జేడీ లక్ష్మీనారాయణ: 'హామీలు బాండ్ పేపర్‌పై రాసిస్తా' - బీబీసీ తెలుగు రంగస్థలం

  • 27 మార్చి 2019
రంగస్థలం
చిత్రం శీర్షిక బీబీసీ ప్రతినిధి పసునూరు శ్రీధర్ బాబు, పురంధేశ్వరి, వీవీ లక్ష్మినారాయణ, దాడి వీరభద్రరావు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా రాష్ర్టంలో కీలక సమస్యలపై రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులతో బీబీసీ తెలుగు 'రంగస్థలం' పేరుతో చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

రాయలసీమ రాజకీయాలు, ఆ ప్రాంతంలో నెలకొన్న సమస్యలపై ఈనెల 25న తిరుపతిలో తొలి రంగస్థలం చర్చా కార్యక్రమం జరిగింది.

ఇవాళ ఉత్తరాంధ్ర రాజకీయాలు, సామాజిక స్థితిగతులపై విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలోని ఐఐఎఎం కాలేజీలో 'రంగస్థలం' చర్చా కార్యక్రమం జరిగింది.

బీబీసీ సీనియర్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్ పసునూరు శ్రీధర్ బాబు నిర్వహించిన ఈ రంగస్థలం చర్చా కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి, జనసేన నుంచి వీవీ లక్ష్మీనారాయణ, వైసీపీ నుంచి దాడి వీరభద్రరావు పాల్గొన్నారు.

దాడి వీరభద్రరావు (వైసీపీ) ఏమన్నారంటే...

తెలుగువారి ఆత్మగౌరాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. ఆయన హయాంలో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశాను.

ఎన్టీరామారావు ఉన్నంత కాలం ఆయనతోనే వున్నాను, కానీ చంద్రబాబుతో వెళ్లలేదు.

తెలుగు దేశం పార్టీ గౌరవాన్ని కాపాడేందుకు పనిచేశాను. చంద్రబాబు నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు.

ఎమ్మెల్సీ పదవి కొనసాగింపు గురించి టీవీల్లో చూసి తెలుసుకోవాల్సి వచ్చింది. అందుకే తెలుగుదేశం వీడాను.

2014లో జగన్‌కి అతి విశ్వాసం ఉండేది. మన సేవలు ఉపయోగించుకోనప్పుడు ఎందుకులే అక్కడుండడం అని బయటకు వచ్చేశాను.

గతంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం వేరు, ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం వేరు. బాబు దగ్గర రెండు మూడు వందల మందిని చంపిన వాళ్లున్నారు.

ఈ ప్రభుత్వం హయాంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఏ కార్యాలయంలోనూ లంచం ఇవ్వకుండా సామాన్య ప్రజలకు పనులు కావడంలేదు.

జగన్‌లో మార్పు వచ్చింది

ప్రస్తుతం తెలుగు దేశం పార్టీకి ప్రత్యామ్నాయం వైసీపీనే.

పాదయాత్ర తరువాత జగన్‌లో చాలా మార్పు వచ్చింది. అన్ని వర్గాల సమస్యల గురించి ఆయన తెలుసుకున్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఒక దశలో ద్రోణంరాజు సత్యనారాయణ, గుడివాడ గురునాథ రావు, నేను కలిసి ఉత్తరాంధ్ర ప్రాంతీయ పార్టీ పెడదాం అనుకున్నాం. ఇక్కడ అంత బాధాకరమైన పరిస్థితి ఉంది.

ఒకసారి పోలవరం ప్రాజెక్టు కావాలని మా జిల్లా ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్లాను. అక్కడికి వెళ్లగానే మాలోని ఒక ఎమ్మెల్యే కాగితం తీసి ఈ ఉద్యోగి బదిలీ చేసి పెట్టండని అన్నారు.

ఎమ్మెల్యేల్లో 70 శాతం మంది ఉద్యోగుల బదిలీల కోసమే పనిచేస్తున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజాప్రతినిధుల్లో పోరాట పటిమ లేదు, అమాయకత్వం ఎక్కువుంది. ప్రజలు కూడా నాయకులను క్షమించేస్తున్నారు. లంచం తింటున్నా అడిగేవారు లేరు.

