ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: అధికారుల బదిలీపై ఎవరేమంటున్నారు

  • 27 మార్చి 2019
చంద్రబాబు, జగన్ Image copyright Tdp.ncbn/YSJagan

ఏడాది కాలంగా కేంద్ర ప్ర‌భుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు, కేంద్రాన్ని మరోసారి ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యాన్ని చంద్ర‌బాబు స‌వాల్ చేస్తున్నారు.

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ స‌హా ఇద్ద‌రు ఎస్పీల‌ను బ‌దిలీ చేస్తూ ఎన్నిక‌ల సంఘం తీసుకున్న నిర్ణ‌యాన్ని టీడీపీ అధినేత సీరియ‌స్‌గా ప‌రిగ‌ణిస్తున్నారు. దీన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారణకు స్వీకరించింది.

బీజేపీ నేత‌లు మాత్రం ఇది ఆరంభం మాత్ర‌మేన‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈసీ నిర్ణ‌యం ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

భార‌త ఎన్నిక‌ల సంఘం తాజా ఆదేశాల ప్ర‌కారం ఏపీలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేస్తున్న ఏబీ వెంక‌టేశ్వ‌ర రావుతో పాటు శ్రీకాకుళం ఎస్పీ వెంక‌ట‌ర‌త్నం, క‌డ‌ప ఎస్పీ రాహుల్ దేవ్ శ‌ర్మ‌ను ఎన్నిక‌ల విధుల నుంచి తొల‌గించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ వెంక‌టేశ్వర రావు తీరు మీద చాలాకాలంగా విమ‌ర్శ‌లు ఉన్నాయి. గ‌తంలో కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వంటి వారు ఆయనపై బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేశారు.

విప‌క్ష వైసీపీ నేత‌లు కూడా ప‌లుమార్లు విమ‌ర్శించారు. వారం క్రితం ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి నేతృత్వంలోని వైసీపీ బృందం ఈసీని క‌లిసి, ప‌లువురు ఐపీఎస్ అధికారుల తీరు మీద రాత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేసింది. బీజేపీ నేత‌లు కూడా ఈసీని క‌లిసి ఏపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై ఫిర్యాదు చేశారు.

Image copyright D.L.Narasimha
చిత్రం శీర్షిక ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ

‘కడప ఎస్పీని బదిలీ చేయడం దేనికి సంకేతం?’

విప‌క్ష వైసీపీ త‌ప్పుడు ఫిర్యాదుల మేర‌కు ఈసీ చ‌ర్య‌లు తీసుకుంద‌ని టీడీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ఈ ప‌రిణామాల ప‌ట్ల టీడీపీ ఎంపీ సీఎం ర‌మేశ్ బీబీసీతో మాట్లాడారు.

"ఏబీ వెంక‌టేశ్వ‌ర రావు లా అండ్ ఆర్డ‌ర్ విధుల్లో నేరుగా లేరు. అయిన‌ప్ప‌టికీ ఫిర్యాదు వ‌చ్చింద‌నే కార‌ణంతో చ‌ర్య‌లు తీసుకోవ‌డం క‌క్ష సాధింపు చ‌ర్య‌. ఫిర్యాదు వ‌స్తే విచార‌ణ చేయాలి. కానీ ఎన్నికల సంఘం అధికారులు దిల్లీలో కూర్చుని వైసీపీ, బీజేపీ ఫిర్యాదులు చేయ‌గానే విచార‌ణ కూడా లేకుండా చర్య‌లు తీసుకోవ‌డంతో మాకు భ‌య‌మేస్తోంది. ఆందోళ‌న క‌లిగిస్తోంది. వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ‌లో ఉండ‌గా క‌డ‌ప ఎస్పీని బ‌దిలీ చేయ‌డం దేనికి సంకేతం? దీనిపై ఈసీని నిల‌దీస్తాం. ఈసీ స్పంద‌న త‌ర్వాత న్యాయ‌పోరాటం కూడా చేస్తాం. ఏపీలో ఎన్నిక‌ల అధికారుల నుంచి కూడా నివేదిక రాకుండా చ‌ర్య‌లు తీసుకోవ‌డం అనుమానాలు క‌లిగిస్తున్నాయి. ఏబీ వెంక‌టేశ్వ‌ర రావు ఉండ‌రు, ఠాకూర్ ఉండ‌ర‌ని వైసీపీ నేత‌లు ప్ర‌క‌టించ‌డం, ఈసీ చ‌ర్య‌లు తీసుకోవ‌డం స‌హించ‌రానివి" అని సీఎం రమేశ్ అన్నారు.

Image copyright facebook/GVL Narasimha Rao
చిత్రం శీర్షిక జీవీఎల్ నరసింహ రావు

‘ఇది అంతం కాదు.. ఆరంభం!'

