‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఐడియా బాలకృష్ణదే’ - ప్రెస్ రివ్యూ

  • 23 మార్చి 2019
Image copyright facebook/RGV

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మార్చి 29న విడుదల కానుందంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రామ్‌గోపాల్ వర్మ మీడియా సమావేశం గురించి సాక్షి పత్రికలో ఓ కథనం ప్రచురితమైంది...

బాలకృష్ణకు అంకితం

ఎన్టీఆర్‌గారి బయోపిక్‌ చేద్దామని బాలకృష్ణ అన్నారు. పొలిటికల్‌ విషయాలు తెలుసుకునేందుకు ఆయనే కొందరు వ్యక్తుల్ని నాకు పరిచయం చేశారు.

ఎన్టీఆర్‌గారి జీవితంలోకి లక్ష్మీపార్వతిగారు వచ్చాక జరిగిన ఘటన లేకుండా సినిమా చేద్దామని బాలకృష్ణ అన్నారు. అందుకు నేను ఒప్పుకోకపోవడంతో మా కాంబినేషన్‌లో సినిమా ఆగిపోయింది.

అయితే బాలకృష్ణ నన్ను సంప్రదించకపోయి ఉంటే మాత్రం 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా ఐడియా నాకు వచ్చేది కాదు అని వర్మ అన్నారు.

నేను నమ్మిన నిజంతో...

'వైస్రాయ్‌ హాటల్‌' సంఘటన జరిగినప్పుడు నేను 'రంగీలా' సినిమా తీస్తూ బొంబాయిలో ఉన్నా. 25 ఏళ్ల కిందట జరిగిన ఆ ఘటనలో వాస్తవం ఏంటన్నది నాకు తెలియదు.

ఆ సంఘటన జరిగినప్పుడు రాజకీయాల్లో ఉండి, ప్రస్తుతం లైమ్‌లైట్‌లో లేని దాదాపు 35మందిని కలిసి ఏం జరిగిందన్నది తెలుసుకుని, నేను నిజమని నమ్మిన దాంతో 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రం తీశా.

వార్నింగ్‌ ఇచ్చారు

ఈ సినిమా తీస్తున్న టైమ్‌లో 'ఇలాంటి వ్యవహారాలు నీకెందుకు? సినిమా తీయకపోవడమే మంచిది' అంటూ నాకు కొందరు సలహాలు ఇచ్చారు. కానీ, నేనెవరి సలహాలు పాటించను.. సినిమా పూర్తయ్యాక విడుదల ఆపాలంటూ టీవీ డిబేట్‌లో ఉన్నప్పుడు వార్నింగ్‌లు ఇచ్చారు.

చంద్రబాబుగారే ఓ సినిమా తీసుకోవచ్చు

ఎన్టీఆర్‌గారి వైపు నుంచి చూస్తే వైశ్రాయ్‌ హోటల్‌ ఘటనలో 100శాతం కుట్ర దాగి ఉంది. నాదెండ్ల భాస్కరరావుగారు పార్టీ కోసం తప్ప, ఎన్టీఆర్‌గారిని పెద్దగా కలిసింది లేదు.

సీబీఎన్‌, రక్తసంబంధీకులు, దగ్గరివాళ్లు చేసిన 'వైశ్రాయ్‌' కుట్ర ఎప్పుడూ పెద్ద కుట్రే అవుతుంది. చంద్రబాబు పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఆయనదే నిజమైనప్పుడు బాబుగారే ఒక సినిమా తీసుకోవచ్చు అని మీడియా సమావేశంలో వర్మ మాట్లాడినట్లు సాక్షి కథనం పేర్కొంది.

Image copyright YSR CONGRESS

రాష్ట్రంలో కుట్రలు, కుతంత్రాలు..!’

రాష్ట్రవ్యాప్తంగా ఈ మూడు రోజుల్లో హత్యలు, దాడులు, దహనాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ శ్రేణులను ఆదేశించారంటూ జగన్ ఆరోపించారని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

శుక్రవారం పులివెందుల స్థానానికి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయడానికి ముందు సీఎస్ఐ చర్చి వద్ద జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పేరెత్తకుండా ఆయన్ను చంద్రబాబుకు పార్ట్‌నర్‌గా పేర్కొన్నారు.

‘‘రాష్ట్రంలో విపరీతమైన కుట్రలు జరుగుతున్నాయి. కలుషితమైన రాజకీయాలు ఏం జరుగుతున్నాయో అర్థం కావడంలేదు. పులివెందుల నుంచే మొదలుపెడతారు. చిన్నాన్నను అతి దారుణంగా చంపివేసిన వీళ్లు మనకు బురద పూశారు. వీళ్లే పోలీసులతో విచారణ చేయిస్తారు..’’

‘‘తప్పుడు విచారణలతో కుట్రలు, కట్టుకథలు చెప్పి వైసీపీ నేతలను అరెస్టు చేస్తారు. కడప జిల్లాలో గెలవలేమని నిర్ధరణకు వచ్చిన చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు చేసి కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఐదేళ్ల పాలనలో అన్యాయాలు చేయడంతో రాష్ట్రంలో ఈసారి టీడీపీకి ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావు.’’

‘‘చిన్నాన్నను చంపితే జమ్మలమడుగులో తిరిగేవారు ఎవరు? చంపినా ఆ నేరాన్ని కుటుంబ సభ్యులపై మోపి, ఎవరినైనా అన్యాయంగా అరెస్టు చేసి, చివరికి పులివెందులలో ఎన్నికలు జరపనివ్వకుండా చేస్తారు. ముఖ్య నేతలందరినీ ఏదో ఒక నేరంపై అరెస్టు చేస్తారు. ఇవేనా రాజకీయాలు..? సీఎంకు ఓట్లడిగే హక్కు లేదు. ప్రజల దృష్టి మరల్చేందుకు చేస్తున్న కుట్రల్లో భాగంగా కడపలో హత్యా రాజకీయాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే మీరంతా విజ్ఞతతో తోడుగా నిలవండి’’

‘ఆయన పార్ట్‌నర్ ఎవరో తెలుసా?

‘‘నాడు కాంగ్రెస్‌తో కుమ్మక్కై నన్ను ఇబ్బంది పెట్టి కేసులు నమోదు చేయించారు. జగన్‌ను ఇబ్బంది పెట్టిన అధికారి ఎవరో తెలుసా.. సీబీఐలో పనిచేసిన మీకు తెలిసిన అధికారే. ఆయనకు చంద్రబాబు భీమిలిలో టికెట్‌ ఇచ్చేందుకు ప్రయత్నించి, విమర్శలు రావడంతో తన పార్ట్‌నర్‌(పవన్‌)తో విశాఖ ఎంపీ టికెట్‌ ఇప్పించి డ్రామాలు ఆడుతున్నారు. నిన్న పార్ట్‌నర్‌ నామినేషన్‌ వేస్తే అక్కడ ఎవరున్నారో తెలుసా.. టీడీపీ జెండాలు కనిపించాయి. చంద్రబాబు పార్ట్‌నర్‌ ఎవరో తెలుసా? ఓ సినిమా యాక్టర్‌. చంద్రబాబు స్క్రిప్ట్, ఆదేశాలతోనే ఆయన అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. నిర్మాత, డబ్బులు, డైలాగులు, అభ్యర్థుల నిర్ణయాలు చంద్రబాబు ఆదేశాలే. బి-ఫారం ఇచ్చేది మాత్రం పార్ట్‌నరే..'' అని జగన్ ప్రసంగించారంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం పేర్కొంది.

Image copyright KalvakuntlaChandrashekarRao/fb

దేశంలోనే అత్యుత్తమ సీఎం కేసీఆర్

దేశంలో అత్యంత సమర్థ పనితీరు ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రులెవరని సీవోటర్- ఐఏఎన్‌ఎస్ సర్వే లెక్కతీసినప్పుడు ఏకంగా 79.2% ప్రజల మద్దతుతో కేసీఆర్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారని నమస్తే తెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో...

దేశంలోని ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్.. అత్యంత జనరంజకంగా పాలిస్తున్నారని మరోమారు వెల్లడైంది.

ఆయన తర్వాతి స్థానాల్లో పెద్దగా పేరు బయటకురాని హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్, రికార్డుస్థాయిలో ఐదోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్ ఉన్నారు.

‘చంద్రబాబుకు 14వ ర్యాంకు’

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం టాప్ 5 జాబితాలో చోటు సంపాదించుకోగా.. నవ్యాంధ్ర నిర్మాతనని చెప్పుకొంటున్న ఏపీ సీఎం చంద్రబాబు 14వ ర్యాంకులో నిలిచారు.

దేశంలోని 29 రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరుపై ప్రముఖ సర్వేసంస్థ సీవోటర్‌తో కలిసి ప్రముఖ వార్తాసంస్థ ఐఏఎన్‌ఎస్ (ఇండో ఏషియన్ న్యూస్ సర్వీస్) నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది.

అత్యంత పేలవమైన పనితీరు ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రుల జాబితాలో తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ సీఎంలు ఉన్నారు.

మొత్తం 20,827 మంది ఓటర్లను సర్వే చేయగా.. కేసీఆర్ పాలనపై పూర్తి సంతృప్తికరంగా ఉన్నామని 68.3% తేల్చిచెప్పారు. ఫర్వాలేదన్నవారు మరో 20.8% ఉన్నారు.

మొత్తంగా కేసీఆర్ పాలనపై సంతృప్తి వ్యక్తంచేస్తున్నవారు 79.2% ఉన్నారని సర్వే వెల్లడించింది. కేసీఆర్ పాలన బాగోలేదన్నది కేవలం 9.9% మాత్రమే కావటం గమనార్హం అని నమస్తేతెలంగాణ కథనం పేర్కొంది.

Image copyright Janasena Party/Facebook

‘ఇక్కడ కేసీఆర్‌కు ఏంపని?’

ఆంధ్ర రాజకీయాల్లో కేసీఆర్ జోక్యం ఏమిటంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారని ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

''తెరాస వాళ్లు ఆంధ్రా ప్రజలను ద్రోహులని తిట్టారు, రాయలసీమ నుంచి వచ్చిన కొందరు ఫ్యాక్షనిస్టులను రాళ్లతో తరిమికొట్టారు. కేటీఆర్‌ ఆంధ్రావాళ్లను పెద్దపెద్ద తిట్లు తిడుతుంటే మీకు పౌరుషం రాలేదా? గోదావరి రక్తం మీలో ప్రవహించడం లేదా? అటువంటి వారిని ఇక్కడకు ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉంది. ఇదే విషయంపై తాను పోరాటం చేస్తే దాడికి యత్నించారు. అయినా నేను వెనకాడలేదు. తెరాస సత్తాచాటాలనుకుంటే మీ పార్టీ అభ్యర్థులను ఇక్కడ నిలిపి ప్రచారం చేయండి'' అని పవన్ సూచించారు.

విశాఖలో బలమైన అభ్యర్థులను ఎంపికచేయగానే ప్రత్యర్థి పార్టీల గుండెల్లో భయం మొదలైందని పవన్‌ వ్యాఖ్యానించారు.

ఇంట్లో హత్య జరిగితే గుర్తించలేని వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుతారని ప్రశ్నించారు.

'కిరాతకంగా చంపేశారు, వేలిముద్రలు దొరకలేదు, రక్తపు మరకలు లేవు, కొన్ని గంటల తర్వాత లెటరు దొరికింది.. ఇలా చెబుతున్నారు.. పినతండ్రి బాధ్యత మీది కాదా.. మీ ఇంట్లో జరిగే హత్యకే ఏం మాట్లాడకపోతే భీమవరంలో అలాంటి సంఘటనలు జరిగితే మీరేం అడ్డుకుంటారు. ఇటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అయితే ఏం న్యాయం చేస్తారు?' అని ప్రశ్నించారు.

మీ పార్టీ కిరాయి మూకలను ఆంధ్రప్రాంతానికి పంపితే తన్ని తరిమేస్తానని, మినీ ఇండియా లాంటి భీమవరంలో విజయం సాధించి అభివృద్ధితో విశ్వవ్యాప్తం చేస్తానని పవన్ ప్రతిజ్ఞ చేశారంటూ ఈనాడు దినపత్రిక కథనం తెలిపింది.

విద్యార్థులు Image copyright Getty Images

‘కారుణ్య మరణాలకు అనుమతినివ్వండి..’

గ్రూప్‌-2 నియామక ప్రక్రియలో జాప్యాన్ని నిరసిస్తూ అభ్యర్థులు నిరసన బాట పట్టారంటూ నవతెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

జాప్యంపై మానసిక క్షోభ తట్టుకోలేక తమను కారుణ్య మరణానికి అనుమతినివ్వాలంటూ శుక్రవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

సుమారు 200 మంది అభ్యర్థులు ర్యాలీగా తరలివచ్చి హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రూప్‌-2 క్వాలిఫైడ్‌ అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.

రెండున్నరేండ్లు గడుస్తున్నా ఫలితాలు వెల్లడించడం లేదన్నారు. మెరిట్‌ జాబితాలో పేర్లున్నా ఫలితాలు వెలువడక, ఉద్యోగం రాక, వేరే ఉద్యోగం చేయలేక ఎన్నో అవమానాలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

తాము ఇంకెంత కాలం తల్లిదండ్రులపై ఆధారపడి జీవించాలో అర్థం కావడం లేదన్నారు. ఫలితాల విడుదలలో జాప్యం కారణంగా తమకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరారంటూ నవతెలంగాణ పత్రిక కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)