రాహుల్ గాంధీ: ''దేశంలోని ప్రతి పేద కుటుంబానికి రూ.72 వేల వరకు నగదు ఇస్తాం'' - కనీస ఆదాయ పథకంపై కాంగ్రెస్ అధ్యక్షుడి ప్రకటన

  • 25 మార్చి 2019
రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ Image copyright Twitter/@RahulGandhi

కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెడతామని రెండు నెలల క్రితం ప్రకటించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు ఈ పథకం విధివిధానాలను వెల్లడించారు.

పథకం కింద పేద కుటుంబాల్లో 20 శాతం కుటుంబాలకు ఏడాదికి రూ.72 వేల వరకు నగదు అందుతుందని రాహుల్ చెప్పారు. పథకంతో ఐదు కోట్ల కుటుంబాలు అంటే సుమారు 25 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందుతారని వెల్లడించారు. నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద కనీస ఆదాయ పథకం ఇదే అవుతుందని ఆయన చెప్పారు. బీజేపీ స్పందిస్తూ- ప్రస్తుతమున్న పథకాల కింద దేశంలోని పేద ప్రజలు రాహుల్ చెబుతున్న ప్రయోజనం కంటే ఎక్కువ ప్రయోజనమే పొందుతున్నారని చెప్పింది.

గెలవమని స్పష్టంగా తెలిసినప్పుడు చంద్రున్ని తెచ్చి చేతిలో పెడతానని కూడా ఓటరుకు హామీ ఇవ్వవచ్చంటూ రాహుల్ హామీని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ట్విటర్‌లో కొట్టిపారేశారు.

Image copyright Ravisankar Lingutla

''ఐదేళ్లుగా ప్రజలు ముఖ్యంగా పేదలు చాలా కష్టాలు పడుతున్నారు. ఈ దేశ పేద ప్రజలకు న్యుంతమ్ ఆయ్ యోజన (న్యాయ్-న్యాయం) పేరుతో కనీస ఆదాయ పథకాన్ని అందించాలని మేం నిర్ణయించుకున్నాం'' అని రాహుల్ దిల్లీలో మీడియా సమావేశంలో చెప్పారు.

నెలకు రూ.12 వేల కుటుంబ ఆదాయాన్ని'కటాఫ్'గా నిర్ణయించామని ఆయన చెప్పారు. అంటే నెలకు రూ.12 వేల కన్నా తక్కువ ఆదాయమున్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది.

ఈ కటాఫ్‌కు కుటుంబ ఆదాయానికి మధ్య ఎంత వ్యత్యాసం ఉంటే అంత డబ్బును ప్రభుత్వం అందిస్తుంది. ఉదాహరణకు కుటుంబ నెల ఆదాయం రూ.6 వేలు ఉంటే, ఈ పథకం కింద ప్రభుత్వం రూ.6 వేలు అందిస్తుంది.

ఆచరణ సాధ్యమేనంటున్న రాహుల్

కనీస ఆదాయ పథకంపై తమ పార్టీ సమగ్రమైన విశ్లేషణ జరిపిందని, అన్ని లెక్కలూ వేశామని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ హయాంలో తీసుకొచ్చిన మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరే ఈ పథకం కూడా ఆచరణ సాధ్యమేనని తెలిపారు.

Image copyright Twitter/RahulGandhi

మతం, కులం, భాష భేదం లేకుండా పేదలందరికీ సంవత్సరానికి 72 వేల రూపాయల వరకు నగదు బ్యాంకు ఖ్యాతాల్లో జమ చేస్తామని రాహుల్ చెప్పారు. ''ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని సంపన్నులకు డబ్బు ఇస్తున్నారు. కాంగ్రెస్ పేదలకు డబ్బు ఇస్తుంది'' అని వ్యాఖ్యానించారు.

'పేదరికంపై అంతిమ పోరాటం మొదలు'

పథకాన్ని దశల వారీగా అమలు చేస్తామని రాహుల్ తెలిపారు. ఈ పథకంతో పేదరికంపై అంతిమ పోరాటాన్ని ప్రారంభించామని, పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పారు.

