వీడియో జర్నలిస్టుపై బాలకృష్ణ దాడి వీడియో... బాధితుడు ఏమన్నారంటే?

  • 28 మార్చి 2019
బాలకృష్ణ Image copyright ugc

సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా మోజో టీవీ వీడియో జర్నలిస్టు‌పై దాడికి దిగినట్లుగా చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

ఒక టీడీపీ కార్యకర్త ఇంట్లోంచి బాలకృష్ణ బయటకు వస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన కొంతమంది చిన్న పిల్లలను కార్యకర్తలు వెనక్కి తోసేయడం ఆ వీడియోలో కనిపించింది.

ఆ తరువాత ఆయన ఆక్కడ ఉన్న మోజో టీవీ వీడియో జర్నలిస్టుపై చేయి చేసుకుని, దుర్భాషలాడటం కనిపించింది. '‘రాస్కెల్‌ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా... నరికి పోగులుపెడతా.. ప్రాణాలు తీస్తా... బాంబులు వేయడం​ కూడా తెల్సు నాకు... కత్తి తిప్పడం కూడా తెలుసు' అంటూ బెదిరిస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి.

బాలకృష్ణ ఆగ్రహానికి గురైన మోజో టీవీ వీడియో జర్నలిస్టు గోవర్దన్ బీబీసీతో మాట్లాడారు. ఆ సంఘటనను వివరిస్తూ, ''హిందూపురంలో బాలకృష్ణ ప్రచారం చేయడానికి వచ్చారు. అక్కడే ఒక టీడీపీ కార్యకర్త ఇంట్లో భోజనం చేసి బయటకు వస్తుండగా చాలా మంది ఆయనతో సెల్ఫీ తీసుకోడానికి ప్రయత్నించారు. అదే సమయంలో మేం ఆయన బైట్ తీసుకోవడానికి వచ్చాం. నేను షూట్ చేస్తుండగా నాపై దాడికి దిగారు. వీడియో డిలీట్ చేయాలని దూషించారు'' అని తెలిపారు.

మీడియా ప్రతినిధులపై దాడికి దిగడం, అభిమానులపై చేయి చేసుకోవడం బాలకృష్ణకు కొత్తేమీ కాదని మోజో టీవీ సీఈవో రేవతి అన్నారు.

ఈ ఘటనపై ఆమె బీబీసీతో మాట్లాడుతూ, ''బాలకృష్ణ కంటే ముందు ఆయన సతీమణి ఎన్నికల ప్రచారాన్ని కూడా మా ప్రతినిధి కవర్ చేశారు. ఆ తర్వాత బాలకృష్ణ ప్రచారాన్ని కవర్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. చిత్రీకరిస్తున్న మా వీడియో జర్నలిస్టుపై దాడి చేశారు. అసభ్యకరంగా మాట్లాడారు'' అని తెలిపారు.

''మా ప్రతినిధిపై జరిగిన దాడికి సోషల్ మీడియాలో బాలకృష్ణ వివరణ ఇచ్చారు. జర్నలిస్టు సంఘాలు కూడా ఈ ఘటననను ఖండించాయి" అని ఆమె అన్నారు.

Image copyright fb/balakrishna

సోషల్ మీడియాలో బాలకృష్ణ వివరణ

మోజో టీవీ ప్రతినిధిపై బాలకృష్ణ దాడి చేసిన దృశ్యాలతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌ కావడంతో, బాలకృష్ణ తన ఫేస్‌బుక్ అకౌంట్లో దీనిపై వివరణ ఇచ్చారు.

అక్కడున్న పిల్లల మీద పడి వీడియో తీస్తున్న వారు అల్లరిమూకలుగా భావించానని, వారు మీడియావారని ఆ తర్వాత తెలిసిందన్న బాలకృష్ణ, ‘‘మీడియా మిత్రులకి నమస్కారం, ఇవాళ నా ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడున్న చిన్న పిల్లల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరిమూకల పని అని భావించి వారిని వద్దని వారించడం జరిగింది, అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసింది. అంతే కానీ ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదు. ఈ విషయం లో మీడియా మిత్రులకి బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతూ... మీ నందమూరి బాలకృష్ణ’’ అంటూ తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.

అయితే మీడియా ప్రతినిధుల మీద రాజకీయ నాయకులు దాడులు చేయడం బాగా పెరుగుతోందని చెప్పిన రేవతి, ఎన్నికల వేళ వివాదాన్ని పెద్దది చేయకూడదనే ఉద్దేశంతోనే దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు'' అని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)