పార్లమెంటు ఎన్నికలు 2019: ప్రధాని మోదీ ప్రభావం దక్షిణ భారతదేశంలో ఎందుకు లేదు?

  • 28 మార్చి 2019
నరేంద్ర మోదీ Image copyright Getty Images

ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులు తరచుగా వింత హామీలు ఇస్తుంటారు.

అయినప్పటికీ, విమానంలో చేసే అనౌన్స్‌మెంట్ల గురించి ఒక రాజకీయ సభలో ఓ ప్రముఖ నాయకుడు ఓ ఎన్నికల హామీ ఇస్తారని ఎవరూ ఊహించలేరు. ప్రత్యేకించి, విమానం సంగతి తర్వాత - కనీసం విమానాశ్రయంలోకి కూడా ఎన్నడూ అడుగుపెట్టని వారు అత్యధిక సంఖ్యలో ఉన్న భారత్ వంటి దేశంలో విమానం లోపల చేసే అనౌన్స్‌మెంట్ల గురించి ఎన్నికల హామీ ఇవ్వటం నిజంగా వింతే.

ఈ నెల మొదట్లో తమిళనాడులోని కాంచీపురంలో జరిగిన ఒక భారీ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సరిగ్గా ఇదే చేశారు.

''తమిళనాడు నుంచి వెళ్లే, ఈ రాష్ట్రానికి వెళ్లే విమానాల్లో తమిళ భాషలో అనౌన్స్‌మెంట్లు చేసేలా చర్యలు చేపట్టడం గురించి కూడా మేం తీవ్రంగా ఆలోచిస్తున్నాం'' అని ఇంగ్లిష్‌లో మాటలు పేర్చుకుంటూ చెప్పారాయన. ఆయనకు తమిళ దుబాసీ ఒకరు సాయంగా ఉన్నారు.

ఇటీవలే భారతీయ జనతా పార్టీతో పొత్తు ఖరారు చేసుకున్న ఏఐఏడీఎంకే నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తంచేశారు. సభకు హాజరైన జన సందోహం కూడా విధిగా అన్నట్లు చప్పట్లు కొట్టి మౌనం దాల్చింది.

ప్రఖ్యాత చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌కు ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు ఎం.జి. రామచంద్రన్ పేరు పెడతామన్న మోదీ ఇచ్చిన రెండో హామీకి జనం నుంచి కాస్త మెరుగైన స్పందన లభించింది.

సాధారణంగా గొప్ప గొప్ప కలలను నెరవేరస్తానంటూ జనానికి హామీలు ఇచ్చే ఒక రాజకీయ నాయకుడు ఇటువంటి హామీలు ఇవ్వటం ఆశ్చర్యకరమే.

''గో బ్యాక్ మోదీ''

మామూలుగా ఘాటైన ప్రసంగాలతో ఆకట్టుకునే ప్రధానమంత్రి ఇక్కడ 40 నిమిషాలకు పైగా మాట్లాడారు. కానీ, ఈసారి ఆయనకు ఇక్కడ ప్రసంగించడం అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించింది.

హిందీని వ్యతిరేకించే రాష్ట్రంగా పేరున్న తమిళనాట హిందీలో మాట్లాడకూడదని ఆయన నిర్ణయించుకోవటంలో ఆశ్చర్యం లేదు. అయితే, హిందీలో మాట్లాడకపోవటం ఆయనకు ఇబ్బంది కలిగించినట్లు కనిపిస్తోంది.

ఆయన వేదిక మీద నిలుచునేటప్పటికే ఈ ప్రాంతంలోని సోషల్ మీడియాలో #GoBackModi హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ల హోరు మొదలైంది.

మోదీ గత ఏడాది ఒక కార్యక్రమంలో పాల్గొనటానికి చెన్నై నగరానికి వచ్చినపుడు ప్రతిపక్ష పార్టీలు ప్రముఖంగా ప్రచారంలోకి తెచ్చిన ఈ నినాదం.. ఆయన దక్షిణాది ప్రాంతానికి వచ్చిన ప్రతిసారీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు కూడా ఈ హ్యాష్ ట్యాగ్ ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవటం మొదలైంది.

