తెలంగాణలో ఒక్క లోక్‌సభ స్థానానికి 480 మంది అభ్యర్థులు

  • 20 మార్చి 2019
దుశ్చర్ల సత్యనారాయణ Image copyright DUCHARLA/FB
చిత్రం శీర్షిక నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య గురించి నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి దుశ్చర్ల సత్యనారాయణ వివరించారు

మీకు నచ్చిన అభ్యర్థికి ఓటేయాలనుకుంటే 50 పేజీలను తిరిగేయాలి... 480 మంది అభ్యర్థులను పరిశీలించాలి అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.

1996 ఎన్నికల్లో నల్లగొండ ఓటర్లకు ఇదే పరిస్థితి ఎదురైంది.

బ్యాలెట్ కేంద్రంగా జల ఉద్యమ కారులు చేపట్టిన ఓ వినూత్న నిరసన వల్ల అక్కడి ఓటర్లు తన అభ్యర్థిని ఎన్నుకోడానికి కాస్త కష్టపడాల్సి వచ్చింది.

అయితే, ఈ ఘటన దేశం మొత్తాన్ని ఆకర్షించింది. చివరకు ఎన్నికల సంఘం సంస్కరణలు తీసుకొచ్చేలా చేసింది.

Image copyright Getty Images

ఓటు వైపు వచ్చిన నీటి పోరాటం

ఒకే పార్లమెంట్ స్థానం నుంచి 480 మంది అభ్యర్థులు బరిలోకి దిగడానికి కారణం కూడా ఒక్కటే.. అదే నీటి సమస్య.

నల్లగొండ జిల్లా నుంచే జీవ నదులు ప్రవహిస్తున్నా నీటి కేటాయింపులో మాత్రం వివక్ష ఎదురవుతోందని జల ఉద్యమకారులు భావించారు. కృష్ణా నది జలాల్లో 76 శాతం వాటా తమకు రావాల్సిన ఉన్నా రాజకీయాల కారణంగా అది దక్కకుండాపోయిందని పోరాటం ప్రారంభించారు.

దుశ్చర్ల సత్యనారాయణ వంటి ఉద్యమకారులు 1980 నుంచే జలసాధన సమితిని స్థాపించి నీటివాటా కోసం పోరుబాట పట్టారు.

నల్లగొండకు దక్కాల్సిన న్యాయమైన నీటి వాటాకు, సాగు- తాగు నీటి కోసమే ఆనాడు ఎన్నికల్లో పోటీ చేశామని జలసాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ బీబీసీ తెలుగుకి తెలిపారు.

''1996లో మూకుమ్మడి నామినేషన్లు వేసి ఓ వినూత్న ఆందోళన చేపట్టాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగానే దాదాపు 682 మందితో నామినేషన్ వేయించాం'' అని ఆయన చెప్పారు.

‘‘వాస్తవానికి ఈ నిర్ణయాన్ని 1994 డిసెంబర్‌లోనే తీసుకున్నాం. అప్పుడు కార్యరూపం దాల్చలేదు. దీంతో 1996లో నల్లగొండ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అయ్యాం. నామినేష్లు వేసిన వారిలో ఎక్కువ మంది పేదలు, మహిళలే'' అని ఆయన వివరించారు.

ఎన్నికలు వాయిదా

1996లో 537 మంది నామినేషన్లు వేశారు. ఇందులో 66 మంది మహిళలు ఉన్నారు. అయితే, 22 మంది తర్వాత తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 35 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 480 మందికి పోటీ చేసే అవకాశం కలిగింది.

అయితే, 480 మంది బరిలో ఉండటంతో ఎన్నికల సంఘం అక్కడ పోలింగ్‌పై పునరాలోచనలో పడింది. అంతమందితో పోలింగ్ నిర్వహించలేమని భావించి ఏప్రిల్‌లో జరగాల్సిన ఎన్నికలను ఆ ఒక్క చోట మే 27కు వాయిదా వేసింది. పోలింగ్ కోసం ప్రత్యేకంగా భారీ బ్యాలెట్ బాక్సును రూపొందించింది. 480 మందికి గుర్తులు కూడా కేటాయించింది.

