తండ్రిపై కూతురు.. అన్నపై తమ్ముడి పోటీ.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో బంధువర్గం

  • 26 మార్చి 2019
పార్టీల నేతలు

రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌న్న‌ది నానుడి. కానీ బంధువులు, బంధుత్వాల‌కు ఎప్పుడూ పెద్ద పీట వేస్తుంటార‌న్న‌ది వాస్త‌వం. తాజాగా ఆంధ్రప్ర‌దేశ్ ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న అభ్యర్థులను ప‌రిశీలిస్తే ఈ విష‌యం స్ప‌ష్టం అవుతోంది.

దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ పోటీ ప‌డుతున్న వారిలో స‌మీప బంధువుల సంఖ్య ఎక్కువ‌గానే క‌నిపిస్తోంది.

నారా- నందమూరి

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు బంధువులు పలువురు ఈ ఎన్నికల్లో పోటీ ప‌డుతున్నారు. చంద్ర‌బాబు త‌న‌యుడు, టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప్ర‌త్య‌క్ష పోరుకి తొలిసారిగా సిద్ధ‌మ‌య్యారు. ఆయ‌న గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ త‌న‌యుడు, చంద్ర‌బాబు వియ్యంకుడు కూడా అయిన నంద‌మూరి బాల‌కృష్ణ అనంత‌పురం జిల్లా హిందూపురం నుంచి రెండోసారి బరిలోకి దిగారు.

బాల‌కృష్ణ చిన్న‌ల్లుడు, నారా లోకేశ్ తోడ‌ల్లుడు భ‌ర‌త్ తొలిసారి విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు.

Image copyright kinjarapu rammohan naidu

కింజ‌రాపు కుటుంబీకుల‌కు పెద్ద పీట‌

టీడీపీ దివంగ‌త నేత కింజ‌రాపు ఎర్రం నాయుడు స‌మీప బంధువులు కూడా ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు.

ఆయ‌న వార‌సుడిగా కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా మరోసారి పోటీ చేస్తున్నారు.

ఎర్రంనాయుడి సోద‌రుడు, మంత్రి అచ్చెన్నాయుడు టెక్క‌లి అసెంబ్లీ స్థానం నుంచి మ‌రోసారి రంగంలోకి దిగారు.

Image copyright SrinivasAdireddy
చిత్రం శీర్షిక ఆదిరెడ్డి భవానీ

ఎర్రంనాయుడి కుమార్తె, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడ‌లు అదిరెడ్డి భ‌వానీ తొలిసారిగా రాజమ‌హేంద్ర‌వ‌రం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ పడుతున్నారు.

రామ్మోహ‌న్ నాయుడి మామ విశాఖ జిల్లా పెందుర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణ మ‌రోసారి బ‌రిలో దిగారు.

కిమిడి క‌ళా వెంక‌ట్రావు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల స్థానంలో పోటీప‌డుతున్నారు. ఆయ‌న స‌మీప బంధువు, మాజీ మంత్రి కిమిడి మృణాళిని త‌న‌యుడు కిమిడి నాగార్జున రాజ‌కీయ అరంగేట్రం చేసి విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నుంచి పోటీప‌డుతున్నారు. ప్ర‌స్తుతం త‌ల్లి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న స్థానంలో ఈసారి కుమారుడికి అవ‌కాశం క‌ల్పించారు.

Image copyright fb/ashokvizianagaram

గజపతి కుటుంబం

కేంద్ర మాజీ మంత్రి , సీనియ‌ర్ నేత పూస‌పాటి అశోక్‌గజపతిరాజు సిట్టింగ్ సీటు విజయనగరం ఎంపీ స్థానానికి మ‌ళ్లీ పోటీ చేస్తున్నారు. తొలిసారిగా అదే కుటుంబం నుంచి అశోక్ గ‌జ‌ప‌తిరాజు కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత‌ను కాద‌ని అదితికి అవ‌కాశం ఇచ్చారు.

