రఘురామ్ రాజన్‌: భారత వృద్ధి రేటుపై అనుమానాలు... ఉద్యోగాల్లేవు కానీ.. 7శాతం వృద్ధి ఎలా?: ప్రెస్ రివ్యూ

  • 27 మార్చి 2019
రఘురామ్ రాజన్ Image copyright Getty Images

భారత ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధితో పరుగులు తీస్తోందని ప్రభుత్వం ప్రకటించడంపై, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ అనుమానాలు వ్యక్తం చేశారని 'ఈనాడు' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. చాలినన్ని ఉద్యోగాలు కల్పించకుండా ఇంతటి వృద్ధి ఎలా సాధ్యమని రఘురామ్ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత జీడీపీ గణాంకాలపై ఉన్న అనుమానాలను తొలగించాల్సిన అవసరం ఉందని.. ఈ గణాంకాలను పర్యవేక్షించడానికి ఒక నిష్పాక్షిక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

''ప్రస్తుత వృద్ధి గణాంకాలు వేటిని సూచిస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు.. భారత వాస్తవ వృద్ధి రేటు తెలుసుకోవడానికి 'ప్రక్షాళన' అయితే అవసరం'' అని వ్యాఖ్యానించారు.

''నరేంద్ర మోదీ ప్రభుత్వంలో నాకు తెలిసిన మంత్రి ఒకరున్నారు. ఎటువంటి ఉద్యోగాలూ లేకుండా 7 శాతం వృద్ధిని మనం ఎలా సాధిస్తున్నామో అర్థం కావడంలేదని ఆయన చెప్పారు. అంటే మనం 7 శాతం వృద్ధితో ముందుకు వెళ్లడం లేదనేగా...'' అని సీఎన్‌బీసీ టీవీ18తో రాజన్‌ అన్నారు. అయితే ఆ మంత్రి పేరును రాజన్‌ ప్రస్తావించలేదు.

2017-18 ఏడాదికి అంతక్రితం ప్రకటించిన 6.7 శాతం వృద్ధి రేటును గత నెల ప్రభుత్వం 7.2 శాతానికి సవరించిన సంగతి తెలిసిందే.

మరోవైపు.. 2017లో నిరుద్యోగ రేటు 45 ఏళ్ల గరిష్ఠానికి చేరిందన్న కార్మిక సర్వే నివేదికను ప్రభుత్వం ప్రజల ముందు ప్రవేశపెట్టకపోవడంపై పలువురు ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ గణాంకాల సవరణలపై 108 మంది ఆర్థిక వేత్తలు, సామాజిక శాస్త్రవేత్తల బృందం కూడా ప్రశ్నలు లేవనెత్తింది.

''కొత్త జీడీపీ గణాంకాలపై గందరగోళం ఎందుకొచ్చిందో కారణాన్ని అన్వేషించాలి. ఒక నిష్పాక్షిక వ్యవస్థ ఏర్పాటు చేసి.. గణాంకాలపై విశ్వాసాన్ని పునరుద్ధరించాల్సి ఉంది'' అని రఘురామ్ రాజన్ పేర్కొన్నారు.

మరోవైపు.. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాత్రం వృద్ధి గణాంకాలను సమర్ధించుకున్నారు. ''ఉద్యోగాలను సృష్టించకుండా ఏ ఆర్థిక వ్యవస్థ కూడా 7-8 శాతం వృద్ధిని కనబరచలేదు. ఎటువంటి సామాజిక వ్యతిరేకతలు కనిపించడం లేదు అంటే.. ఇది ఉద్యోగాలు లేని వృద్ధి కాదని అర్థమేగా అని'' ఆయన చెప్పారు.

Image copyright Pasupujonnalamspsadhanasamiti
చిత్రం శీర్షిక నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 200 మంది పైగా రైతులు నామినేషన్లు వేశారు

నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నిక వాయిదా పడుతుందా?

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను చూస్తే అక్కడ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందనిపిస్తోందని 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాలకు గానూ 505 మంది నామినేషన్లు చెల్లగా ఈ ఒక్క స్థానంలోనే రికార్డు స్థాయిలో 191 నామినేషన్లు ఓకే అయ్యాయి.

ఈ నెల 28న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కూడా అంతే మంది పోటీలో ఉంటే రిటర్నింగ్‌ అధికారి వాస్తవ పరిస్థితిని ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తారు. అదే రోజు లేదా మర్నాడు ఎన్నికల సంఘం గుర్తించిన ప్రింటర్లతో అధికారులు సమావేశం కానున్నారు.

వారు నిర్ణీత గడువులోగా బ్యాలెట్‌ పేపర్లు ముద్రించగలమని హామీ ఇస్తే యథావిధిగా ఏప్రిల్‌ 11నే పోలింగ్‌ జరుగుతుంది. లేదంటే వాయిదా పడే అవకాశం ఉంది. 1996లో నల్లగొండ లోక్‌సభ స్థానంలో ఇలాంటి సమస్య తలెత్తడంతో పోలింగ్‌ను వారంపాటు అధికారులు వాయిదా వేశారు.

పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర అంశాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు నిజామాబాద్‌ రైతులు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి మొత్తం 203 మంది 245 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో 12 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు.

దీంతో ప్రస్తుతానికి బరిలో 191 మంది అభ్యర్థులు ఉన్నట్లైంది. వీరిలో 186 మంది రైతులు పోటీలో ఉన్నారు. వీరంతా నామినేషన్లను విత్‌డ్రా చేసుకోని పక్షంలో ఇక్కడ బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు తప్పకపోవచ్చు.

Image copyright TDP/Facebook

సీఎం పదవి కోసం జగన్ రూ. 1,500 కోట్లు ఇస్తానన్నారు: ఫరూక్ అబ్దుల్లా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద నేషనల్ కాన్ఫరెసన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారని ఆంధ్రప్రభ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. కడపలో మంగళవారం తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో కలిసి ఫరూక్ అబ్దుల్లా పాల్గొన్నారు. జగన్ తన తండ్రి మరణం తరువాత ఆయన స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నించారని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ తనను సీఎంను చేస్తే 1,500 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు రెడీ అని జగన్ తనతో చెప్పారని ఆరోపించారు. జగన్‌కు అంత డబ్బు ఎక్కడిదో చెప్పాలన్నారు.

చంద్రబాబు ఎప్పుడూ రాష్ట్రం గురించే ఆలోచిస్తారని కితాబునిస్తూ.. జగన్‌కు రాష్ట్రం గురించి, ప్రజల గురించి పట్టదనీ, ముఖ్యమంత్రి కుర్చీపైనే ఆయన దృష్టి అని విమర్శించారు.

Image copyright BJP/Facebook

ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీకి అంగీకరిస్తూ చంద్రబాబు పంపిన లేఖ ఇది: పీయూష్ గోయల్

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి అంగీకారం తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర సర్కారుకు చంద్రబాబు రాసిన లేఖను రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ బయటపెట్టారని 'సాక్షి' దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. చంద్రబాబే స్వయంగా సంతకం చేసి ఆ లేఖను పంపారని గోయెల్ తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీకి ఎన్ని నిధులు ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కాదని.. ప్యాకేజీగా రూ.17,500 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని చంద్రబాబే తన రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ద్వారా లెక్కలు వేయించి పంపారని పీయూష్‌ గోయెల్‌ చెప్పారు.

ప్యాకేజీకి అంగీకరిస్తూ 2016 అక్టోబర్‌ 24న రాసిన లేఖతోపాటు ఎన్డీయే ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చాక కూడా ప్యాకేజీని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ 2018 జూలై 5న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన మరో లేఖను కూడా కేంద్ర మంత్రి మంగళవారం విజయవాడలో మీడియా ముందు పెట్టారు.

ప్యాకేజీ కింద రాష్ట్రానికి ఎంత మొత్తం ఇవ్వాలన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వమే తమ అధికారుల ద్వారా లెక్కించి, ఆ వివరాలను కేంద్రానికి నివేదించిందని వెల్లడించారు. రాష్ట్రంలో అమలు చేసే పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తుంది, ప్రత్యేక హోదా ఉంటే 90 శాతం నిధులను కేటాయిస్తుంది. హోదా ద్వారా 90 శాతం నిధులు రాష్ట్రానికి వస్తే ప్రతి ఏటా ఏపీకి రూ.3,500 కోట్లు అదనం వస్తాయని కేంద్రానికి నివేదించారని పేర్కొన్నారు.

14వ ఆర్థిక సంఘం సిఫార్సుల అనంతరం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చే నిధులను రెవెన్యూ లోటు భర్తీ రూపంలో అందజేయాలని కేంద్రం నిర్ణయించిందని గుర్తుచేశారు. ఈ మేరకు ఈశాన్య రాష్ట్రాలు, జమ్ముకశ్మీర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు భర్తీ కింద నిధులు అందజేస్తుందని చెప్పారు. రెవెన్యూ లోటు భర్తీ రూపంలో రూ. 22,113 కోట్లు ఇస్తూనే, ఏపీ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉండడం వల్లే ప్రత్యేక ప్యాకేజీ కింద మరో రూ. 17,500 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చారని వివరించారు.

ఐదేళ్లలో కేంద్ర పన్నులో రాష్ట్ర వాటాగా ఇచ్చే రూ.2.42 లక్షల కోట్లకు తోడు వివిధ అభివృద్ధి కార్యక్రమాల కింద మరో రూ.5 లక్షల కోట్ల విలువైన పనులను కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిందని పీయూష్‌ గోయెల్‌ చెప్పారు. రాజధాని నిర్మాణానికి రూ. 3,500 కోట్లు మంజూరు చేసి, అందులో రూ. 2,500 కోట్లు విడుదల చేసినప్పటికీ అమరావతిలో ఇప్పటిదాకా ఒక్క శాశ్వత భవన నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవని విమర్శించారు.

ప్యాకేజీకి ఒప్పుకుని, ఇప్పుడు ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, మంజూరు చేసిన సంస్థల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

శ్రీలంక పేలుళ్లు: ఆత్మాహుతి దాడుల్లో జేడీఎస్ కార్యకర్తలు మృతి.. 'ఇస్లామిస్ట్ గ్రూప్'పై అనుమానాలు

అవెంజర్స్: ఎండ్‌గేమ్‌ను అర్థం చేసుకోవాలంటే ముందు వచ్చిన 21 సినిమాలూ చూడాల్సిందేనా

లాబ్‌స్టర్, పీతల గుల్లలతో ఎకో-ఫ్రెండ్లీ ప్లాస్టిక్ సంచుల తయారీ

సౌదీలో భారత కార్మికుల కష్టాలకు కారణాలేంటి

ప్రెస్ రివ్యూ: నిన్న 0 మార్కులు, నేడు 99 మార్కులు... ఒక్క రోజులోనే మారిన ఇంటర్ ఫలితం

అబూదాబిలో 13.5 ఎకరాల్లో హిందూ మందిర నిర్మాణం... విశేషాలివే

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సీజేఐ గొగోయ్ ముందుకు రానున్న ముఖ్యమైన కేసులివే

మనిషికి ఇదే చివరి శతాబ్దమా.. డైనోసార్లలా మానవజాతి అంతం కానుందా?