లోక్‌సభ ఎన్నికల బరిలో చిన్న వయస్కుడు తేజస్వి సూర్య

  • 27 మార్చి 2019
తేజస్వి సూర్య
చిత్రం శీర్షిక తేజస్వి సూర్య (మధ్యలో ఉన్న వ్యక్తి)

తేజస్వి సూర్య.. లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీలో ఉన్న వ్యక్తి. బహుశా, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో ఉన్నవారిలో పిన్నవయస్కుడు తేజస్వినే కావచ్చేమో. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ఆరుసార్లు గెలిచిన సీటు ఇది. ఆయన ఇటీవలే మరణించారు.

వృత్తి రీత్యా న్యాయవాది అయిన తేజస్వి వయసు 28 సంవత్సరాలు. కానీ, బీజేపీ కార్యకర్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేసిన అంశం... తేజస్వి వయసు కాదు. సామాజిక కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్న తేజస్విని అనంత్ కుమార్‌ను పార్టీ పరిగణనలోకి తీసుకోకపోవడం వారిని షాక్‌గు గురిచేసింది.

"తేజస్విని అనంత్ కుమార్ పేరును మాత్రమే రాష్ట్ర పార్టీ నాయకత్వం హై కమాండ్‌కు పంపించింది" అని బీజేపీ బెంగళూరు డిస్ట్రిక్ట్ కమిటీ అధ్యక్షుడు సదాశివ్ బీబీసీకి చెప్పారు.

"యువకుడు, ఉత్సాహవంతుడు, వాక్చాతుర్యం ఉంది కాబట్టి పార్టీ ఆయనను ఎంపిక చేసింది. యువతకు అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లలో అవకాశాలివ్వాలనే పార్టీ నిర్ణయం కూడా దీనికి కారణం" అని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్.రవి కుమార్ అన్నారు.

ప్రస్తుతం బీజేపీ యువజన విభాగం.. యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్న సూర్యకు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలతో అనుబంధం ఉంది. సూర్య మావయ్య రవి సుబ్రమణ్య.. బసవనగుడి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.

"ఈ నిర్ణయంపై పార్టీ కార్యకర్తల్లో కొద్దిగా అసంతృప్తి ఉంటే ఉండొచ్చు. కానీ ఇది పార్టీ అధినాయకత్వం నిర్ణయం అని అందరూ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నా భర్త ఎప్పుడూ దేశ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసేవారు. మోదీ తిరిగి అధికారంలోకి రావడం అన్నింటికన్నా ముఖ్యం" అని తేజస్విని అనంత్ కుమార్ వ్యాఖ్యానించారు.

కానీ అనంత్ కుమార్ మద్దతుదారులు దీనిపై అసంతృప్తిగా ఉన్నారు.

"తేజస్విని ఎంపికకు అంతా సిద్ధమైంది. అనంత్ కుమార్‌తో ఉన్న అనుబంధం కారణంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప కూడా ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీజేపీ నేత ఒకరు తెలిపారు.

"అవును, తేజస్వి సూర్య పేరును ఆర్ఎస్ఎస్ సూచించింది. బీజేపీ ఆమోదించింది. బెంగళూరులో యువ ఓటర్లు ఎక్కువగా ఉండటం కూడా దీనికి కారణం" అని రవి కుమార్ చెప్పారు.

"ఆయన అద్భుత వక్త, చదువుకున్నవారు, మోదీని వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకించినట్లే అనే భావాలు ఆయనకున్నాయి" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ సామాజిక కార్యకర్త వ్యాఖ్యానించారు.

2019 మార్చి 22న సూర్య అధికారిక అకౌంట్‌లో ఓ ట్వీట్‌ పోస్ట్ చేశారు. "మోదీని అడ్డుకోవడానికి దేశ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యాయి. ఆధునికమైన, శక్తిమంతమైన భారత్‌ను నిర్మించడం మోదీ అజెండా అయితే వారి అజెండా మోదీని అడ్డుకోవడం. వారికి అభివృద్ధి అజెండా అనేదే లేదు. మీరు మోదీకి మద్దతిస్తే, భారత్‌కు మద్దతిచ్చినట్లే. మీరు మోదీని వ్యతిరకేస్తే, దేశవ్యతిరేక శక్తులను బలపరుస్తున్నట్లే" అనేది ఆ ట్వీట్ సారాంశం.

"ఇదో అద్భుత ఎంపిక. ఆర్థిక స్తోమత లేని యువతకు గుర్తింపునివ్వాలని ప్రధాని, బీజేపీ అధినాయకత్వం నిర్ణయించింది. ఈ వ్యక్తికి నిబద్ధత ఉంది, జాతీయవాది. ఆయన్ను చూస్తే గర్వంగా ఉంది" అని సూర్యకు సీనియర్, కర్నాటక మాజీ అడ్వొకేట్ జనరల్ అశోక్ హర్నహళ్లి చెప్పారు.

కానీ, నామినేషన్ వేయడానికి వెళ్లిన సూర్య దీనిపై వ్యాఖ్యానించడానికి అందుబాటులో లేరు. ఇతర యువకుల్లాగే సూర్య కూడా మంచి పానీ పూరీ ఎక్కడ దొరుకుతుందో తన స్నేహితులకు సోషల్ మీడియాలో సూచిస్తున్నారు.

"బెంగళూరులో మంచి పానీ పూరీ ఎక్కడ దొరుకుతుందో నిన్న రాత్రి 8.21కి సూర్య అందరికీ చెప్పారు. తన అభ్యర్థిత్వం ఖరారు కావడంతో రాత్రి 2.48 నుంచి వరసపెట్టి 14 ట్వీట్లు పోస్ట్ చేశారు" అని చుర్మురి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)