ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు: టీఆర్ఎస్‌కు టాటా చెప్పిన వివేక్... చంద్రబాబు గూటికి బైరెడ్డి

  • 24 మార్చి 2019
వివేక్, బైరెడ్డి Image copyright fb/DrVivekVenkatswamy/IamByreddy

ఎన్నికల ముందు పార్టీల కండువాలు మార్చుతున్న నేతలు గతంలో ఏమన్నారు? ఇప్పుడేమంటున్నారు? అన్న విషయాలను 'సిత్రాలు సూడరో' పేరుతో గత రెండు వారాలుగా ప్రచురిస్తున్నాం.

అందులో భాగంగా... కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేసి టీడీపీలో చేరిన కర్నూలు జిల్లా నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎంపీ టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన జీ.వివేక్‌ల గురించి చూద్దాం.

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Image copyright fb/IamByreddy
చిత్రం శీర్షిక కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు

2019 జనవరిలో కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు.

"చంద్రబాబు అన్నీ అబద్ధాలే మాట్లాడుతారు. గతంలో ప్యాకేజీ అన్నారు, ఇప్పుడు మాట మార్చి ప్రత్యేక హోదా అంటున్నారు. మోదీతో జతకట్టి నాలుగున్నరేళ్లు మీరు సాధించిందేమీ లేదు. అమరావతి కడతామన్నారు కట్టనేలేదు. మొన్న వెళ్లి చూశాను, అమరావతి కంటే నంద్యాలనే బాగుంది. ప్రజలకు చంద్రబాబు అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు. అది ఎవరికీ కనిపించదు. రైతులకు రుణ మాఫీ అనేది ఆయన చూపించే పెద్ద అరుంధతి నక్షత్రం. డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ అన్నారు. అదీ జరగలేదు. బాబు వస్తే జాబొస్తుందని గోడల మీద రాశారు. కానీ, ఉన్న జాబులే పోయాయి. ఏదీ నెరవేరలేదు. ఆయనవన్నీ అబద్ధాలే. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరడం చూస్తుంటే నవ్వొస్తోంది" అని బైరెడ్డి అన్నారు.

Image copyright fb/IamByreddy
చిత్రం శీర్షిక పాత చిత్రం

2019 మార్చి 20: టీడీపీలో చేరిక

టీడీపీ కండువా కప్పుకున్న తర్వాత బైరెడ్డి... విభజనతో పట్టాలు తప్పిన రాష్ట్రాన్ని గాడిన పెట్టింది చంద్రబాబే అన్నారు.

"రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఏ పొరపాటు జరిగినా రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుంది. చంద్రబాబుకు మరోసారి అధికారం ఇవ్వడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ పట్టాలు తప్పింది. దాన్ని పట్టాలపైకి ఎక్కించి నడుపుతున్నది చంద్రబాబు. ఇంకా అయిదేళ్లు ఆయనే ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం తలెత్తుకునే వీలుంటుంది" అని ఆయన చెప్పారు.

Image copyright fb/DrVivekVenkatswamy

జి. వివేక్

తెలంగాణలోని పెద్దపల్లి పార్లమెంట్ స్థానం టికెట్ ఆశించిన భంగపడ్డ జి. వివేక్ టీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు పదవికి కూడా రాజీనామా చేశారు. తనకు టికెట్ ఇస్తానని, మోసం చేశారని ఆయన అన్నారు.

"అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేశానని నా మీద బురదజల్లారు. కానీ, నేనెప్పుడూ అలా చేయలేదు. కేసీఆర్‌కు అవసరమైనప్పుడల్లా మద్దతు ఇచ్చాను. ఇలా పక్కన కూర్చోబెట్టుకుని గొంతు కోస్తారని అనుకోలేదు.

ఇప్పుడు నాకు బానిసత్వం నుంచి బయటకు వచ్చినట్లు అనిపిస్తోంది. నేను టికెట్ ఇవ్వాలని ఎన్నడూ అడగలేదు. వాళ్లే పెద్దపల్లి టికెట్ ఇస్తామని చాలాసార్లు చెప్పారు. నేను ఎంపీగా గెలిచినా, గెలవకపోయినా పెద్దపల్లి కోసం కష్టపడతా. తెలంగాణ ప్రజలకు కావాల్సిన న్యాయం కోసం పోరాడుతా" అని వివేక్ అన్నారు.

పలు పార్టీల నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని, కార్యకర్తల కోరిక మేరకు నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.

Image copyright fb/DrVivekVenkatswamy
చిత్రం శీర్షిక తెలంగాణ ఉద్యమం సమయంలో

మూడు సార్లు మారిన కండువా

2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి స్థానం నుంచి ఎంపీగా గెలిచిన వివేక్, తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

అయితే, అనూహ్యంగా 2014 ఎన్నికలు సమీపించాక మళ్లీ ఆయన కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అప్పుడు ఆయన, ’’రాష్ట్రం ఏర్పాటు చేస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ చెప్పారు. కానీ, తర్వాత మాట తప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కూడా పెట్టుకోలేదు. కాంగ్రెస్ నా రక్తంలో ఉంది, అందుకే తిరిగి ఆ పార్టీకి వెళ్తున్నా" అని అన్నారు.

ఆ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి వివేక్ పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు.

Image copyright fb/DrVivekVenkatswamy
చిత్రం శీర్షిక తాజాగా కరీంనగర్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో

ఆ తర్వాత రెండేళ్ల పాటు కాంగ్రెస్‌లోనే ఉన్న ఆయన, 2016 జూన్‌లో మళ్లీ టీఆర్‌ఎస్ గూటికి చేరారు.

అప్పుడు వివేక్ సోదరుడు వినోద్ మాట్లాడుతూ, తమ తండ్రి వెంకటస్వామి (కాకా) ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధి గురించి తాపత్రయపడేవారని, ఇప్పుడు ఆయన ఆశయ సాధన కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న కేసీఆర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత 2016 డిసెంబర్‌లో వివేక్‌ ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు.

"తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ కలుపుకునిపోవాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి నాకు ఈ అవకాశం ఇచ్చారు. తెలంగాణను అభివృద్ధి చేసి, దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలన్న తపన కేసీఆర్‌కు ఉంది. అందుకోసం నేను కూడా పనిచేసే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని అప్పట్లో చెప్పిన వివేక్ ఇప్పుడు టీఆర్ఎస్‌కు రెండోసారి గుడ్ బై చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)