క్రిస్ గేల్: బ్యాట్ పట్టిన పెను తుపాను అతడు... పంజాబ్ జట్టు చరిత్రను తిరగరాస్తాడా?

  • 26 మార్చి 2019
క్రిస్ గేల్ Image copyright Facebook/Chris Gayle

వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్‌కు ఇంకో ఆరు నెలల్లో 40 ఏళ్లు నిండుతాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీ20 మ్యాచుల్లో మాత్రం అతడు చాలా మంది యువ ఆటగాళ్ల కన్నా ఎంతో ముందున్నాడు.

సోమవారం (మార్చి 25న) జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను విజయ తీరాలకు చేర్చడంలో ఓపెనర్ గేల్ కీలక పాత్ర పోషించాడు. 47 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అతడు 79 పరుగులు చేశాడు. 14 పరుగుల తేడాతో పంజాబ్ గెలుపొందింది.

రాజస్థాన్‌ను ఆ జట్టు సొంత గడ్డ జైపూర్‌లో పంజాబ్ తొలిసారిగా ఓడించింది.

గేల్ తాను పంజాబ్ చరిత్రను తిరగరాస్తాననే సంకేతాలను ప్రస్తుత 12వ సీజన్ తొలి మ్యాచ్‌లోనే పంపాడు.

Image copyright FB/Chris Gayle

అతడిపై పంజాబ్ ఎంతగానో ఆధారపడుతోంది.

2018 సీజన్‌లో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో పంజాబ్ ఏడో స్థానంలో నిలిచింది.

ఆ సీజన్‌లో పంజాబ్ అతడిని 2 కోట్ల రూపాయల కనీస ధరకు తీసుకొంది.

అప్పుడు గేల్ ఒక సెంచరీ చేశాడుగాని పెద్దగా రాణించలేకపోయాడు. గాయం కారణంగా టోర్నమెంటు మధ్యలోనే జట్టుకు దూరమయ్యాడు.

పంజాబ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టోర్నీ గెలవలేదు. ఐపీఎల్‌లో గేల్ వ్యక్తిగతంగా భారీగా పరుగులు సాధించినప్పటికీ, అతడు సభ్యుడిగా ఉన్న జట్టు ఏదీ ఇంతవరకు టోర్నీ గెలుచుకోలేదు.

Image copyright AFP/Getty Images

సోమవారం రాజస్థాన్‌పై గేల్ చెలరేగి ఆడిన తీరు, అతడు తన ఆటను మెరుగుపరచుకోవాలనుకొంటున్నాడనే సందేశంతోపాటు పంజాబ్ చరిత్రను తిరగరాయాలనుకొంటున్నాడనే సందేశాన్ని పంపింది.

10 ఫోర్లు, రెండు సిక్సర్లతో కేవలం 43 బంతుల్లో 69 పరుగులు చేసి రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్ కూడా బాగా ఆడినప్పటికీ మ్యాచ్‌లో హీరో క్రిస్ గేలే.

కుదురుకోవడానికి గేల్ కొంత సమయం తీసుకున్నాడు. తర్వాత బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. అతడి బ్యాటింగ్ పెను తుపానును తలపించింది.

గేల్ ప్రపంచంలోనే అత్యంత బరువైన బ్యాట్ వాడతాడని చెబుతారు. అతడు బంతిని సరైన సమయంలో కనెక్ట్ చేసి సగం శక్తిని ప్రయోగించినా బంతి బౌండరీ అవతల పడుతుందని అంటారు.

మరో ఓపెనర్ ఎల్.‌రాహుల్ నాలుగు పరుగులకే వెనుదిరిగిన క్లిష్టమైన దశలో గేల్ ఆడాడు. అందుకే అతడి ఇన్నింగ్స్‌కు ప్రాధాన్యం ఎక్కువ.

అన్నింటి కన్నా ముఖ్యమైన విషయమేంటంటే- మ్యాచ్ మొత్తం గేల్ ఫిట్‌గా కనిపించాడు. వికెట్ల మధ్య పరుగెత్తేటప్పుడూ ఇబ్బంది పడలేదు.

Image copyright FB/Jos Buttler
చిత్రం శీర్షిక జోస్ బట్లర్ మంచి ఊపు మీదున్నప్పుడు రాజస్థాన్ విజయం దిశగా వెళ్తున్నట్లే కనిపించింది.

గేల్ 15వ ఓవర్లో ఔటయ్యాడు. అప్పుడు పంజాబ్ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 144 పరుగులు.

గేల్ వెనుదిరిగాక కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్ 29 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా నాలుగు వేల పరుగులు చేసిన ఆటగాడిగా గేల్ ఈ మ్యాచ్‌లో ఒక రికార్డు కూడా నెలకొల్పాడు. 113వ మ్యాచ్‌లో అతడు ఈ ఘనతను సాధించాడు.

ఇటీవల ఇంగ్లండ్‌పై తన ఉత్తమ ప్రదర్శనే సోమవారం నాటి మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌కు ప్రేరణనిచ్చిందని గేల్ చెప్పాడు.

కుర్రాళ్లతో ఆడటాన్ని తాను ఆస్వాదిస్తానని 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచిన గేల్ తెలిపాడు.

20 ఓవర్లలో 185 పరుగుల విజయ లక్ష్యంతో దిగిన రాజస్థాన్ తొమ్మిది వికెట్ల నష్టానికి 170 పరుగులే చేయగలిగింది.

జోస్ బట్లర్ మంచి ఊపు మీదున్నప్పుడు రాజస్థాన్ విజయం దిశగా వెళ్తున్నట్లే కనిపించింది. కానీ నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బట్లర్‌ను బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ 'మన్కడ్ ఔట్' చేయడంతో మ్యాచ్‌లో ఆధిపత్యం మారిపోయింది.

Image copyright Twitter/@ashwinravi99
చిత్రం శీర్షిక అశ్విన్

బౌలర్ బంతి వదలక ముందే బట్లర్ క్రీజ్ వదిలి ముందుకు వెళ్లాడు. అశ్విన్ అతడిని 'రనౌట్' చేశాడు.

బట్లర్ రనౌట్ 13వ ఓవర్లో జరిగింది. అప్పటికి కేవలం వికెట్ నష్టానికి రాజస్థాన్ 108 పరుగులు చేసింది.

సంజు సామ్సన్ 30, స్టీవ్ స్మిత్ 20 పరుగులు చేశారు.

పంజాబ్ విజయంలో బౌలర్‌గా కెప్టెన్ అశ్విన్ కూడా ముఖ్య పాత్రే పోషించాడు. నాలుగు ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

బట్లర్‌ను అశ్విన్ ఔట్ చేసిన తీరు క్రీడాస్ఫూర్తి కోణంలో చర్చనీయమైంది. ఇది ఐపీఎల్ మ్యాచ్ అయినందున అదంత పెద్ద వివాదం కాకపోవచ్చు.

క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోయేది మాత్రం గేల్ బ్యాటింగే.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)