హైదరాబాద్‌లో ఉన్న ఫార్మా కంపెనీలను తొలగించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ కంపెనీలు విశాఖకు వస్తున్నాయి. వాటిని అడ్డుకునేవారు లేరు. దాంతో ఇక్కడ కాలుష్యం పెరిగిపోతోంది.

వైసీపీ అధికారంలోకి వస్తే అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఉన్న అంతర్జాతీయ విద్యా సంస్థలను విశాఖలో పెట్టించాలన్నది నా ఆశయం.

విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి. అందరూ ఓటు వేయాలి. డబ్బులు తీసుకోకుండా ఓటు వేయాలి, అవినీతిపరులను ఓడించాలన్న పట్టుదలతో యువత ముందుకు రావాలి.


వీవీ లక్ష్మీనారాయణ (జనసేన) ఏమన్నారంటే..

జనసేనలో చేరడానికి కారణం ఏంటి?

జనసేన ఆవిర్భావానికి ముందు నుంచే పవన్‌ కల్యాణ్, నేను రెండుమూడూ సార్లు చర్చించాం. తర్వాత నేను మహారాష్ట్రకు వెళ్లాను, ఆయన పార్టీ పెట్టారు.

2018లో కలాం గారి మాటలు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. 2025 సంవత్సరం వరకు దేశ భవిష్యత్తును నిర్ణయించే విధంగా మనం ప్రయత్నం చేయాలని కలాం చెప్పారు.

దేశంలో యువతరం అధికంగా ఉంది. యువతరాన్ని సక్రమమైన మార్గంలో ముందుకు తీసుకెళ్తే అదొక 'అణు శక్తి'గా మారుతుంది. లేదంటే, అదొక అణు బాంబుగా మారి ప్రపంచానికే ప్రమాదంగా మారుతుంది.

ఆ యువతను ఒక మార్గంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత నామీద ఉందన్న ఆలోచనతో పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుని జనసేనలో చేరాను.

రైతులు, యువత, మహిళా సాధికారత, విద్య, వైద్యం ఎవరు ప్రాధాన్యత ఇస్తూ, జీరో బడ్జెట్ రాజకీయాల చేసేవారితో కలవాలని అనుకున్నాను.

నన్ను దాదాపు అన్ని పార్టీలూ నన్ను ఆహ్వానించాయి. పవన్ కల్యాణ్ మేనిఫెస్టో చూసిన తర్వాత జనసేనలో చేరాను.

జనసేన మేనిఫెస్టో హృదయ లోతుల్లో నుంచి వచ్చిన అంశాలు ఉంటాయి. ఈసారి మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.

ఉత్తరాంధ్రలో ఉన్న వనరులను ఇక్కడి అభివృద్ధి కోసం వినియోగించడంలేదు. రాజకీయాలు వ్యాపారంగా మారడం వల్ల సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి.

అవినీతి

గ్రామాల్లో జన్మభూమి కమిటీల వల్ల కేవలం ఒక పక్షానికి మాత్రమే ప్రయోజనాలు కలుగుతున్నాయి. పాలకపక్షానికి మద్దతు తెలిపిన వారికి మాత్రమే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయి.

అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతిని చూసి పవన్ కల్యాణ్ ఆ పార్టీతో పొత్తు నుంచి బయటకు వచ్చారు.

యువత ఓటింగ్ శాతం అధికంగా ఉంటోంది. అంటే, యువత మార్పును కోరుకుంటోంది.

విశాఖను ఎందుకు ఎంచుకున్నారు?

పార్టీ నిర్ణయం మేరకే నేను విశాఖను ఎంచుకున్నాను. మరో కారణం, ఇక్కడ భూ కబ్జాలు ఎక్కువగా ఉన్నాయని పవన్ కల్యాణ్ చెప్పారు.

అలాంటి భూ కబ్జాల ద్వారా వచ్చే డబ్బు ఘోరమైన నేరాలకు పెట్టుబడిగా మారుతుంది. అలాంటి పరిస్థితులు విశాఖలో వస్తే దాని ప్రభావం రాష్ట్రం మొత్తం మీద పడుతుందని పవన్ అన్నారు. అందుకే, ఇక్కడ ఒక కొత్వాల్‌గా వెళ్లాలని నాకు సూచించారు.

