'కాబోయే ప్రధాని కేసీఆర్‌...' టీఆర్‌ఎస్‌ ప్రచార హోరు - ప్రెస్ రివ్యూ

  • 25 మార్చి 2019
KCR Image copyright KCR

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ను ఈ దేశానికి కాబోయే ప్రధానిగా టీఆర్‌ఎస్‌ ఫోకస్‌ చేస్తోందని 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. మంత్రులు, పార్టీ ఎంపీ అభ్యర్థులు.. అందరూ దీనిని ఒక ప్రచార నినాదంగా మలుస్తున్నారు. ప్రచారం ఊపందుకుంటున్న నేపథ్యంలో కేసీఆర్‌ సహా నేతలందరి నోటా ఇదే మాట వినిపిస్తోంది.

రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలుండగా, మిత్రపక్షం మజ్లిస్‌ సిటింగ్‌ స్థానం హైదరాబాద్‌ మినహా మిగిలిన 16 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు కార్యరంగంలోకి దూకాయి.

కాంగ్రెస్‌, బీజేపీయేతర పార్టీలతో జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానని, లోక్‌సభ ఎన్నికల తర్వాత అవసరమైతే జాతీయ పార్టీ పెడతానని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే 120 మందితో మాట్లాడానని కూడా ఇటీవల ఆయన ప్రకటించారు.

దీంతో, మిగిలిన నేతలు కూడా ప్రచారాన్ని 'ప్రధాని కేసీఆర్‌' దిశగానే నడిపిస్తున్నారు. మమత, అఖిలేశ్‌, నవీన్‌ పట్నాయక్‌, కేసీఆర్‌, జగన్‌ కలిసి కేంద్రంలో కీలకం కాబోతున్నారని, లోక్‌సభ ఎన్నికల్లో తమకు 170 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఏ ఒక్క జాతీయ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాదని, కేంద్రంలో హంగ్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. అప్పుడు 16 సీట్లతో కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంలో కీలకం అవుతారని, ప్రధాని పదవి కూడా ఆయనను వరించే అవకాశం ఉందని రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణ బిడ్డ (కేసీఆర్‌) దేశానికి ప్రధాని ఎందుకు కాకూడదంటూ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేస్తున్నారు.

Image copyright @BJP Telangana

పాక్‌పై భారత దాడికి ఆధారాలు అడగటం.. రాజకీయాలు చేయడమే: నిర్మలా సీతారామన్‌

బాలాకోట్‌పై భారత సేన దాడి అనంతరం అందరూ జేజేలు పలుకుతుంటే, కొందరు మాత్రం దాడికి ఆధారాలు అడుగుతున్నారని.. అలా అడగటం రాజకీయాలు చేయడం కాదా? అని కాంగ్రెస్‌ను ఉద్దేశించి కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారని 'ఈనాడు' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. ఆదివారం హైదరాబాద్‌ సైనిక్‌పురిలో మల్కాజిగిరి భాజపా ఎంపీ అభ్యర్థి రాంచందర్‌రావు అధ్యక్షతన మాజీ సైనికాధికారులు, సైనికులు, మేధావులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ.. సైనిక బలగాలకు సంబంధించిన ఆర్మీ చీఫ్‌ను, వైమానిక దళ ప్రధానాధికారిని కాంగ్రెస్‌ దూషించడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు.

ఆ పార్టీ పస లేని ఆరోపణలు చేస్తోందని, భాజపా మాత్రం సైనికుల త్యాగాలను గుర్తించి 'వార్‌ మెమోరియల్‌'ను నిర్మించి జాతికి అంకితం చేసిందని పేర్కొన్నారు. రఫేల్‌ పైనా కాంగ్రెస్‌ ఎంతో రాద్ధాంతం చేస్తోందన్నారు.

వచ్చే సెప్టెంబరులో మొదటి యుద్ధవిమానం దేశానికి వస్తుందని, 2022లో అదే నెల నాటికి మొత్తం 36 విమానాలు వస్తాయని వెల్లడించారు.

Image copyright @Swamy39

నేను బ్రాహ్మణున్ని.. చౌకీదార్ కాలేను: ఎంపీ సుబ్రమణ్యస్వామి

''నేను చౌకీదార్‌ను కాలేను. ఎందుకంటే నేను బ్రాహ్మణుడిని'' అని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యాయని 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. దేశానికి నేనూ చౌకీదారునే అని, ప్రతిఒక్క మద్దతుదారు అండగా నిలువాలని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల పిలుపునిచ్చిన నేపథ్యంలో అమిత్‌షాతోపాటు బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు ట్విట్టర్‌లో తమపేరు ముందు చౌకీదార్ అనే పదాన్ని చేర్చుకుంటున్న విషయం తెలిసిందే.

వారిలా ట్విట్టర్‌లో తన పేరు ముందు చౌకీదార్ అని పెట్టుకోలేనని ఆదివారం సుబ్రమణ్యస్వామి ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ''నేను బ్రాహ్మణుడిని. అందుకే చౌకీదార్‌ను కాలేను. బ్రాహ్మణులు ఎప్పటికీ చౌకీదార్లు కాలేరు. ఇది వాస్తవం. నేను ఇచ్చే ఆదేశాలను చౌకీదార్ అమలుచేయాలి. చౌకీదార్లను నియమించుకునే వారంతా అదే ఆశిస్తారు. అందుకే నేను చౌకీదార్లలో ఒకరిని కాలేను'' అని సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు.

మరోవైపు, ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆర్థికరంగాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారన్నారు. జీడీపీ పరంగా మనదేశం అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉన్నదని, మోదీ మాత్రం భారత్‌ను ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ అని చెబుతుంటారని.. ఇలా ఆయన ఎందుకు అంటుంటారో అర్థంకావటం లేదని పేర్కొన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

శ్రీలంక పేలుళ్లు న్యూజిలాండ్ మసీదుల్లో దాడులకు ప్రతీకారంగా జరిగినవా?

99 మార్కులు వస్తే 0 వేశారు.. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎందుకిన్ని పొరపాట్లు

లోక్‌సభ ఎన్నికలు 2019: సాయంత్రం 5 గంటలకు 62.16 శాతం పోలింగ్.. బెంగాల్‌లో ఘర్షణలు ఒకరి మృతి

ఈవీఎం వీవీ ప్యాట్‌ నుంచి రశీదు వస్తుందనుకుంటే పాము వచ్చింది

భారత ఓటర్లు ఏం కోరుకుంటున్నారు.. బలమైన నాయకత్వమా, ప్రజాస్వామ్యమా

డాకర్ ర్యాలీ: 5,600 కి.మీ. అత్యంత క్లిష్టమైన బైక్ రేస్‌ను పూర్తిచేసిన ఏకైక మహిళ

సీజేఐ గొగోయ్ మీద లైంగిక ఆరోపణలు: ఈ కేసు #MeToo కంటే పెద్దది. ఎందుకంటే..

ప్రెస్ రివ్యూ: ‘ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఖర్చు రూ. 8750 కోట్లు.. అంతా అవినీతి డబ్బే’