ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: వీళ్లు ఒక్కసారి గెలిచి ఏడేళ్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు

టంగుటూరి ప్రకాశం పంతులు

ఫొటో సోర్స్, rajyasabha

ఫొటో క్యాప్షన్,

ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు

ఆంధ్ర రాష్ట్రంలో తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు, ప్రస్తుత ఎన్నికలకు మధ్య తేడా ఏంటి?

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత దేశంలో తొలిసారిగా 1951-52లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

అప్పుడు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగంగా ఉన్నాయి.

1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.

కొత్త రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరు ప్రకాశం పంతులు నియమితులయ్యారు.

అయితే, కొన్నాళ్లకే ప్రకాశం పంతులు పాలనను మిత్రపక్షాలు వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నాయి.

అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టాయి. ఆ తీర్మానం నెగ్గడంతో 14 నెలలు కూడా గడవకముందే ప్రభుత్వం పడిపోయింది.

దాంతో, రాష్ట్రంలో కొన్ని నెలల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగిన తర్వాత 1955 ఫిబ్రవరిలో మధ్యంతర ఎన్నికలు జరిగాయి.

ఫొటో సోర్స్, PottiSriramuluMemorial/AmarajeeviSamaraGaatha

ఫొటో క్యాప్షన్,

మద్రాస్, ఆంధ్రా కలిసి ఉన్న మ్యాపు

167 శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. అందులో 29 నియోజకవర్గాలకు ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించేవారు. అంటే, మొత్తం 196 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగాయన్నమాట.

ఆ ఎన్నికల్లో 581 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.

రాష్ట్రంలో 1.13 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 60.14 శాతం పోలింగ్ నమోదైంది.

సీపీఐ, కాంగ్రెస్‌లు ప్రధానంగా పోటీపడ్డాయి. కాంగ్రెస్ 142 స్థానాల్లో పోటీ చేసి 119 చోట్ల గెలుపొందింది.

170 మంది స్వతంత్రులు బరిలో నిలవగా, 22 మంది విజయం సాధించారు.

జయప్రకాశ్ నారాయణ్ స్థాపించిన ప్రజా సోషలిస్టు పార్టీ 45 చోట్ల అభ్యర్థులను నిలపగా, 13 మంది గెలుపొందారు.

అత్యల్పంగా 34 ఓట్ల (0.11 శాతం) తేడాతో పీపీ షేక్ మొహమ్మద్ నిజామి మీద పీఎస్‌పీ అభ్యర్థి జి. బూసన్న గెలుపొందారు.

నిజామీకి 12,973 ఓట్లు పడగా, బూసన్నకు 13,007 ఓట్లు పోలయ్యాయి.

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఒకే అభ్యర్థి టీఎన్ వెంకటసుబ్బయ్య పోటీ చేశారు.

సర్వేపల్లి నుంచి పోటీ చేసి గెలిచిన బెజవాడ గోపాల రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.

ఫొటో సోర్స్, upgovernor.gov.in

ఫొటో క్యాప్షన్,

బెజవాడ గోపాల్ రెడ్డి

నిజానికి ఆ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల పదవీకాలం 1960 వరకే కొనసాగాలి. కానీ, 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలోని తెలంగాణ ప్రాంత శాసనసభ్యుల పదవీ కాలం 1962 వరకు ఉండడంతో (తెలంగాణ ప్రాంతంలో 1957లో ఎన్నికలు జరిగాయి) ఆంధ్ర ప్రాంతంలోని ఎమ్మెల్యేల పదవీకాలం రెండేళ్లు పొడిగించారు.

అంటే, వారు ఏడేళ్లు ఎమ్మెల్యేలుగా కొనసాగారు.

నాటి అనుభవం

1955 ఎన్నికల్లో ఓటు వేసిన విశాఖపట్నానికి చెందిన సుశీల అప్పటి అనుభవాలను బీబీసీ తెలుగుతో పంచుకున్నారు.

"ఇప్పటిలా నాయకులు ఓటర్లను డబ్బులు, మద్యం సీసాలతో ప్రలోభాలు పెట్టేవారు కాదు.

చాలా సాదాసీదాగా ప్రచారం చేసేవారు. నాయకులు ఇంటింటికీ వచ్చి తమకు ఓటు వేయాలని కోరేవారు.

ఇంత హడావుడి ఉండేది కాదు. నాయకులు చాలా తక్కువ ఖర్చు చేసేవారు. సైకిళ్లకు జెండాలు కట్టుకుని తిరుగుతూ ప్రచారం చేసేవారు.

కొద్ది మంది మాత్రమే జీపుల్లో కనిపించేవారు. ఓట్లు వేసేందుకు డబ్బాలు పెట్టేవారు.

కాగితం (బ్యాలెట్ పేపర్) మీద నచ్చిన అభ్యర్థి మీద చుక్క పెట్టి ఆ డబ్బాలో వేసేవాళ్లం" అని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)