ఈసీ చ‌ర్య‌ను బీజేపీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహ‌రావు స్వాగ‌తించారు. "పోలీసు వ్యవస్థను, అధికార యంత్రాంగాన్ని పార్టీ వ్యవస్థలా వాడుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం ఇబ్బందికరమే. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే కావాలి. ఎలక్షన్ కమిషన్ తన వంతు రాజ్యాంగ బద్ధమైన బాధ్యత నిర్వహిస్తే ప్రజలు సైకిల్‌ను అటకెక్కించి మిగిలింది పూర్తి చేస్తారు" అని ట్వీట్ చేశారు.

‘ఈసీ అధికారాల‌ను ప్ర‌శ్నించ‌లేరు..!’

న్యాయ‌పోరాటం త‌ప్ప‌ద‌ని టీడీపీ నేత‌లు చెబుతున్న నేప‌థ్యంలో ప‌రిణామాలు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏపీ బార్ కౌన్సిల్ స‌భ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు బీబీసీతో మాట్లాడుతూ..

"ఎన్నిక‌ల విధుల నిర్వ‌హ‌ణ‌లో అధికారుల తీరు మీద ఫిర్యాదులు వ‌చ్చిన‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకోవ‌డం చ‌ట్ట‌బ‌ద్ధ‌మే. ఈసీకి స‌ర్వ‌హ‌క్కులు ఉన్నాయి. న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించిన‌ప్ప‌టికీ టీడీపీ నేత‌లు ఈసీ అధికారాల‌ను ప్ర‌శ్నించ‌లేరు. పూర్తిస్థాయిలో ఆధారాలు త‌మ‌కు ల‌భించిన‌ప్ప‌టికీ విచార‌ణ లేకుండా చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. అయితే ఎన్నిక‌ల క‌మిష‌న్ తీసుకున్న నిర్ణ‌యం వెనుక ఎలాంటి కార‌ణాలున్నాయి, ఏ కార‌ణంతో చ‌ర్య‌లు తీసుకున్నార‌న్నది మాత్రం వెల్ల‌డికాలేదు"అని త‌న అభిప్రాయం వెల్ల‌డించారు.

Image copyright YSRCongress
చిత్రం శీర్షిక వైఎస్‌ వివేకానందరెడ్డి

‘టీడీపీ ఆరోప‌ణ‌లను కొట్టిపారేయ‌లేం..!’

ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆదేశాల అంశంలో కేంద్ర బీజేపీ నేత‌ల పాత్ర ఉందంటూ టీడీపీ చేస్తున్న ఆరోప‌ణ‌లు కొట్టిపారేయ‌లేమ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు పి.నిరంజ‌న్ రావు అన్నారు.

"ఈసీ పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంది. అయిన‌ప్ప‌టికీ అనేక‌మార్లు ఆరోప‌ణ‌లు వ‌స్తూ ఉంటాయి. తాజాగా ఏపీలో అధికారుల బ‌దిలీ విష‌యంలో ఈసీకి సంపూర్ణ అధికారాలున్న‌ప్ప‌టికీ రాజ‌కీయ కోణంలో వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం శ్రేయ‌స్క‌రం కాదు. కీల‌క‌మైన హ‌త్య కేసు విచార‌ణ‌లో ఉండ‌గా క‌డ‌ప జిల్లా ఎస్పీని బ‌దిలీ చేయ‌డం మాత్రం ప‌లువురిని విస్మ‌యానికి గురిచేస్తోంది. అయినా ఈసీ నిర్ణ‌యం వెనక్కి తీసుకునే అవ‌కాశాలు చాలా తక్కువ. అంతేకాకుండా ఏపీలో మ‌రికొంద‌రు నేత‌ల మీద కూడా చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం టీడీపీ న్యాయ‌పోరాటానికి చేస్తున్న ప్ర‌య‌త్నాలు త‌దుప‌రి చ‌ర్య‌ల‌ను అడ్డుకునేందుకు ఉప‌యోగ‌ప‌డ‌వ‌చ్చు" అన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

అనంతలో కియా ఫ్యాక్టరీ: "భూములిచ్చినవారికి ఉద్యోగాలన్నారు, మా చదువునుబట్టే ఇవ్వమని అడుగుతున్నాం"

శ్రీలంక పేలుళ్లు: బురఖా ధరించిన ఈ వ్యక్తి బౌద్ధ మతస్థుడా? ఈ వీడియోలో వాస్తవమెంత?

ఓటర్ ఐడీ కోసం ట్రాన్స్‌జెండర్లకు ఇన్ని ఇబ్బందులా

ప్రెస్ రివ్యూ: టిక్‌టాక్ వీడియోలో కేసీఆర్‌ను దూషించిన యువకుడి అరెస్టు

ఐపీఎల్ 2019: చెలరేగిన డివిలియర్స్, స్టోయినిస్... రాయల్ చాలెంజర్స్‌కు మూడో విజయం

బిల్కిస్ బానో: పదిహేడేళ్లుగా పోరాడుతున్నా. సుప్రీం కోర్టు నాకు అండగా నిలిచింది

ఈ రెండు నెలలు వేలాది కుటుంబాల పోషణభారం మహిళలదే

‘27 ఏళ్ల తరువాత కోమా నుంచి బయటపడిన అమ్మ నన్ను పేరు పెట్టి పిలిచింది’