మోదీ ప్రసంగాన్ని చూస్తే, ఈ సభకు హాజరైన జనానికి కనెక్ట్ కావడం ఎలాగో భారత ప్రధానమంత్రికి నిజంగా తెలియలేదని అనిపించింది.

హిందీ మాట్లాడే ఉత్తర భారతదేశానికి వ్యతిరేకంగా తనను తనను తాను నిర్వచించుకునే తమిళనాడులోని దాదాపు 7.2 కోట్ల మంది జనాభాలో చాలా మంది ఓటర్లు కూడా ఆయనతో కనెక్ట్ కాలేదని అనిపిస్తోంది.

''బీజేపీ సమావేశాలకు యువత పెద్దగా హాజరుకాదు. మోదీ మీద, తమిళనాడులోని ఇతర బీజేపీ నేతల మీద వ్యంగ్య చిత్రాలు, వీడియో ట్రాల్స్‌ చాలా చూశాను. విరగబడి నవ్వాను'' అని చెన్నైకి చెందిన డి.సెల్వకుమార్ బీబీసీతో పేర్కొన్నాడు. అతడు తొలిసారి ఓటు వేయబోతున్న తమిళ నవ యువకుడు.

''మోదీని మేం ఓ జాతీయ నాయకుడిగా చూడం. ఎందుకంటే తమిళ ప్రజలతో అతడికి ఏం సంబంధం, అనుబంధం లేదు'' అని చెప్పాడు.

Image copyright AFP
చిత్రం శీర్షిక జయలలిత, కరుణానిధిలు తమిళనాడు రాజకీయాలను దశాబ్దాలుగా శాసించారు

అందరూ ఇలాగే అనుకుంటారని కాదు. మోదీ దేశభక్తి సందేశంతో ఏకీభవిస్తూ, ఆయనను ఓ బలమైన నాయకుడిగా పరిగణించే వారు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

2016లో జయలలిత మరణం, 2018లో కరుణానిధి మరణంతో రాష్ట్రంలో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయగల ఏకైక నాయకుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీయేనని దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికార ప్రతినిధుల్లో ఒకరైన నారాయణన్ త్రిపాఠి బీబీసీతో పేర్కొన్నారు.

మాజీ ముఖ్యమంత్రులైన జయలలిత, కరుణానిధి దశాబ్దాల పాటు ఈ రాష్ట్ర రాజకీయాలను శాసించారు.

''ఇక్కడి రాజకీయ పార్టీలు మోదీ పేరు వింటేనే భయపడుతున్నాయి. కాబట్టి తమిళ ప్రజలకు ఆయనను శత్రువుగా చిత్రీకరించటానికి జరుగుతున్న విష ప్రచారంలో అవి భాగస్వామయ్యాయి. రాష్ట్ర సంస్కృతిని, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని అవి ప్రయత్నిస్తున్నాయి'' అని త్రిపాఠి ఆరోపించారు.

అయితే, గత ఏడాది గజా తుపాను రాష్ట్రంలో విధ్వంసం సృష్టించినపుడు మోదీ మౌనంగా ఉండటం చాలా మంది ప్రజలకు ఆగ్రహం కలిగించిందని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు కె.ఎన్.అరుణ్ చెప్పారు.

''ఆయన పరిస్థితిని ఏరియల్ సర్వేతో అయినా పరిశీలించటానికి రాలేదు. కనీసం ఆ తుపాను విధ్వంసం గురించి ఒక ట్వీట్ కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఆయన ఇక్కడికి ఇప్పటికే మూడు సార్లు వచ్చారు. జనం చాలా రగిలిపోతున్నారు'' అని ఆయన పేర్కొన్నారు.

మోదీ పట్ల తమిళ ప్రజలు ఆకర్షితులు కాకపోవటానికి కారణం దీనికన్నా చాలా మౌలికమైనదని రాష్ట్రానికి చెందిన విశ్లేషకులు అంటారు.

బీజేపీ, దాని సైద్ధాంతిక పునాది అయిన ఆర్ఎస్ఎస్‌ ఒక అగ్ర కుల, ఉత్తర భారతదేశ అజెండాకు ప్రాతినిధ్యం వహించే సంస్థలుగా విస్తృతంగా పరిగణిస్తున్నారు.