Image copyright fb/GantaSrinivasaRaoOfficial

గంటా వారసులు

విశాఖ జిల్లాకి చెందిన మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఈసారి విశాఖ ఉత్త‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ ప‌డుతున్నారు. ఆయ‌న వియ్యంకుడు పుల‌ప‌ర్తి రామాంజ‌నేయులు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం నుంచి వ‌రుస‌గా మూడోసారి పోటీ చేస్తున్నారు. గంటా స‌మీప బంధువు ప‌రుచూరి భాస్క‌ర‌రావు జ‌న‌సేన త‌రుపున అన‌కాప‌ల్లి నుంచి పోటీ చేస్తున్నారు.

Image copyright fb/andhrapradeshcm

య‌న‌మ‌ల బంధువులు

ఆర్థిక మంత్రి, టీడీపీ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లో ఆయ‌న ప్ర‌త్య‌క్ష పోరుకి దూరంగా ఉన్నారు. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం తూర్పు గోదావ‌రి జిల్లా తునిలో సోద‌రుడు య‌న‌మ‌ల కృష్ణుడు మ‌ళ్లీ పోటీ చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు.

ఇక య‌న‌మ‌లతో పాటు తెలంగాణ మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌కు కూడా వియ్యంకుడైన టీటీడీ చైర్మ‌న్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ క‌డ‌ప జిల్లా మైదుకూరు నుంచి మ‌ళ్లీ పోటీ ప‌డుతున్నారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఆయ‌న ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Image copyright C.CHANDRA KANTH RAO

క‌ర్నూలులో నాలుగు కుటుంబాలు

తెలుగుదేశం పార్టీ తరుపున క‌ర్నూలు జిల్లాలో మూడు కుటుంబాల‌కు అవ‌కాశాలు ద‌క్కాయి. అందులో ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి కుటుంబానికి రెండు సీట్లు కేటాయించారు. ఈసారి కేఈ కృష్ణ‌మూర్తి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌డంతో ఆయ‌న స్థానంలో త‌న‌యుడు కేఈ శ్యాంబాబు ప‌త్తికొండ నుంచి పోటీ ప‌డుతున్నారు. కేఈ ప్ర‌తాప్‌కి డోన్ సీటు కేటాయించారు.

మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య‌ప్ర‌కాశ్ రెడ్డి కొద్దికాలం క్రిత‌మే టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. ఆయ‌న‌కు క‌ర్నూలు లోక్‌స‌భ టికెట్ ద‌క్క‌గా, ఆయ‌న భార్య కోట్ల సుజాత‌మ్మ ఆలూరు నుంచి బరిలో ఉన్నారు.

మ‌రో మంత్రి భూమా అఖిల ప్రియ ఆళ్ల‌గ‌డ్డ నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె సోద‌రుడు, నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలిచిన భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి టికెట్ ద‌క్కించుకున్నారు. బ్ర‌హ్మానంద‌రెడ్డి సొంత మామ కాట‌సాని రామిరెడ్డి వైసీపీ త‌రుపున బ‌న‌గాన‌ప‌ల్లిలో పోటీ ప‌డుతుండ‌గా, రామిరెడ్డి సోద‌రుడు కాట‌సాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం బ‌రిలో వైసీపీ అభ్య‌ర్థిగా ఉన్నారు. స‌మీప బంధువులు రెండు ప్ర‌ధాన పార్టీల త‌రపున పోటీ ప‌డుతుండ‌డం విశేషం.

క‌ర్నూలు జిల్లాల‌కే చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేశ్ త‌న‌యుడు టీజీ భ‌ర‌త్ కి క‌ర్నూలు ఎమ్మెల్యే టికెట్ ద‌క్కింది.

మ‌రో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబంతో సమీప బంధుత్వం ఉన్న రాయపాటి న‌రసరావుపేట ఎంపీగా బ‌రిలో ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన వియ్యంకులు జీవీ ఆంజ‌నేయులు వినుకొండ నుంచి, కొమ్మలపాటి శ్రీధర్‌ పెదకూరపాడు నియోజక వర్గాల నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు.

Image copyright fb/jcdiwakarreddy
చిత్రం శీర్షిక జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం

జేసీ కుటుంబం నుంచి ఇద్దరు వారసులు

అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబం నుంచి ఇద్ద‌రు వార‌సులు ఎన్నికల బరిలో నిలిచారు. జేసీ ప‌వ‌న్ రెడ్డి త‌న తండ్రి దివాక‌ర్ రెడ్డి స్థానంలో అనంత‌పురం ఎంపీ స్థానం నుంచి పోటీ ప‌డుతుండ‌గా, జేసీ అస్మిత్ రెడ్డి కూడా తండ్రి ప్ర‌భాక‌ర్ రెడ్డి స్థానంలో తాడిప‌త్రి ఎమ్మెల్యే సీటు ద‌క్కించుకున్నారు.