తొలుత దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని, తర్వాత పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ఆయన చెప్పారు. ఈ పథకం కాంగ్రెస్ ఇస్తున్న హామీ అని, దీనిని నిలబెట్టుకుంటామని తెలిపారు. ఈ అంశంపై చాలా మంది ఆర్థికవేత్తల సలహాలను తీసుకున్నామన్నారు.

ఈ పథకం అమలుకు సుమారు 3.58 లక్షల కోట్ల రూపాయలు కావొచ్చనే అంచనా ఉంది.

Image copyright AFP

పథకం ప్రభావంపై భిన్న వాదనలు

ఇలాంటి పథకాలకు 'సార్వత్రిక కనీస ఆదాయం(యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్-యూబీఐ)' అనే భావన మూలం. యూబీఐని బ్రెజిల్, మరికొన్ని దేశాల్లో వేర్వేరు నమూనాల్లో అక్కడి అవసరాలకు అనుగుణంగా ప్రవేశపెట్టారు.

సాధారణంగా ఏదైనా దేశం లేదా రాష్ట్రంలో యూబీఐ పథకం ఉంటే పౌరులందరికీ కనీస ఆదాయాన్ని ప్రభుత్వమే బేషరతుగా అందిస్తుంది. ఆర్థిక స్థితి, సామాజిక స్థితి, ఉపాధితో సంబంధం లేకుండా నిర్ణీత సొమ్మును అందజేస్తుంది.

ఆర్థిక వ్యవస్థలో ఎవరి భాగస్వామ్యం ఎంతనేదానితో నిమిత్తం లేకుండా పౌరులందరికీ సముచిత ఆదాయం ఉండాలనే భావనే యూబీఐ పథకానికి మూలం. ఈ పథకం ప్రభావంపై భిన్న వాదనలు ఉన్నాయి.

పేదరిక నిర్మూలనకు యూబీఐ అత్యుత్తమ మార్గమని దీనిని సమర్థించేవారు చెబుతారు. ప్రతి ఒక్కరికీ గౌరవప్రదమైన జీవితం ఉండేలా పటిష్ఠమైన సామాజిక భద్రతను ఇది కల్పిస్తుందని అంటారు.

ఇది ఉత్పాదకతను తగ్గిస్తుందని దీనిని వ్యతిరేకించేవారు చెబుతారు. అత్యధికులు ప్రభుత్వం క్రమం తప్పకుండా తమ బ్యాంకు ఖాతాల్లో జమచేసే డబ్బు కోసం ఎదురుచూస్తారే తప్ప పనిపై ఆసక్తి చూపరని, ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భాగస్వాములు కాబోరని వారు వాదిస్తారు.

మద్దతు పలికిన నాటి ఆర్థిక సర్వే

యూబీఐ పథకానికి 2016-17 ఆర్థిక సర్వే మద్దతు పలికింది. ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్)తోపాటు ప్రజలకు కల్పిస్తున్న ఇతర ప్రయోజనాల స్థానంలో యూబీఐని తీసుకురావొచ్చని అప్పటి ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించారు.

చిత్రం శీర్షిక అరవింద్ సుబ్రమణియన్

ఆర్థిక సర్వే ఏం చెప్పిందంటే...

1) విధానపరంగా చూస్తే యూబీఐ ఎంతో ఆకర్షణీయమైనదని చెప్పింది. పేదరిక నిర్మూలన కోసం అమలు చేస్తున్న వివిధ సామాజిక సంక్షేమ పథకాలకు యూబీఐ పథకం ప్రత్యామ్నాయం కాగలదని వ్యాఖ్యానించింది.

2) యూబీఐ పథకం అమల్లో చాలా సవాళ్లు ఉంటాయని చెప్పింది. ఇప్పటికే ఉన్న పేదరిక నిర్మూలన, సంక్షేమ పథకాలకు ప్రత్యామ్నాయంగా కంటే కూడా వాటికి అదనపు పథకంగా ఇది మారే ముప్పు ఉందని, అదే జరిగితే ఆర్థికంగా ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయపడింది.

3) యూబీఐ విజయవంతం కావడమనేది ప్రధానంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ''మొదటి అంశమేంటంటే- జన్‌ధన్ ఖాతాల వినియోగం, ఆధార్ అనుసంధానం, మొబైల్ వాడకం ఉండటం. ఇది నగదు నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకి పంపడానికి ఉపయోగపడుతుంది. రెండోదేమిటంటే- పథకం వ్యయంలో ఎవరు ఎంత భరించాలనేదానిపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే చర్చలు'' అని వివరించింది.

4) పేదరికాన్ని అర (0.5) శాతానికి తగ్గించే విధంగా యూబీఐ పథకాన్ని అమలు చేయాలంటే స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో నాలుగు నుంచి ఐదు శాతం వరకు వ్యయమవుతుందని అంచనా వేసింది. ఆదాయం మెరుగ్గా ఉన్నవారిలో మొదటి 25 శాతం మందిని మినహాయించి పథకాన్ని అమలు చేస్తే వ్యయం ఇలా ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పుడు మధ్యతరగతికి అందిస్తున్న రాయితీలు, ఆహారం, పెట్రోలియం, ఎరువుల రాయితీల వాటా జీడీపీలో ఇంచుమించు మూడు శాతంగా ఉందని ప్రస్తావించింది.

5) యూబీఐ ఒక శక్తిమంతమైన ఆలోచన అని, దీనిని అమలు చేయాల్సిన సమయం ఇంకా రాలేదని అనుకున్నా, దీనిపై లోతైన చర్చ జరగాల్సిన తరుణమైతే వచ్చిందని వ్యాఖ్యానించింది.

Image copyright Getty Images

యూబీఐ స్వరూపం ఏమిటి?

యూబీఐ అమలుకు మద్దతు కూడగట్టే మేధావులు, నిపుణులతో కూడిన 'బేసిక్ ఇన్‌కమ్ ఎర్త్ నెట్‌వర్క్(బీఐఈఎన్)' - ఈ పథకంలో ప్రధానంగా ఐదు అంశాలు ఉంటాయని చెబుతోంది.

1) అంతా ఒకేసారి కాకుండా నిర్ణీత వ్యవధిలో విడతల వారీగా డబ్బు అందించడం.

2) ఆహార వోచర్లు, సేవా కూపన్లు లాంటివి ఇవ్వడం కాకుండా నగదు ఇవ్వడం.

3 ) కుటుంబం లెక్కన కాకుండా ప్రతి వ్యక్తికీ ఇవ్వడం.

4) సార్వజనీనంగా పౌరులందరికీ అందజేయడం.

5) ఆదాయం లేదా ఉపాధితో నిమిత్తం లేకుండా బేషరతుగా ఇవ్వడం.

Image copyright Getty Images

ఇతర దేశాల అనుభవాలు?

యూబీఐని లాటిన్ అమెరికాలోని బ్రెజిల్, వాయువ్య ఐరోపాలోని నెదర్లాండ్స్‌తోపాటు మరికొన్ని దేశాల్లో వేర్వేరు నమూనాల్లో ప్రవేశపెట్టారు.

1) 'బోల్సా ఫ్యామిలియా (కుటుంబ ఆదాయం)' పేరుతో బ్రెజిల్‌ 2003 నుంచి యూబీఐ తరహా పథకం అమలు చేస్తోంది. పథకం కొనసాగింపుపై మొదట్లో కొన్ని సందేహాలు వ్యక్తమైనా, ఇప్పటికీ ఇది అమలవుతోంది. ఈ పథకం పేదరికం ప్రభావాన్ని తగ్గించిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది. అంతేగాకుండా యువతకు మెరుగైన అవకాశాల కల్పన ద్వారా పేదరిక నిర్మూలనకు, విద్య, వైద్య సౌకర్యాల అభివృద్ధికి కూడా ఇది ఎంతో తోడ్పడిందని చెప్పింది.

2) ఐరోపాలో జాతీయ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని తొలిసారిగా అమలు చేసిన దేశం ఫిన్‌లాండే. సామాజిక భద్రత వ్యవస్థను సమూలంగా మార్చేందుకు, బ్యూరోక్రసీని తగ్గించేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం ఈ ప్రయోగంలో పరిశీలించింది. రెండు వేల మంది నిరుద్యోగులకు మాత్రమే ప్రభుత్వం ఈ పథకాన్ని వర్తింపజేసింది. దీనిని ఇక కొనసాగించబోమని ఇటీవలే ప్రకటించింది.

3) కెనడాలోని ఓంటారియో రాష్ట్రం సామాజిక సంక్షేమ పథకాల కన్నా యూబీఐ మెరుగైనదా, కాదా అన్నది తేల్చేందుకు 2017లో మూడు ప్రాంతాల్లో దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టింది. మూడేళ్లపాటు అమలు చేయాలనుకున్న ఈ పథకాన్ని ప్రారంభించిన కొన్ని నెలలకే ఆపేసింది. దీనిని సుదీర్ఘకాలం అమలు చేయలేమని ప్రభుత్వం చెప్పింది.

4) వాయువ్య ఐరోపాలోని నెదర్లాండ్స్‌లో, దక్షిణ ఐరోపాలోని ఇటలీలో ప్రయోగాత్మకంగా యూబీఐ అమలును చేపట్టారు.

5) ఆఫ్రికాలోని కెన్యా పశ్చిమ ప్రాంతంలో ఉండే ఒక గ్రామంలో పెద్దవాళ్లలో ఒక్కొక్కరికి నెలకు 22 డాలర్లు చొప్పున ప్రభుత్వం డబ్బు అందిస్తోంది. ఈ పథకాన్ని 12 ఏళ్లపాటు అమలు చేయాలని నిర్ణయించారు. క్రమం తప్పకుండా నేరుగా డబ్బు ఇస్తే ప్రజలను పేదరికం నుంచి బయటపడేయవచ్చా అన్నది ఇక్కడ పరీక్షిస్తున్నారు.

Image copyright JOHNNY MILLER/MILLEFOTO
చిత్రం శీర్షిక యూబీఐ అమలును చేపట్టిన వివిధ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఆర్థిక అసమానతలు ఎక్కువనే వాదన ఉంది

భారత్‌లో ఇది సాధ్యమా, కాదా?

యూబీఐ అమలును చేపట్టిన ఏ దేశం లేదా ప్రాంతంలోనూ ప్రజల ఆదాయాల్లో భారత్‌లో ఉన్నన్ని అంతరాలు లేవు. దీనిని బట్టి చూస్తే సిక్కింలో విజయవంతమయ్యే అవకాశమున్న యూబీఐ, బిహార్ లాంటి పేద రాష్ట్రంలో పనిచేస్తుందని చెప్పలేమనే వాదన ఉంది.

బేషరతుగా సామాజిక భద్రత కల్పించడంలో అత్యల్ప ఆదాయమున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని ప్రపంచ బ్యాంకు నిరుడు విడుదల చేసిన ఒక ముసాయిదా నివేదికలో కనీస ఆదాయ విధానంపై చర్చలో పేర్కొంది.

కనీస ఆదాయాన్ని అందరికీ కల్పించాలనే యూబీఐ సూత్రానికి ఈ వాదన విరుద్ధమే అయినప్పటికీ, అత్యంత దుర్భర పరిస్థితుల్లోని ప్రజలకు ప్రాధాన్యమివ్వడం అవసరమని ప్రపంచ బ్యాంకు చెప్పింది.

సిక్కిం: మిగులు విద్యుత్ అమ్మి అమలు చేస్తామన్న పాలక పక్షం

యూబీఐ పథకం అమలుకు ఈశాన్య భారత్‌లోని సిక్కిం పాలక పక్షం 'సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్(ఎస్‌డీఎఫ్)' ఇంతకుముందే హామీ ఇచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాము తిరిగి అధికారంలోకి వస్తే 2022 నుంచి యూబీఐని అమలు చేస్తామని, దీనికి తమ పార్టీ, ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్ కట్టుబడి ఉన్నట్లు ఎస్‌డీఎఫ్ లోక్‌సభ సభ్యుడు ప్రేమ్ దాస్ రాయ్ చెప్పారు.

