కేటీఆర్: 'నాగలికి ఓ వైపు ఎద్దును, మరో వైపు దున్నపోతును కట్టొద్దు’ :ప్రెస్ రివ్యూ

  • 24 మార్చి 2019
Image copyright KTR/FACEBOOK

ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒకే పార్టీ వారు ఉంటేనే రాష్ట్రానికి ఎక్కువ మేలుజరుగుతుందని కేటీఆర్ అన్నారంటూ సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరికి ఓటు వేసి, పార్లమెంటు ఎన్నికల్లో మరొకరికి ఓటేస్తే నాగలికి ఓవైపు దున్నపోతు, మరోవైపు ఎద్దును కట్టినట్లుంటుందని కేటీఆర్ అన్నారు.

కేంద్రాన్ని యాచిస్తే నిధులు రావని, శాసించి గల్లా పట్టి తెచ్చుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ 16 ఎంపీ సీట్లు గెలుచుకుంటే ఇలా చేయొచ్చన్నారు. బడితే ఉన్నోడిదే బర్రె అన్నట్టు రాజకీయాలు తయారయ్యాయని శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమం లో వ్యాఖ్యానించారు.

''జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతున్నారు. ఇన్నేళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ఏం సాధించాయి? దేశంలో కరెంటు, నీళ్లను సైతం జాతీయ పార్టీలు ఇవ్వలేకపోయాయి. కాంగ్రెస్‌ జాతీయపార్టీ ఎలా అవుతుంది. ఓ పెద్ద సైజు ప్రాంతీయపార్టీ మాత్రమే.

ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీలు దయతలిస్తేనే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ గెలిచేది. పొరపాటున ఆ రెండు పార్టీలు అభ్యర్థులను పెడితే సోనియా, రాహుల్‌ కూడా ఓడిపోతారు. టీఆర్‌ఎస్‌ ఐదేళ్లలో ఏం చేయలేదని విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ ఇన్నేళ్లలో తెలంగాణకు తెచ్చిన దారిద్య్రం ఐదేళ్లలో వదులుతుందా?'' అని కేటీఆర్ అన్నారని సాక్షి దినపత్రిక పేర్కొంది.

Image copyright Getty Images

మోదీ బయోపిక్‌పై ఫిర్యాదు

ప్రధాని మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'పీఎం నరేంద్ర మోదీ' సినిమా రాజకీయ వేడిని రాజేస్తోందని సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

లోక్‌సభ ఎన్నికలకు సరిగ్గా వారం రోజుల ముందుగా అంటే ఏప్రిల్‌ 5న సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించడంపై ప్రతిపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి.

మోదీ బాల్యంలో టీ అమ్మడం, ఆరెస్సెస్‌లో చేరిక, గుజరాత్‌ సీఎంగా ఎదుర్కొన్న సవాళ్లు, సర్జికల్‌ దాడులుసహా పలు అంశాలను స్పృశించిన ఈ సినిమా బీజేపీకి ఎన్నికల్లో లబ్ధి కలిగించేలా ఉందని మండిపడుతున్నాయి.

బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రధానపాత్రలో, బొమన్‌ ఇరానీ, మనోజ్‌ జోషీ, కిశోర్‌ షహానే, దర్శన్‌ కుమార్‌ తారాగణంతో ఈ సినిమాను దర్శకుడు ఒమంగ్‌ కుమార్‌ తెరకెక్కించారు.

ఈ సినిమాకు తాము పాటలు రాసినట్లు పోస్టర్లు వేయడంపై గీత రచయితలు జావేద్‌ అఖ్తర్, సమీర్‌లు మండిపడ్డారు. తాము ఈ సినిమాకు పాటలు రాయలేదన్నారు.

సినిమా ప్రకటనను ప్రచురించిన దైనిక్‌ భాస్కర్‌ పత్రిక, ట్రైలర్‌ విడుదల చేసిన టీ-సిరీస్‌ కంపెనీ, నిర్మాతలకు తూర్పు ఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన రిటర్నింగ్‌ అధికారి షోకాజ్‌ నోటీసులు జారీచేశారు.

ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా ఈ ప్రకటన ఇచ్చిన నేపథ్యంలో సర్టిఫికేషన్, వ్యయానికి సంబంధించిన పత్రాలను మార్చి 25లోగా సమర్పించాలని ఆదేశించారు.

ప్రకటన రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తోందని రిటర్నింగ్‌ అధికారి అన్నారు. ఇందుకు సంబంధించిన మొత్తం ఖర్చును అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి జతచేస్తామని నోటీసులో రిటర్నింగ్‌ అధికారి పేర్కొన్నట్లు సాక్షి పత్రిక తెలిపింది.

Image copyright facebook/YSJaganmohanreddy

'రైతులను మోసం చేయడంలో నంబర్ 1'

అయిదేళ్ల చంద్రబాబు పాలన మోసపూరితమేనని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..

'రాష్ట్రాన్ని నంబర్‌వన్‌ చేశారట.. 650 అవార్డులు వచ్చాయట. నిజమే! రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేయడంలో నంబర్‌వన్‌. పొదుపు మహిళల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఎగ్గొట్టడంలో నంబర్‌వన్‌. యువతకు ఉపాధి చూపకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేయడంలో నంబర్‌వన్‌ ఈ చంద్రబాబు' అని విరుచుకుపడ్డారు.

దివంగత రాజశేఖరరెడ్డి పాలనలో గిరిజనులకు ఏడు లక్షల ఎకరాలను పంపిణీ చేశారని గుర్తుచేశారు. ఆయన అడుగుజాడల్లోనే నడుచుకుంటానని హామీనిచ్చారు.

'అయిదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని చూపి ఓట్లడిగే సత్తా చంద్రబాబుకు లేదు. కొత్తగా మీ భవిష్యత్తు నా బాధ్యత అని ముందుకు రావడం సిగ్గుచేటు కాదా?' అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే కాకినాడ సెజ్‌ భూములు రైతులకు తిరిగి ఇచ్చేస్తానని ఏరువాకలో ప్రకటించిన చంద్రబాబు.. రైతులపై కేసులు పెట్టించారని ఆరోపించారు.

'ప్రభుత్వంలో కాంట్రాక్టు సర్వీసులు అనేకం ఉన్నాయి. ఆర్టీసీ బస్సులను కాంట్రాక్టుకు నడుపుతున్నారు. తెదేపా ఎంపీలు జేసీ బ్రదర్స్‌ లాంటి వాళ్లకే వీటిని అప్పగిస్తున్నారు. వీటన్నింటినీ మార్చేస్తా. పెట్టుబడి రాయితీతో నిరుద్యోగులకు కార్లను అందించి వాటి సేవలు ప్రభుత్వానికి అందించి తగిన భృతి పొందేలా చూస్తా' అని జగన్‌ పేర్కొన్నారంటూ ఈనాడు దినపత్రిక కథనం తెలిపింది.

ఆదార్ ఫింగర్ ఫ్రింట్స్ Image copyright AFP

ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌కు ఆధార్ అడ్డంకులు

వేలాది మంది ప్రజలు ఈ ఏడాది తమ ఆదాయ పన్ను వివరాలను సమర్పించలేక పోతున్నారని, అందుకు కారణం పాన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానించడంలో సాంకేతిక సమస్యలు తలెత్తడమేనని ది హిందూ పత్రిక ఈరోజు ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసే ఆధార్ కార్డులో ఒక వ్యక్తి ఇంటి పేరును రాసే అవకాశం ఉంది. కానీ, పాత సాంకేతిక వ్యవస్థతో రూపొందిన పాన్ కార్డులో ఇంటి పేరు లేదా ఇనిషియల్స్ ఎంటర్ చేసే వీలు లేదు.

ఫలితంగా చాలా మంది ప్రజలు, ముఖ్యంగా దక్షిణ భారతీయులు పాన్ కార్డుతో ఆధార్‌ను లింక్ చేయలేకపోతున్నారు. పేర్లు సరిపోలక పోవడం వల్ల రెండింటినీ అనుసంధానించడం కుదరడం లేదని, ఈ సమస్యకు తమ వద్ద పరిష్కారం కూడా లేదని ఆదాయ పన్ను శాఖ అధికారులు ది హిందూతో చెప్పారని ఆ వార్తలో తెలిపారు.

పాన్ కార్డ్ సాఫ్ట్‌వేర్‌ను దాదాపు 30 ఏళ్ళుగా ఉపయోగిస్తున్నారు. దీనిలో ఇనిషియల్స్ ఎంటర్ చేసే వ్యవస్థ లేదు. బయోమెట్రిక్ వివరాలతో కూడిన ఆధార్ కార్డులో వ్యక్తి ఇంటిపేరు నమోదు చేయవచ్చు.

ఈ తేడా వల్ల వేలాది మంది తమ ఆధార్ కార్డులను పాన్ కార్డుతో అనుసంధానించలేకపోతున్నారు. పాన్ కార్డుకు ఆధార్ వివరాలు అనుసంధానం చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

దీనివల్ల, పొడవైన పేర్లు ఎక్కువగా ఉండే దక్షిణాది ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని ది హిందూ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

శ్రీలంక పేలుళ్ల ‘సూత్రధారిగా భావిస్తున్న హషీమ్’ చెల్లెలు ఏమంటున్నారంటే...

శ్రీలంకలో మరో మూడు పేలుళ్లు, తుపాకుల చప్పుళ్లు

చెర్నోబిల్: భారీ అణు విషాదానికి నేటితో 33 ఏళ్లు.. అసలు ప్రమాదం ఎలా జరిగింది?

భారత్‌లో పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువుల పరిస్థితి ఎలా ఉంది?

మోదీ రోడ్‌షో అంటూ వాజ్‌పేయీ అంతిమయాత్ర వీడియోను షేర్ చేస్తున్నారా?

టీఎస్‌ఆర్టీసీ బస్: ‘‘పక్కా ప్లాన్‌తో ప్రొఫెషనల్స్ చేసిన దొంగతనం ఇది’’.. ఎలా జరిగిందంటే..

మహారాష్ట్ర రైతుల లాంగ్ మార్చ్ ‘ముఖచిత్రం’ షేకుబాయికి భూమి వచ్చిందా

మనుషుల్లాగా సెల్ఫీకి ఫోజిచ్చిన గొరిల్లాలు... ఈ ఫొటో వెనకున్న పూర్తి కథ