ఇక జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి సొంత బావ‌మ‌రిది న‌ల్ల‌పురెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి వైసీపీ త‌రుఫున నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పోటీ చేస్తున్నారు.

Image copyright fb/ysrcpofficial

వైసీపీలోనూ అదే వ‌రుస‌

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌ పులివెందుల నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. ఆయన బాబాయి కొడుకు వైఎస్‌.అవినాష్‌ రెడ్డి కడప లోక్‌సభ నుంచి, మేనమామ రవీంద్రనాథ రెడ్డి కమలాపురం నుంచి పోటీప‌డుతున్నారు. ఈ ముగ్గురు సిట్టింగ్ సీట్ల‌లోనే బరిలో ఉన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి, ఆయ‌న సోద‌రుడు ధ‌ర్మాన కృష్ణ‌దాసు న‌ర‌స‌న్న‌పేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గ‌తంలో వీరిద్ద‌రూ ఆయా స్థానాల‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యారు.

విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన మ‌రో మాజీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ కుటుంబీకుల‌కు కూడా మూడు టికెట్లు ద‌క్కాయి. బొత్స సత్యనారాయణ చీపురుప‌ల్లి నుంచి పోటీ ప‌డుతున్నారు. ఆయ‌న సోద‌రుడు అప్ప‌ల న‌ర‌స‌య్య గ‌జ‌ప‌తిన‌గ‌రం స్థానాన్ని ద‌క్కించుకోగా, తోడ‌ల్లుడు అప్ప‌ల‌నాయుడు నెల్లిమ‌ర్ల నుంచి రంగంలో ఉన్నారు.

కర్నూలు జిల్లా శ్రీశైలం నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన సోదరుడి కుమారుడు, శిల్పా రవిచంద్రారెడ్డి నంద్యాల నుంచి వైసిపి తరపున తొలిసారిగా రంగంలోకి వ‌చ్చారు. ఎమ్మెల్సీగా ఉన్న గంగుల ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌న‌యుడు గంగుల బిజేంద్ర‌నాథ్ రెడ్డి ఆళ్లగడ్డ నుంచి పోటీ ప‌డుతున్నారు.

చిత్తూరు జిల్లాకి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు స్థానంలో పోటీలో ఉండ‌గా, ఆయ‌న సోద‌రుడు పెద్దిరెడ్డి ద్వార‌కానాధ్ రెడ్డి తంబళ్లపల్లి నియోజక వర్గం నుంచి పోటీ ప‌డుతున్నారు. ఇక రామచంద్రారెడ్డి త‌నయుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ స్థానం కోసం పోటీ ప‌డుతున్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజక వర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న‌ ఆళ్ల రామకృష్ణారెడ్డి మ‌రోసారి బరిలో ఉన్నారు. ఆయన స‌మీప బంధువు మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి గుంటూరు లోక్‌సభ సీటులో వైసీపీ అభ్య‌ర్థిగా పోటీ ప‌డుతున్నారు.

నెల్లూరు ఎంపీ స్థానానికి వైసీపీ అభ్య‌ర్థిగా ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి అనూహ్యంగా తెర‌మీద‌కు వ‌చ్చారు. ఆయ‌న వియ్యంకుడు మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఉద‌యగిరి అసెంబ్లీ స్థానం కోసం పోటీ ప‌డుతున్నారు. ఇక మేక‌పాటి కుటుంబానికి చెందిన మాజీ ఎంపీ రాజ‌మోహ‌న్ రెడ్డి త‌న‌యుడు మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి సిట్టింగ్ సీటు ఆత్మ‌కూరు కోసం మ‌ళ్లీ ప‌డుతున్నారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తోడ‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర రావు మ‌రోసారి ప్ర‌కాశం జిల్లా ప‌ర్చూరు నుంచి ప‌డుతున్నారు. ఆయ‌న ఈసారి వైసీపీ అభ్య‌ర్థిగా రంగంలో ఉన్నారు.

