నిజామాబాద్‌: కవితపై 236 మంది పోటీ చేయడం వెనుక కారణమేంటి?

  • 25 మార్చి 2019
కల్వకుంట్ల కవిత Image copyright KAVITHA/FB
చిత్రం శీర్షిక కల్వకుంట్ల కవిత

తెలంగాణలోని నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి అత్యధికంగా 245 నామినేషన్లు దాఖలు అయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కుమార్తె, సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఇక్కడి నుంచే పోటీ పడుతున్నారు.

ఎంపీ కవిత తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడం వల్లే ఆమెపై రైతులు, వారి ప్రతినిధులే 236 మంది పోటీకి దిగుతున్నట్లు నామినేషన్ వేసినవారిలో పలువురు బీబీసీ తెలుగుకు తెలిపారు.

Image copyright Pasupujonnalamspsadhanasamiti
చిత్రం శీర్షిక ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు ఫిబ్రవరిలో రహదారులపై బైఠాయించారు.

ఇంతకీ సమస్య ఏమిటి?

పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధరలను పెంచాలని నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లోని రైతులు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నారు.

ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరిలో రహదారులపై బైఠాయించారు. రోడ్లను దిగ్బంధం చేశారు. వంటావార్పు చేపట్టారు. చలో అసెంబ్లీకి పిలుపునిస్తే పోలీసులు అడ్డుకొన్నారు.

‘‘ఎన్ని ఆందోళనలు చేసిన స్పందన కనిపించలేదు. అందుకే ఎన్నికల్లో మూకుమ్మడి నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ప్రతీ గ్రామం నుంచి ఇద్దరు రైతులు కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్ లోక్‌సభ బరిలో నిలవాలని నిర్ణయించుకున్నాం'' అని నామినేన్ వేసిన ఆర్మూరు రైతు వెంకటేశ్ కోల బీబీసీకి చెప్పారు.

Image copyright Pasupujonnalamspsadhanasamiti
చిత్రం శీర్షిక నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 242 మంది నామినేషన్ల వేశారు

కవితపైనే ఎందుకు నామినేన్ వేయాలని నిర్ణయించుకున్నారని ప్రశ్నించగా, ''గత ఎన్నికల్లో పసుపు బోర్డును తీసుకురాకపోతే, పసుపుకు రూ.10వేలు మద్దతు సాధించలేకపోతే మీ ఊరికి ఓటు అడగటానికి రానని ఆమె సవాల్ చేశారు. తాము రాజకీయ నాయకులం కాదు. ఉద్యమకారులం.. మాట చెబితే నికార్సుగా దాని మీద నిలబడతాం అని అన్నారు. ఐదేళ్లు గడిచాయి. మేం ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా సరైన రీతిలో స్పందించలేదు. అందుకే ఆమెపై ఈ వినూత్న నిరసనకు దిగాం'' అని ఆయన తెలిపారు.

Image copyright Pasupujonnalamspsadhanasamiti

''వాస్తవానికి ఊరికి ఇద్దరు చొప్పున వెయ్యి మంది రైతులు నామినేషన్లు వేయాలి. కానీ, టీఆర్ఎస్ నాయకుల ఒత్తిళ్లు, బెదిరింపుల మూలంగా ఆర్మూరు, నిజమాబాద్ రూరల్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల నుంచి 236 మంది రైతులు నామినేషన్లు వేశారు'' అని చెప్పారు.

Image copyright Pasupujonnalamspsadhanasamiti

'నా మీద కాదు మోదీ, రాహుల్ మీద పోటీ చేయండి'

తనపై పోటీకి మూకుమ్మడిగా నామినేషన్లు వేస్తున్నారనే వార్తలపై ఇటీవల నిజామాబాద్‌లో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలో కవిత స్పందించారు.

''నామినేషన్లు వేయాల్సింది నా పై కాదు.. ప్రధాని మోదీ పోటీ చేసే వారణాసిలో, రాహుల్ గాంధీ పోటీ చేసే ఆమేథీలో వేయాలి. అందుకోసం నిజామాబాద్ నుంచి వెయ్యి మంది నామినేషన్లు వేద్దాం. ఇక్కడ నామినేష్లను వేస్తున్నది రైతులు కాదు.. రైతుల ముసుగులో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఈ పని చేయిస్తున్నారు'' అని విమర్శించారు.

దీనిపై రైతు వెంకటేశ్ మాట్లాడుతూ, ''అమేథీ, వారణాసిలో కవిత నామినేన్లు వేయాలి. మా పరిధిలో ఉంది మేం చేస్తున్నాం. మా రైతులందరిదీ ఇదే మాట'' అని చెప్పారు.

దేశంలో అత్యధికంగా నల్లగొండలో..

మూకుమ్మడిగా నామినేషన్లు వేయడం తెలంగాణలో ఇదే తొలిసారి కాదు. 1996 ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ స్థానానికి ఏకంగా 515 మంది నామినేషన్లు వేశారు. తమ ప్రాంతానికి సాగు, తాగు నీటి సౌకర్యం కల్పించాలని జలసాధన సమితి నేతృత్వంలో స్థానికులు ఇలా నామినేషన్ వేసి నిరసన తెలిపారు.

అయితే, స్క్రూటీని అనంతరం 35 మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 480 మందికి పోటీ చేసే అవకాశం కలిగింది. అత్యధిక మంది పోటీకి దిగడంతో నల్లగొండ పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు నెల రోజుల పాటు వాయిదా వేశారు.

ఇప్పటి వరకు ఒక పార్లమెంట్ స్థానం నుంచి అత్యధిక మంది అభ్యర్థులు పోటీ చేసిన రికార్డు నల్లగొండ పేరిటే ఉంది. ఆ తర్వాత స్థానం కర్నాటకలోని బెల్గాం నియోజకవర్గానిది. ఇక్కడ 1996లో 456 మంది పోటీ చేశారు. ఇదే సంవత్సరం తూర్పు దిల్లీ నియోజకవర్గం నుంచి 122 మంది బరిలోకి దిగారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం