నీలం సంజీవరెడ్డి: ఆ ఒక్క మాట... ఆయనను రాష్ట్రపతి కాకుండా చేసింది

  • 28 మార్చి 2019
ఇందిరా గాంధీ, నీలం సంజీవరెడ్డి Image copyright Getty Images

ఆ ఒక్క మాట.. నీలం సంజీవ రెడ్డిని రాష్ట్రపతి కాకుండా చేసింది

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వాడిన ఒక పదం దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీలో చీలికలకు కారణమైంది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే రాష్ట్రపతి కాకుండా చేసింది. ఇంతకీ ఏమిటా పదం? దాని వెనుకున్న కథేంటి?

1969లో భారత నాల్గవ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ ఆకస్మిక మరణంతో కొత్త రాష్ట్రపతి ఎన్నిక అనివార్యం అయింది. అప్పటి వరకు ఉపరాష్ట్రపతిగా ఉన్న వి.వి. గిరిని తాత్కాలిక రాష్ట్రపతిగా నియమించారు.

అయితే, ఐదో రాష్ట్రపతి ఎన్నిక కోసం వేగంగా చర్యలు ప్రారంభమయ్యాయి.

అప్పుడు రాష్ట్రపతి పదవి రేసులో ఇద్దరు తెలుగు నేతలు కూడా బరిలో దిగారు. అందులో ఒకరు నీలం సంజీవరెడ్డి కాగా మరొకరు తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగుతున్న వి.వి. గిరి.

సంజీవరెడ్డిని అధికారంలో ఉన్న కాంగ్రెస్ బలపర్చగా వి.వి.గిరి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు.

అప్పుడు కేంద్రంలో, అత్యధిక రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్సే అధికారంలో ఉంది. దీంతో కాంగ్రెస్ బలపరిచిన సంజీవ రెడ్డి గెలుపు ఖాయమని భావించారు. కానీ, అలా జరగలేదు.

Image copyright Getty Images

ఇందిరకు ఇష్టం లేకున్నా!

పార్టీ నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు 1969 జూలై 10న బెంగళూరులో సమావేశం అయింది.

అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిజలింగప్ప, ప్రధాని ఇందిర సహా పార్టీలోని పెద్దలు కె. కామరాజ్, మొరార్జీ దేశాయి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

మెజారిటీ నేతలు సంజీవ రెడ్డిని పార్టీ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ చేయాలని సూచించారు.

అయితే, ప్రధాని ఇందిర మాత్రం జగ్జీవన్ రామ్‌ను బరిలోకి దింపాలని అన్నారు. ''గాంధీ శతజయంతి సందర్భంగా దళితుడిని రాష్ట్రపతి చేస్తే బాగుంటుంది. మహాత్ముడికి మనమిచ్చే నివాళి అవుతుంది'' అని అన్నారు.

కానీ, చివరకు సంజీవ రెడ్డి అభ్యర్థిత్వానికి ఇందిర ఆమోదం తెలపక తప్పలేదు. సంజీవరెడ్డి నామినేషన్ దాఖలు వేసినప్పుడు ఇందిర కూడా ఆయన వెంట వచ్చారు.

మరోవైపు, అదే సమయంలో వి.వి. గిరి తాను కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇందిర గాంధీ సూచన మేరకే గిరి రాష్ట్రపతి పదవికి పోటీకి దిగారనే ఊహాగానాలు కూడా అప్పుడు వచ్చాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక భారత ఐదో రాష్ట్రపతి వి.వి. గిరి

నాటకీయంగా రాష్ట్రపతి ఎన్నికలు

రాష్ట్రపతి ఎన్నికలు ఇతర ఎన్నికలకు భిన్నంగా ఉంటాయి. రాష్ట్రపతిని ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల సభ్యులు ఉంటారు. రాష్ట్రాలలోని శాసన సభ్యుల సంఖ్యను బట్టి ఓటు విలువ కూడా మారుతుంది.

అయితే, ప్రధానిగా ఉన్న ఇందిర ఈ ఎన్నికల్లో తన పార్టీకి చెందిన సంజీవరెడ్డికి ఓటు వేయాలని చెప్పకుండా ఆత్మప్రభోదానుసారం ఓటు వేయండని తన సభ్యులకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ నేతలు మాత్రం మొదటి ప్రాధాన్యత ఓటును పార్టీ అభ్యర్థి సంజీవ రెడ్డికి, రెండో ప్రాధాన్యత ఓట్లను బరిలో ఉన్న జనసంఘ్ అభ్యర్థి సీడీ దేశ్‌ముఖ్‌కు వేయాలని సూచించారు.

అయితే, ఇందిర అంతరార్థం గ్రహించిన కాంగ్రెస్ సభ్యులు చాలా మంది సంజీవరెడ్డికి కాకుండా వి.వి.గిరికి ఓటు వేశారు.

1969 ఆగస్టులో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తంగా 8,36,337 ఓట్లు పోలయ్యాయి.

ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వి.వి. గిరికి 420,077 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నీలం సంజీవరెడ్డికి 405,427 ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్లతో వి.వి. గిరి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.

ఆత్మప్రభోదానుసారం అనే ఒకే ఒక మాటతో ఇందిర గాంధీ కాంగ్రెస్ బలపరిచిన నీలం సంజీవ రెడ్డికి రాష్ట్రపతి పదవిని దూరం చేశారు.

పార్టీలో చీలిక

సంజీవ రెడ్డి ఓటమికి కారణమైన ఇందిరా గాంధీ సహా అప్పటి ఆహార శాఖ మంత్రి రామ్, పరిశ్రమల అభివృద్ధి మంత్రి అలీని కాంగ్రెస్ అధ్యక్షుడు నిజలింగప్ప వివరణ కోరారు.

ఆ తర్వాత పరిణామాలతో 1969 చివర్లో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది.

Image copyright Getty Images

ఇందిర సహకారంతో రాష్ట్రపతిగా నీలం

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి అనంతరం నీలం సంజీవరెడ్డి రాజకీయాలకు కొద్దికాలం దూరమయ్యారు. తర్వాత జయప్రకాశ్ నారాయణ్ పిలుపు మేరకు 1975లో మళ్లీ రాజకీయంగా క్రీయశీలమ్యారు.

జనతా పార్టీ అభ్యర్థిగా నంద్యాల పార్లమెంట్ ‌నుంచి పోటీ చేసి గెలిచారు. మరోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

1977లో రాష్ట్రపతిగా ఉన్న ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణించడంతో అతని స్థానంలో నీలం సంజీవరెడ్డిని ఎన్నుకునేందుకు నాటి జనతా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అప్పడు విపక్షంలో ఉన్న ఇందిర కూడా సంజీవ రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతిచ్చారు.

దీంతో సంజీవరెడ్డి ఏకగ్రీవంగా రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

శ్రీలంక పేలుళ్ల ‘సూత్రధారిగా భావిస్తున్న హషీమ్’ చెల్లెలు ఏమంటున్నారంటే...

శ్రీలంకలో మరో మూడు పేలుళ్లు, తుపాకుల చప్పుళ్లు

చెర్నోబిల్: భారీ అణు విషాదానికి నేటితో 33 ఏళ్లు.. అసలు ప్రమాదం ఎలా జరిగింది?

భారత్‌లో పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువుల పరిస్థితి ఎలా ఉంది?

మోదీ రోడ్‌షో అంటూ వాజ్‌పేయీ అంతిమయాత్ర వీడియోను షేర్ చేస్తున్నారా?

టీఎస్‌ఆర్టీసీ బస్: ‘‘పక్కా ప్లాన్‌తో ప్రొఫెషనల్స్ చేసిన దొంగతనం ఇది’’.. ఎలా జరిగిందంటే..

మహారాష్ట్ర రైతుల లాంగ్ మార్చ్ ‘ముఖచిత్రం’ షేకుబాయికి భూమి వచ్చిందా

మనుషుల్లాగా సెల్ఫీకి ఫోజిచ్చిన గొరిల్లాలు... ఈ ఫొటో వెనకున్న పూర్తి కథ