 మంది మావోయిస్టులు లొంగిపోయారని అంటోంది. ఈ విషయాన్ని గత సంవత్సరం మోదీ ఓ ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించారు. కానీ ఎస్ఏటీపీ సమాచారం ప్రకారం ఈ సంఖ్య 4000 పైమాటే.

2014 నుంచి 2018 నవంబరు 15 వరకూ 3286 మంది మావోయిస్టులు లొంగిపోయారని ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. (ఆధారం: http://164.100.47.190/loksabhaquestions/annex/16/AS5.pdf)

వామపక్ష తీవ్రవాద ఘటనలు కూడా 2014 నుంచి తగ్గుతూ వస్తున్నాయి. కానీ ఈ తగ్గుదల 2011 నుంచి, అంటే కాంగ్రెస్ హయాం నుంచే కొనసాగుతోందని హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

అంటే, గత కొన్నేళ్లుగా కశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు పెరుగుతూ ఉంటే ఈశాన్య భారతంలో తిరుగుబాట్లు, వామపక్ష తీవ్రవాద ఘటనలు తగ్గుముఖం పట్టాయి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)