ఎవరు గెలిచారంటే..

ఈ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులో 331వ నంబర్‌లో ఉన్న సీపీఐ అభ్యర్థి ధర్మభిక్షం తన సమీప అభ్యర్థి బీజేపీకి చెందిన నల్లు ఇద్రాసేన రెడ్డిపై 71వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

చిత్రం శీర్షిక నల్లగొండలోని ఫ్లోరైడ్ బాధితుడు

అధికారం కోసం కాదు పరిష్కారం కోసం’

అధికారం చేపట్టాలనే కోరికతో తమ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయలేదని కేవలం తమ సమస్యలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి అవగాహన కల్పించాలని మూకుమ్మడిగా పోటీకి దిగామని దుశ్చర్ల చెప్పారు.

''న్యాయమైన నీటి వాటా, ఫ్లోరైడ్ రహిత నల్లగొండ కోసమే ఎన్నో ఉద్యమాలు చేశాం. లక్ష మందితో ప్రధానికి పోస్టుకార్డుల పంపిణీ, వేలాది మందితో పాదయాత్రలు చేశాం. ఫ్లోరైడ్ బాధితులతో దిల్లీకి వెళ్లి నాటి ప్రధాని వాజ్‌పేయిని కలిశాం. జంతర్ మంతర్‌లో ఆందోళనలు చేశాం అయినా రాజకీయ నాయకుల్లో ఎలాంటి మార్పు రాలేదు. మా కష్టాలను వారి దృష్టికి తీసుకొచ్చేందుకే ఎన్నికల్లో పోటీకి దిగాం'' అని ఆయన పేర్కొన్నారు.

అప్పటి ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో 50 పేజీల బ్యాలెట్ పేపర్‌ను, ఐదు అడుగులకు మించిన బ్యాలెట్ బాక్సును ఎన్నికల సంఘం ప్రత్యేకంగా తయారు చేసిందని దుశ్చర్ల తెలిపారు.

ఎన్నికల సంస్కరణలు

ప్రజా ప్రాతినిథ్యచట్టం 1951 లోని సెక్షన్ 34(1)(ఏ) ప్రకారం లోక్ సభకు పోటీ చేసే జనరల్ అభ్యర్థులు పూచికత్తుగా రూ. 500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే రూ. 250 ఎన్నికల సంఘానికి సమర్పించాలి.

నల్లగొండ ఘటన తర్వాత ఎన్నికల సంఘం పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కొత్తగా సంస్కరణలు తీసుకొచ్చింది. డిపాజిట్ రుసుంను భారీగా పెంచింది.

లోక్‌సభ, రాజ్యసభకు పోటీ చేసే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.25,000 , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.10 వేలు సమర్పించేలా నిబంధనలు మార్చింది.

నల్లగొండ బాటలో నిజమాబాద్ రైతులు

ఇప్పటి వరకు ఒక పార్లమెంట్ స్థానం నుంచి అత్యధిక మంది అభ్యర్థులు పోటీ చేసిన రికార్డు నల్లగొండ పేరిటే ఉంది. ఆ తర్వాత స్థానం కర్నాటకలోని బెల్గాం నియోజకవర్గానిది. ఇక్కడ 1996లో 456 మంది పోటీ చేశారు. ఇదే సంవత్సరం తూర్పు దిల్లీ నియోజకవర్గం నుంచి 122 మంది బరిలోకి దిగారు.

ఇప్పుడు నిజామాబాద్ జిల్లా రైతులు కూడా ఇదే తరహాలో పోరాడాలనుకుంటున్నారు. తమ సమస్యలను పరిష్కరించనందుకు నిరసనగా నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి వెయ్యి మందిపైగా అభ్యర్థులను నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు