లోక్‌సభ ఎన్నికలు 2019: గంగా మైదానంలో ‘హిందుత్వ’ పరిస్థితి ఏమిటి?

  • 21 మార్చి 2019
వారణాసి

వచ్చే నెలలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అందరి చూపు గంగా మైదానంలోని మూడు ఉత్తరాది రాష్ట్రాలపై ఉంది. ఉత్తర్ ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్... ఈ మూడు రాష్ట్రాలు అధికార బీజేపీకి ఎంత కీలకమో, విపక్ష పార్టీలకు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే 160 మందిపైగా ఎంపీలు ఎన్నికయ్యేది ఈ మూడు రాష్ట్రాల నుంచే!

అంతేకాదు, ఈ రాష్ట్రాల్లో గత కొద్ది సంవత్సరాలుగా హిందూ జాతీయవాదం బాగా పెరగటమే కాకుండా, చాలా సార్లు అది హింసాత్మకంగా కూడా మారింది. ఎన్నికల వేళ ఈ మూడు రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేసేందుకు బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ్ నాలుగు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు.

2014 లోక్‌సభ ఎన్నికలు… హిందుత్వ విధానాల పునాదిపై నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అధికార పీఠంపైకి దూసుకొచ్చింది. దాంతో 1992లో బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత మూగబోయిన కొన్ని గొంతుకలకు కొత్త ఊపిరి లభించినట్టయింది.

హిందుత్వ భావజాలం, విశ్వాసాల ముసుగులో జరిగిన హింసాత్మక ఘటనలు చాలా వివాదాస్పదమయ్యాయి. ఆవులను అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలతో చాలా మంది రోడ్ల మీదకు వచ్చారు.

గోవధపై నిషేధం విధించాలని పట్టుబడుతున్న సమూహాల ఆగ్రహానికి ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక పోలీసు అధికారి సైతం ప్రాణాలు కోల్పోయారు.

హిందువుల పరిస్థితి ప్రమాదంలో పడిందా?

ఆవులకు సంబంధించిన హింసాత్మక ఘటనలు 2015 నుంచి బాగా పెరిగిపోయాయని ఇండియా స్పెండ్ గణాంకాలు చెబుతున్నాయి.

అదే సమయంలో కోట్లాది మంది హిందువులు పవిత్రంగా భావించే గంగానదిని, భారతీయ సంస్కృతిని, ఆవులను కాపాడాలన్న నినాదాలు బలం పుంజుకున్నాయి. భారత్‌లో హిందువుల ఉనికి నిజంగానే ప్రమాదంలో పడిందనే ప్రచారాన్ని కూడా చాలా మంది నమ్మసాగారు.

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionవీడియో: గంగా మైదానంలో ‘హిందూత్వ’ పరిస్థితి ఏమిటి

''బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనం మరింత ఎక్కువ సంఖ్యలో హిందుత్వ విధానాల పట్ల ఆకర్షితులవుతున్నారు. మునుపటి ప్రభుత్వాలన్నీ దేశంలోని అత్యధిక సంఖ్యాకులైన హిందువులను ఏదో విధంగా అణచివెయ్యాలనే చూశాయి. వాళ్లొక వివాదాస్పద చట్టాన్ని కూడా తేవాలని చూశారు. ఆ చట్టం హిందువులను తమ సొంత దేశంలోనే శరణార్థులుగా మార్చగలిగేది'' అని వారణాసికి చెందిన గౌరవ్ ప్రకాష్ అభిప్రాయపడ్డారు.

పవిత్రమైన ఆవులను కాపాడాలనే పేరుతో కొత్త చట్టాలు, పన్నులు ముందుకొచ్చాయి. పాలక బీజేపీ ప్రభుత్వాలు ఫైజాబాద్, అలహాబాద్ వంటి నగరాలకున్న ముస్లిం పేర్లను తొలగించి హిందూ పేర్లు పెట్టడం పట్ల కూడా చాలా చోట్ల నిరసనలు వ్యక్తమయ్యాయి.

