హోలీ రోజున గురుగ్రామ్‌లో ముస్లిం కుటుంబంపై మూకుమ్మడిగా ఎందుకు దాడి చేశారు: Ground Report

  • 25 మార్చి 2019
దిల్షాన్
చిత్రం శీర్షిక దిల్షాన్ తల మీద గాయానికి రెండు కుట్లు పడ్డాయి. అతడి కుడి చేయి విరిగింది. శరీరం మీద చాలా గాయాల గుర్తులున్నాయి

''ఈ ఇల్లు వదిలేసి పోతాను. నా ఊరికి వెళ్లిపోతాను. నా కళ్ల ముందే నా పిల్లలను కొట్టారు వాళ్లు. నేను చూస్తూ ఉండిపోయాను. ఏం చేయలేకపోయాను. ఇక్కడ ఉండదలచుకోలేదు. ఈ ఇంటి కోసం నేను అప్పులు చేశాను. కానీ ఇప్పుడిక్కడ ఉండాలంటే చాలా భయంగా ఉంది. ఉండలేను.''

ఏడుస్తూ చెప్పాడు మొహమ్మద్ సాజిద్. అతడి తల దగ్గర కూర్చున్న ఓ వ్యక్తి అతడి కన్నీళ్లు తుడిచాడు. సాజిద్ ఎడమ చేతి మీద ప్లాస్టర్ ఉంది. అతడి కాళ్ల మీద లోతైన గాయాల గుర్తులున్నాయి.

అతడికిలా ఎందుకు జరిగింది? అతడు చేసిన తప్పేమిటి? అతడికేమీ తెలియదు.

మార్చి 21న దేశంలో హోలీ పండుగ చేసుకున్నారు. సౌభ్రాతృత్వానికి, పరస్పర ప్రేమకు చిహ్నం హోలీ అని విశ్వసిస్తారు.

ఆ రోజు జనం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ గులాల్ చల్లుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో గురుగ్రామ్‌లోని భూప్‌సింగ్ నగర్‌లో నివసించే మొహమ్మద్ సాజిద్ కుటుంబానికి చుట్టూ ఉన్న సమాజం నుంచి భయానక అనుభవం ఎదురైంది. ఆ భయం నుంచి వాళ్లు ఇంకా తేరుకోలేదు.

అయితే.. ఈ కేసు మతపరమైనదని పోలీసులు పరిగణించటం లేదు.

చిత్రం శీర్షిక సాజిద్ కుడి చేయి విరిగింది. అతడికి చాలా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఇంట్లో ఇక ఏమాత్రం ఉండదలచుకోలేదని అతడు చెప్తున్నాడు

సాజిద్ మేనల్లుడు, ఆ దాడి బాధితుడు దిల్షాద్ కథనం ప్రకారం.. గురువారం నాడు సాయంత్ర 5 గంటల నుంచి 5.30 గంటల మధ్య నయా గావ్‌కు చెందిన దాదాపు 25-30 మంది జనం కర్రలు, బడిసెలతో వారి ఇంట్లోకి ప్రవేవించారు. సాజిద్, దిల్షాద్, సమీర్, షాదాబ్ సహా 12 మందిని తీవ్రంగా కొట్టారు. సాజిద్ కుమారుడు షాదాబ్ ప్రస్తుతం సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ ట్రామా సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు.

గురుగ్రామ్‌లోని భోండ్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని భూప్‌సింగ్ నగర్‌లో నివసించే సాజిద్ మీద, అతడి కుటుంబం మీద జరిగిన దాడికి సంబంధించిన వీడియో దృశ్యాలను మీరు సోషల్ మీడియాలో చూసి ఉంటారు.

ఆ వీడియోలో కొందరు వ్యక్తులు సాజిద్‌ను కర్రలతో కొడుతుండటం కనిపిస్తుంది. ఆయనను కాపాడటానికి ఒక మహిళ వస్తుంటే.. ఆమెనూ కొట్టడం కనిపిస్తుంది. కొంతమంది పిల్లలు పైఅంతస్తులో తలుపులు మూసుకొని తమను తాము కాపాడుకోవటానికి ప్రయత్నించటం కనిపిస్తుంది. ఒక బాలిక ఆర్తనాదాలు కూడా వినిపిస్తాయి.

దనిష్ట వయసు 21 సంవత్సరాలు. ఆమె ఈ వీడియోను చిత్రీకరించేటపుడు దీనిని అసలు బయటి వారికి షేర్ చేయగలనని కూడా అనుకోలేదు. హోలీ పండుగ చేసుకోవటం కోసం తన చిన్నాన్న ఇంటికి వచ్చారామె. కర్రలు, కత్తులతో ఆ గుంపు ఇంట్లోకి ప్రవేశించినపుడు ఆమె వంట చేస్తూ ఉన్నారు. తన సోదరుడు ఇర్షాద్‌కి చెందిన ఫోన్ ఆమె దగ్గరుంది.

''వాళ్లు కొడుతున్నపుడు నా చేతిలో ఫోన్ ఉంది. దానిని వీడియో తీయాలని నేను అనుకున్నాను. మేం మేడ మీదికి పరిగెత్తాం. వాళ్ల దాడిని వీడియో తీయటం మొదలుపెట్టాం. వీడియో తీస్తున్నట్లు వాళ్లకు తెలిసినపుడు ''ఆ ఫోన్‌ను, ఆ పిల్లను విసిరిపారేయండి' అని కేకలు వేశారు. నాకు చాలా భయమేసింది. ఫోన్‌ను కాపాడాల్సి ఉంది. దగ్గర్లో ఉన్న ఇటుకల్లో దాన్ని దాచేశాను. ఒకవేళ వాళ్లు నన్ను చంపినా ఆ వీడియో సాక్ష్యంగా ఉంటుందని అనుకున్నాను. కానీ వాళ్లు తలుపులు పగగలగొట్టలేకపోయారు'' అని ఆమె వివరించారు.

చిత్రం శీర్షిక 21 ఏళ్ల దనిష్ట హోలీ సెలవుకు తన చిన్నాన్న ఇంటికి వచ్చింది

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ నుంచి మొహమ్మద్ సాజిద్ 15 ఏళ్ల కిందట తన కుటుంబంతో కలిసి జీవనోపాధి వెదుక్కుంటూ గురుగ్రామ్ వచ్చారు. ఆయన ఘసోలా గ్రామంలో గ్యాస్ రిపేరింగ్ షాపు నడిపేవారు.

మెరుగైన జీవితాన్ని వెదుక్కుంటూ నగరానికి వచ్చారు. కానీ ఈ నగరం తనను ఇంతగా భయపెడుతుందని ఆయన ఎన్నడూ అనుకోలేదు.

''ఇక్కడ ఎందుకు ఆడుకుంటున్నారు? పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఆడుకోండి''

''ఈ గొడవ మొత్తం క్రికెట్ దగ్గర మొదలైంది. ఆ గొడవ ఘర్షణ స్థాయికి పెరిగింది. ఇరు పక్షాలూ కొట్లాడుకున్నాయి. అవును.. ఒకవైపు వారు ఎక్కువగా కొట్టారు. గుర్తుతెలియని వ్యక్తుల మీద మేం కేసు నమోదు చేశాం. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాం'' అని గురుగ్రామ్ పోలీస్ కమిషనర్ మొహమ్మద్ అకీల్ బీబీసీతో చెప్పారు.

ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని అరెస్టులకు అవకాశముందని చెప్పారు.

ఈ కేసులో దిల్షాద్ అనే వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తుల మీద ఫిర్యాదు చేశారని గురుగ్రామ్ పోలీస్ పీఆర్ఓ శుభాష్ బోకెన్ తెలిపారు. సాక్ష్యాలు, వీడియో ఆధారంగా మహేశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.

ఐపీసీ లోని 147 (అల్లర్లకు పాల్పడటం), 148 (చట్టవ్యతిరేకంగా గుమిగూడటం), 452 (చొరబాటు), 506 (బెదిరించటం), 307 (హత్యా యత్నం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

''ఇది దురదృష్టకరం. కానీ ఇది మతపరమైన అంశమని నేను అనుకోను. రెండు గ్రూపుల మధ్య పరస్పర ఘర్షణ ఇది. ఇది మతపరమైనదని అనడం తప్పవుతుంది'' అని హరియాణా పోలీస్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్ పేర్కొన్నారు.

క్రికెట్ దగ్గర మొదలైన గొడవతో ఇరు పక్షాల వారూ ఘర్షణపడ్డారని, ఒక పక్షం వారు వేరొక పక్షం వారి ఇంట్లోకి వెళ్లి దాడి చేశారని, వారిపై చర్యలు ప్రారంభించామని పోలీసులు చెప్తున్నారు.

కానీ బాధిత కుటుంబం వివరిస్తున్న కథనం.. పోలీసులు చెప్తున్న వివరాలతో సరిపోలటం లేదు.

బాధితుడు దిల్షాద్, ''అప్పుడు ఇంట్లో 17 మంది ఉన్నాం. మేం ఇంటి బయట క్రికెట్ ఆడుకుంటున్నాం. ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చారు. 'మీరు ముస్లింలు ఇక్కడ ఎందుకు ఆడుకుంటున్నారు? పాకిస్తాన్ వెళ్లి అక్కడ ఆడుకోండి' అన్నారు. మేం వాళ్లకి బ్యాట్, బాల్ ఇచ్చాం. అప్పుడే సాజిద్ అంకుల్ వచ్చారు. ఏం జరిగిందని అడిగారు. బైక్ మీద వచ్చిన ఒక వ్యక్తి ఆయనను చెంప మీద కొట్టాడు. 'నువ్వెవరు? నీ ఇల్లు ఎక్కడ?' అని అడిగాడు'' అని చెప్పారు.

''మేం ఇక్కడే ఉంటామని ఆయన చెప్పారు. ఇక మేం ఇంట్లోకి వెళ్లాం. కొద్దిసేపటి తర్వాత ఆరుగురు వ్యక్తులు రెండు బైకుల మీద వచ్చారు. ఒక వ్యక్తి అంకుల్ వైపు చూపించి అతడేనని చెప్పాడు. అతడు మాట పూర్తి చేస్తుండగానే వాళ్లు మమ్మల్ని కొట్టటం మొదలుపెట్టారు. వారి వెనుక చాలా మంది ఉన్నారు. వాళ్ల దగ్గర కర్రలు, బరిసెలు, రాళ్లు ఉన్నాయి. మా ఇంటి మీద రాళ్లు విసరటం మొదలుపెట్టారు'' అని వివరించారు.

వైరల్ వీడియలో ప్రధాన బాధితుడు మొహమ్మద్ సాజిద్, ''వాళ్లు ఇనుప తలుపును తోస్తూనే ఉన్నారు. తలుపు తెరుచుకోకపోవటంతో కిటికీ గ్రిల్ పగులగొట్టి ఇంటిపైకి వచ్చారు. నన్ను కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఆ ఘటన తలచుకుంటేనే భయంతో వణుకుపుడుతోంది. మేం ముస్లింలం. భారతదేశంలో నివసిస్తున్నాం. పాకిస్తాన్‌తో మాకేం సంబంధం?'' అని ప్రశ్నించారు.

''నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. కేసు వాపసు తీసుకోవాలని, బయట మాట్లాడి పరిష్కరించుకోవాలని వాళ్లు ఒత్తిడి చేస్తున్నారు. నేను నిర్ణయం తీసుకోను. అధికారయంత్రాంగం నుంచి సాయం లభించకపోతే నా పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటాను. ఈ స్థలం వదిలి వెళ్లిపోతాను.''

ఈ మాటలు చెప్తూ సాజిద్ వణికిపోయారు. ఆయనకు పక్క గదిలో నుంచి వచ్చిన ఒక బాలిక మంచినీళ్లు అందించింది. అవి తాగాక ఆయన కొంత నెమ్మదించాడు.

ఆయనతో మాట్లాడుతున్నపుడు నా కళ్లు గదిలో నేల మీద చెల్లాచెదురుగా పడివున్న గాజుపెంకుల మీదకు మళ్లాయి. గురువారం సాయంత్రం ఈ ఇంటి కిటికీ గాజుగ్లాసులే కాదు.. ఈ కుటుంబంలోని ప్రతి వ్యక్తి గుండె ముక్కలైంది.

మేం పై అంతస్తులోకి వెళ్లాం. అక్కడ ఒక చిన్నారి పాప ఆడుకుంటోంది. ఆమె మొఖం మీద లోతైన గాయం ఉంది. ఆ గాయం తాలూకు రక్తం ఇంకా పూర్తిగా ఆరిపోలేదు. ఆ దెబ్బ ఎలా తగిలిందని మేం ఆ పాపని అడిగినపుడు.. 'హోలీ అంకుల్ వాళ్లు వచ్చారు. అందరినీ కొట్టారు. నన్ను కూడా కొట్టారు. ఆ అంకుల్ వాళ్లు మళ్లీ వస్తారా?' అని అడిగింది.

ఐదేళ్ల ఆఫిఫా కూడా తన తాత ఇంటికి పండుగ చేసుకోవటానికి వచ్చింది. ఆమె కూడా వారి దాడిలో గాయపడింది. ''అంకుల్ వాళ్లు గ్రిల్ పగులగొట్టి ఇక్కడికి వచ్చారు. తాతను బాగా కొట్టారు. ఈ రక్తపు మరక తాతదే. అప్పుడు నేను అక్కడ దాక్కున్నా. అంకుల్ వాళ్లు నన్ను, మున్నీని కూడా కొట్టాడు. మా గేటును కూడా అంకుల్ వాళ్లు పగలగొట్టారు'' అని ఆమె చెప్పింది.

చిత్రం శీర్షిక ఐదేళ్ల ఆసిఫాను కూడా కొట్టి గాయపరిచారు

''దుష్ట ముస్లింలను మా గ్రామంలో ఉండనీయం''

ఈ కేసులో మహేశ్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడు సమీపంలోని నయాగావ్ నివాసి. నయా గావ్‌లోని మహేశ్ ఇంటి దగ్గరకి మేం వెళ్లినపుడు.. అతడి చెల్లెలు మాత్రమే ఉంది. ఆమె మాతో మాట్లాడటానికి నిరాకరించింది.

ఆ తర్వాత సమీపంలోని స్థానికులతో మాట్లాడటానికి మేం ప్రయత్నించాం. మొదట వాళ్లు మాట్లాడటానికి నిరాకరించారు. కానీ తర్వాత తమ పేర్లు వెల్లడించరాదన్న షరతు మీద మాట్లాడటానికి అంగీకరించారు.

''ఏమీ జరగలేదు. వాళ్లు గూండాలు. మేం టీ తాగుతున్నాం. వాళ్లు మా పిల్లల్ని వలలో వేసుకున్నారు. ఇప్పటివరకూ ముస్లింలు ఇక్కడ నివసించారు. ఇంతకుముందు ఎప్పుడూ ఎలాంటి గొడవల్లేవు. ఇప్పుడు ఈ దుష్టులు ప్రవేశించారు. వాళ్ల ఇళ్లలో ఒక్క పొయ్యి కూడా వెలగదు. ప్రతి ఒక్కరి పిల్లలూ దాక్కున్నారు. రెండు రోజుల తర్వాత పంచాయతీ జరుగుతుంది. ఊరి పిల్లలందరూ అక్కడ మాట్లాడతారు. దుష్టులను మా ఊళ్లో ఉండనివ్వం. వాళ్లు వాళ్ల ఇళ్లలో ఆయుధాలు ఉంచుకుంటారు. వాళ్లు ఈ ఊర్లో ఉండాలనుకుంటే మాకు పంచాయతీలో క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. క్షమాపణ చెప్పని వారిని గ్రామంలో బహిష్కరిస్తాం. వాళ్లకి సకలం బంద్ చేస్తాం'' అని వాళ్లు చెప్పారు.

చిత్రం శీర్షిక నయా గావ్ స్థానికులు

''సాజిద్ కుటుంబం క్రికెట్ ఆడుకుంటోంది. ఇద్దరు కుర్రాళ్ల బండి తాకి వాళ్లకి చిన్న దెబ్బలు తగిలాయి. ఆ కుర్రాళ్లని వాళ్లు కొట్టారు. ఈ కొట్లాట చూసి మా సమాజంలోని ఒక పెద్దాయన వారిని కాపాడటానికి వెళ్లాడు. ఆయనను ముస్లింలు బ్యాట్‌తో కొట్టారు. దీంతో ఆగ్రహించిన గ్రామ యువకులు వాళ్ల ఇంటికి వెళ్లారు'' అని స్థానికుడొకరు చెప్పారు.

నయాగావ్ గుజ్జర్ల ఆధిక్యం ఉన్న ప్రాంతం. ఇది పిల్లలకు సంబంధించిన గొడవ అని, దీనికి హిందూ - ముస్లిం పేరుతో మతం రంగు పులమటానికి ప్రయత్నిస్తున్నారని గ్రామస్థులు అంటున్నారు.

ఈ గొడవకు బాధిత కుటుంబం మతం రంగు పులుముతోందని నయా గావ్ ప్రజలు ఆరోపిస్తుంటే.. లఖన్ సింగ్ అనే స్థానిక పెద్ద.. ''ఈ దేశంలో హిందువులు ద్రోహులు, ముస్లింలు నిజాయతీపరులు. దేశంలో హిందువుల గొంతును అణచివేస్తున్నారు.. ముస్లింలు చెబుతున్నదే నిజమవుతోంది'' అని వ్యాఖ్యానించారు.

ఈ మాటలు విన్నపుడు.. ఈ వివాదానికి మతం రంగు ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నదెవరు అనేది నిర్ణయించటం కష్టంగా మారింది.

ఈ కేసులో బాధిత కుటుంబం, పోలీసులు, దాడి చేసిన వారు.. అందరికీ వారి సొంత దృక్కోణం ఉంది. కానీ.. వైరల్ వీడియో మూక దాడుల సమస్యను మరోసారి తెరపైకి తెచ్చింది. ఇండియాలో ఇటువంటి దాడులు ఎప్పుడు ఆగుతాయన్న ప్రశ్న మళ్లీ మనముందుకు వచ్చింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు

శ్రీలంక పేలుళ్లు న్యూజిలాండ్ మసీదుల్లో దాడులకు ప్రతీకారంగా జరిగినవా?

99 మార్కులు వస్తే 0 వేశారు.. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎందుకిన్ని పొరపాట్లు

లోక్‌సభ ఎన్నికలు 2019: సాయంత్రం 5 గంటలకు 62.16 శాతం పోలింగ్.. బెంగాల్‌లో ఘర్షణలు ఒకరి మృతి

ఈవీఎం వీవీ ప్యాట్‌ నుంచి రశీదు వస్తుందనుకుంటే పాము వచ్చింది

భారత ఓటర్లు ఏం కోరుకుంటున్నారు.. బలమైన నాయకత్వమా, ప్రజాస్వామ్యమా

డాకర్ ర్యాలీ: 5,600 కి.మీ. అత్యంత క్లిష్టమైన బైక్ రేస్‌ను పూర్తిచేసిన ఏకైక మహిళ

సీజేఐ గొగోయ్ మీద లైంగిక ఆరోపణలు: ఈ కేసు #MeToo కంటే పెద్దది. ఎందుకంటే..

ప్రెస్ రివ్యూ: ‘ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఖర్చు రూ. 8750 కోట్లు.. అంతా అవినీతి డబ్బే’