మోదీ బ్రాహ్మణుడు కాకపోయినా, పూర్తిగా అగ్ర కుల సంస్థ అనే ఇమేజీని మార్చుకోవటానికి ఆర్ఎస్ఎస్ ఇటీవలి సంవత్సరాల్లో చాలా కష్టపడి ప్రయత్నం చేస్తున్నా... అవేవీ ఇక్కడి అధిక శాతం ప్రజల మీద ఎక్కువగా ప్రభావం చూపించలేదు.

''ఇప్పటికి ఎనిమిది దశాబ్దాలు కావస్తోంది. ఇక్కడ బీజేపీని ఇంకా బ్రాహ్మణవాద పార్టీగానే చూస్తున్నారు. వాళ్లు ఈ ఇమేజీని వదిలించుకోవాల్సి ఉంది'' అని అరుణ్ వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ‘గో బ్యాక్’ మోదీ నిరసనలు తమిళనాట గత ఏడాది ప్రారంభమయ్యాయి

ఉత్తర భారతదేశ ''పెత్తనానికి'' వ్యతిరేకంగా నిలిచే ఓ కంచుకోటగా తమిళనాడు తనను తాను పరిగణిస్తుంది. 1965లో భారతదేశపు ఏకైక అధికార భాషగా హిందీని విధించాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఇక్కడ హింసాత్మక నిరసనలు చెలరేగాయి.

ఈ రాష్ట్ర రాజకీయాల మీద, బ్రాహ్మణ వ్యతిరేక సెంటిమెంట్ మూలంగా ఉండే ద్రవిడ ఉద్యమం ప్రభావం కూడా ఉంది. ఇతర కులాలకు 'ఆత్మగౌరవం' భావనకు ద్రవిడ ఉద్యమం బలంగా మద్దతిచ్చింది. సామాజిక సంక్షేమం, అభివృద్ధి మీద అది దృష్టి కేంద్రీకరించింది.

కాబట్టి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలన్నీ పౌష్టికాహార పథకాలు, ఉచిత స్కూళ్లు, కాలేజీల నిర్మాణం, గ్రామాల విద్యుదీకరణ వంటి సామాజిక సంక్షేమ పథకాలపై భారీగా పెట్టుబడి పెట్టాయి.

ఫలితంగా తమిళనాడు, పొరుగు రాష్ట్రమైన కేరళ మానవాభివృద్ధిలో ఇంకా భారీ సవాళ్లను అధిగమించాల్సి ఉన్న దేశంలో విశిష్ట స్థానంలో నిలిచాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం.. ఈ రాష్ట్రంలో అక్షరాస్యత రేటు 80 శాతం పైగా ఉంది. ప్రసవ మరణాల రేటు ప్రతి లక్ష సజీవ జననాలకు కేవలం 67 మాత్రంగానే ఉంది. ఇక పోషకాహార లోపాల స్థాయిలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి.

వరుస రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక సంక్షేమ విధానాలు, పథకాలను అమలు చేయటం దీనికి ప్రధాన కారణం.

అంతేకాదు, భారతదేశంలో ఆర్థికంగా కూడా రెండో అతి పెద్ద రాష్ట్రం ఇది. ఇక్కడ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు బలంగా ఉన్నాయి. 2017-18 సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 8 శాతంగా ఉందని తాజా గణాంకాలు చెప్తున్నాయి.

''సమస్య ఏమిటంటే.. తమిళనాడుకు చేస్తానని ఆయన చెప్తున్న ప్రతి విషయమూ.. 20 ఏళ్ల కిందటే మాకు సంబంధం లేని అంశాలు. ఆయన చెప్పుకుంటున్న తన గొప్ప పథకాల లక్ష్యాలన్నిటినీ ఈ రాష్ట్రం దశాబ్దాల కిందటే సాధించింది'' అంటారు ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యే పి.టి.ఆర్.త్యాగరాజన్.

''ఇక్కడికి వచ్చినపుడు ఏం మాట్లాడాలో ఆయనకు తెలీదు'' అని త్యాగరాజన్ వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం మొదటిగా తమిళనాడులోనే ప్రారంభమైంది

కానీ, తమ పార్టీ ప్రవేశపెట్టిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు రాష్ట్రానికి చాలా లబ్ధి కలిగించాయని బీజేపీ నాయకుడు త్రిపాఠి అంటారు.

భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో సాధారణ హిందూ ఓట్లను కూడగట్టటానికి బీజేపీ కృషి చేసింది. కానీ తమిళనాడులో ఈ వ్యూహం ఫలించలేదు. 2014లో రాష్ట్రంలో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు.

''తమిళనాడులో మతం చాలా బలంగా ఉన్నప్పటికీ, ఇది మొదటి నుంచీ నిజమైన లౌకిక రాష్ట్రం. ఆ సామరస్యం దెబ్బతినటం ఇక్కడి ప్రజలకు ఇష్టం ఉండదు. ఈ ఛాందసవాద నినాదాలు, విభజన రాజకీయాలను మేం కోరుకోం'' అని రచయిత, జర్నలిస్ట్ వాసంతి పేర్కొన్నారు.

''బీజేపీ హిందూ ఛాందసవాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉంటుంది ద్రవిడ సిద్ధాంతం. ఇక్కడ ఆ పార్టీకి కొన్ని వర్గాల వారిలో కొంత ఆకర్షణ ఉన్నప్పటికీ.. అది ఓట్లుగా మారే అవకాశం చాలా తక్కువ'' అని కె.ఎన్.అరుణ్ వివరించారు.

అయితే.. మోదీ ఉపయోగించుకోగల సమస్యలేవీ తమిళనాడుకు లేవని కాదు.

‘‘గెలవకపోయినా నష్టం లేదు’’

''ఇక్కడ చాలా తీవ్రమైన స్థానిక సమస్యలు ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన ప్రాంతీయ అంశాలున్నాయి. కానీ మోదీ ప్రసంగాల్లో ఇవేవీ ప్రతిఫలించలేదు. దేశంలోని ప్రతి చోటా ఏం జరుగుతోందో ఆయన తెలుసుకుంటూ ఉండాలని ఆశించలేం. కానీ, ఆయనకు ప్రసంగాలు రాసేవారికి ఇంకా మెరుగుగా తెలిసి ఉండాలి'' అని ఫ్రంట్‌లైన్ మేగజీన్ అసోసియేట్ ఎడిటర్ ఆర్.కె.రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు.

స్టేషన్ పేర్ల గురించి మాట్లాడటం జోక్ అని అంటూ, ''ఇటువంటి విషయాలకు బదులుగా రాష్ట్ర పారిశ్రామిక హబ్‌లు ఎలా కొట్టుమిట్టాడుతున్నాయో, ఇటీవలి కాలంలో భారీ స్థాయిలో ఉద్యోగాలు ఎలా పోతున్నాయో అనే అంశాల గురించి మోదీ మాట్లాడి ఉండవచ్చు'' అని ఆయన అన్నారు.

''అసలు ఓటర్ల డిమాండ్ల గురించి ఆయన నేరుగా ఎందుకు మాట్లాడలేరు? ఆయన తిరుప్పూర్ నగరానికి వెళ్లినపుడు అక్కడి జనం కోరుతున్న స్పెషాలిటీ ఆస్పత్రి గురించి మాట్లాడి ఉండొచ్చు. కానీ మోదీ ఆ అంశాన్ని ప్రస్తావించనే లేదు. బాణాసంచా మీద సుప్రీంకోర్టు నిషేధం శివకాసిలో పరిశ్రమలను ఎలా దిబ్బతీస్తోందో ఆయన ఎందుకు మాట్లాడలేరు?'' అని ప్రశ్నించారు.

అయితే, తమిళనాడు కనీసం ప్రస్తుతానికైనా తమకు అంత ముఖ్యం కాదని బీజేపీ నిర్ణయించుకుని ఉండవచ్చునని తాను భావిస్తున్నట్లు రాధాకృష్ణన్ చెప్పారు.

''తమిళనాడును ఇప్పటికిప్పుడు గెలుచుకోవటం ఆయనకు చాలా ఇష్టమే. కానీ, ఆయన గెలుచుకోకపోయినా మారేది ఏమీ లేదు. దక్షిణాన తన పునాదిని బలోపేతం చేసుకోవటానికి మాత్రమే ఆయన వస్తున్నారని నేను అనుకుంటాను. అందుకోసం.. ఇది సరిపోతుంది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)