''ఒక నగరానికి ఉండే మౌలిక స్వభావం ఎప్పుడూ మారకూడదు. నిజానికి అది మరింత అభివృద్ధి చెందాలి. ఉదాహరణకు నేను నా పేరును ‘ఎక్స్‌వైజెడ్’ గా మార్చుకున్నాననుకోండి. దాంతో వచ్చే మార్పేంటి? పేరులో మార్పు ద్వారా ముఖాన్ని మార్చకోలేం కదా. మీకు నిజంగానే పట్టింపు ఉంటే ఇతర అంశాల్లో మార్పు చేయండి'' అని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన జానపద గాయని మంజు నార్యన్ అన్నారు.

మితవాద భావజాలంలో ఇటీవల వచ్చిన ఊపుతో ఇప్పటి వరకు సమాజంలో ఒక మూలన ఉంటూ వస్తున్న శక్తులకు బలం చేకూరినట్టయ్యింది.

చాలా చోట్ల మతపరమైన ఊరేగింపులు హింసకు దారితీయగా, ఘర్షణలను రెచ్చగొట్టేందుకు వాటిని వాడుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. బిహార్‌కు చెందిన ఈ నిరుపేద ఆంబులెన్స్ డ్రైవర్ తన దారిన తాను వెళ్తుండగా ఇలాంటి ఘర్షణలో చిక్కుకుపోయారు. ఇక ఆయన జీవితాంతం వైకల్యంతో గడపాల్సిందే.

''కోపోద్రిక్తులైన గుంపులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటున్నాయి. అప్పటికే నేను దాదాపు మా ఇంటి పక్కన ఉండే వీధి వరకు చేరుకున్నాను. కొద్ది నిమిషాల్లో నేను ఇంట్లోకి చేరుకునే వాణ్నే. కానీ అలా జరగలేదు. ఒక బుల్లెట్ నా పేగుల్ని చీల్చుకుంటూ వెళ్లింది. నేనక్కడే పడిపోయాను'' అని మొహమ్మద్ నయీమ్ అన్నారు.

ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటలా ఉన్న తూర్పు ప్రాంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ లో కూడా మతహింసకు సంబంధించిన ఘటనలు బాగా పెరిగాయి.

బంగ్లాదేశ్ సరిహద్దులో నిస్త్రాణంగా ఉన్నట్టు కనిపించే మాల్దా నగరం ఇలాంటి ఘర్షణలకు వేదికయ్యింది. అయితే, కొందరు బాధితులు కూడా దీని పట్ల గర్వపడుతున్నారు.

''నా కాలికి బుల్లెట్ తగులుతుందని నేననుకోలేదు. నేను హిందువును కాబట్టి మా ఆలయాన్ని కాపాడటానికి ప్రయత్నించడమే నేను చేసిన తప్పు. ఎవరైనా దాన్ని కూలగొడితే హిందువునై ఉండి ఏమీ చెయ్యలేకపోతే ఎలా సమర్థించుకోగలను? పవిత్రమైన ఆలయాన్ని కాపాడే క్రమంలో నా ప్రాణాలు పోయినా పర్వాలేదు'' అని కాళీచౌక్-మాల్దాకు చెందిన తన్మయ్ అన్నారు.

''పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ శిబారాలు 2000 వరకు ఉన్నాయి. వీటిని రోజూ నడిపిస్తుంటారు. వీటిలో పాల్గొనేవారి సంఖ్య పెరిగిపోతోంది. మొత్తం ఉత్తర భారతం అంతా చూసినట్టయితే ఈ శిబిరాల సంఖ్య 10 వేలకు పైగానే ఉండొచ్చు. ఇటీవల మితవాద హిందూ జాతీయవాదం బాగా పెరిగిపోవటంలో ఈ శిబిరాలు అన్ని రకాలుగా ఉపయోగపడ్డాయని చాలా మంది భావిస్తారు'' అని బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ అన్నారు.

''ఎన్నికలు సమీపించాయి. ప్రజలకు ఎన్నో సమస్యలున్నాయి. గంగామైదానం వెంట నా ప్రయాణంలో వేర్వేరు రాజకీయాలకు సంబంధించిన బలమైన ధోరణుల్ని గమనించాను. అయితే, వీటిలో ఏ ధోరణులకు ఓటర్లు పట్టం గడతారో కాలమే నిర్ణయించాలి'' అని నితిన్ శ్రీవాస్తవ వివరించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం