లోక్‌సభ ఎన్నికలు 2019: చంద్రశేఖర్ ఆజాద్: మీసం మెలేసి మోదీని సవాల్ చేస్తున్న ఈ దళిత నేత ఎవరు?

  • 22 మార్చి 2019
చంద్రశేఖర్ ఆజాద్
చిత్రం శీర్షిక దేశంలో దళితుల సరికొత్త నాయకుడిగా ఎదిగిన చంద్రశేఖర్ ఆజాద్

నూరు కోట్ల మందికి పైగా జనం ఉన్న దేశంలో ఒక గళాన్ని బలంగా వినిపించటం చాలా కష్టం.

కానీ, ఒక యువకుడు... భారతదేశంలో అత్యంత వెనుకబడిన కులాల వారిగా పరిగణించే దళితుల (గతంలో అంటరానివారు) నుంచి వచ్చిన చరిష్మా గల యువ నాయకుడు ఈ ఎన్నికల్లో తన స్వరం వినిపించాలని ప్రయత్నిస్తున్నారు.

భారతదేశ శక్తిమంతమైన ప్రధాని నరేంద్రమోదీతో, ఆయన ఇలాకాలోనే తలపడుతున్నారు చంద్రశేఖర్ ఆజాద్. సీనియర్ రాజకీయ నాయకుడు మోదీని ఆయన సొంత నియోజకవర్గం వారణాసిలో సవాల్ చేస్తున్నాడు. ఇది బైబిల్‌లో వర్ణించిన డేవిడ్ వర్సెస్ గోలియాత్ పోరాటాన్ని తలపిస్తోంది.

నిజానికి, వారణాసి నుంచి 2014లో 3 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచిన మోదీకి ఆజాద్ గట్టి పోటీనిచ్చే పరిస్థితి లేదు. అయితే, ఇక్కడ ఆజాద్ లక్ష్యం గెలవడం కాదన్నది స్పష్టం. మోదీ మీద పోటీ చేయటం ద్వారా తన గొంతు వినిపించే అవకాశాన్ని దక్కించుకోవడం ఆయనకు ఆయనకు ముఖ్యం.

ఈ ఎన్నికలను మోదీకి ఒక రిఫరెండం అని కొందరు భావిస్తున్నారు. ఒక వర్గం వారిని సమీకరించే నాయకుడిగా మోదీని చాలా మంది ఆరాధిస్తారు. అదే సమయంలో దేశంలో విభజన సృష్టిస్తున్నారని ఆయనని నిందించే వాళ్లూ ఉన్నారు.

చిత్రం శీర్షిక మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని దళితులకు ఆజాద్ పిలుపునిచ్చారు

దళిత సంస్థ అయిన భీమ్ ఆర్మీ నాయకుడు ఆజాద్. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయబోతున్నారు.

భారతదేశపు సంకుచిత కుల వ్యవస్థలో అట్టడుగు కులాలైన దళితులకు చిరకాలంగా పౌర స్వాతంత్ర్యం, గౌరవమర్యాదలు నిరాకరించారు. ఆ వర్గం నుంచి ఆజాద్ గత మూడేళ్లలో ఓ ప్రముఖ నాయకుడిగా ఆవిర్భవించారు.

రాజకీయ నాయకుడిగా మారిన ఈ యువ న్యాయవాది గత శుక్రవారం నాడు రాజధాని దిల్లీలో వేలాది మంది మద్దతుదారులతో భారీ సభ నిర్వహించటం ద్వారా మోదీ వాకిటి ముందు చాలెంజ్ విసిరారు.

ఆయన, కారు పార్లమెంటు స్ట్రీట్‌కు చేరుకోగానే... ఆయన మద్దతుదారులు పార్టీ నీలి రంగు జెండాను పైకెత్తి ''జై భీమ్'' అంటూ నినాదాలు చేశారు. భీమ్ అంటే, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, దళిత నాయకుడు భీమ్‌రావ్ అంబేడ్కర్.

చిత్రం శీర్షిక ఆజాద్‌ను చూడటానికి తాము ఐదు గంటలు పైగా వేచివున్నామని ఆయన మద్దతుదారులు చెప్పారు

తెల్లవారటంతోనే జనం పోగవటం మొదలైంది. ఆజాద్‌ను చూడటానికి తాము ఐదు గంటల ముందు నుంచీ నిరీక్షిస్తున్నామని చాలా మంది నాతో చెప్పారు.

ఆజాద్ కారు నుంచి దిగగానే, యువకులు ఆయనను చుట్టుముట్టారు. ఆయనతో కరచాలనం చేయటానికి, సెల్ఫీ తీసుకోవటానికి చాలా మంది ప్రయత్నించారు.

అయితే, ఆయన దిల్లీకి రావటానికి ముందు ఓ హైడ్రామా చోటుచేసుకుంది. గతం వారం ఆరంభంలో ఆయన తన సొంత పట్టణం ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్ నుంచి మోటార్‌సైకిళ్లతో భారీ ప్రదర్శనగా దిల్లీకి బయలుదేరారు. కానీ అన్ని బైకులతో వెళ్లటానికి ఆయనకు అనుమతి లేదంటూ పోలీసులు ఆజాద్‌ను ఆపివేశారు.

తమకు అనుమతి ఉందని ఆజాద్ పట్టుపట్టారు. కానీ, ఆ అనుమతిని ఆయనకు సమాచారం ఇవ్వకుండానే పోలీసులు ఉపసంహరించారు.

ఆ సందర్భంగా జరిగిన తోపులాటలో ఆజాద్ అనారోగ్యానికి గురయ్యారు. ఆ మరుసటి రెండు రోజులూ ఆస్పత్రిలో గ్లూకోజ్ తీసుకుంటూ గడిపారు. శుక్రవారం దిల్లీకి వచ్చినప్పుడు ఆయన ఇంకా అనారోగ్యంగానే ఉన్నట్లు కనిపించారు. సహచరుల సాయంతో వేదిక మీదకి వచ్చారు.

చిత్రం శీర్షిక కొందరు మద్దతుదారులు ఆజాద్‌ను దళిత నాయకుడు బి.ఆర్.అంబేడ్కర్‌తో పోల్చుతున్నారు

మద్దతుదారులు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేస్తుండగా.. ప్రధానమంత్రికి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటువేయాలని 20 కోట్ల మంది దళితులకు ఆయన పిలుపునిచ్చారు.

''నేను బనారస్ (వారణాసి) వెళుతున్నాను. ఆయనను (నరేంద్ర మోదీని) ఓడించటానికి నాకు మీ మద్దతు అవసరం. నేను అక్కడికి వెళ్లటానికి కారణం, ఆయన దళిత వ్యతిరేకి కావటమే. అందుకు ఆయన శిక్ష అనుభవించక తప్పదని ఆయన తెలుసుకోవాలి'' అని ఆజాద్ చెప్పారు.

''మనం కలసికట్టుగా భారతదేశ భవిష్యత్తును లిఖిస్తాం'' అని ప్రకటించారు.

ఆజాద్ అంతకుముందు దిల్లీ వచ్చినపుడు ఒకసారి నేను కూడా ఆయనను కలిశాను. ''మోదీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద అత్యాచారాలు పెరిగిపోయాయి. మేం ఆయనను మళ్లీ ఎన్నుకోవటం అవివేకం అవుతుంది'' అని ఆయన నాతో వ్యాఖ్యానించారు.

ప్రధానమంత్రికి వాస్తవికతతో సంబంధాలు తెగిపోయాయి. అత్యాచారానికి పాల్పడ్డ వారిని మూడు రోజుల్లో ఉరితీయటం జరిగిందంటూ ''అబద్ధాలు'' చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం అధికారంలో ఉంది.

''ఒక దళిత మహిళ అత్యాచారానికి గురైతే పోలీసులు 40 రోజుల పాటు ఆమె ఫిర్యాదును కూడా నమోదు చేయరు'' అన్నారు. ''మోదీ మరో దేశంలో నివశిస్తున్నారన్నది స్పష్టం'' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

చిత్రం శీర్షిక కుల అణచివేత మీద పోరాటానికి ఆజాద్ తన భీమ్ ఆర్మీని స్థాపించారు

ఆజాద్ రాజకీయ మూలాలు తన కుటుంబం, తన కులం వారు ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న ''రోజు వారీ కుల వివక్ష''లో ఉన్నాయి.

మంచి నీరు తాగినందుకు, బల్లలు శుభ్రం చేయనందుకు దళిత బాలురను తరచుగా కొడుతున్న ఒక కాలేజీలో కుల అణచివేత మీద పోరాటం కోసం 2015లో ఆయన భీమ్ ఆర్మీని స్థాపించారు.

రెండేళ్ల కిందట ఆజాద్ సొంత పట్టణం షహరాన్‌పూర్‌లో దళితులు - అగ్రకుల ఠాకూర్ల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగినపుడు భీమ్ ఆర్మీ ప్రచారంలోకి వచ్చింది.

ఆజాద్‌ను కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్ చేశారు. ఆయన దాదాపు 16 నెలల పాటు జైలులో గడిపారు. జైలులో ఉండటం వల్ల ఆయన ప్రజాదరణ తరిగిపోలేదు. నిజానికి ఆయన సమాజానికి ఆయనను మరింత ఆప్తుడిని చేసింది.

హింస మీద తనకు నమ్మకం లేదని ఆజాద్ అంటారు. కానీ, ఇండియాలో ఓ ''అప్రకటిత అత్యవసర పరిస్థితి'' ఉందని, దానిపై పోరాడి తీరాలని పేర్కొన్నారు.

చిత్రం శీర్షిక ఆజాద్ రాజకీయాల మూలాలు దళితుడిగా తాను ఎదుర్కొన్న వివక్షలో ఉన్నాయి

''మేం శాంతినే నమ్ముతాం. కానీ మేం పిరికివాళ్లం కాదు. చెప్పులు ఎలా కుట్టాలో మాకు తెలుసు. వాటితో ఎలా కొట్టాలో కూడా మాకు తెలుసు'' అని చెప్పారు.

దళితులకు సంప్రదాయంగా కేటాయించిన కులపరమైన పాత్రలను, దానితో పాటు ఉండే సంకేతాలను నిరంతరం సవాల్ చేస్తుండటం ఆయనను ఆ ప్రజలకు దగ్గర చేస్తోంది.

ఓ గ్రామం వెలుపల ''ది గ్రేట్ చమార్'' అని రాసిన ఒక బోర్డు పక్కన నిలబడివున్న అతడి ఫొటోతో.. ఆజాద్ మొదటిసారి ప్రజల దృష్టిని ఆకర్షించారు. జంతువుల చర్మంతో పనిచేసే దళితులను తక్కువగా వర్ణించి చెప్పటానికి ఉపయోగించే పదం చమార్.

ఆ బోర్డు ద్వారా ఆ దూషణను ఒక గౌరవంగా మార్చేశారాయన.

ఫొటోల్లో ఆయన తరచుగా తన మీసం మెలివేస్తున్నట్లు, చలువ కళ్లద్దాలు ధరించి, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్ నడుపుతూ కనిపిస్తుంటారు.

ఇది అతడి సమాజంలో యువకులు, ఔత్సాహికులకు ఆయనను చాలా సన్నిహితుడిని చేసింది. ఆయనను ఒక ఫ్యాషన్ ఐకాన్‌గానూ మార్చింది.

దిల్లీ సభలో 20ల, 30ల వయసు యువకులు చాలా మంది సన్‌గ్లాసెస్‌ ధరించి, మెలి తిప్పిన గుబురు మీసాలతో కనిపించారు.

చిత్రం శీర్షిక దళిత యువతలో ఆజాద్‌కు విశేష అభిమానులు ఉన్నారు

కానీ.. ఆజాద్ ప్రభావం కళ్లకు కనిపించేదానికన్నా చాలా లోతైనది. ఆయన చెప్పిన పార్టీకి లేదా అభ్యర్థికే ఓటు వేస్తామని చాలా మంది నాతో చెప్పారు.

అంతకంతకూ పెరుగుతున్న అతడి ప్రభావం.. ఉత్తరప్రదేశ్‌లో నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన దళిత నాయకురాలు మాయావతికి ఆందోళన కలిగిస్తోంది. అతడు ''బీజేపీ ఏజెంట్'' అని, దళిత ఓట్లను చీల్చటం కోసం పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు.

ఈ ఆరోపణను ఆజాద్ తిరస్కరించారు. అధికార పార్టీని తాను వ్యతిరేకిస్తున్నాననేందుకు వారణాసిలో మోదీ మీద పోటీ చేస్తుండటమే రుజువని చెప్తున్నారు. దేశాన్ని బీజేపీ నుంచి, ఆ పార్టీ అగ్ర కుల సిద్ధాంతం నుంచి విముక్తం చేయటమే తన ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు.

''ఇరవై ఒకటో శతాబ్దం దళితులకే చెందుతుందని బాబా సాహెబ్ (భీమ్‌రావ్ అంబేడ్కర్) చెప్పారు. కాబట్టి 2019లో మేం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నేను అనుకుంటున్నాను. అప్పుడు కాకపోతే 2024లో తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం'' అని చెప్పారు.

''అగ్రకులాలు మమ్మల్ని 3,000 సంవత్సరాల పాటు తమ సేవకులుగా చూశాయి. ఇక అలా జరగదు'' అని ఆజాద్ ఉద్ఘాటించారు.

ఫొటోలు: అభిషేక్ మధుకర్, బీబీసీ

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionజిన్నీ మాహీ: పాప్‌ సంగీతంలో దళిత గొంతుక!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

LIVE: హైదరాబాద్ ‘ఎన్‌కౌంటర్‌’పై హైకోర్టులో కేసు: ‘సోమవారం దాకా నిందితులకు అంత్యక్రియలు చేయొద్దు.. మృతదేహాలను భద్రపరచండి’

ఆరు గంటలు గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.. అయినా ఆమె ప్రాణం పోలేదు

INDvsWI: మొదటి టీ20లో భారత్ విజయం.. కోహ్లీ 94 నాటౌట్

నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్

స్మృతి ఇరానీపై లోక్‌సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎంపీల ‘దౌర్జన్యం’ చేశారన్న బీజేపీ.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్

పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు

హైదరాబాద్ ఎన్‌కౌంటర్: సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అంటే ఏంటి.. ఎందుకు చేస్తారు

సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'