ఉత్తరాంధ్రలో వనరులు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. ప్రజలు అలాగే వెనుకబడి ఉంటే, తాము అధికారం చలాయించొచ్చన్న నాయకుల ఆలోచన కూడా అందుకు ఒక కారణం.

మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకే అధిక ప్రాధాన్యం ఇస్తాం. ఈసారి మా ప్రభుత్వమే వస్తుంది.

అసెంబ్లీ నియోజకవర్గం వారీగా సమస్యలపై దృష్టి సారిస్తాం.

మా మేనిఫెస్టో ఏసీ గదుల్లో తయారు చేసింది కాదు... ప్రజల మధ్యలో తయారైంది.


పురందేశ్వరి (బీజేపీ) ఏమన్నారంటే..

పార్టీ నిర్ణయం మేరకు నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను. గతంలో నేను ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు పలు సమస్యలను పరిష్కరించాను. బీహెచ్‌పీవీని బీహెచ్‌ఈఎల్‌‌లో విలీనం చేయించాం.

ఉత్తరాంధ్ర వెనకబాటుకు కారణమేంటి?

ఇక్కడి నీటి వనరులను వినియోగించుకోవడంపై ప్రభుత్వాలు దృష్టి సారించలేదని అనుకుంటున్నాను.

నేను ఎంపీగా ఉన్నప్పుడు ఉద్దానం ప్రాంతం నా పరిధిలోకి రాకపోయినా అక్కడికి వైద్యుల బృందాన్ని తీసుకెళ్లి పరిశీలించాను. కానీ, ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఆలోచించలేదు.

ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని భావించినా నక్సలిజం లాంటి సమస్యలు ఉన్నాయి.

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చొరవతోనే ఉద్దానం ప్రాంతంలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న తపన ప్రజాప్రతినిధులకు ఉండాలి. అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.

కేంద్రం ప్రాజెక్టులు ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం భూముల కేటాయింపు వంటి విషయాల్లో ఆలస్యం చేస్తోంది.

వెనుకబడిన జిల్లాల కోసం కేంద్రం ఇచ్చే నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం లేదు.

పోలవరం ప్రతి ఇటుక ఖర్చూ కేంద్రమే ఇస్తోంది

పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఎడమ కాలువకు రాష్ట్ర ప్రభుత్వమే భూసేకరణ చేసి ఇవ్వాల్సి ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకంలోనూ కేంద్రానికి సింహ భాగం ఉంది.

ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం పేరును పెద్ద అక్షరాలతో రాసి ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను పీఎంఏవై అని చిన్న అక్షరాలతో రాస్తారు. చంద్రన్న బీమా పథకంలోనూ అలాగే చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ ఇవ్వట్లేదని ప్రజల్లో తప్పుడు భావనను తీసుకెళ్లారు.

మీకు ఓటు ఎందుకు వేయాలి?

ఎన్టీఆర్ కూతురిగా నన్ను అందరూ గుర్తిస్తారు. మా కుటుంబంలో వేర్వేరు పార్టీలున్నాయి. వాటిని అలాగే చూడాలి. ఎవరికి ఓటు వేయాలో ఓటర్లే నిర్ణయించుకుంటారు.

విశాఖపట్నం విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చాను. బీచ్ సుందరీకరణ కోసం రూ.50 కోట్లు మంజూరు చేయించాను, ఆ డబ్బులు ఏమయ్యాయో రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు.

రైల్వే జోన్‌ కోసం సుదీర్ఘ పోరాటం చేశాం. వాల్తేరుతో కూడిన విశాఖ రైల్వే జోన్ వచ్చింది. దీని విషయంలో నష్టం జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది.

విశాఖలో కాలుష్యం అనేది సమస్యగా ఉంది. అధునాతన సాంకేతికత సాయంతో దానికి పరిష్కారం కనుగొనే దిశగా ఆలోచన చేస్తాం.

రాష్ట్రంలోని 7 వెనుకబడిన జిల్లాలకు కేంద్రం రూ.1050 కోట్లు ఇచ్చింది. కానీ, ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంలేదు.

వచ్చిన నిధులను ఎలా ఖర్చు పెట్టారో చెప్తూ యుటిలైజేషన్ సర్టిఫికెట్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వట్లేదు. అందువల్లే, తదుపరి నిధులను కేంద్రం విడుదల చేయడంలేదు.

వనరులున్నా అభివృద్ధి లేదు: పాత్రికేయులు శివశంకర్

ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సరిపడే బడ్జెట్ కేటాయించలేదు.

వలసలు నిరోధించాలంటే నీళ్లు కావాలి. వనరులున్నా అభివృద్ధి లేదు. వ్యవసాయ భూములన్నీ రియల్ ఎస్టేట్ భూములుగా మారిపోతున్నాయి.

ఈ మూడు జిల్లాలు ల్యాండ్ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోయింది. కారణం, నాయకులు, ప్రభుత్వాలకూ వీటి అభివృద్ధిపై ఫోకస్ లేదు.

మద్రాసు ప్రెసిడెన్సీలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. విశాఖ నగరం అభివృద్ధి చెందితే సరిపోదు, జిల్లా మొత్తం అభివృద్ధి కనపడాలి. మూడు జిల్లాలు ఎదగాలి.

ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర డిక్లరేషన్‌లో కూడా రీజనల్ డెవలప్‌మెంట్ బోర్డు వెయ్యాలనేది ప్రధాన డిమాండ్.

రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధికి ఓ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలి. వాస్తవంగా చెప్పాలంటే రాయలసీమ కన్నా ఉత్తరాంధ్రే వెనకబడి ఉంది.

ఎన్నో దశాబ్దాల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ రద్దు చేశారు. దీనివల్ల జోన్ వచ్చినా ఈ ప్రాంతానికి పెద్దగా ఒనగూరే ప్రయోజనం లేకుండా పోయింది.

ఎందరో రైతుల పోరాటం, త్యాగాల కారణంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. కానీ అప్పట్లో భూములిచ్చిన వారి పిల్లలు నేడు ఉపాధి లేక రోడ్లపై తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదంటే కొత్తగా ఏర్పాటయ్యే పరిశ్రమల్లో, ప్రాజెక్టుల్లో స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.

అభివృద్ధి అంటే మనం ఆలోచించేది కాదు: అడ్వొకేట్ జహనారా

ఉత్తరాంధ్ర కొన్ని దశాబ్దాలుగా వంచనకు గురైంది.

గతంలో ఎన్నో చెరువులుండేవి. వ్యవసాయం మొత్తం ఈ నీటిపై ఆధారపడి ఉండేది. అప్పట్లో వరి ఎక్కువగా ఇక్కడ సాగయ్యేది కాదు. కానీ 1980ల తర్వాత ప్రభుత్వాలు వరి పండించడంపై ఎక్కువ దృష్టిపెట్టడంతో బోర్‌వెల్స్ పెరిగిపోయాయి. ఎందుకంటే వరి సాగుకు నీరు ఎక్కువ కావాలి. సంప్రదాయ పంటలనుంచి ప్రజలు పక్కకు వచ్చేశారు.

ఈ మూడు జిల్లాలు వెనకబడిన ప్రాంతాలు అని గతంలోనే ప్లానింగ్ కమిషన్ నివేదిక ఇచ్చింది.

వలసల కారణంగా ఈ ప్రాంతంలో మహిళల పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారింది.

మానవాభివృద్ధి సూచిక ప్రకారం... నిరుద్యోగం, అనారోగ్యం లేకుండా ఉండాలి.

పబ్లిక్ హెల్త్ సెంటర్లను అభివృద్ధి చేయాలి.

సింగపూర్ టౌన్‌షిప్పులు కట్టడం, విజన్ 2020 అవసరమే కానీ, ప్రజలు దోమకాట్లతో చనిపోతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి.

వేరే జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పోటీచేయడం ఏంటి? ఇక్కడ నాయకత్వం లేదా? స్థానికులకు ఎందుకు అవకాశాలివ్వరు? ఇక్కడి వారికి అవకాశాలిస్తేనే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)