Image copyright fb/janasenaparty
చిత్రం శీర్షిక పవన్ కల్యాణ్, నాగబాబు

జ‌న‌సేన‌లోనూ అదే సీన్

వార‌స‌త్వ రాజ‌కీయాలకు వ్య‌తిరేకంగా మాట్లాడే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీలో కూడా ప‌లువురు బంధువుల‌కు టికెట్లు ద‌క్కాయి. స్వ‌యంగా ప‌వ‌న్ అటు భీమ‌వ‌రం, ఇటు గాజువాక రెండు స్థానాల నుంచి పోటీ చేస్తుండ‌గా సోద‌రుడు నాగ‌బాబు న‌ర్సాపురం పార్ల‌మెంట్ స్థానంలో పోటీప‌డుతున్నారు.

నాగ‌బాబు తోడ‌ల్లుడు,మాజీ ఎమ్మెల్యే చింత‌ల‌పూడి వెంక‌ట్రామ‌య్య పెందుర్తి నుంచి అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్నారు.

వైసీపీ త‌రుపున భీమిలి నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ అవంతి శ్రీనివాస్ సోద‌రుడు ముత్తంశెట్టి కృష్ణారావు కి జ‌న‌సేన త‌రుపున అవ‌నిగ‌డ్డ నుంచి అవ‌కాశం ద‌క్కింది. ఇక భీమ‌వ‌రం వైసీపీ అభ్య‌ర్థి గ్రంధి శ్రీనివాస్ , తూర్పు గోదావ‌రి జిల్లా కొత్త‌పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్య‌ర్థి స‌త్యానంద‌రావు స్వ‌యంగా బావ‌, బావ‌మ‌రుదులు.

Image copyright Ministry of Panchayati Raj
చిత్రం శీర్షిక కిశోర్ చంద్రదేవ్

ఒక‌రిపై ఒక‌రు

ఒకే పార్టీ త‌రపున కొంద‌రు, వేరు వేరు పార్టీల త‌రపున మరికొంద‌రు ప‌డుతుండ‌గా స‌మీప బంధువులు ముఖాముఖీగా త‌ల‌ప‌డుతున్న స్థానాలు కూడా ఉన్నాయి.

విశాఖ జిల్లా అర‌కు పార్ల‌మెంట్ స్థానం కోసం మాజీ ఎంపీ వైరిచ‌ర్ల కిశోర్ చంద్ర‌దేవ్ పోటీ ప‌డుతున్నారు. ఆయ‌న టీడీపీలో చేరి టికెట్ ద‌క్కించుకున్నారు. ఆయ‌న‌కు పోటీగా కాంగ్రెస్ త‌రఫున శృతిదేవి పోటీ చేస్తున్నారు. ఆమె కిశోర్ చంద్ర‌దేవ్‌కి స్వ‌యంగా కూతురు కావ‌డం విశేషం.

Image copyright ShrutiDevi
చిత్రం శీర్షిక వైరిచర్ల శ్రుతిదేవి

తూర్పు గోదావ‌రి జిల్లా కొత్త‌పేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో అన్న‌ద‌మ్ములు పోటీ ప‌డుతున్నారు. టీడీపీ త‌రుపున మాజీ ఎమ్మెల్యే బండారు స‌త్యానంద‌రావు పోటీ చేస్తుండ‌గా, జ‌న‌సేన అభ్య‌ర్థిగా బండారు శ్రీనివాస్ బరిలో ఉన్నారు.

ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే వై విశ్వేశ్వ‌ర్ రెడ్డికి మ‌ళ్లీ టికెట్ ద‌క్క‌గా, మంత్రాల‌యం నుంచి పోటీ చేస్తున్న వై బాల‌నాగిరెడ్డి, ఆదోని నుంచి పోటీ చేస్తున్న వై సాయి ప్ర‌సాద్ రెడ్డి, అనంత‌పురం అర్బ‌న్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వై. అనంత వెంక‌ట్రామిరెడ్డి కూడా స‌మీప బంధువులే కావ‌డం విశేషం.

మంత్రాల‌యం, అధోని నుంచి బాల‌నాగిరెడ్డి, సాయి ప్ర‌సాద్ రెడ్డి కూడా ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు