నరేంద్ర మోదీ ప్రసంగం: అంతరిక్షంలో ఉపగ్రహాన్ని కూల్చివేశాం.. ఈ అపూర్వ విజయం దేశానికి గర్వకారణం

  • 27 మార్చి 2019
నరేంద్ర మోదీ

పార్లమెంటు ఎన్నికలు మరి కొద్ది రోజుల్లోనే జరుగనున్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘‘భారతదేశం అంతరిక్ష శక్తి’’గా ఆవిర్భవించిందని ప్రకటించారు.

లో-ఎర్త్ ఆర్బిట్‌లోని ఒక లైవ్ శాటిలైట్‌ను కూల్చివేయటం ద్వారా అంతరిక్ష భద్రతా రంగంలో భారత్ గొప్ప విజయం సాధించిందని చెప్పారు.

ప్రధాని మోదీ చేసిన ప్రకటనలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

''కొద్ది సేపటి కిందట భారతదేశం ఒక చరిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించింది.

మార్చి 27వ తేదీ.. భారత్ ఓ పెద్ద అంతరిక్ష శక్తిగా అవతరించింది.

ఇప్పటివరకూ ప్రపంచంలో మూడు దేశాలు అమెరికా, రష్యా, చైనాలకు ఈ సామర్థ్యం ఉంది.

నాలుగో దేశంగా భారత్ ఈ రోజు ఈ విజయం సాధించింది.

ప్రతి భారతీయుడికీ ఇంతకు మించిన గర్వపూర్వక క్షణం ఉండబోదు.

అంతరిక్షంలో మూడు వందల కిలోమీటర్ల దూరంలో.. లో ఎర్త్ ఆర్బిట్‌లోని ఒక లైవ్ సాటిలైట్‌ను కూల్చివేశాం.

ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని యాంటీ-సాటిలైట్.. ఏ-సాట్ క్షిపణితో దీనిని కూల్చివేశారు. కేవలం మూడు నిమిషాల్లోనే ఈ ఆపరేషన్‌ను పూర్తిచేశారు.

మిషన్ శక్తి - ఇది చాలా కఠినమైన ఆపరేషన్. నిర్దేశిత లక్ష్యాలు, ఉద్దేశాలను ఈ ఆపరేషన్ సాధించింది.

ఈ అసాధారణ విజయాన్ని సాధించటానికి కృషిచేసిన డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలకు అభినందనలు.

ఈ యాంటీ-సాటిలైట్ మిస్సైల్ ఓ పెద్ద మైలు రాయి. ఇది భారతదేశంలోనే వికసించిన యాంటీ శాటిలైట్ సాంకేతిక పరిజ్ఞానం.

అంతరిక్షం మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది.

రక్షణ, వ్యవసాయం, వాతావరణ అంచనాలు, వైద్య విద్యలకు ఉపగ్రహాలు సాయపడుతున్నాయి.

మన ఉపగ్రహాల ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు.

ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఒక నిర్దిష్ట దేశానికి వ్యతిరేకంగా చేపట్టింది కాదు.

మేం శాంతియుత వాతావరణం స్థాపించాలని కోరుకుంటున్నాం. యుద్ధం కాదు.

ఈ అంతరిక్ష కార్యక్రమం భారత భద్రత, అభివృద్ధి కోసం చేపట్టినది.

భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవటానికి మనం సంసిద్ధంగా ఉండాలి.''

అంతకు ముందు..

బుధవారం ఉదయం పదకొండు గంటల సమయంలో... మరికొన్ని నిమిషాల్లో అంటే 11.45 గంటల నుంచి 12 గంటల మధ్య తాను ప్రజలకు ముఖ్యమైన సందేశం ఇవ్వనున్నానని ప్రకటించారు.

Image copyright Twitter

తన ప్రసంగాన్ని టీవీలు, రేడియోలు, సోషల్ మీడియాలో చూడాలని కోరారు.

అయితే, 12.15 గంటల వరకూ ఆయన ఎలాంటి ప్రకటనా చేయలేదు.

దీంతో ఆయన ఏం ప్రకటన చేస్తారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

"డీఆర్‌డీఓకు అభినందనలు. మీ కృషి చూసి గర్విస్తున్నా" అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

"ఈ రోజు నరేంద్ర మోదీ ఆకాశం వైపు చూపిస్తూ.. ఉచితంగా గంటపాటు టీవీలను, నిరుద్యోగం, గ్రామీణ సంక్షోభం, మహిళల భద్రత లాంటి సమస్యల నుంచి దేశ ప్రజల దృష్టిని తనవైపు మళ్లించుకున్నారు" అని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు.

మిషన్ శక్తి ఆపరేషన్‌ను విజవంతంగా పూర్తి చేసి, దేశాన్ని సురక్షితంగా తయారు చేస్తున్నందుకు డీఆర్‌డీవో, ఇస్రోలకు అభినందనలు తెలిపారు.

బీబీసీ రక్షణ వ్యవహారాల కరెస్పాండెంట్ జొనాథన్ మార్కస్ విశ్లేషణ

నేవిగేషన్, నిఘా పర్యవేక్షణ, సమాచార సేకరణ, కమ్యూనికేషన్ లాంటి పౌర, రక్షణ అవసరాల కోసం పెద్ద దేశాలు అనేక రకాల ఉపగ్రహాల వినియోగాన్ని పెంచుతున్నాయి.

ఇప్పుడు అంతరిక్షంలో అద్భుతమైన ప్రదర్శనతో భారత్ అగ్రదేశాల సరసన చేరింది.

అంతరిక్ష సైన్యం పేరుతో కొనసాగుతున్న ట్రెండ్‌లో ఇదొకటి. అంతరిక్షంలో అమెరికా సైనిక బలగం ఏర్పాటు చేయనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అది అమెరికా సైన్యంలో ఆరో శాఖగా ఉంటుందని చెప్పారు.

అయితే, ఇలా అంతరిక్ష బలగాల మోహరింపు చర్యలను తక్షణమే నియంత్రించాలన్న డిమాండ్ ఆయుధ నియంత్రణ కోసం పనిచేసే వారి నుంచి వచ్చే అవకాశం ఉంది.

మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారా?

మిషన్ శక్తి ఆపరేషన్‌ విజయవంతమైందంటూ ప్రధాని మోదీ ప్రకటించడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందా? లేదా? అన్నది తెలుసుకునేందుకు మాజీ ప్రధాన ఎన్నికల అధికారి టీఎస్ కృష్ణ మూర్తితో బీబీసీ మాట్లాడింది.

"ఇలాంటి ప్రకటనలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయా? లేదా అని చెప్పేందుకు ఎలాంటి నియమం లేదు. ఆయన దేశ ప్రధాని హోదాలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి, అది ఉల్లంఘన కిందకు రాదు. అయితే, ఏది ఏమైనా ఈ విషయాన్ని ఎన్నికల సంఘం పరిశీలించాల్సి ఉంటుంది’’ అని కృష్ణమూర్తి చెప్పారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం

ముఖ్యమైన కథనాలు