యూబీఐని చాలా మంది ఆర్థికవేత్తలు సమర్థిస్తున్నారని, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ పథకం బాగా పనిచేస్తుందని, దీనిపై 2017లోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలో చర్చ జరిగిందని ప్రేమ్ దాస్ రాయ్ తెలిపారు. గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో, వివిధ గిరిజన ప్రాంతాల్లో ఓ మోస్తరు నమూనాలతో ఈ పథకాన్ని అమలు చేసి చూశారని, ఇది సత్ఫలితాలు ఇస్తున్నట్లు వెల్లడైందని చెప్పారు. సిక్కింలో మాత్రం ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి ఈ పథకం కింద డబ్బు అందిస్తామని తెలిపారు. ఉపాధితో సంబంధం లేకుండా కుటుంబాలకు డబ్బు అందించడమే ఈ పథకంలో ప్రధానాంశమన్నారు.

చిత్రం శీర్షిక పవన్ చామ్లింగ్ నాయకత్వంలోని సిక్కిం ప్రభుత్వం ఈ పథకం సాధ్యాసాధ్యాలను ఇప్పటికే పరిశీలించింది

ఈ పథకం అమలు సాధ్యాసాధ్యాలను సిక్కిం ప్రభుత్వం ఇప్పటికే పరిశీలించింది.

జలవిద్యుత్ ప్రాజెక్టులను విజయవంతంగా అమలు చేయడంవల్ల సిక్కింలో మిగులు విద్యుత్ ఎక్కువగా ఉంటోంది.

''సిక్కింలో 2200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. వచ్చే కొన్నేళ్లలో ఇది మూడు వేల మెగావాట్లకు చేరుతుంది. సిక్కిం అవసరాలకు 200 నుంచి 300 మెగావాట్ల విద్యుత్ సరిపోతుంది. మిగిలిన విద్యుత్‌ను అమ్మడం వల్ల వచ్చే డబ్బు సిక్కిం ప్రజలది, యూబీఐ రూపంలో దీనిని వారికే అందిస్తాం'' అని ఎస్‌డీఎఫ్ చెబుతోంది. తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఎస్‌డీఎఫ్ ఉంది.

Image copyright Getty Images

ఇది తాయిలం కాదు, ప్రజలపై నమ్మకమన్న ఎస్‌డీఎఫ్

యూబీఐని ప్రవేశపెట్టేందుకు అవసరమైన ప్రక్రియ ఇప్పటికే మొదలైందని ప్రేమ్ దాస్ రాయ్ తెలిపారు. ఇతర రాయితీలు, భత్యాలను కూడా యూబీఐ పరిధిలోకి తీసుకొచ్చి, నెలనెలా నిర్ణీత సొమ్మును లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. ఇది యువతకు ఎక్కువగా ఉపయోగపడుతుందని, వారు ఆదాయం గురించి ఆందోళన చెందకుండా భవిష్యత్తు గురించి ఆలోచించవచ్చని అభిప్రాయపడ్డారు.

యూబీఐను తాయిలంగా భావించకూడదని, దీని కింద డబ్బు ఇవ్వడమంటే బాధ్యతాయుతంగా సొమ్మును ఖర్చుచేస్తారనే నమ్మకాన్ని ప్రజలపై ఉంచడమని ఆయన వ్యాఖ్యానించారు.

సిక్కిం ఖజానాకు రాబడి నిలకడగా వస్తుంది. రాష్ట్రంలో దారిద్ర్యరేఖకు దిగువనున్న (బీపీఎల్) జనాభా శాతం జాతీయ సగటు కంటే తక్కువగా ఉంటుంది. నెలవారీ తలసరి వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1444గా, పట్టణ ప్రాంతాల్లో రూ.2,538గా ఉంది.

2011 గణాంకాల ప్రకారం సిక్కిం జనాభా 6,10,577. అక్షరాస్యత శాతం 82.6.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)