శరద్ పవార్‌ను అత్యంత అవినీతిపరుడిగా వికీపీడియా ఎందుకు చూపించింది? - Fact Check

  • 28 మార్చి 2019
శరద్ పవార్ Image copyright FB/SHARAD PAWAR

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్‌ దేశంలోని అత్యంత అవినీతిపరుల్లో ఒకరని 'వికీపీడియా' వెబ్‌సైట్ చూపిస్తోందనే స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. సోషల్ మీడియాలో కొన్ని వేల మంది దీనిని చూశారు.

ఈ నెల 26న వికీపీడియా పేజీ ఒకటి పవార్‌ను అత్యంత అవినీతిపరుడని పేర్కొన్న మాట నిజమే.

వికీపీడియాలో అకౌంట్ ఉన్న ఎవరైనా పేజీలు సృష్టించవచ్చు. అప్పటికే ఉన్న పేజీలను ఎడిట్ చేయవచ్చు.

పవార్ వికీపీడియా పేజ్ ఎడిట్ వివరాలను బీబీసీ పరిశీలించింది. ఈ నెల 26న దీనిని అనేకసార్లు ఎడిట్ చేశారని తేలింది.

ఎడిటింగ్ క్రమం ఇదీ

ఈ నెల 26న ఉదయం 'ఓఎస్‌జెడ్‌పీ' అనే యూజర్ నేమ్ ఉన్న ఒక వ్యక్తి వికీపీడియాలో పవార్ బయోలో ''అత్యంత ప్రజాదరణ కలిగిన నేత(మోస్ట్ పాపులర్)'' అనే మాట చేర్చారు.

తర్వాత లారీ హాకెట్ అనే మరో యూజర్, ఈ మాటను తొలగించారు.

కొన్ని గంటల తర్వాత ఆ మాట మళ్లీ పేజీలో చేరింది.

Image copyright Wikipedia

ఉదయం ఎనిమిదిన్నర గంటలప్పుడు వివేక్140798 అనే ఇంకో యూజర్, 'అత్యంత ప్రతిభావంతుడైన నేత' అనే మాట చేర్చారు.

దీనిని వెనువెంటనే తొలగించి, మళ్లీ తిరిగి చేర్చారు.

Image copyright Wikipedia

కొన్ని నిమిషాల తర్వాత, అదే యూజర్ పవార్ పేజీ నుంచి 'టర్బన్ వివాదం' అనే సెక్షన్ తొలగించారు.

పవార్‌ వివాదాలకు సంబంధించిన ఇతర సెక్షన్లను కూడా తీసేశారు. వీటిని తర్వాత తిరిగి చేర్చారు.

Image copyright Wikipedia

వేర్వేరు యూజర్లు పవార్‌ను మొదట మంచిగా చూపించే విధంగా రాశారు. తర్వాత చెడుగా చూపించేందుకు ప్రయత్నించారు.

9:20 గంటలప్పుడు పవార్ పార్టీ పేరు 'నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ'ను మార్చి 'నేషనల్ కరప్ట్ పార్టీ' అని తప్పుగా పేర్కొన్నారు. తర్వాత దాన్ని సరిచేశారు.

Image copyright Wikipedia
Image copyright Wikipedia

ఓ గంట గడిచాక పవార్ పేజీ నుంచి అన్ని వివాదాలను తొలగించారు. తర్వాత వాటిని తిరిగి చేర్చారు.

11:32 గంటలప్పుడు గుర్తుతెలియని యూజర్ ఎవరో పవార్ బయోలో అత్యంత అవినీతిపరుడైన (మోస్ట్ కరప్టెడ్) నేత అని చేర్చారు.

ఈ మాటను మొదటి వాక్యంలో పెట్టారు.

ఇలా ఎలా జరిగింది?

పేజీని సంబంధిత వ్యక్తులు తమదిగా క్లెయిమ్ చేసుకోకపోయినా, లేదా పేజీని సెక్యూర్ చేసుకోకపోయినా, ఎవరైనా పేజీని ఎడిట్ చేసేందుకు వికీపీడియా అవకాశం కల్పిస్తుంది. ఈ అవకాశం వల్లే పవార్ పేజీలో ఇలా జరిగింది. ఇది తమ పేజీ అని పవార్‌గాని ఆయన పార్టీగాని క్లెయిమ్ చేసుకోలేదు.

ఇప్పుడు ఈ పేజీని సెక్యూర్ చేశారు. కాబట్టి సంబంధిత వ్యక్తులు తప్ప ఇతర యూజర్లు ఎడిట్ చేయలేరు.

వికీపీడియా పేజీల్లో ఇలాంటి నిర్ధరణ కాని సమాచారం కనిపించడం ఇదే తొలిసారి కాదు.

పవార్‌ పరువుకు భంగం కలిగించేందుకు ఎవరు యత్నించారో గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎన్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)